Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దండలో దారం

గత కొన్నేళ్లుగా కథారచయిత్రి, కాలమిస్టు, విమర్శకురాలు డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు నిర్వహిస్తూ వచ్చిన కథా చర్చ కార్యక్రమాన్ని గురించి ‘దండలో దారం’ పేరిట వ్యాసంగా అందిస్తున్నారు కె.ఎన్. మురళీ శంకర్.

డేళ్ల క్రితం మే నెలలో ఓ సాయంత్రం, బాగా వేడిగా ఉండే కాకినాడలో ఓ డాబా ఇంటి టెర్రస్ మీద సాహిత్య సమావేశం. ఓ ప్లాస్టిక్ కుర్చీలో ‘చలం’ పుస్తకాలు, వాటిపైన ఆ రచయితకి ఎంతో ఇష్టమైన మల్లెపూల దండ. దాదాపు ఓ ఇరవైమంది సభికులు. ఆ సమావేశంలో వారందరూ వక్తలు కూడాను. చలం జయంతి సందర్భంగా ఆయన రాసిన ఒక్కో పుస్తకాన్ని గురించీ ఒక్కొక్కరు మాట్లాడాలి. అందరూ సాహిత్యాన్ని కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళే. ఇలాంటి చర్చలో గొంతు విప్పడం మాత్రం అందరికీ దాదాపు అదే మొదలు. వాళ్ళందరి మధ్యలోనూ ఒకే ఒక్క రచయిత్రి. ఆవిడ చలం రచనల మీద ‘సత్యాన్వేషి చలం’ పేరిట పరిశోధనా గ్రంథం రచించి, బంగారు పతకాన్ని గెలుచుకున్న విదుషి డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి. డాబా ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరిచెట్లు అడపాదడపా కదులుతూనే ఉన్నా, జరుగుతున్న చర్చల కారణంగా అక్కడి గాలి వేడెక్కింది. అసలే చలం రచనలు, వాటిపై వాద-ప్రతివాదాలకి కొదవేముంటుంది? మొత్తం చర్చలో ఎక్కడా కలగజేసుకోకుండా, అందరి అభిప్రాయాలనీ శ్రద్దగా, ఆసక్తిగా వింటూ కూర్చున్న వారు వీరలక్ష్మీదేవి గారొక్కరే! ‘మాట్లాడింది ఎవరు?’ అని కాకుండా, ‘మాట్లాడిన విషయం ఏమిటి?’ అన్నది మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఆవిడ స్పందించిన తీరు అందరికీ గుర్తుండిపోయింది. సమావేశం ఆసాంతమూ అందరికీ నీళ్ళూ-టీలూ సరఫరా చేయడమే కాకుండా, చివర్లో వేడివేడి ఉప్పుడుపిండి, రసగుల్లాతో హోస్టు రవిగారు ఇచ్చిన విందునీ ఎవ్వరం మర్చిపోలేదు. అదిగో, ఆ విందు జరుగుతుండగానే వీరలక్ష్మీదేవి గారు అన్నారు: “అందరూ బాగా మాట్లాడేరర్రా.. మనం రెగ్యులర్‌గా కథా చర్చ పెట్టుకుందావేంటి?” — అది ప్రారంభం.

