Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దారి ఎటు?

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘దారి ఎటు?’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

నాకు పదహారేళ్ళ వయసు..

నేను పదవ తరగతి పరీక్షలు రాశాను. రిజల్ట్స్ వచ్చి కాలేజీలో చేరటానికి కనీసం రెండు నెలలు సెలవులు ఉంటాయి. నా మనసంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. ఇప్పటిదాకా రోజూ స్కూల్‌కి వెళ్ళటం, పాఠాలు చదవటం, హోంవర్కులు చేయటంతో గడిచిపోయింది. ఈ రెండు నెలలు ఫ్రీబర్డ్ లాగా ఉండవచ్చు. పరీక్ష పాసయినప్పుడు కలిగే ఆనందం కంటే సెలవులు ఇచ్చిన ఆనందమే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. సెలవులకి బాబాయి వాళ్ళ ఊరు బయలుదేరాను. బస్ ఊరి సెంటర్‌లో రావిచెట్టు కింద ఆగింది. బ్యాగ్ భుజానికి తగిలించుకుని నడవసాగాను.

ఊళ్ళో ఎక్కువగా పెంకుటిళ్ళు, పూరిళ్ళే! చిన్నగా నడుస్తూ వెళుతున్నాను. ఒక ఇంటిముందు చెట్టుకింద ఐదారుగురు ఆడవాళ్ళు గుంపుగా కుర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నన్ను చూడగానే మాటలు ఆపి “ఎవరు బాబూ! ఎవరి తాలూకు నువ్వు?” అని అడిగింది ఒకామె. “ధర్మారావుగారు మా బాబాయి. ఇల్లు ఎక్కడో చెబుతారా?”అని అడిగాను. ఆమె “ఒరే! కోటేశూ! ఈ అబ్బాయిని ధర్మారావుగారింటి దగ్గర దించిరా!” అని పెద్దగా కేకేసింది. జీతగాడు కాబోలు నీరుకావి పంచె, భుజాన కండువా వేసుకుని నా వంక చూస్తూ “రా!” అని పిలిచాడు.

నేను అతని వెంటే నడవసాగాను. దారిలో అందరి ఇళ్ళూ తలుపులు బార్లా తెరిచిఉన్నాయి. అయిదారు ఇళ్ళ కొకచోట ఆడవాళ్ళు గుంపుగా కుర్చుని లోకాభిరామాయణం ముచ్చటించుకుంటున్నారు. ప్రతి ఇంటిముందు వడ్లపురి ఉంది. ఊళ్లోకి ఎవరైనా కొత్తమనిషి రాగానే వీళ్ళకి తెలిసిపోతుంది. ఎవరని ఆరా తీస్తారు. ఇంక దొంగల భయం ఎందుకుంటుంది? అందుకే తలుపులు తెరిచి పెత్తనాలకి వెళ్ళినా నిశ్చింతగా ఉంటారు అనుకున్నాను.

జీతగాడు నన్ను బాబాయివాళ్ళ ఇంటిదగ్గర దించి “ధర్మారావుగోరూ! మీకోసం ఎవరో వచ్చారు” అని నన్ను అప్పజెప్పి వెళ్ళిపోయాడు. “ఓరోరి నువ్వట్రా కిట్టిగా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి?” బాబాయి నా భుజం చుట్టూ చెయ్యివేసి లోపలకి తీసుకువెళ్ళాడు. లోపలనుంచీ పిన్ని బయటకు వచ్చి “అమ్మా నాన్నా బాగున్నారా కృష్ణా!” అని పలకరించింది. “బాగున్నారు పిన్నీ!” అన్నాను. అందరం కబుర్లలో పడిపోయాము.

***

నాకు ఇరవై నాలుగేళ్ళు..

నాకు కొత్తగా ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఎక్కడో దూరంగా మారుమూల పల్లెటూళ్ళో పోస్టింగ్ వచ్చింది. లగేజీ మోసుకుంటూ నడుస్తున్నాను. ఉదయం పదిగంటలు అయింది. దారిలో ఒక ఇంటి అరుగు మీద నలుగురు పెద్ద మనుషులు కూర్చున్నారు. నేను కొత్తగా కనబడేసరికి నా వంక ప్రశ్నార్థకంగా చూశారు. “నేను ఈ ఊరి గవర్నమెంట్ స్కూల్‌కి కొత్తగా టీచర్‌గా వచ్చాను. హెడ్ మాస్టర్ జానకిరామ్ గారిల్లు ఎక్కడండీ!” అడిగాను. “జానకిరామయ్య ఇంటికా! కొంచెం పైకి వెళితే పంచాయితీ ఆఫీస్ వస్తుంది. దానికి దక్షిణంగా నాలుగడుగులు వేస్తే శివాలయం ఒకటి వస్తుంది. దానికి తూర్పువైపు ఉన్న బంగాళా పెంకుల ఇల్లే జానకిరామయ్యది” చెప్పాడు ఒకాయన.

