[ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారి ‘డబ్బు అమ్మబడును’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఇటీవలి కాలంలో శీర్షికతోనే పాఠకులను ఆకర్షించిన పుస్తకాలలో ‘డబ్బు అమ్మబడును’ ఒకటి. శీర్షికకి తగినట్టుగా కవర్ పేజీ చక్కగా డిజైన్ చేయడంతో, పుస్తకం చూడగానే చదవాలనిపిస్తుంది.
ఏరువ శ్రీనాథ్ రెడ్డి వర్ధమాన కవి, కథకులు. వృత్తిరీత్యా ఇంగ్లీష్ లెక్చరర్. కొంతకాలం తెలుగు సినిమా రంగంలోనూ పని చేశారు. ‘డబ్బు అమ్మబడును’ వారి తొలి కథాసంపుటి.
ఇందులోని 13 కథలలో అధిక భాగం కథలలో డబ్బు ప్రధాన కథావస్తువు. కొన్ని చోట్ల ప్రత్యక్షంగా, మరికొన్ని చోట్ల పరోక్షంగా ఈ కథల్లోని మనుషులని ఆడిస్తుంది. డబ్బే కాకుండా, జీవితంలోని ఆశలు, ఆశాభంగాలు, ఎదగడాలు, పతనాలు, పొందడం, కోల్పోవడం, బతుకుని పండించుకోడం, అంతం చేసుకోవడం.. చిన్న చిన్న ఆనందాలు, వెంటాడే విషాదాలు.. నిశ్చలత్వం, నిర్మోహం, నిస్సంగత్వం! ఇలా జీవితంలోని అతి ముఖ్యమైనవన్నీ ఈ కథల్లో తారసపడతాయి.
~
తిరుపతమ్మ గుడి బయట ఉండే యాచకులలో నీలమ్మ, సూరిగాడు తల్లీకొడుకులు. గుడి ముందు బిచ్చమెత్తుకుంటుంటే పెద్దగా ఆదాయం రావడం లేదు. ఊర్లోకి వెళ్ళి అడుక్కుందామంటాడు సూరిగాడు. వద్దంటుంది తల్లి. అక్కడే ఉండాలంటుంది. ఒకరోజు ఓ మంత్రి తాను తెచ్చిన డబ్బుతో తిరుపతమ్మకి అలంకరణ చేయిస్తాడు. రాత్రి అందరూ పడుకున్నాకా, ఆ డబ్బు లోంచి కొంచెం తీసుకుందామని అంటాడు సూరిగాడు. ‘చేయి చాచి అడగచ్చు, చేతిలోది లాక్కోకూడదు’ అంటుందా తల్లి. ఎందుకామె ఆ గుడిని వదిలి రానందో కొడుక్కి చెప్పినప్పుడు – పాఠకుల హృదయం బరువెక్కుతుంది. కథలోని సారాన్ని చాటుంది కథాశీర్షిక ‘విరిగిన రెక్కలు’.
పరువు హత్య నేపథ్యంగా సాగిన కథ ‘సంపంగి’. కూతురిని అమితంగా ప్రేమించిన తండ్రి – ఆమె తన అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుందని ఆమె ప్రియడుని, ఆమెని చంపేస్తాడు. ఈ కథని మరణించిన కావేరి చెబుతుంది. కావేరి చనిపోయి సంవత్సరమయ్యాకా, ఆమె సమాధి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుని, పెంచుకోడానికి తన కూతురు పోలికలుండే అమ్మాయిని వెతుక్కుందామని అనాథ శరణాలయానికి వెడతాడు తండ్రి. కానీ చిత్రంగా ఏ అమ్మాయి ముందుకు రాదు. ఈ కథలో తండ్రి దురంహకారిగా అనిపిస్తాడు, కూతురు మాత్రం తండ్రిని వెనకేసుకొస్తుంది. తండ్రిది విచక్షణా రాహిత్యమైతే, కూతురిది అపరిపక్వత అనిపిస్తుంది పాఠకులకి.