నెల్లాళ్ళ తర్వాత, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు కథలు ఎంపిక చేసి, ఫోటోకాపీలు తీయించి నిర్ణీత సమావేశ సమయానికి వారం ముందుగానే అందరికీ పంపిణీ చేశారు వీరలక్ష్మీదేవి – వాటిలో ఆవిడ రాసిన కథ ఒక్కటీ లేదు. “మా మేడమీదే పెట్టుకుందాం” అని రవిగారు అనేయడంతో వేదిక ఎక్కడన్న ప్రశ్నేరాలేదు. పోటీ పరీక్షలకి సిద్ధపడినంత శ్రద్ధగా వచ్చారందరూ. మొదటి కథ మధురాంతకం నరేంద్ర రాసిన ‘మిత్ర’. ఒకరు మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయం మీద చర్చ, ఆ తర్వాత రెండో వారు మాట్లాడడం, చర్చ — ఇదీ ఏర్పాటు, ఆవిడ చేసిందే. కథానాయిక మిత్రవింద స్వార్థపరురాలా? అనే విషయం మీద హోరాహోరీగా చర్చ సాగింది. ఈసారి టీ తో పాటు చెగోడీలనీ సిద్ధం చేశారు రవిగారు, చివర్లో డిన్నర్ మామూలే. కథా చర్చ బృందంలో మహిళలు మిత్రవిందలో స్వార్థాన్ని చూస్తే, మగవాళ్ళంతా ఆమె పట్ల సహానుభూతి చూపించారు. గంటన్నర దాటినా ఇంకా చర్చ సాగుతూనే ఉంది. “ఇంకా రెండు కథలున్నాయర్రా” అంటూనే ఉన్నారు వీరలక్ష్మీదేవి. మొత్తానికి రెండో కథ మీద చర్చ మొదలైంది. మధురాంతకం మహేంద్ర రాసిన ‘హొగెనెకల్’ కథ. మేమందరం ‘ప్రభాస్’ అని ముద్దుగా పిలుచుకునే ఆరడుగుల జగన్నాధరాజు గారు చర్చ మొదలు పెట్టి, కథలో విషాదాన్ని అనుభవంలోకి తెచ్చేసుకుని ఉన్నట్టుండి నోట మాట రాక దుఃఖ పడడం చూసిన మాకందరికీ ఆశ్చర్యం కలిగింది. పాఠకుల మీద సాహిత్యం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అక్కడున్న అందరం ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. మూడో కథ మీద చర్చించడానికి సమయం చాల్లేదు. “ఈసారి కథాచర్చ మా ఇంట్లో పెట్టుకుందాం” వీరలక్ష్మీదేవి గారు ప్రకటించారు. అప్పటికే ఈ చర్చలని హోస్టు చేయడానికి రవిగారితో మరో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు.

తర్వాతి కథాచర్చలో మొదటి కథ తోలేటి జగన్మోహనరావు రాసిన ‘కప్పడాలు’. చర్చ ఎలా జరగబోతోందో ముందే ఊహించినట్టున్నారు, మిర్చీ బజ్జీలు సిద్ధంగా ఉంచారు మా హోస్టు. ఈ చర్చని చేతుల్లోకి తీసుకున్నది అందరం ‘క్రియ జగన్’ అని పిలుచుకునే జగన్నాధ రావు గారు. గ్లోబలైజేషన్ మంచిచెడ్డల మీదకి చర్చని మళ్ళించడమే కాకుండా, అప్పడాల కంపెనీ మూతపడితే తప్పేవిటన్న వాదనని ముందుకు తెచ్చారు. మొదట్లో ‘ఎందుకిన్ని బజ్జీలు?’ అనిపించిన పొట్లం కళ్ళముందే ఖాళీ అయిపోయింది. రెండు మూడు విడతల్లో టీ ప్రవహించింది. చర్చ మాత్రం ఓ కొలిక్కి రాలేదు. రెండో కథకి సమయమూ చిక్కలేదు. “ఈసారి నుంచి ఒక కథ చాలనిపిస్తోంది” అన్నారు హోస్టు, చర్చకి ముక్తాయింపు ఇస్తూ. అప్పటికే గ్లోబలైజేషన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండింటి వాదనల్లోనూ చర్చలకు నిలబడే విషయాలని ఎంచి, మధ్యేమార్గం సూచించి ఉన్నారావిడ. తర్వాతి నెల చర్చ పి. సత్యవతి ‘సూపర్ మామ్ సిండ్రోమ్’ కథ మీద. సభ్యులు ఎంత సంసిద్ధంగా ఉన్నారంటే, సత్యవాణి గారు ఓ లాంగ్ నోట్ బుక్ తెచ్చుకున్నారు వరసగా అందరు మాట్లాడిన పాయింట్లూ రాసుకోడానికి. మహాలక్ష్మి గారు పూర్తిగా కథానాయిక వైపు నిలబడి “ఆమె చేసిన దాంట్లో తప్పేం ఉందండీ? ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని ప్రతి తల్లీ అనుకుంటుంది, ఆమె కూడా అనుకుంది. మీరు ఆవిణ్ణి తప్పు పట్టడం నాకేమీ నచ్చలేదు” అన్నారు. కథానాయిక పొరపాటేవిటో, రచయిత్రి ఏం చెప్పదల్చుకున్నారో వివరంగా చెప్పారు వీరలక్ష్మీదేవి గారు. ప్రతి చర్చలోనూ ఆవిడే చివరి వక్త. ముక్తాయిచండంతో పాటు, తర్వాతి సెషన్ గురించి ప్రకటించడంతో ఆవేల్టి కార్యక్రమం ముగుస్తుంది ప్రతిసారీ. “ఈసారి ఏ కథ గురించి మాట్లాడుకుందాం” అంటూ అభిప్రాయ సేకరణ చేశాకే కథ ఎంపిక చేస్తున్నారిప్పుడు.