“థాంక్స్!’ అని ముందుకు నడిచాను. ఆయన చెప్పిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ ఆ ఇంటిముందు ఆగాను. గేటు తెరుచుకుని లోపలకి వచ్చాను. వరండాలో ఒకాయన తెల్లటి ధోవతి, ఉత్తరీయం వేసుకుని వాలుకుర్చీలో కుర్చుని ఉన్నాడు. ఆయనకి ఇరుపక్కలా బెంచీలమీద ఊళ్ళోవాళ్ళు కుర్చుని ఉన్నారు. “నమస్కారమండీ! నాకు ఈ ఊరి స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. జానకిరామ్ గారు మీరేనా!’” అడిగాను. “నేనే! రండి కూర్చోండి! నిన్న యం.డి.ఓ. ఆఫీస్ నుంచీ ఫోన్ వచ్చింది మీరు వస్తున్నట్లుగా!” అన్నాడు వాలుకుర్చీలో కూర్చున్నాయన.

“కాసిని మజ్జిగ పుచ్చుకుంటారా ఎండలో వచ్చారు?” అని “సీతా!” లోపలకి చూస్తూ కేకేశాడు. “అబ్బే వద్దండీ!” అన్నాను. ఇంతలో లోపలనుంచీ పెద్ద ముత్తైదువలా కనిపిస్తున్న ఒకామె వచ్చింది. “ఈ అబ్బాయికి ఏమైనా ఇవ్వు” అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి పెద్ద లోటానిండా చిక్కటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. అవి తాగేసరిగి కడుపు నిండిపోయింది.

నాకింకా పెళ్లి కాలేదని తెలిసి “మీకు ఉండటానికి, భోజనానికి ఏ లోటూ లేకుండా మేము చూసుకుంటాము. మీరు మాత్రం మా పిల్లలకి చదువు బాగా చెప్పండి. చాలు” అన్నాడు బెంచీమీద కూర్చున్న ఒకాయన.

“అలాగేనండీ!” అన్నాను.

***

నాకిప్పుడు యాభై అయిదేళ్ళు..

మా మేనల్లుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నాడు. వాడికి జాబ్ వచ్చి రెండేళ్ళు అయింది. ఏడాది క్రితమే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశంకి రమ్మని ఫోన్ చేశాడు. “నేను ఎన్నిరోజుల నుంచో పిలుస్తుంటే మీరు రావటంలేదు. ఈ సారి తప్పకుండా రావాలి.. మీరు, అత్తయ్య నాలుగురోజులు ఉండాలి. వెంటనే వెళతానంటే ఒప్పుకోను” అన్నాడు.

వాడి అభిమానానికి సంతోషిస్తూనే “హైదరాబాద్ వరకూ రాగలను గానీ అక్కడనుంచీ ఇంటికి రావాలంటే ఆ సిటీ బస్ లలో తోసుకుంటూ ఎక్కటం, దిగటం నేను చేయలేను నాయనా!” అన్నాను.

“ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తానుగా! మీరు బస్ దిగిన తర్వాత నాకు ఫోన్ చేయండి” అన్నాడు.

అన్నట్లుగానే బస్ దిగగానే క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ వెళుతుంటే బయటకు చూస్తూ కూర్చున్నాను. క్యాబ్ ఒక అపార్ట్‌మెంట్ ముందు ఆగింది. మా మేనల్లుడు నవ్వుతూ ఎదురొచ్చాడు. తలస్నానం చేసినట్లున్నాడు. జుట్టు పొడిపొడిగా నుదిటిమీద పడుతూ ఉంది. పక్క ఫ్లాట్‌లో మాకు విడిది ఏర్పాటు చేశాడు. స్నానాలు, టిఫిన్‌లు అయిన తర్వాత కొత్త ఫ్లాట్‌కి తీసుకువెళ్ళాడు. త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది. విశాలమైన గదులు, ఫ్యాన్లు, లైట్లు బిగించి ఉన్నాయి. “ఫర్నిచర్ పాత ఇంటినుంచీ ఇంకా తీసుకురాలేదు. గృహప్రవేశం తర్వాత తెస్తాను” అన్నాడు.

