Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దైవం మనుష్య రూపేణా!..

[కె.వి. సుమలత గారు రచించిన ‘దైవం మనుష్య రూపేణా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దానితో ఎడతెగని వర్షాలతో రోడ్లన్నీ మోకాలు లోతు జలమయం.. కనీసం పది నిముషాలు కూడా తెరిపివ్వకుండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్ల మీద నీరు ఏరులా పారుతోంది. కుదిరినోడికి వానంత సుఖం లేదు, కుదరనోడికి వానంత కష్టం ఉండదేమో!..

అది విజయవాడలోని బాపూజీ కాలనీ. అక్కడ ఎక్కువగా ఒడిశా నుండి బతుకు తెరువును వెతుక్కుంటూ వచ్చి కూలీపనులు చేసుకుంటూ నివాసముoటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు, వారం రోజుల ముసురుతో వారికి పనులు లేకపోవడంతో అంతా గుడిసెల్లోనే ఉసూరుమంటూ కూర్చుంటున్నారు.

“లక్ష్మీ! ఇయ్యాల కూడా చినుకు పడుతూనే ఉంది. ఎక్కడా కూలీ దొరకడం లేదు. పని లేదని కడుపుకి తెలియదు కదా, ఆకలికి పేగులు ఈసూరోమని ఏడుస్తున్నాయి.” అన్నాడు నాయక్.

“బావా! నువ్వలాగoటే నా గుండెలో కలుక్కుమంటుంది” బిక్కముఖం వేసుకుని అంది లక్ష్మి.

“లక్ష్మీ! మన సంగతి వదిలేసినా రెండేoడ్ల చoటోడికి కూడా మెతుకు పెట్టలేని నా బతుకు మీద నాకే విరక్తి పుడుతుంది” అన్నాడు నాయక్.

“బావా! నువ్వేమన్నా పని దొరికితే చేయడం లేదా? ఆకాశానికీ చిల్లి పడ్డట్లు వాన పడుతుంటే కూలీ పని ఎలా దొరుకుతుంది? అయినా సోనా మన చంటోడికి కాసిని గంజి నీళ్ళు పోసింది” అంది లక్ష్మి.

“సోనా గంజి నీళ్ళు పోసిందంటే దుర్గారావుకి పని దొరికినట్లే” కూర్చున్నోడు లేచి నిలబడ్డాడు నాయక్.

“కంచికచర్ల దగ్గర క్వారీ పని నడుస్తుందని ఎవరో చెప్తే వెళ్ళాడట. మనకున్నది ఒక్కడే వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు కదా ఆకలో రామచంద్రా అని ఏడుస్తున్నారని సోనా బాధపడింది” అంది లక్ష్మి.

“లక్ష్మీ! నాకు కూడా పనిప్పిస్తాడేమో ఒకసారి దుర్గారావు దగ్గరకు వెళ్తాను” అన్నాడు నాయక్.

“వద్దు బావా! వానలకు క్వారీ దగ్గర పనంటే ప్రాణాలతో చెలగాటం. బండలను పగులగొట్టేటప్పుడు అవి పాకుడుపట్టి జారిపోతాయి” కంగారుగా అంది లక్ష్మి.

“సాల్లేవే! పనులు లేక ఉపాసంతో చచ్చే కన్నా పని చేసుకుంటూ చస్తే నష్టపరిహారమన్నా వస్తుంది” అంటూ భోరున కురుస్తున్న వానలోనే బయటకు వచ్చాడు నాయక్.

నాయక్ గుడిసెకు రెండిళ్లవతల దుర్గారావు గుడిసె ఉంటుంది.

“దుర్గా! దుర్గా..” అంటూ లోపలకు వచ్చాడు నాయక్.

“ఏంటి బావా ఇప్పుడొచ్చావు? రా కూర్చో” అన్నాడు దుర్గారావు.

“కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు కానీ నీకు క్వారీల పని దొరికిందట కదా? నన్ను కూడా తీసుకుపోరా, వారం రోజుల నుండి పని లేదు” అన్నాడు నాయక్.

“బావా! నేను కూడా పిల్లల కడుపు నింపాలనే రాళ్ళ మీద పని కష్టమైనా వెళ్ళాను. రాళ్ళు బాగా జారిపోతున్నాయి. నువ్వు చేయలేవేమో” అన్నాడు దుర్గారావు.

“ఎంత కష్టమైనా సరే వస్తాను.. మీ కాంట్రాక్టర్ దగ్గరకు పోదాం పద” అన్నాడు నాయక్.

