అలారం మోగింది. మంచి నిద్రలో వున్న నేను చెయ్యి చాపి, అలారం ఆపి, అప్పుడే ఐదు అయిపోయిందా అనుకుంటూ, కాసేపు నిద్రలోకి జారుకోడానికి ప్రయత్నించాను. 5 నిమిషాల్లో బధ్ధకం తీరిన తరువాత లేచి, కాలకృత్యాలు తీర్చుకున్నాను. మా ఆవిడను వెతుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళాను. గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనే కలిపిన కప్పు నా చేతికి ఇచ్చింది. అది తాగి డాబా మీదకి వెళ్లాను.
మాది విశాఖపట్నం. కేజీహెచ్‌కి దగ్గరలో అఫీషియల్ కాలనీలో మూడంతస్తుల మేడ. పైన పెంట్ హౌస్ చుట్టూతా ఉన్న ఓపెన్ ప్లేస్‌లో వాకింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడి నుంచి సముద్రం కనబడుతుంది. దాని మీద తేలే ఓడలు, తెల్లటి మరకలలా ఉండే అలలు, దూరంగా డాల్ఫిన్స్ నోస్ ఇవన్నీ చూడడం నాకు చాలా ఇష్టం. డస్ట్ ఎలర్జీ ఉండడం వలన బీచ్ రోడ్డు వెళ్లకుండా డాబా మీద నుంచే వాకింగ్ చేస్తున్నాను. క్లాసిక్‌గా వార్మప్, ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ అయ్యేటప్పటికి ఒక గంట పట్టింది. నాకు అర్జెంటు పనులేమీ లేవు. ఎక్కడికి వెళ్లవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆర్ అండ్ బి లో ఇంజనీరుగా పని చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యాను. కిందకు వచ్చాను మా ఆవిడ ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ చేతికిచ్చింది. హ్యాపీగా చేత్తో పట్టుకుని, హాల్‌లో సెటిల్ అయ్యాను. కాఫీ తాగుతూ పేపరు ఆసాంతం చదవడం నా దినచర్యలో ముఖ్యమైన భాగం. అది జరగకపోతే ఆ రోజు ఏదో మిస్ అయినట్టుగ ఉంటుంది. ఎనిమిది గంటలకల్లా తయారయ్యి బయటకు వచ్చింది కల్పవల్లి, నా భార్య. ఫిజిక్స్ లెక్చరర్.
“టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. లంచ్ కూడా హాట్ ప్యాక్‌లో సర్దాను. టైంకి తినండి. నేను నాలుగు గంటలకల్లా వచ్చేస్తాను. వెంకటలక్ష్మి వస్తుంది. ఏం చేయాలో దానికి నిన్ననే చెప్పేసాను. ఇక కొత్తగా ఏమి సూచనలు, సలహాలు ఇవ్వకండి” అని చెప్తూనే బయటకు వెళ్ళింది.
“అలాగే” అని బదులిచ్చి, గేటు వరకు వెళ్లి సాగనంపాను. తాను బండి మీద వెళ్ళిపోయింది. రిటైర్ అయిన కొత్తలో తనను ప్రతిరోజు కాలేజికి దిగపెట్టడం, తీసుకురావడం చేస్తానని వాలంటీర్ చేశాను. కానీ నా మాట నిలబెట్టుకోలేకపోయాను. తన సమయానికి నేను సరిగ్గా తయారవలేకపోయే వాడిని. కాబట్టి అది కొనసాగలేదు. నేను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. కానీ “నా అంతట నేను వెళ్ళి రావడమే నాకు సులువు” అని మా ఆవిడ నా పని తేలిక చేసింది.
