Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దంతవైద్య లహరి-11

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

డెంటల్ ఫ్లోరోసిస్

ప్ర: డాక్టర్ గారూ నమస్కారం. కొందరికి దంతాలు కొంచెం పసుపు రంగులో ఉంటాయి. ఎంత క్లీన్ చేసుకున్నా తెల్లగా కావు. చిన్నప్పటి నుండి అలాగే వున్నాయి. దంతవైద్య నిపుణులను అడిగితే ఫ్లోరైడ్ వాటర్ తో అలా వస్తంది రంగు అంటారు. దీని గురించి, సరైన సూచనలు చేయగలరు.

–శ్రీమతి. ఎ. విజయ లక్ష్మి, నిజామాబాద్.

జ: విజయ లక్ష్మి గారూ.. రంగు పళ్ళు శీర్షికన, ఈ పసుపు పళ్ళ గురించి పాక్షికంగా గతంలో చర్చించాము. అది మీరు చదివే వుంటారు. అయినా ఇది చాలామందిలో ఉదయించే సందేహం కనుక మళ్ళీ ఒకసారి కాస్త విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి రంగు పళ్ళు ఉండడానికి గల కారణాలలో ‘ఫ్లోరోసిస్’ ఒకటి. అయితే, ఫ్లోరోసిస్ పళ్ళను చాల సులభంగా గుర్తుపట్టవచ్చును. ఫ్లోరోసిస్ పళ్ళు ఏ రంగులో నైనా ఉండవచ్చు. పంటి మీద మచ్చలు.. మచ్చలుగా వుండి చూడ్డానికి కాస్త అభ్యంతరకరంగా ఉంటుంది.

ఎక్కువ శాతం ఫ్లోరోసిస్ పళ్ళు తెల్లని మచ్చలను కలిగి ఉంటాయి. వీటిని ‘సుద్ద పళ్ళు’ అని వ్యవహరిస్తారు. ఈ సుద్ద పళ్లకు ‘ఫ్లోరోసిస్ పళ్ళు’ అని పేరు ఎందుకు వచ్చినట్టు?

మనం త్రాగే నీటిలో ఉండవలసిన దానికంటే ‘ఫ్లోరిన్’ అధిక మోతాదులో ఉంటే, ‘ఫ్లోరోసిస్’ అనే సమస్య ఉత్పన్నం అవుతుంది. అయితే దీని వల్ల పంటి పింగాణీ పొరమీద తెల్లని సుద్ద మచ్చల్లా గానీ, గోధుమరంగు గానీ ఇతర రంగులు గానీ రావచ్చు. అయితే ఫ్లోరోసిస్ భారిన పడిన పళ్ళు, పెళుసుగా (ఫ్రెజైల్) వుండి, కొంచెం గట్టి పదార్ధాలు తింటే పంటి చివరి భాగం ముక్కలు ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అలా చూడ్డానికి బాగుండపోవడమే గాక గట్టి పదార్ధాలు నమిలే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆడపిల్లల విషయంలో, ముఖ్యంగా పెళ్లి కావల్సిన ఆడపిల్లలకు ఇది ఒక మచ్చ లాంటిదే!

ఇది సాధారణంగా త్రాగునీటిలో ఫ్లోరిన్ స్థాయి 2-పి.పి.ఎం నిష్పత్తిని మించి వున్న నీళ్లు త్రాగిన వారికి ప్రాప్తిస్తుంది. అంటే నిలకడగా వుండే బావి నీళ్ళల్లో (అన్ని బావుల్లో కాదు) ఫ్లోరిన్ అధికంగా వుండే అవకాశం వుంది. అంటే గ్రామాలలో చిన్నప్పటి నుండీ బావినీరు త్రాగేవారిలో ఫ్లోరోసిస్ వస్తుంది. అది కూడా కొన్ని ప్రాంతాల బావి నీటివల్లనే వస్తుంటుంది. ఉదా: నల్లగొండ జిల్లా (తెలంగాణా), ప్రకాశం జిల్లా (ఆంద్ర ప్రదేశ్), మరి కొన్ని ప్రదేశాలు.

ఈ రంగు పోగొట్టుకోవడానికి, పంటి నిర్మాణంపై అవగాహన లేని చాలామంది, గరుకుపొడులతో పళ్ళు తోమే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పంటి రంగు పోదు సరికదా, పన్ను అరిగి పోయి, ఆ తర్వాత ‘జివ్వు’మని గుంజడం మొదలు పెడుతుంది. అందుచేత శాశ్వత ప్రయోజనం ఉండదు. కొందరు దంతవైద్యులు ‘బ్లీచింగ్’ చికిత్స చేస్తారు. అంటే ఆమ్లాలతో కడగడం అన్నమాట! ఇది కూడా శాశ్వత వైద్యం కానే కాదు!

ఈ ఫ్లోరోసిస్ మచ్చలతో పట్టింపు లేని వాళ్లకు ఏ సమస్యా లేదు. అది భరించలేనివారు మాత్రం, ముఖ్యంగా పెళ్ళి కావలసిన ఆడపిల్లలకు ‘పంటి తొడుగులు’ చికిత్స చేయించుకోవడం ఉత్తమం. దీనినే ‘క్రౌన్ & బ్రిడ్జి’ చికిత్స అంటారు. ఫ్లోరోసిస్ వల్ల వచ్చే దంత సమస్య ఇతర శరీర ఫ్లోరోసిస్‌తో పోల్చుకుంటే అతి స్వల్పం అని గుర్తుంచుకోవాలి.