‘అద్దె బతుకులు’ కథలో తాను ఒళ్ళు అమ్ముకోవడం లేదని, అద్దెకి ఇస్తున్నానని న్యాయస్థానంలో చెబుతుంది రమాదేవి. అవినీతిపరుడైన అధికారి మూర్తితో ఉండగా, పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టుకు తెస్తారు. ఆ ముందు రాత్రి వరకూ ఆమెతో కులికిన మూర్తి, ఇప్పుడు ఆమె వల్లే తాను ఇరుక్కున్నాననీ, బయటకి వచ్చాకా ఆమెని చంపేయాలని ఆలోచిస్తాడు. న్యాయమూర్తి వేసిన ప్రశ్నలకు రమాదేవి సుదీర్ఘంగా జవాబులు చెబుతుంది. కళాకారిణిగా ఉండాల్సిన తాను వ్యభిచారిణిగా ఎందుకు మారాల్సి వచ్చిందో, అందుకు కారకులెవరో చెబుతుంది. ఇంతకీ రమాదేవి మూర్తితో ఉందని పోలీసులకి ఉప్పందించనదెవరో కథ చివర్లో తెలుస్తుంది.
గంభీరమైన సమస్యని వ్యంగ్యంగా చెప్పడం కాస్త నవ్వించినా, చెప్పదలచిన అంశం చురుక్కుమనిపిస్తుంది ‘బ్యాంక్ లోనుకి లోను కాను’ కథలో. ఈ కథలో పదాలతో ఆటలాడారు రచయిత. పంచ్ డైలాగులతో కథని నడిపారు.
‘బస్‍స్టాండులో బస్సు కొన్న’ కథ ఇద్దరు పిల్లవాళ్ళ కథ. ఈ కథలోనూ పంచ్ డైలాగులు విరివిగా వాడారు. ఓ రాజకీయ నాయకురాలి స్టేట్‍మెంట్.. రీల్స్‌లో బాగా పాపులర్ అయినది, ఇందులో వాడారు రచయిత. ఈ కథలో ఆంగ్లపదాలు ఎక్కువగా వాడారు. సెలబ్రిటీల పనుల మీద, వారు చేసే వ్యాఖ్యల మీద వెటకారం ఉంది. విద్యార్థిగా ఉండడం కన్నా లారీ క్లీనర్‌గా ఉండడం ఎక్కువ ప్రయోజనం అని భావించిన ఇద్దరు పిల్లలు ఇంట్లోంచి పారిపోయి, బస్సెక్కి మరో ఊరిలో దిగి అక్కడ పని వెతుక్కుంటారు. మోసపోయి, ఉన్న డబ్బంతా పోగుట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ బస్టాండుకు చేరతారు. నానా అవస్థలు పడి ఇల్లు చేరి, అమ్మానాన్నలతో తిట్లూ దెబ్బలూ తింటారు. ఇది ఎప్పుడో 23 ఏళ్ళక్రితం జరిగిన కథ అంటూ కథకుడు చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ పారిపోవాలని ఉంది అంటాడు. ఎందుకు పారిపోవాలనుకున్నాడో పాఠకులు గ్రహించినప్పుడు అతని వేదన అర్థమవుతుంది.
దేవతా విగ్రహం చేయిస్తానని, ఊర్లో వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి, ఆ డబ్బుతో కనిపించకుండా పోయిన సుబ్బారెడ్డి – ఓ విగ్రహం తయారు చేయించి, ఊళ్ళోకి తీసుకొస్తాడు. దాని మీద ఉన్న పాలిథిన్ షీట్‌ని విప్పి చూస్తే, అది చనిపోయిన అతని కొడుకు విగ్రహం. అంతే, ఊరంతా ఒక్కసారిగా సుబ్బారెడ్డి మీద విరుచుకుపడతారు. ఆత్మహత్మ చేసుకుని చచ్చిపోయిన నీ కొడుక్కి మా డబ్బుతో విగ్రహం ఎందుకు చేయించావని అడిగితే, సుబ్బారెడ్డి చక్కని సమాధానం చెప్తాడు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న తన కొడుకుని ఆడిపోసుకున్నదీ ఊరివాళ్ళేననీ, అతడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులయిందీ ఊరి జనమేననీ – అందుకే.. ఆ విగ్రహాన్ని చూస్తే మరెవరూ అటువంటి తప్పు చేయకుంటా ఉంటారని చెప్తాడు. ‘ఊపిరి ఆపుకున్న ఊరు’ మంచి కథ.