‘ఉద్యోగం వచ్చి రెండేళ్ళయినా కాలేదు. అప్పుడే ఇంత పెద్ద ఇల్లు కొన్నాడా! నేను ఉద్యోగం వచ్చిన ఇరవై ఏళ్ళకి గానీ స్వంత ఇల్లు ఏర్పరచుకోలేక పోయాను. ఎంతైనా ఈ కాలం పిల్లలకి తెలివితేటలు ఎక్కువ’ అనుకున్నాను.

రెండు రోజులు గడిచాయి. గృహప్రవేశం ముగిసింది. వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయారు. “మీరు ఇంకో రెండు రోజులు ఉండండి మామయ్యా! శని ఆదివారాలు నాకు సెలవే! మిమ్మల్ని బయటకు తీసుకువెళతాను” అన్నాడు. ఆ మర్నాడు “నాకు సురేంద్రపురి చూడాలని ఉందిరా నందూ! అక్కడ మన పురాణాలకు సంబంధించిన శిల్పాలు ఎన్నో ఉన్నాయటగా!” అన్నాను కారులో ముందు సీటులో కూర్చుంటూ. నా భార్య కూడా వెనకసీటులో కూర్చుంది.

“అవును” అన్నాడు డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటూ.

“సురేంద్రపురి అంటే ఎక్కడ?” అడిగాను.

“తెలియదు”

“అదేమిటి? రెండేళ్ళనుంచీ ఇక్కడ ఉంటున్నావు అడ్రెస్ తెలియదా!” ఆశ్చర్యంగా అడిగాను.

“ఈ రోజుల్లో అడ్రెస్ ఎవరూ గుర్తుపెట్టుకోవటం లేదు మామయ్యా! సెల్ ఫోన్‌లో లొకేషన్ పెట్టుకుంటాం. దాన్ని బట్టి వెళుతూ ఉంటాం” అన్నాడు.

సెల్ ఫోన్‌లో మేము వెళ్ళాల్సిన దారి చూపిస్తూ ఉండగా వెళ్ళాము. అక్కడి శిల్పాలు అన్నీ చూసి తిరిగివచ్చాము. మళ్ళీ లొకేషన్ ప్రకారం ఇంటికి తీసుకువచ్చాడు. తర్వాత కూడా బిర్లా టెంపుల్, యాదగిరి గుట్ట, చిలుకూరు మొదలైనవి అన్నీ చూశాము. ఎక్కడికి వెళ్ళినా లొకేషన్ ఆధారంగానే వెళ్లి వచ్చాము, ఎటువంటి ఇబ్బంది ఎదురు అవలేదు. రెండురోజుల తర్వాత తిరిగి బయలుదేరాము. తిరుగు ప్రయాణానికి టికెట్స్ రిజర్వ్ చేయించాడు. బస్టాండ్ దగ్గరకు వచ్చి బస్ ఎక్కించాడు. బస్ బయలుదేరింది. సీట్‌లో తల వెనక్కి ఆనించి కుర్చుని కళ్ళు మూసుకున్నాను.

నా చిన్నప్పుడు ఊరిలోకి ఎవరైనా కొత్తమనిషి కనబడితే పనిగట్టుకుని పలకరించి దారి చూపించేవారు. నాకు కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు ఊరివాళ్ళు అడిగి తెలుసుకోకపోయినా మనం అడ్రెస్ అడిగితే చెప్పేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి అడ్రెస్ ఎక్కడో తెలియదు. ఎక్కడికి వెళ్ళాల్సివచ్చినా లొకేషన్ పెట్టుకుంటారు. అందులో కుడిపక్కకు వెళ్ళు, ఎడమపక్కకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, వెనక్కు వెళ్ళు అని చూపిస్తుంటే వెళ్ళటమే తప్ప కచ్చితమైన పోస్టల్ అడ్రెస్ ఎవరికీ తెలియదు. సెల్ ఫోన్‌లు వచ్చిన కొత్తలో కనీసం పది నంబర్లయినా గుర్తు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పేరు సేవ్ చేసుకోవటం వచ్చింది. నంబర్లు గుర్తులేకుండా పోయాయి. అలాగే ఈ తరంవారికి చదువులు, ఉద్యోగాలు, అన్ని తెలివితేటలూ ఉన్నాయి. కానీ పోస్టల్ అడ్రెస్ అంటే ఏమిటో తెలియకుండా పోయింది. దీనిని పురోగమనం అనాలా! తిరోగమనం అనాలా! అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను.

Exit mobile version