~

ప్ర: పన్ను తీసిన /తీయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారూ?

శ్రీ గోనుగుంట మురళీకృష్ణ & ఇతరులు.

జ: పన్ను తీయడం అనేది అనుకున్నంత పెద్ద చికిత్సా ప్రక్రియ కాదు, అలా అని నిర్లక్ష్యం చేయదగ్గ చిన్న చికిత్సా ప్రక్రియ కాదు. మామూలుగా ఓ చిన్న శస్త్ర చికిత్స.

శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పన్ను తీయించుకున్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

పన్ను తీయడమూ/తీయించుకోవడమూ అనే చికిత్స, దంత వైద్యుడి సమక్షంలో, డెంటల్ క్లినిక్‌లో పూర్తి అవుతుంది. అక్కడ ఎలాంటి సమస్య వచ్చిన వారు తగిన సమయంలో చికిత్స చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనము, మన కుటుంబ సభ్యులు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుచేత దంతవైద్యులు సూచించిన జాగ్రత్తలు తూ.చ. తప్పకుండా పాటించాలి.

పన్ను తీయించుకున్న తర్వాత ఎదురయ్యే సాధారణ సమస్యలు:

పంటి కుదురు నుండి రక్త స్రావం:

సాధారణంగా పన్ను తీసిన వెంటనే దంత వైద్యులు పన్ను తీసిన చోట (పంటి కుదురు మీద) దూది వుండ పెట్టి అరగంట సేపు గట్టిగా వత్తి పెట్టమని, నోట్లో సహజంగా వూరే లాలాజలం ఉమ్మి వేయకుండా మింగాలని చెబుతారు. కానీ చాలా మంది క్లినిక్ నుండి బయటకు రాగానే, నోటిలో ఊరిన లాలాజలాన్ని మింగకుండా ఉమ్ముతుంటారు. ఇంటికి వెళ్ళగానే దూది వుండతీసి బయట పడేస్తారు. దానితో పంటి కుదురు నుండి రక్తస్రావం మొదలవుతుంది. లాలాజలానికి అది తోడై, ఉమ్మగానే బోలెడు రక్తంలా కనిపించి భయబ్రాంతులకు గురిచేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, నోరు పుక్కిలించే ప్రయత్నం చేస్తారు. దీనితో రక్తస్రావం మరింతగా ఉధృతమయ్యే అవకాశం వుంది. మరి, ఎందుకు ఇలా? పన్ను తీసినప్పుడు, దౌడ రక్త నాళాల నుండి పంటి రక్తనాళాలు తెగిపోవడం మూలాన రక్తస్రావం జరుగుతుంది. అందుచేత పంటి కుదురుమీద దూది వుండతో వత్తిపెట్టడం వల్ల రక్తం గడ్డకట్టి రక్తనాళాలు మూసుకు పోతాయి. తద్వారా రక్తస్రావం ఆగిపోతుంది. దూది త్వరగ్గా తీసేయడం వల్ల రక్తం గడ్డ కట్టక రక్తస్రావం జరుగుతుంది. అలాగే రక్తం గడ్డకట్టే స్థాయిలో నోరు పుక్కిలిస్తే, రక్తపు గడ్డ పగిలి రక్తస్రావం అయ్యే అవకాశం వుంది. అందుచేత దంతవైద్యుల సూచనలు తప్పక పాటించాలి.

ఇకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసారు రక్తస్రావం కొనసాగే అవకాశం వుంది. కొన్ని రక్త సంబంధమైన వ్యాధుల మూలాన, రక్తం గడ్డకట్టదు. ముఖ్యంగా ‘హీమోఫీలియా’ వంటి వ్యాధులు వున్నవారు, దాని గురించి దంతవైద్యుల దృష్టికి తీసుకు రాకపోవడం మూలాన ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది ప్రాణానికే ముప్పు తెచ్చే సమస్య. అందువల్ల, ఎంతకీ రక్తస్రావం ఆగకుంటే, వెంటనే దంతవైద్యులను గాని లేదా దగ్గరలో వున్న ఇతర వైద్యులను గాని సంప్రదించాలి.

అలాగే పన్ను తీసిన పంటి కుదురులో చేతి వేలు అదే పనిగా పెట్టడం వల్ల, పంటి కుదురు వ్యాధిగ్రస్థమై, ఆ ప్రాంతం వాచి, విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం వుంది. ఈ సమస్యను ‘డ్రై సాకేట్’ అంటారు. దీనికోసం మళ్ళీ ప్రత్యేకమైన మందులు వాడవలసి ఉంటుంది.

అలా అని, పన్ను తీయించుకోవాలనుకునేవాళ్ళు ఈ సమస్యలన్నిటినీ ఊహించుకుని భయపడకూడదు. మన ఇతర శరీర సమస్యలను దంతవైద్యుల దృష్టికి తీసుకువెళ్లి వారికి సహకరించడం, వైద్యుల సూచనలు విధిగా పాటించడం చేయగలిగితే, పన్ను తీయించుకోవడం అనేది అతి చిన్న శస్త్ర చికిత్స మాత్రమే!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version