[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
పనుదోము పుల్లతో పచార్లు:
ప్ర: డాక్టర్ గారూ, పూర్వం గ్రామీణ జీవనంలో పండ్లను ‘పిడక బొగ్గు’ (కచ్చిక)తో గానీ, ఏదైనా పందుంపుల్లతో గానీ శుభ్రం చేసుకునేవారు. ఆ సందర్భంలో నోట్లో పందుంపుల్ల వేసుకుని ఊరంతా తిరిగి రాజకీయాలు చక్కబెట్టటమో, ఇతర పనులు చూసుకోవటమో చేసేవారు. తిరిగి ఇంటికి వచ్చేవరకూ పందుంపుల్ల సగానికి పైగా అరిగిపోయేది! ఈ ఆధునిక సమాజంలోకూడా కొందరు టూత్ బ్రష్ పైన పేస్ట్ వేసుకుని, ఊరంతా తిరగడం చాలామంది గమనించే వుంటారు. అంతసేపూ నోట్లో వారి బ్రష్ నలుగుతూనే ఉంటుంది. ఇది ఎంతవరకూ సమంజసం?ఈ పద్ధతి దంతాలకు మంచిదా? చెడ్డదా?
-నాగిళ్ల రామ శాస్త్రి,సాహితీ వేత్త, హన్మకొండ.
జ: శాస్త్రి గారూ.. ఈ శీర్షిక ప్రారంభించిన తర్వాత మీరే ఇంత పెద్ద ప్రశ్న వేశారు. ఇక్కడ ఇదొక రికార్డు. తర్వాత ఒక దురలవాటును (వారికి మంచి అలవాటే అనిపించవచ్చు!) గమనించి, నా వంటి వారి దృష్టికి తీసుకు రావడం గొప్ప విషయం. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు. ప్రతి వారం ఈ శీర్షికలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, తగిన సూచనలు చేస్తున్న మీ పెద్ద మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
పూర్వం పల్లెటూళ్లలో దంతధావనానికి ప్రధానంగా పంటి పుల్ల/పనుదోము పుల్ల లేదా పందుంపుల్లను వాడేవారు. టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు విపణిలో ప్రవేశించేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు ఉదయం పొలాల్లో పని చేసుకోవడానికి వెళుతూ, మధ్యలో ఎక్కడో ఒక చెట్టు పుల్ల విరిచి పళ్ళు తోముకుంటూ పొలం వరకు వెళ్లి, అక్కడ పంటకాలువలో ముఖం కడుక్కునేవారు. ఇంట్లో ఉండేవారు పంటి పుల్లను వాడినా, ఎక్కువశాతం మంది, బొగ్గుపొడి, ఇటుకపొడి, ఉప్పు, కచ్చిక వంటి పదార్థాలతో పళ్ళు తోముకునేవారు. తరువాత పళ్ళపొడుల ఆవిర్భావం, ఆ తర్వాత టూత్ పేస్టులు అందుబాటులోకి వచ్చి కొనసాగుతున్నాయి.