డాక్టర్ శైలజ గారు వాళ్ళింట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘కలుపు మొక్కలు’ కథ మీద. “లంచం తీసుకోడమే కాదు, ఇవ్వడమూ నేరమే అయినప్పుడు, తన కొడుకు ఉద్యోగం కోసం లంచం ఇచ్చిన అవధాన్లు ఎందుకు కలుపుమొక్క కాదు?” అనే విషయం మీద వాడి వేడి చర్చ జరిగింది. షర్బత్ ఇచ్చి అందరినీ చల్లబరిచారు డాక్టర్ గారు. శుభశ్రీ గారు హోస్టు చేసిన సమావేశంలో చర్చ త్రిపుర రాసిన ‘జర్కన్’ కథ గురించి. సభ్యులకిప్పుడు కేవలం కథ చదువుకుని వచ్చేయడమే కాక, కథ, రచయిత పూర్వాపరాలు కూడా తెలుసుకుని రావడం, చర్చను వాటితో అనుసంధానించడం అలవాటైంది. జెన్ బౌద్ధం, సీసాలో బాతు అంటూ చర్చను ఎక్కడికో తీసుకుపోతున్నప్పుడు గొంతు విప్పారు, అప్పుడే కథా రచయితగా పేరుతెచ్చుకున్న చిరంజీవి వర్మ. “అది బర్మా యుద్ధం రోజుల నాటి కథ. నిజంగానే జరిగిన సంఘటన అయి ఉంటుంది తప్ప మరీ ఇంత కాంప్లికేటెడ్‌గా ఆలోచించి రాసి ఉండరు.” అప్పటికే అలిసిపోయి ఉన్న అందరం ఒక్కసారి నోరు తెరిచాం. బాదంఘీర్ గ్లాసులు అందించారు హోస్టు. కథాచర్చలు ఇలా ‘ఇంతింతై’ సాగుతున్న రోజుల్లోనే కాకినాడలో రెండు సాహిత్య కార్యక్రమాలు మొదలయ్యాయి. గాంధీభవన్లో చెట్టుకింది నెలవారీ సమావేశాల్లో ప్రతి నెలా ఓ రచయిత గురించి ఉపన్యాసం. ‘పరివర్తన’ మేడ మీద ప్రతి నెలా ఓ నవలా పరిచయం. చర్చల్లో రాటుదేలుతున్న కథాచర్చ సభ్యులకి ఒకటికి రెండు వేదికలు దొరికాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే కవులు, రచయితలూ ఎవరన్నా ఆ సభల్లో ఉండడం జరిగితే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. “ఇక్కడ సాహిత్యాన్ని గురించి బాగా కృషి జరుగుతోందే” అంటూ ఉండేవారు.