“బావా! నా దగ్గర ఫోన్ నంబరుoది. నేను అడుగుతాను కానీ కొన్ని బియ్యం గింజలు తీసుకెళ్లి మా చెల్లెమ్మకివ్వు. రేపు నీకు కూలీ డబ్బులు వచ్చాక ఇచ్చేద్దువు గానీ” అన్నాడు దుర్గారావు.

“వద్దు దుర్గారావు! చంటోడికి గంజి నీళ్ళు పోసారు చాలు” మొహమాటంగా అన్నాడు నాయక్.

“సోనా! బావ అట్లాగే అంటాడు కానీ డబ్బా బియ్యం గిన్నెలో పోసివ్వు” అన్నాడు దుర్గారావు.

సోనా ఒక గిన్నెలో గ్లాసుడు బియ్యం పోసిచ్చింది. సిగ్గుపడుతూనే అవి తీసుకుని వెళ్ళిపోయాడు నాయక్.

“లక్ష్మీ! దుర్గారావు డబ్బాడు బియ్యం ఇచ్చాడు. అన్నం వండి ముందు చంటోడికి పెట్టు” అన్నాడు నాయక్.

“బావా! మనం ఇక్కడకు వచ్చి ఐదేళ్ళయినా రేషన్ కార్డు రాలేదు. అదన్నా ఉంటే  బియ్యం గింజలు దొరికేవి. కనీసం గంజినీళ్ళతోనైనా కడుపు నింపుకునేవాళ్ళం” బాధగా అంది లక్ష్మి.

నాయక్ మరుసటి ఉదయం దుర్గారావుతో కలిసి పనికి బయలుదేరాడు.

“బావా! చంటోడిని సోనాకిచ్చి నేను కూడా పనికి రానా?” అంది లక్ష్మి.

“వద్దు లక్ష్మీ! నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు కాలు జారితే ప్రమాదం” అని వారించాడు నాయక్.

లక్ష్మి అయిష్టంగానే ఊరుకుంది. క్వారీ దగ్గర ఎత్తైన కొండలు, భారీ గుంతలు, రణగొణ ధ్వనులతో పనిచేసే భారీ లారీలు.. రోజూ కొన్ని వందల లారీల కంకర సరఫరా అవుతుంది. అదే స్థాయిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నిబంధనలు పట్టని క్వారీ యజమానులు ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తున్నారు. అక్రమంగా పేలుళ్లు జరుపుతున్నారు.

కాంట్రాక్టర్లు క్రషర్ మిల్లులో భద్రత గాలికి వదిలేసారు. ఏ మాత్రం భద్రతా చర్యలు లేకుండానే బండరాళ్ళను పగులగొట్టే చర్యలు చేపడుతున్నారు. దీనికి డ్రిల్లింగ్ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. నేలలో బోరు వేసే యంత్రం తరహాలో డ్రిల్లింగ్ యంత్రo ఉంటుంది. దీనితో కొండల్లోని బండలను డ్రిల్లింగ్ చేయడం ద్వారా బద్దలు కొడుతుంటారు. ఇలా తక్కువ పరిమాణంలో చేసిన రాళ్ళను క్రషర్ మిల్లులకు తరలిస్తుంటారు. డ్రిల్లింగ్ యంత్రం ద్వారా కొండలకు రంధ్రాలు చేసి వాటిలో జిలిటిన్ స్టిక్స్ కూరుస్తుంటారు. వీటిని పేల్చడం ద్వారా రాళ్ళు బద్దలు కొడుతుంటారు.

దుర్గారావు, నాయక్ లిద్దరూ కాంట్రాక్టర్ రత్నాకర్ దగ్గరకు వెళ్ళారు. ఆయన కూలీ పనికి వచ్చిన అందరితో మస్తర్ వేయించుకున్నాడు.

“దుర్గారావు! నువ్వు కంప్రెషర్ మీద డ్రైవర్ పని చెయ్యాలి” అన్నాడు రత్నాకర్.

“సారూ! ఆ పని ఇంకెవరి కన్నా చెప్పండి. నేను వేరే పని చేస్తాను” భయంగా అన్నాడు దుర్గారావు.

“చెప్పింది చెయ్యి మాట్లాడకుండా” విసురుగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రత్నాకర్.

“పోనీ ఆ పని నేను చేయనా?” అడిగాడు నాయక్.

“వద్దు బావా! నేనే చేస్తాను.. నువ్వు చెయ్యలేవు” అన్నాడు దుర్గారావు.