మా పెళ్లయ్యి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. నాకు ఉద్యోగం వచ్చిన సంవత్సరంలోనే ఏమైనా స్వాతంత్రం ప్రకటిస్తానని అనుకున్నారో ఏమో మా వాళ్లు నాకు పెళ్లి చేసేశారు. ఆ పాటికి, కల్పవల్లి డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉంది. పెళ్లయిన తర్వాత తాను డిగ్రీ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పిహెచ్ డి చేస్తూ ఉండగా కొత్తగా విమెన్స్ కాలేజీ పెట్టడంతో జాబ్ వచ్చేసింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఇంజనీరింగ్ చేసి అమెరికాలో సెటిలయ్యారు. పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. పెద్ద అమ్మాయికి ఇద్దరు, చిన్న అమ్మాయికి ఒకరు పిల్లలున్నారు. సంవత్సరానికోసారి వస్తూ ఉంటారు. మాది అరమరికలు లేని విజయవంతమైన ప్రయాణం ఇప్పటిదాకా.
పనిమనిషి పిలుపుతో నా ఆత్మావలోకనం నుంచి బయటికి వచ్చాను.
***
11 అవుతూ ఉంటే మళ్ళీ మోగింది, ఇంటి బెల్. వెళ్లి తలుపు తీస్తే కృష్ణమూర్తిగారు, వాళ్ళ అబ్బాయి కోదండరావు వచ్చారు. మా కాలనీలో చాలా ఏళ్లుగా ఉన్న వారిలో ఆయన కూడా ఒకరు. ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. అతడే కోదండరావు.
ఇద్దరు ఆడపిల్లలకూ పెళ్లిళ్లు అయ్యాక ఆఖరికి అతనికి పెళ్లి కావటం వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కోదండరావు వయసు దాదాపు 45 ఉంటాయి. 12 ఏళ్ల ఆడపిల్ల కూడాను. విషయం ఏమిటంటే, అతడికి భార్య పోయి ఓ సంవత్సరం అవుతోంది. ప్రస్తుతానికి మళ్ళీ వివాహం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.
మా వెంకటలక్ష్మి అడగకుండానే వచ్చి అందరికీ కాఫీలు ఇచ్చి వెళ్ళింది. నేను కాఫీ రెండో రౌండ్ లాగించాను. కాసేపు కబుర్లు అయ్యాక అడిగాను,
“మూర్తి గారు ఏమిటి ఇలా వచ్చారు?” అన్నాను.
“మీకు తెలియనిది ఏముంది?! కోడలు పోయి సంవత్సరం అయింది. ఎన్నాళ్ళలా ఒంటరిగా వదిలేస్తాం? మరో పెళ్లి చేద్దామని కోదండం కోసం” అన్నారాయన.
నేను రిటైర్ అయిన తరువాత టైం పాస్ కోసం తెలిసున్న వాళ్ళలో పెళ్లి సంబంధాలను ఆరేంజ్ చేయడం మొదలుపెట్టాను. నంబర్లు కలిపితే పైవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మాట్రిమోనియల్ కాలమ్స్ కన్నా కాస్త అందరికీ, అన్ని విధాల చేరువగా ఉంటుందన్న ఆశ. కోదండరావు వయసును బట్టి ఫైల్ తీశాను. ఇద్దరు ముగ్గురు పెళ్లి కూతుర్లు ఉన్నారు. వాళ్లలో ఇద్దరికి పిల్లలున్నారు. ఒకరు ఒంటరి.
“ఇదిగో ఈ సంబంధం చూడండి. పోయిన ఏడాది అయింది. ఈవిడకి ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాళ్లే. ఆవిడ ఉద్యోగస్తురాలు. కాబట్టి పాపను చూసుకోవడంలో లోటు ఉండదు” అంటూ నా సేల్స్ టాక్ ఇచ్చాను. “ఆల్రెడీ పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు వద్దులేండి” అన్నాడు కోదండం. ఇంకొక ఫోటో చూపించాను.
“ఈవిడ సింగిలే!” అన్నాను.
“మరీ ముదురుగా ఉంది” అన్నాడు వాడు. అన్నీ ఇలా వీటో చేస్తూ ఉంటే ఫైల్ సర్దేసి, సోఫాలో వెనక్కు వాలి “మీ మనసులో ఎవరైనా ఉన్నారా?” అని అడిగాను.