ఇకపోతే, పందుంపుల్లతో ఎక్కువసేపు గడిపితే ఎదురయ్యే అనర్థాలు ఏమిటీ? అన్నది ప్రశ్న. పుల్లను ఎంతసేపు నమిలినా జరిగే నష్టం ఏమీ లేదు, సమస్య వచ్చేది ఎక్కువ సేపు పళ్ళు తోమినప్పుడే! సాధారణంగా పళ్ళు తోముకోవడానికి, చాలా రకాల చెట్టుపుల్లలు వాడినప్పటికీ, ఎక్కువశాతం మంది వాడేది మాత్రం వేప, గానుగ పుల్లలు. వీటిని నమలడం, వీటితో పళ్ళు తోముకోవడం వల్ల, పళ్ళు శుభ్రపడడమే కాక, వీటిలో వుండే నూనెలు, పంటి చిగుళ్లు ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడతాయి. కానీ పంటి పుల్లతో, పళ్ళను ఎక్కువసేపు తోముకోవడం వల్ల పళ్ళు త్వరగా అరిగిపోవడమే గాక అనుకోని రీతిలో చిగుళ్లకు గాయమయ్యే ప్రమాదం వుంది. అంతమాత్రమే కాక, దారి పొడవునా ఉమ్ముతూ పోవడం వల్ల వీరికున్న అనారోగ్య సమస్యలు – పాదరక్షలు లేకుండా నడిచే పాదచారులకు సంక్రమించే అవకాశం వుంది. అందుచేత ఈ అలవాటు మంచిది కాదు. గరుకు పొడులతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా రావచ్చునేమో గాని, త్వరగా అరిగిపోయి, ఇబ్బందులను సృష్టిస్తాయి. తప్పనిసరిగా పళ్ళపొడిని వాడాలని అనుకునేవారు, మెత్తని పొడులను ఎన్నుకోవడం మంచిది.
ఇకపోతే, పళ్ళు తోముకోవడానికి పందుంపుల్లను ఉపయోగించినా, పళ్ళపొడి/టూత్ పేస్ట్ ఉపయోగించినా, దంతధావనానికి ఒక అయిదు నిముషాలు కేటాయించి, ఒకచోట కూర్చొని లేదా నిలబడి, ఆ పని పూర్తిచేయడం మంచిది.
పళ్ళను ఐదు నిముషాలకంటే ఎక్కువసేపు తోముకోవడం ఆరోగ్యకరం కాదు. అలాగే హార్డ్ బ్రష్‌లు వాడడం, పళ్ళను గట్టిగా రుద్దడం చేయకూడదు. బ్రతికినంత కాలం పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పని సరి!
~
ముందరి పళ్ళమధ్య లావు చిగురు:
ప్ర: డాక్టర్ గారూ.. మా అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. చాలా అందంగా ఉంటుంది. ఆమెకు చిన్నప్పుడు, వేలు చీకే అలవాటు లేదు. కానీ, ఇప్పుడు ముందరి పళ్ళ మధ్య చిగురు లావుగా అయి ఖాళీ ఏర్పడి, చూడడానికి అసలు బాగోలేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమైనా ఉంటే, చెప్పగలరా?
– ఎస్. వి. చలపతి రావు. హైద్రాబాద్.
జ: చలపతి రావు గారు, మీ అమ్మాయికి ‘డయాస్టిమా’ (రెండు పళ్ళ మధ్య గేప్) అనే చిన్న సమస్య వుంది. ఇలా రావడానికి కొన్ని కారణాలు వున్నాయి. 1) దౌడ మామూలుగా వుండి, దౌడ లోని పళ్ళు ఉండవలసిన పరిమాణం కంటే చిన్నగా వున్నప్పుడు 2) వేలు చీకడం అనే అలవాటు వున్నప్పుడు 3) ముందరి పళ్ళమధ్య వుండే సన్నని నరం (ఫ్రీనం) లావుగా మారడం వల్ల పళ్ళ మధ్య ఖాళీ రావచ్చు. మీరు చెప్పిన దానిని బట్టి మీ అమ్మాయికి, మూడవ రకం సమస్యగా నాకు అర్థం అయింది. దీనిని చిన్న శస్త్ర చికిత్స, దాని తర్వాత ఆర్థోడాంటిక్ చికిత్స ద్వారా పరిష్కరించవచ్చును.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అమ్మాయిని, దంత వైద్యులకు (ఓరల్ సర్జన్ + ఆర్థో డాంటిస్ట్) చూపించండి. త్వరలో ఫలితం మీకే తెలుస్తుంది. ఆలస్యం అయ్యేకొద్దీ చికిత్స క్లిష్టతరం అయ్యే అవకాశాలు ఉంటాయి.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.