అక్కడ భూమికి నిలువునా లంబ కోణoలో కొండలను తొలిచినట్లున్నాయి. పై భాగంలో ఉన్న రాళ్ళు ఏ క్షణంలో నైనా మీద పడే విధంగా కనిపిస్తున్నాయి.

“ఒరేయ్ దుర్గారావు! జాగ్రత్తరా ఇటు చూస్తే కొండంతా మన మీద పడేటట్లుంది” అన్నాడు నాయక్.

“సర్లే బావా! నువ్వు కూడా జాగర్త” అంటూ దుర్గారావు కంప్రెషర్ డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. మిగిలిన కూలీలంతా బద్దలైన రాళ్ళను గమేలలోకి తీస్తున్నారు.  డ్రిల్లింగ్ చేస్తుండగా ఉన్నట్లుండి దాదాపు యాభై మీటర్ల పైనుంచి కిందకు రాళ్ళు దొర్లుతూ ఒక్కసారిగా వేగంగా పనిచేస్తున్న కార్మికుల మీదకి వచ్చాయి. ఎవరికి వాళ్ళు వాటి బారి నుండి రక్షించుకోవడానికి పరుగులు తీసారు.

దుర్గారావు మీదకు వస్తున్న రాళ్ళను నాయక్ ముందుగా చూసాడు. తప్పించుకోవడానికి వీలు కాని విధంగా రాళ్ళ మధ్య చిక్కుకున్న అతడి వైపుకి “ఒరేయ్ దుర్గారావు” అంటూ ముందుకు వచ్చినా అతడి అరుపులు గాలిలో కలిసిపోయాయి. పరుగెత్తలేకపోవడంతో అందులో మరో నలుగురు వ్యక్తులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. జోరున కురుస్తున్న వాన శబ్ధంలో కార్మికుల హాహాకారాలు కలిసిపోయాయి. కాసేపట్లో అక్కడకు ఎం పి గారు, అధికారులు, పోలీసు యంత్రాంగం, జర్నలిస్టులు వచ్చి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

ప్రమాదం వార్త తెలియడంతో చంటోడిని చంకనేసుకుని లక్ష్మి, ఇద్దరు పిల్లలను చెరోచేత్తో పట్టుకుని సోనా, అలాగే మిగిలిన కూలీల తరపువాళ్ళు లబోదిబోమని ఏడుస్తూ తమ వాళ్ళు ఎక్కడున్నారని అందరినీ అడుగుతున్నారు. విచారణలో దుర్గారావు, నాయక్ ఇద్దరూ మృతుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది.

కాసేపట్లో ప్రోక్లయినర్ ద్వారా తునాతునకలైన మృతదేహాలను రాళ్ళమధ్య నుండి బయటకు తీసారు. ఉదయం ఇంట్లో నుండి సంతోషంగా పనికి వచ్చిన తమ వాళ్ళు విగత జీవులుగా బయట పడడంతో మృతుల, గాయపడ్డవారి తాలూకు బంధువుల రోదనలు మిన్నంటాయి. లక్ష్మి, సోనా కూడా రెండు చేతులను గుండెల మీద వేసుకుని లబోదిబోమని ఏడుస్తూ అక్కడే కూలబడ్డారు.

“భారీ వర్షాలు పడుతుంటే డ్రిల్లింగ్ పనులు ఎందుకు ఆపలేదు?” మంత్రిగారు రత్నాకర్‌ని ప్రశ్నించారు.

“నేను వద్దన్నాను సర్. కూలీలు వర్షాలకు  పనులు లేక తిండికి కష్టంగా ఉందని వాళ్ళే వస్తామని గొడవ చేసారు. నిజానికి నాకు అసలు ఇష్టం లేదు. వాళ్ళ బలవంతంతోనే ఒప్పుకోవలసి వచ్చింది” అన్నాడు రత్నాకర్.

అక్కడున్న అధికారులకు అతను చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసినా ఎవరూ నోరు మెదపలేదు. మృతులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం వారి నుండి వచ్చే డబ్బు అందుతుందని మంత్రి గారు హామీ ఇచ్చారు. లేబర్ కమిషన్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పిదప లేబర్ చట్టప్రకారం తగు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

“చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా తరపు నుండి కూడా ఇరవై వేలు ఇస్తాను. ప్రభుత్వం నుంచి కూడా ఇన్స్యూరెన్స్ డబ్బులు అందేoదుకు మీకు సహాయపడతాను” కంటి తుడుపుగా అన్నాడు రత్నాకర్.