కృష్ణమూర్తిగారు “మీ చుట్టాలు పద్మనాభం గారి కోడలు అయితే ఎలా ఉంటుంది?” అన్నారు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను.
పద్మనాభం గారు మా మామగారు తరపు బంధువులు. ఆయన పెద్దకోడలు జయలక్ష్మి. గంగిగోవు లాంటి పిల్ల. కనుముక్కు తీరు బాగానే ఉంటుంది. ఒకరకంగా ఈ కాలనీలో స్థలం ఆయన ముందు చూపే. అప్పట్లో ఆయన పెద్ద కొడుకు, శేఖరానికి, మా చుట్టాల అమ్మాయి జయలక్ష్మిని, మేమే సంబంధం చెప్పి పెళ్లి చేశాము. అంతో, ఇంతో తాగుడు అలవాటు ఉన్న శేఖరం ఒక రోజున దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో క్వారీ లారీ గుద్దేసి చనిపోయాడు. ఇది జరిగి రెండేళ్లు అవుతోంది.
పద్మనాభం గారింట్లో, మా కాలనీలో ఉన్న అందరితో పోలిస్తే టైం టేబుల్ ప్రకారం తిండి, నిద్ర, పనులు జరుగుతున్నాయంటే, అది మా జయలక్ష్మి అలుపెరుగక చేసే పని. ఈ విషయం అందరికీ తెలుసు. ఎదిగి వచ్చిన కొడుకులిద్దర్నీ చూసుకుంటూ, అత్తమామలకు దగ్గరుండి అన్ని పనులు చేయడంలో జయలక్ష్మి ఓపికకు అంతులేదు. ఇల్లు తోట అన్నీ అందంగా ఉంచుతూ, ఏడాదికోసారి అమెరికా నుంచి వచ్చే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లల పనులను కూడా చిరునవ్వుతో చేస్తుందని జయలక్ష్మికి పేరు. ఊరగాయలు, ఒడియాలు, పొడాలు ఈ లిస్టు పెద్దదే. అత్తగారు ఆడపడుచులు కలిసినప్పుడు మాత్రం, జయలక్ష్మి నష్ట జాతకం వల్లే వాళ్ళబ్బాయి చనిపోయాడంటూ కాస్త ఎత్తిపొడుపు మాటలు ఉంటూనే ఉంటాయి. ఇది నాకు, కల్పవల్లికి కాస్త బాధగానే ఉంటుంది.
“పాపం పిచ్చి పిల్ల! దానికి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడండీ?” అంటూ ఉంటుంది మా ఆవిడ. నాకు కూడా మనసులో ఆ అమ్మాయి పట్ల సింపతీ ఉంది.
కోదండరావు అకస్మాత్తుగా పెళ్లి ప్రపోజల్ తేవడంతో నేను చాలా కదిలిపోయాను. ఎంతసేపు ఇంటి పని, వంట పని, చుట్టాల ఆదరణ, అత్తమామల సేవ అనే ఒక మాదిరి సినిమా కష్టాల లాంటి తన బాధలనుంచి బయట పడేసే మార్గం నాకు కనబడినట్టు అనిపించింది. “ఆ అమ్మాయి అయితే చాలా కరెక్ట్! నీకూ ఆడపిల్ల! ఓపిక ఉన్న మనిషి” అన్నాను నేను.
కృష్ణమూర్తిగారు “అవసరం లేదు వీడి కూతుర్ని అమ్మమ్మగారింటికి పంపించేస్తాం, ఎలాగూ మా కోడలు పొలం తెచ్చుకుంది. అది ఆ పిల్ల పేరున పెట్టేస్తా” అన్నారు.
“ఓ! మగ పిల్లలతో సరిపోతుందన్నమాట మీకు” అన్నాను, కోదండం వైపు చూస్తూ. అతడు ఏం మాట్లాడలేదు. కృష్ణమూర్తి గారి మళ్లీ ఇలా అన్నారు.