అవినీతికి పాల్పడి విపరీతంగా ధనం ఆర్జించిన మస్తాన్ రెడ్డికి హఠాత్తుగా జ్ఞానోదయం అవుతుంది. తన దగ్గరున్న డబ్బుని అవసరమున్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. కానీ ఎవరూ తీసుకోరు. అంతకు ముందు అవసరమంటూ డబ్బు అడిగిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాడు. భార్య కూడా ప్రభుత్వోద్యోగే. ఆమె పరిచయస్థులకీ ఫోన్ చేయిస్తాడు. చిత్రం ఎవరూ అతని దగ్గర డబ్బు తీసుకోడానికి ముందుకు రారు. చివరికి ఆ డబ్బుని అంతా నాలుగు మూటల్లో సర్ది, ఊరి మధ్యలో ఉన్న ఓ మండపంలో పెట్టాలనుకుంటాడు. కానీ వాటిని మోసుకువెళ్ళడం కష్టమవుతుంది. ‘మోయలేనంత డబ్బు సంపాదించామ’ని బాధపడతారు. ఎంత లోతైన వాక్యమో! అతి కష్టం మీద ఆ సంచుల్ని ఊరి మధ్యకు చేర్చి, అలా వదిలేస్తారు. ఎన్ని అవసరాలున్నప్పటికీ, ఎవరూ ఆ డబ్బుని తీసుకోరు. నిస్పృహతో ఆ దంపతులిద్దరూ బస్ ఎక్కి ఊరు విడిచి వెళ్ళిపోతారు. డబ్బు సంచులు మాత్రం అక్కడే ఉండిపోతాయి.
సినిమా రంగంలో ప్రవేశించి జీవితాన్ని కాంతిమంతం చేసుకోవాలను ఎందరిలానో, పట్టుదలగా – ఊరి నుంచి వచ్చి కృష్ణానగర్‍లో పాతుకుపోయిన రవి కథ ‘ఉదయాస్తమయాలు’. తల్లిదండ్రులను కాదనుకుని, సినిమా డైరక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి – తిరిగి ఊరుకు వెళ్ళడానికి మొహం చెల్లక, అమ్మానాన్నలకి దూరంగా ఉండిపోతాడు రవి. 22 ఏళ్ళ తర్వాత, తన ఫోన్ నెంబరు తెలుసుకుని తండ్రి ఫోన్ చేసి చెప్పిన ఓ వార్త అతన్ని విచలితుడిని చేస్తుంది. ఊరెళ్ళడానికి డబ్బులు ఉండవు. గదిలోని మిత్రులందరి జేబుల్లోంచి దొంగతనం చేసినా రెండొందలు కూడా రావు. చాలాసేపు సాగిన మానసిక సంఘర్షణతో బలవన్మరణానికి పాల్పడుతాడు. ఆకాశంలో రవి ఉదయిస్తే, ఈ రవి అస్తమిస్తాడు.
ఓ వర్ధమాన క్రీడాకారిణికి సాయం చేయడానికి, ఎప్పుడో మానేసిన పడుపు వృత్తి లోకి మళ్ళీ ప్రవేశించాలనుకుంటుంది సంధ్య. కానీ కొత్త అమ్మాయిలు చాలామంది ఉన్నారనీ, నువ్వు అవసరం లేదని అంటుంది రత్తమ్మ. ఇంతలో శీనుగాడు ఆటోలో వచ్చి, ఆమెకో మార్గం చూపిస్తాడు. ఓ ముసలి రసికుడికి శరీరాన్ని అప్పగించి, తనకు కావల్సిన డబ్బు తీసుకుంటుంది. మర్నాడు ఆ క్రీడాకారిణి ఇంటికి వెళ్ళి ఆమెకు డబ్బు అందిస్తుంది. అయితే సాయం చేసిన క్రెడిట్ మాత్రం స్థానిక ప్రజాప్రతినిధి ఎకౌంట్‍లో పడుతుంది. ప్రధాన పాత్ర పేరు సంధ్య, చేసినది సాయం కాబట్టి శీర్షిక ‘సాయం సంధ్య’ అని పెట్టారేమో అని మొదట పాఠకులకి అనిపిస్తుంది. కానీ చివరి వాక్యాలు చదివాకా, అసలు సంగతి తెలుస్తుంది. అటు పగలూ, ఇటు రాత్రి కాని వేళని సందెవేళ అంటారు. ‘సాయం సంధ్య’ కథలో సంధ్య కూడా స్త్రీ కాదు, పురుషుడూ కాదని అవ్యక్తంగా చెప్తారు రచయిత.