ఏమంటే ఏం జరుగుతుందో.. మనిషి ఎలాగూ పోయాడు, ఏమైనా అంటే వచ్చే డబ్బు కూడా రాదని బాధిత కుటుంబాలు నోరు మూసుకున్నాయి. తరువాత మృతదేహాలను పోస్టుమార్టంకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. మళ్ళీ అందరూ పొలోమంటూ అటు పరుగెత్తారు.

“లక్ష్మీ! ఈ ముసురులో శవాలను ఇంటికి తెచ్చినా చావు చేయడానికి కూడా మన దగ్గర పైసా లేదు” ఏడుస్తూనే అంది సోనా.

“అయితే వాళ్ళను అనాథలలా ఆస్పత్రిలో వదిలేయడమేనా?” వెక్కుతూ అంది లక్ష్మి.

“అంతేనే..” భుజాల చుట్టూ చెయ్యి వేసి ఓదారుస్తూ అంది సోనా.

సోనా మాటలలో నిజాన్ని గ్రహించిన లక్ష్మి మరింత దుఃఖంతో ఆమెని హత్తుకుపోయింది.

రత్నాకర్ కొడుకు సుభాష్ విదేశoలో విద్యను అభ్యసిస్తున్నాడు. ప్రమాదం జరిగిన ఐదవ రోజున ఇండియా వచ్చాడు. ప్రమాదం గురించిన వార్తలు పేపర్లో, టీవీలో చూడటంతో తండ్రిని పూర్తి వివరాలు అడిగాడు. ఎందుకో ఆయన చెప్పిన సమాధానాలు సుభాష్‌కి సంతృప్తినివ్వలేదు. మరుసటిరోజు స్వయంగా తనే ప్రమాద స్థలాన్ని చూడాలని వెళ్ళాడు.

అతడికి ఘటనాస్థలంలో వారం క్రితం కొన్నిప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయిన ఛాయలు మచ్చుకి కూడా కనిపించలేదు. ఏమీ జరగనట్టు కూలీలు మొన్నటి ప్రమాదానికి వెరవకుండా ప్రాణాలొడ్డి రాళ్ళు బద్దలు కొడుతూ పనిచేస్తున్నారు.

‘ఆకలిమంట ఎంత ప్రమాదాన్నయినా ఎదుర్కునే శక్తినిస్తుంది!’ అనుకున్నాడు సుభాష్.

అంతలో ఎక్కడో సన్నని ఏడుపు వినిపిస్తుంటే చుట్టూ చూసాడు. అక్కడ పగిలిన రాళ్ళను మోస్తున్న ఆడకూలీలు కనిపించారు. వాళ్ళల్లో కడుపుతో ఉన్న ఒక స్త్రీ పిల్లవాడిని వీపుకి కట్టుకుని తల మీద గమేలా పెట్టుకుని నడుస్తుంది. ఏడుపు ఆమె దగ్గర నుండే వస్తుందని తెలుసుకుని అటు వైపుకి నడిచాడు.

“ఏమైందమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు?” అన్నాడు సుభాష్.

“ఏమీ లేదయ్యగారు!” అని తడబడిందామె.

“ఏమీ లేకుండా ఎవరూ ఏడవరు. ఏంటో చెప్తే నాకు తోచిన సహాయం చేస్తాను” అన్నాడు సుభాష్.

“అయ్యా! చెప్పడానికి ఏమీ లేదు. నేను నెత్తి మీద బరువు ఆపలేకపోతున్నాను” అంది.

“అయ్యా! మీకు చెప్పుకుంటే మాకు లాభమేముంటాది?” అంది ఆమె వెనకున్న స్త్రీ.

సుభాష్ ఒక క్షణం మౌనం వహించాడు.

“అమ్మా! ముందు విషయం చెప్పoడి” అన్నాడు సుభాష్.

“నా పేరు సోనా, ఆమె పేరు లక్ష్మి. మొన్న ప్రమాదం జరిగినప్పుడు నా పెనిమిటి, దాని పెనిమిటి పోయారు. కాంట్రాక్టర్ గారు నష్టపరిహారం కింద ఇస్తానన్న డబ్బులో సగమిచ్చాడు. పభుత్వం నుండి వచ్చే డబ్బు ఇంకా రాలేదు. మొగుడు పోయాడని ఏడుస్తూ కూర్చుంటే మా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవు” అంది సోనా.