“బాంకు ఉద్యోగం కదా! ముందు పెళ్లయిందనుకో! ట్రాన్స్‌ఫర్ తీసుకుని మరో కాపురం పెడతారు, నిక్షేపంగా. మగపిల్లల్ని హాస్టల్‌కు పంపిస్తే బాగుంటుంది” అన్నారు కృష్ణమూర్తి గారే మళ్ళీ.
“కొత్తజంట, కొత్త కాపురం కొత్తగా మొదలు పెడతారన్నమాట,కొత్త ఊళ్లో” అన్నాను. “పిల్లల్ని కనే ఉద్దేశం ఏమైనా ఉందా?” అన్నాను హఠాత్తుగా.
కోదండం తల ఊపాడు. కృష్ణమూర్తిగారు, “అవునండీ! మరి వీడికి కూడా ఒక వారసుడిని కనే అవకాశం ఉంటే మంచిదే” అన్నారు.
నాకు కొంచెం అయోమయంగానే అనిపించినా, జయలక్ష్మికి మళ్లీ పెళ్లి అన్న ఆలోచనకు వచ్చిన సంతోషంతో, “ఆ సంగతి అడుగుదాం లెండి” అన్నాను.
తండ్రి, కొడుకు వెళ్లడానికి బయలుదేరారు. వాళ్ళని సాగనంపడానికి నేను కూడా గేటు దాకా వెళ్లాను. కళ్ళజోడు సర్దుకుంటూ, “ఆ అమ్మాయికి వాళ్ల పుట్టింటివారు ఏమన్నా నగానట్రా, భూమి పెట్టారేమో కనుక్కోవాలి మరి. అమ్మాయి మనదైనప్పుడు ఆ భూమి కూడా మనదే అవుతుంది కదా! తర్వాత, తర్వాత మాట తేడాలు రాకుండా ముందే ఇవన్నీ చక్కబెట్టుకోవడం మంచిది” అన్నారు కృష్ణమూర్తిగారు. నేను నోరు వెళ్ళబెట్టి ఉండిపోయాను,
ఆ రోజు శనివారం కావడంతో కల్పవల్లి త్వరగానే ఇంటికి వచ్చేసింది. సాయంకాలం ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. తనకి పొద్దున జరిగినవన్నీ చెప్పాను.
“ఏంటి బ్యాంకు కృష్ణమూర్తి గారా? వాళ్ల కోదండం చూడడానికి బాగానే ఉంటాడు. అయినా అకస్మాత్తుగా ఇలాంటి విషయాలు మాట్లాడడం కొంచెం కష్టం. రేపు ఆదివారం కదా! జయలక్ష్మిని మనింటికి పిలుస్తాను. మనిద్దరం కలిసి కూర్చోబెట్టి, నెమ్మదిగా చెబుదాం” అన్నది నా శ్రీమతి.
మర్నాడు ఆదివారం సాయంకాలం అయిన తరువాత జయలక్ష్మి వచ్చింది. ముందు ఆడవాళ్లు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. “వస్తారా” కాసేపయాక నా భార్య పిలిచింది. సరేనంటూ వెళ్లి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.
మూర్తి గారి అబ్బాయి వివరాలన్నీ చెప్పి, “జయా! ఈ సంబంధం మా దగ్గరికి వచ్చింది. నీ అభిప్రాయం చెప్తావని ఎదురుచూస్తున్నాను” అంది కల్పవల్లి.
అప్పుడు, “గవర్నమెంట్ ఉద్యోగం కదా అని మామయ్య గారు నీకు ఈ సంబంధాన్ని చేశారు. తీరా అది ఇలా అయిపోయింది. ఆ ఇంట్లో నువ్వు పడే యాతన చూడలేకపోతున్నాం. అప్పుడప్పుడు నువ్వు పిల్లల్ని తీసుకుని మీ పుట్టింటికి వెళ్లి పోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు” అన్నాను.