రెక్కాడితే గాని డొక్కాడని ఓ కుటుంబానికి బోలెడు డబ్బు దొరుకుతుంది. కొడుకు చాలా సేపు ఇబ్బంది పడి లెక్కపెట్టి, ఆ బేగ్‍లో ఉన్నవి 20 లక్షల రూపాయలుగా లెక్క తేలుస్తాడు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి పోలీసులకి ఇద్దామనుకుంటారు. కానీ తమ మీద అనుమానం వస్తుందని ఆలోచిస్తారు. పైగా ఎలక్షన్ కోడ అమల్లో ఉన్న కాలం! కొన్నాళ్ళు ఊరుకుని ఆరు లక్షలు పెట్టి అప్పులన్నీ తీర్చేస్తారు. మిగిలిన డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు. వ్యసనాల బారిన పడతారు. అప్పులిచ్చి మరీ అవమానాల పాలవుతారు. ‘ఇంట్లోకి డబ్బు వచ్చినప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది’ అంటాడు కొడుకు. మనిషికి మనశ్శాంతికి మించిన ఆస్తి లేదని చెప్తుంది ‘కాసులు కురిసిన వేళ’ కథ. ఈ కథలో రామయ్య మాటల్లో దొర్లే బూతులు – కొందరు పాఠకులకి ఇబ్బందిగా అనిపించవచ్చు. చివరికి తమ దగ్గర మిగిలిన డబ్బుతో ఓ మంచి పని చేస్తాడు ఆ కుటుంబంలోని కొడుకు.
డబ్బే ప్రాణంగా బతికే తిరపతి రెడ్డి, ఓ సంఘటన వల్ల, తన వైఖరి మార్చుకుని, తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ సాయపడతాడు. మొదట అతన్ని తిట్టుకున్న పనివాళ్ళే, చివరికొచ్చేసరికి దేవుడంటారు. ఆసక్తిగా చదివిస్తుంది ‘తిరపతి రెడ్డి తీరు మారింది’ కథ.
డబ్బు డబ్బునే ఎందుకు ఆకర్షిస్తుందో గొప్పగా చెప్పిన కథ ‘డబ్బు అమ్మబడును’. ఎడ్లబండిలో నోట్ల కట్టలు పెట్టుకుని అమ్మడానికి వెళ్ళిన కస్తూరి, జనాల నుంచి ఏం కోరుకుందో చదివితే, ప్రస్తుత సమాజానికి అవసరమైనవి అవేనని పాఠకులకు అవగతమవుతుంది. విభిన్నమైన కథ. ఎవరికి వారు చదువుకుని తర్కించుకోవాల్సిన కథ.
~
ఈ కథలు ఎన్నో ప్రశ్నలను రేపుతాయి. సున్నితమన ఆలోచనలను కలిగిస్తాయి. మనిషితనమంటే ఏమిటో గుర్తుచేస్తాయి. డబ్బు కన్నా ముఖ్యమైనవేమిటో చెప్తాయి.
ఏదైనా వస్తువు కొనాలంటే కావల్సింది డబ్బు. మరి ఆ డబ్బునే అమ్మకానికి పెట్టినప్పుడు దేనితో కొంటాం? అన్న ప్రశ్న తలెత్తుంది. డబ్బు అమ్మడమంటే, డబ్బు కంటే విలువైనవి ఏవో ఉన్నాయని ఈ కథాసంపుటి సూచిస్తుంది. ఈ కథలు చదివాకా, అవేమిటో పాఠకులు గ్రహిస్తారు. డబ్బుకిచ్చే అనవసరమైన ప్రాధాన్యతని తగ్గించి, జీవన విలువలను పెంపొందించాలని రచయిత అభిలషిస్తున్నట్లు తెలుస్తుంది.
చక్కని కథలందించిన ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారికి, ప్రతి కథకీ చక్కని బొమ్మ వేసి, అందమైన ముఖచిత్రం గీసిన పరిమి చరణ్ గారికి అభినందనలు.
***
డబ్బు అమ్మబడును (కథలు)
రచన: ఏరువ శ్రీనాథ్ రెడ్డి
ప్రచురణ: అన్వీక్షికి పబ్లిషర్స్ పై. లి.
పేజీలు: 180
వెల: ₹ 200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
అన్వీక్షికి పబ్లిషర్స్ పై. లి. ఫోన్. 7659877744
ఆన్‌లైన్‍లో:
https://www.amazon.in/DABBU-AMMABADUNU-YERUVA-SRINATH-REDDY/dp/9395117494
~
ఏరువ శ్రీనాథ్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-yeruva-srinath-reddy/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.