[బాలబాలికల కోసం ‘దంచినమ్మకు బొక్కిందే కూలి!’ అనే కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
ఒక ఊరిలో రాజయ్య అనే షావుకారు ఉండేవాడు. ఆయన పరమ లోభి. పైసా ఖర్చు పెట్టాలంటే అతడికి ప్రాణం పోయినంత పని అయ్యేది.
ఒకరోజు తన దుకాణంలోని వేరుశనగ పలుకులు, అటుకులను శుభ్రం చేయించడం కోసం ఊరి చివర ఉండే లక్ష్మమ్మను పనికి పిలిచాడు.
లక్ష్మమ్మ నిరుపేద. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు ఆమెది. షావుకారు ఇంట్లో పని మొదలుపెట్టింది. వేరుశనగ పలుకులు శుభ్రం చేస్తూ, ఎవరూ చూడట్లేదనుకుని ఆకలి తట్టుకోలేక పిడికెడు పలుకులు నోట్లో వేసుకుని నములుతూ పనిచేయసాగింది.
సరిగ్గా అదే సమయానికి రాజయ్య అక్కడికి వచ్చాడు. లక్ష్మమ్మ నోరు కదులుతుండటం చూసి ఆయన కళ్లు ఎర్రబడ్డాయి. “ఏమే లక్ష్మమ్మ! ఇదేం వరుస? నిన్ను పనికి పిలిచానా లేక నా ఇంట్లో సరుకులు మేయడానికి పిలిచానా? ఇలా గుప్పెళ్ల కొద్దీ బుక్కేస్తుంటే నాకేం మిగులుతుంది?” అంటూ విరుచుకుపడ్డాడు.
లక్ష్మమ్మ భయంతో వణికిపోతూ, “అయ్యా! ఏమీ అనుకోకండి.. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు, ఆకలి వేసి అలా చేశాను” అని దీనంగా బతిమాలింది.
షావుకారు హేళనగా నవ్వుతూ, “చూడమ్మా లక్ష్మమ్మా! నీలాంటి వాళ్లు ఉండబట్టే ‘దంచినమ్మకు బొక్కిందే కూలి’ అనే సామెత పుట్టింది” అన్నాడు.
లక్ష్మమ్మకు ఆయన చెప్పింది ఒక్క ముక్కా అర్థం కాలేదు. బుర్ర గోక్కుంటూ ఆయన వైపు చూసింది.
షావుకారు వెటకారంగా వివరించాడు.. “పూర్వం రోజుల్లో రోట్లో వడ్లు దంచేటప్పుడో, చేటతో బియ్యం చెరిగేటప్పుడో పనిచేసేవాళ్లు ఆకలి వేసి గుప్పెడు బియ్యం నోట్లో వేసుకునేవారు. అప్పట్లో కూలి డబ్బులు వెంటనే ఇచ్చే అలవాటు ఉండేది కాదు. వారానికో, నెలాకో ఇచ్చేవారు. అందుకే ఆకలి తట్టుకోలేక పని చేస్తూ దొరికినది తినేసేవారు.
యజమానులు కూడా పాపం అని వదిలేసేవారు. దాన్నే ‘బొక్కిందే కూలి’ అనేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అడిగినంత కూలి వెంటనే ఇస్తున్నాం. ఈ రోజుల్లో అటుకులు, వేరుశనగ పలుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత రేటున్న కాలంలో కూడా నువ్వు నా సరుకులు తింటే నాలాంటి వాళ్లు దివాళా తీయాల్సిందే!” అని విసుక్కున్నాడు.
లక్ష్మమ్మ మారు మాట్లాడకుండా తలదించుకుంది. ఒకప్పుడు సామాన్యుడి ఆకలి తీర్చిన ఆ సామెత, నేడు మానవ సంబంధాల కంటే డబ్బుకే విలువ పెరగడంతో రాజయ్య లాంటి లోభుల నోట విమర్శగా వినిపిస్తోంది.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