జయలక్ష్మి అన్నీ విని మౌనంగా కూర్చుంది. మేం ఇద్దరం ఒకరివైపు ఒకరం పరిశీలనగా చూసుకున్నాం. కాసేపయాక, జయ, “పుట్టింటి వాళ్ళు ఇచ్చేదేదో ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వెళ్లి మళ్ళీ వాళ్లకు భారంగా కూర్చోమంటారా? అసలే పల్లెటూరు. కూతురు ఇంటికొచ్చి ఉండడం అవమానం అని అనుకుంటూ ఉంటారు. అయినా పిల్లల్ని కన్నాక, ఇదే నా ఇల్లు. ఇదే నా ఊరు. కష్టమో, నష్టమో ఇక్కడే తేల్చుకుంటాం. ఇక్కడ నాకున్న హక్కును ఎవరూ కాదనలేరు” అని స్థిరంగా చెప్పింది జయలక్ష్మి.
“కాదమ్మా వేరే పెళ్లి చేసుకుని, అక్కడి నుంచి బయట పడవచ్చు కదా?” చాలా తెలివిగా మాట్లాడాననుకున్నాను.
“పిల్లలతో సహా నేను బయటకు వచ్చేస్తే వారసత్వపు ఆస్తుల మీద వాళ్లకు హక్కు పోతుంది కదా? ప్రత్యేకంగా వాళ్లకి నేను గడిచి ఇవ్వగలిగింది ఏమీ లేకపోయినా ఇక్కడే ఉండటం వల్ల వాళ్ల హక్కులు వాళ్ళకి పోకుండా చూసినదాన్ని అవుతాను. నేను అనాలోచితంగా బయటకు వచ్చేయడం ఏ మాత్రం కుదరదు. ఆ హక్కుల్ని లాక్కోవడానికి మా ఆడపడుచు ఎప్పటికీ సిద్ధంగానే ఉంది” అంది జయలక్ష్మి.
తర్వాత ఏం మాట్లాడాలో తెలియక నా భార్య వైపు చూశాను. “కోదండం చాలా మంచోడు. బ్యాంక్ ఉద్యోగం ఒక్కతే ఆడపిల్ల. బోలెడు జీవితం ముందుంది. పిల్లాపాపలతో నీకంటూ ఒక సంసారంతో ఉండాలని మా కనిపిస్తుంది కదా!” అంది మా ఆవిడ.
ఈసారి జయలక్ష్మి, నా కళ్ళలోకి చూస్తూ,”నిజంగా చెప్పండి, అన్నయ్యగారూ! అతనికి కావలసింది వాళ్ళ అమ్మాయికి, నా కొడుకులకు కలిపి తల్లా? లేక ఒక ఆడదా?” అని ప్రశ్నించింది. కృష్ణమూర్తి గారి ఆలోచనలను కొత్త కాపురం పెట్టించాలని ఊహలను గురించి పాజిటివ్‌గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. జయలక్ష్మి వెంటనే నవ్వింది, “అయ్యో మీకు అర్థం కావడం లేదు. అతనికి కావలసింది పిల్లలకు తల్లి కాదు దీపం పెట్టే ఇల్లాలూ కాదు. పడకగదిలోకి ఒక ఆడది” అంది.
నేను మా ఆవిడ కాస్త ఆశ్చర్యపోయాం.
“మీ దగ్గర నాకు స్వాతంత్రం ఉంది గనుక ఇలా ఓపెన్‌గా మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతం తల్లిగా చాలా సుఖంగా ఉన్నాను. ఇది వదులుకుని కేవలం ఆడదాని పోస్ట్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా కూడా లేను. పసుపు కుంకుమల కోసం నన్ను నేను మోసం చేసుకోలేను” అంది జయ.
కల్పవల్లి ముందుగా తేరుకుని, “ఎన్నాళ్ళు వాళ్ళింట్లో చివాట్లు చీత్కారాలు భరిస్తావే?” అంది.