కథాచర్చలో కనిపించని ఓ క్రమశిక్షణ మొదటినుంచీ ఉంటూ వస్తున్నా, చర్చలు పదునెక్కే కొద్దీ నియమాల్లోనూ మార్పు రాసాగింది. ‘ఒకరు మాట్లాడడం, చర్చ’ నుంచి ‘వరుసగా అందరూ మాట్లాడక అప్పుడు చర్చ’ గా మారడం వల్ల మాట్లాడేందుకు అందరికీ సమానావకాశం వచ్చింది. సభ్యుల్లో క్రమంగా వచ్చిన మార్పునీ చెప్పుకోవాలి. బయట విడిగా చూస్తే ‘వీళ్ళసలు వాదిస్తారా?’ అనిపించేలా ఉండే అన్నపూర్ణగారు, రవిగారు చర్చలో దూకారంటే ఇక ఎవరూ ఎదురెళ్లలేరు. రాంబాబుగారు చర్చలో వాదించే తీరు చూస్తే ‘ఈయనతో విభేదించే వారి మొహం ఇంకెప్పుడూ చూడరేమో’ అనిపించేస్తుంది. చర్చ అయిపోయాక మళ్ళీ మామూలే. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ క్షణం కూడా మౌనంగా ఉండని సంధ్యగారు చర్చ మొదలయ్యిందంటే ఇక పెదవి కదపరు. అతి మితభాషి మంగమణి గారు ఉన్నట్టుండి అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, జవాబు చెప్పడానికి కనీసం రెండు మూడు నిముషాలు ఆలోచించుకోవాలి. అందర్నీ శ్రద్ధగా వినడమే కాదు, ఓ కంట కనిపెడుతూ ఉంటారు వీరలక్ష్మీదేవి గారు. అప్పుడే చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరిన కుర్రాడు హర్ష ఓ కథ గురించి తన అభిప్రాయం చెప్పాలా వద్దా అని లోలోపల గుంజాటన పడుతుంటే మొదట గుర్తించింది ఆవిడే. వరుసక్రమాన్ని ఆపి మరీ అతనిచేత మాట్లాడించారు, “చిన్నవాళ్లని మొదట మాట్లాడనివ్వాలి” అంటూ. అయితే ఇదంతా చాలా ‘లో-ప్రొఫైల్’ కార్యక్రమం. కథాచర్చ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కాదు కదా, చర్చ జరిగేప్పుడు మేమెవ్వరం ఫోటోలు కూడా తీసుకోలేదు. టెక్నాలజీని ఒడిసి పట్టుకోవడంలో ‘కథాచర్చ’ గ్రూపు ముందే ఉంది. మొదట్లో కథల ఫోటోకాపీల బట్వాడా, ఎస్సెమ్మెస్ ద్వారా సమావేశం వివరాల పంపిణీ జరిగేది. రానురానూ, కథల పీడీఎఫ్‌లు వాట్సాప్ లో పంచడం, అటుపైన ‘కథాచర్చ’ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడమూ జరిగింది.