సుభాష్ నిర్ఘాంతపోయాడు. కాసేపటి తరువాత తేరుకున్నాడు. అప్పటికే సోనా అక్కడ నుండి వెళ్ళిపోయింది. అతడు గబగబ గుమాస్తా దగ్గరకు వెళ్ళాడు.

“గుమాస్తా గారు! మొన్న ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఇచ్చిన డబ్బుల లెక్కలు చూపించండి” అన్నాడు సుభాష్.

“బాబూ! అలాoటి లెక్కలు అందరికీ చూపించకూడదు. నాన్నగారికి తెలిస్తే కోపం వస్తుంది” అన్నాడు గుమాస్తా.

సుభాష్ వెంటనే తండ్రికి ఫోన్ చేసి అక్కడకు రమ్మన్నాడు. రత్నాకర్ ఏం జరిగిందోననే కంగారుతో అక్కడకు వచ్చాడు. జరిగినదంతా గుమాస్తా ఆయనకు వివరించాడు.

“సుభాష్! ఇవన్నీ నీకు అవసరం లేదు. ఇక్కడ నుండి తక్షణమే నువ్వు ఇంటికి వెళ్లిపోవాలి” కోపంగా అన్నాడు రత్నాకర్.

“డాడీ! నేను ఆ కూలీ వాళ్లకు న్యాయం జరిగేదాకా వెళ్ళను” అన్నాడు సుభాష్.

“ఈ నీతులు చెప్పడానికి బాగుంటాయి. నేను కూడా ఇలా నీతులు వల్లిస్తే నువ్వు కూడా అమెరికాలో చదవకుండా వాళ్ళలాగే కూలీపని చేసుకునేవాడివి” హేళనగా అన్నాడు రత్నాకర్.

“డాడీ! ఇలా అవినీతి సొమ్ముతో చదువుకోవడంకన్నా అదే మేలు. మీరు వెంటనే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే మీడియాకు సమాచారం అందిస్తాను.” కోపంగా అన్నాడు సుభాష్.

రత్నాకర్ కొడుకుని దగ్గరకు తీసుకుని నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ససేమిరా వినలేదు. బెదిరించడానికి కూడా చూసాడు, సుభాష్ మరింత మొండిపట్టుదల పట్టాడు. అప్పటికే వారి గొడవకు అక్కడున్న జనం లోపలకు తొంగి చూస్తూ వెళ్తున్నారు.

“డాడీ! ధైర్య సాహసాలతో అన్యాయాన్ని ఎదిరించి నీతిగా బ్రతకాలని నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టానని అమ్మ చాలాసార్లు చెప్పింది. మీరు ఇలా అవినీతి పనులు చేస్తున్నారని అమ్మకు తెలిస్తే మిమ్మల్ని క్షమించదు.. నేను కూడా చూస్తూ ఊరుకోలేను. ఎవరి తప్పులూ ఎల్లకాలం సాగవు. చేసిన తప్పులకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవిoచాల్సిందే! దయచేసి మానవత్వంతో ఆలోచించండి” అన్నాడు సుభాష్.

“సర్! దయచేసి చిన్నబాబుగారి మాట వినండి” అన్నాడు గుమాస్తా.

రత్నాకర్ చేసేదేమీ లేక మరుసటి రోజు ఉదయం మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు సుభాష్ కళ్ళముందే ఇచ్చేసాడు. వాళ్ళు అశ్రునయనాలతో సుభాష్‌కి చేతులెత్తి నమస్కరించారు.

“నేను మీకంటే చిన్నవాడిని నాకు నమస్కారం చేయకండి. మీరు పోగొట్టుకున్న మీ వాళ్ల ప్రాణాలకు మూల్యం చెల్లించడం ఎవరి వల్లా కాదు. నేను ఇండియా నుండి అమెరికా వెళ్ళేలోగా మీకు ప్రభుత్వం నుండి వచ్చే డబ్బు కూడా దగ్గరుండి త్వరగా అందే ఏర్పాట్లు చేస్తాను” అన్నాడు సుభాష్.

“బాబూ! నువ్వు సల్లగుండాల! రెక్కల కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. ఇంటి యజమానిని పోగొట్టుకుని చీకటిలో దారి తెలియక అల్లాడుతున్న మా బతుకుల్లో నువ్వు దీపం వెలిగించావు” చెమర్చిన కళ్ళతో అంది సోనా.

సుభాష్ వారి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. మానవత్వం సుభాష్ లాంటి వారి రూపంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

(అయిపోయింది)

Exit mobile version