“వదినా! మా పెద్దాడు ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. డిగ్రీ కలిపి కనీసం ఆరేళ్లు పడుతుంది. ఉద్యోగానికి మరో రెండేళ్లు వేసుకుంటాం. ఈ లోపు చిన్నవాడు ఎదుగుతాడు. ఎలా చూసినా, మరో పదేళ్లలో ఇద్దరు సెటిల్ అయిపోతారు. ఈ ఇంటికి వచ్చి నాకు ఇప్పటికి పదహారేళ్లు. మరో పదేళ్లు గడపలేనంటావా? ఇంక ఆ తర్వాత జీవితం అంటావా, నా పిల్లలు చూస్తారని కాదు.ఆ భగవంతుడే అంతా చూస్తాడు. ఈ పదేళ్ళూ, నా బాధ్యతను మరి దేని మీద దృష్టి పెట్టే ఉద్దేశం నాకు లేదు” అని చెప్పింది జయలక్ష్మి.
పొద్దు పోతోందని కల్పవల్లి లేచి గదిలో లైట్ వేసింది.
“దీపాల వేళ! వదినా, మీరు ఇదంతా నా క్షేమం, నా సుఖం కోరి చెప్పారని నాకు తెలుసు. మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు. అయిందేదో అయింది. ఇదే నా తుది నిర్ణయం. ఏం అనుకోకండి” అని బయటకు దారి తీసింది జయలక్ష్మి.
పక్కింటి టీవీలో పాట వినబడుతోంది, ‘అమ్మ మాట’ సినిమాలోది. “తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్నా!” అని.
చాలా సార్లు విన్నా దాని అర్థం నాకు ఎప్పుడు తెలియలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా మెదడులోకి ఎక్కుతున్నట్టుగా అనిపించింది. ప్రతీ ఉదయం సుప్రభాతం పలుకుతూ, “కర్తవ్యం దైవమాహ్నికమ్” అని సామాన్యులమైన మనం, ఆ దేవదేవునికి గుర్తు చేస్తూ ఉంటాం. కానీ మనలో ఎంతమందికి మన కర్తవ్యం ఏమిటో గుర్తుంటుంది? ఈ సమాజంలో చదువు, డబ్బు, అందం ఉన్నా ఆత్మస్థైర్యం, కర్తవ్యం పట్ల స్పష్టత లేక తమ జీవితాన్ని పెళ్ళికాని అమ్మాయిలు సమస్యల్లోకి నెట్టుకుంటున్నారు. అత్తగారు అడిగిందని, మొగుడు మొత్తాడనీ, ఆడపడుచు ఆరళ్లు పెట్టిందని గోరంతలు కొండంతలు చేసుకుని వివాహబంధాన్ని ఇట్టే తెంపుకుని వచ్చేస్తున్నారు వివాహం అయిన వారు. వీళ్లంతా ఒకసారి జయలక్ష్మిని చూస్తే బాగున్ను! ఎవరి కర్తవ్యం వారికి సరిగ్గా తెలిసినప్పుడే ప్రపంచంలో అయోమయం, అసంతృప్తి, అసహనం తొలగిపోతాయి. ఆత్మన్యూనత అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. భర్త పోయాడు, అత్తవారి ఇంట్లో గౌరవం లేదు. ఉద్యోగం చేయడానికి తగిన అర్హత కూడా లేదు, రేపు పదేళ్ల తరువాత ఈవిడ త్యాగాన్ని కన్నబిడ్డలు గుర్తిస్తారో లేదో తెలియదు. కేవలం జీవితం పట్ల సరైన అవగాహన, ప్రస్తుతం తన స్థానం ఏమిటో, ఆ తరువాత తను చేయవలసిన దేమిటో దాన్ని తెలుసుకుని, పాటించగల దృఢమైన చిత్తం ఈ జయలక్ష్మిది.
మా ఇంటి గేటు వేసి మెల్లగా నడుచుకుంటూ ఎదుటి వరుసలో నాలుగేళ్ల అవతల ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తోంది, జయలక్ష్మి. ఆ నడకలో బెదురు లేదు. స్థిరత్వం ఉంది. నాకెందుకో ఆ అమ్మాయి కాళ్ళకు ఒకసారి మొక్కాలనిపించింది.