అంతకు మించిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్ గురించి చెప్పుకోడానికి ముందు ఓ రెండు సంగతులు చెప్పుకోవాలి. కాకినాడలో ప్రతి ఏటా జరిగే ‘క్రియ’ పిల్లల పండుగకి చాలా ప్రాంతాల నుంచి రచయితలూ, రచయిత్రులూ వస్తూ ఉంటారు. ‘క్రియ’లో అతిథి మర్యాదలకి ఎప్పుడూ లోటుండదు. అయితే, కథాచర్చ మొదలయ్యాక రచయితలూ, రచయిత్రులని ప్రత్యేకంగా గుర్తుపట్టడం మొదలయ్యింది. “మీరు రాసిన కథ గురించి మేం చర్చించుకున్నాం” అని సభ్యులు చెప్పడం, వాళ్ళు సంతోషపడడం, ఓ కొత్త ఆత్మీయత. ‘క్రియ’ జరిగేప్పుడే రచయితలతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వచ్చింది కథా చర్చ సభ్యుల్లో. ఇక, రెండున్నరేళ్ల క్రితం వీరలక్ష్మీదేవి గారు నిర్వహించిన ‘పద యాత్ర’ ఆలోచన మొదలయ్యింది ఒకానొక కథాచర్చలోనే. శ్రీపాద సొంత ఊరు పోలమూరు నుంచి కృష్ణశాస్త్రి పుట్టిపెరిగిన చంద్రంపాలెం వరకూ పాదయాత్ర చేయాలని సంకల్పించారవిడ. ‘పద యాత్ర’ అని పేరు పెట్టారు. ‘కథ నుంచి కవిత్వానికి’ అంటూ టాగ్ లైన్ జతచేశారు చిరంజీవి వర్మ. కథా చర్చ సభ్యులందరం నాలుగైదు కార్లలో బయలుదేరి ఓ ఆదివారం ఉదయాన్నే పోలమూరులో దిగిపోయాం. అక్కడి స్థానికులతో మాట్లాడితే వాళ్ళెంతో సంతోషంగా ఆహ్వానించారు. అటుపైన చంద్రంపాలెం వరకూ ‘రెక్కీ.’ దూరాన్ని కొల్చుకుంటూ, మధ్యాహ్న విరామాలు, రాత్రి విశ్రాంతి ఎక్కడెక్కడ తీసుకోవాలో నిర్ణయించుకుంటూ, స్థానికులతో మాట్లాడుతూ చంద్రంపాలెం చేరేసరికి సాయంకాలమైంది. అటుపైన రెండు మూడు సమావేశాలు కేవలం శ్రీపాద, కృష్ణశాస్త్రి రచనల మీద చర్చలతో పాటు, పద యాత్ర ఏర్పాట్లు సమీక్షించుకునేందుకే. సంగీతం టీచర్ శేషుకుమారి గారు వాళ్ళింట్లో బజ్జీలు లైవ్‌లో వేసి అందిస్తుంటే అవి తింటూ ప్లాన్‌కి మెరుగులు దిద్దాం. మిరియాల జున్ను తింటే తప్ప విడిచిపెట్టలేదు శేషుకుమారి గారు.

మూడురోజుల పాటు సాగిన ‘పద యాత్ర’ ఓ వైవిధ్యమైన కార్యక్రమం. అంతకు ముందెప్పుడూ ఆ తరహా యాత్ర జరిగిన దాఖలా లేదు. “ఓ మహిళ ముందుండి నడిపించడం” అని మేం అనబోతే “టాఠ్, ఇది మనందరి కార్యక్రమమూను, ముందూ వెనుకా ఏమీ లేదు” అనేశారు వీరలక్ష్మీ దేవి గారు. వీలు కుదిరిన అందరం కలిసి నడుస్తూ, దారిలో గుడి, బడి ఎక్కడ నలుగురు కనిపించినా ఆగి మాట్లాడడం – మరీ ముఖ్యంగా బడుల్లోకి వెళ్లి మేష్టర్ల తోనూ, పిల్లలతోనూ వివరంగా చర్చించడం – ఇలా ఆడుతూ పాడుతూ సాగిందా యాత్ర. కథాచర్చ సభ్యులు పిల్లలతో మాట్లాడారు, ఆసక్తి ఉన్నవాళ్ళకి కథల ఫోటో కాపీలు పంచారు. పోలమూరులో జరిగిన ప్రారంభ సభ, చంద్రంపాలెంలో జరిగిన ముగింపు సభ మాత్రమే కాదు, పద యాత్ర ఆసాంతం అందరికీ గుర్తుండిపోయే అనుభవం. కథాచర్చ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా సాగుతూ ఉండగా గత మార్చిలో కోవిడ్ మహమ్మారి రూపంలో పెద్ద ఆటంకం ఎదురైంది. గడప దాటి బయటకి వెళ్లకూడని పరిస్థితుల్లో చర్చలు సాగేదెలా? దీనికీ మార్గం దొరికింది. కోవిడ్ మొదలైన మూడు నాలుగు నెలలకి వీరలక్ష్మీదేవి గారే ఓ ప్రతిపాదన తెచ్చారు. కాన్ఫరెన్స్ కాల్‌లో కథా చర్చ చేద్దామని. మాకెవరికీ ఊహకి కూడా అందని విషయం అది. అసలు ముఖాముఖీ లేకుండా చర్చేమిటి? డాక్టర్ వి. చంద్రశేఖర్ రావు ‘చిట్టచివరి రేడియో నాటకం’ కథతో ఈ కొత్తరకం కథాచర్చ మొదలయింది. ఉన్నట్టుండి కొందరికి కాల్ డ్రాప్ అవడం, వాళ్లెవరో కనుక్కుని మళ్ళీ కాల్‌లో చేర్చడం లాంటి ఇబ్బందులూ, ముఖాముఖీ ఉంటే ఇంకా బాగుండేదన్న భావనా అందరికీ ఉన్నా, కార్యక్రమం ఆగిపోలేదన్న సంతోషం ముందుకి నడిపించింది. అయితే, అది ఎక్కువకాలం సాగలేదు.

సభ్యులకో, వాళ్ళ తాలూకు వాళ్ళకో అనారోగ్యం, చర్చకి సిద్ధపడే పరిస్థితులు లేకపోవడం లాంటి కారణాలతో కథాచర్చ నిరవధికంగా వాయిదా పడింది. కాళీపట్నం రామారావు గారు ఇక లేరన్న వార్త వినగానే వీరలక్ష్మీదేవి గారు చేసిన ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ కాల్‌గా మారడం, అందుబాటులో ఉన్న అందరం ‘యజ్ఞం’ ‘ఆర్తి’ కథల్ని జ్ఞాపకం చేసుకోవడంతో కథా చర్చ ఆగిపోదనీ, కొనసాగుతుందనీ భరోసా కలిగింది మాకు. గడిచిన ఏడేళ్లలో కథా చర్చలో ఎన్నో మార్పులొచ్చాయి. నాటి సభ్యుల్లో కొందరు ఇప్పుడు లేరు. మరికొందరు కొత్తవాళ్లు వచ్చి చేరారు. కథను శ్రద్ధగా చదవాలి, అందరు మాట్లాడేదీ వినాలి, కథకి సంబంధం లేని విషయాలతో చర్చని పక్కదారి పట్టించకూడదు అనే మూడు నియమాలూ పాటిస్తే చాలు, కథా చర్చలో పాల్గొనవచ్చు. మొదట్లో కథ ఎంపిక మొదలు, అన్ని విషయాలూ తానే స్వయంగా చూసుకున్న వీరలక్ష్మీ దేవి గారు ఇప్పుడు బాధ్యతల్ని అందరికీ పంచారు. ‘ఇప్పటి కథాచర్చల్లో ఆవిడ పాత్ర ఏమిటి’ అంటే జవాబు ఒక్కటే, దండలో దారం. సభ్యులందరూ ఒకే కథ మీద ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు, అన్నీ శ్రద్ధగా విని, అందరి ఆభిప్రాయాలకీ సమన్వయం చేస్తారావిడ. ఇన్నేళ్ళుగా కథా చర్చ విజయవంతంగా సాగడం వెనుక రహస్యం కూడా ఇదే. చర్చల్లో పాల్గొనే సభ్యులు అన్ని చోట్లా ఉండొచ్చు కానీ, ఇలా సమన్వయం చేయగలిగే వారే అరుదుగా ఉంటారు. ఈ కథాచర్చ కాకినాడకు ప్రత్యేకం. త్వరలోనే మనం కథా చర్చని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి మేడమ్. మీరు మరెన్నో పుట్టిన రోజులు మరింత సంతోషంగా జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష.

(జులై 19 డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి పుట్టిన రోజు)

~

డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి రచనలు: ‘ఉత్సవ సౌరభం’ ‘కొండఫలం’ ‘కిటికీ బయట వెన్నెల’ కథా సంపుటాలు, ‘సాహిత్యానుభవం’ వ్యాస సంకలనం, ‘సత్యాన్వేషి చలం’ పరిశోధనా గ్రంధం, ‘భారతీయ నవలా దర్శనం’ భారతీయ భాషల నుంచి తెలుగులోకి అనువదింపబడిన వంద నవలల సమీక్ష, ‘ఆకులో ఆకునై’, ‘మా ఊళ్ళో కురిసిన వాన’, ‘జాజిపూల పందిరి’ ‘కొన్ని శేఫాలికలు’ కాలమ్స్.

-కె.ఎన్. మురళీ శంకర్

Photo courtesy: Rajesh Ramdas

Exit mobile version