[శ్రీమతి లక్ష్మీ అయ్యగారి రచించిన ‘దసరా వచ్చిందయ్యా!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“బడిలో ఈ వారం అంతా పాఠాలు చెప్పరు బామ్మా.. ఈ నాలుగు రోజులూ మాస్టార్ల వెంట నాలుగు వీధుల్లో తిరుగుతూ బాణాలు పట్టుకుని దసరా పాటలు పాడుతూ, అందరికీ పప్పు బెల్లాలు పంచాలిట. మురళీకృష్ణ మాస్టారు ఆ బాధ్యత అంతా నువ్వే చూసుకో కాముడూ.. అని నాకు అప్పచెప్పారు. మా మాస్టారుకి నేనంటే ఎంత ఇష్టమో.. తెలుసా!! నక్షత్రాల పేర్లు నా అంత క్షుణ్ణంగా ఎవ్వరూ చెప్పలేరని మిగతా మాస్టర్లతో ఎప్పుడూ అంటూ ఉంటారు.”
గుక్కతిప్పుకోకుండా నేను మాట్లాడే మాటలకి బుగ్గమీద అబ్బురంగా వేలు వేసుకుని వింటున్న బామ్మనీ, నన్నూ.. మార్చి మార్చి చూస్తూ.. “మొదలయ్యాయా బామ్మ మనవరాలి గొప్పలు.. అది చెప్పడం, మీరు దాని మాటలు విని రోజూ దిష్టి తీయడం, నెలకో మూడు కేజీల ఉప్పు దీని దిగదుడుపులకే సరిపోతుంది” అని నాలుగు దులిపేసి అక్కడ నుండి నిష్క్రమించింది మా మాతాజీ.
“బామ్మా!!! ఎలా.. అయినా బాణాలు తీసుకుని రేపు ఉదయానికి బడి దగ్గరకి రమ్మన్నారు. అమ్మకి చెప్తే మగరాయుడిలా బాణాలు పట్టుకుని గెంతులు వెయ్యకు, సున్నితంగా అమ్మాయిలా ఉండడం నేర్చుకో అంటోంది” అని, బామ్మకి చెప్పేలోపే పేద్ద చెక్కబల్లని ఈడ్చుకుని రావడం నా బుర్రమీద చెయ్యపెట్టి ఒడుపుగా దానిమీదికి ఎక్కి, అటక మీద వున్న వెదురు కర్రని తియ్యడం క్షణాల్లో జరిగిపోయాయి.
అంతే, యిక నా ఆనందానికి అవధులు లేవు. బామ్మా పని చేయడానికి నడుం బిగించింది అంటే తనని ఇక ఏ శక్తీ ఆపలేదు.
“ఒసై కాముడూ మూలనున్న కత్తి అందుకోవే, వీటిని ముక్కలుగా చీల్చి నీకు బాణాన్ని తయారు చేస్తా” అంటూనే వెదురు మీద ఒడుపుగా రెండు దెబ్బలు వేసింది. పెళ పెళ మని నాలుగు ముక్కలుగా చీలుకున్నాయి.
“నువ్వు ముట్టుకుంటే వాటి పేళ్లు చేతిలో గుచ్చుకుని నీ చెయ్యనొప్పెడుతుంది” అని చెప్పి తన చేతికి గుచ్చుకున్న పేళ్లుని అలవోకగా తీస్తూ పంటిబిగువున నొప్పిని భరిస్తూ పురికొసలతో వెదురుని వింటిలా వంచి కొసలు ముడేసింది.
బామ్మ నా వైపుచూసి ఒక నవ్వు నవ్వి.. “కాముడూ నీకు దసరా సెలవలు యిస్తారు కదా ఈసారి బొమ్మల కొలువు పెట్టుకుందాము.. చిన్నప్పుడు మీ అత్త ముచ్చట పడి కొలువు పెట్టుకుంటాను అంటే దానికోసం బోల్డు బొమ్మలు కొనిపెట్టేను. నా ఆనందాన్ని చూసి కన్నుకుట్టిన ఆ దేముడు దాన్ని ఎంతో కాలం నాతో వుండనివ్వలేదు. నేను దాని జ్ఞాపకాలతో పాటు బొమ్మలని కూడా భోషాణం పెట్టెలో పెట్టి దాచేసాను.. ఏదో మా అక్క దయవలన మీ నాన్నని పెంచుకోడం మీరు పుట్టడం. మళ్ళీ నా కూతురుని నీలో చూసుకుని ముచ్చట పడుతున్నాను” అంటూ తన చీర కొంగుతో కళ్ళు వత్తుకుంది.
తాను చెప్పింది పూర్తిగా నా వయసూ మనసుకు అర్థం అవకపోయినా, బామ్మా కూడా నా సహాయం తీసుకుంటూ నాకు పెద్దరికం కట్టపెడుతోంది అచ్చంగా మా మురళీ కృష్ణ మాష్టారిలా.. అని మాత్రం నా చిన్న బుర్రకి అర్థం అయ్యింది.
“నువ్వు బాణం కట్టి ఇచ్చేయి బామ్మా, ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు!! పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు!!’ అంటూ నలుగురితో నాలుగు వీధులూ తిరిగి నాలుగు పాటలు పాడి పప్పు బెల్లాలు తీసుకుని తుర్రుమని వచ్చేయనూ..” అంటూ బామ్మా చేసిన బాణాన్ని పట్టుకుని పరుగుతీసాను.
***
“నాలుగు వీధులే అన్నావూ.. మా కాముడిని ఎంత దూరం తిప్పారో ఏమో” అంటూ, కొబ్బరి నూనెలో రెండు చుక్కల నీళ్లు వేసి చేసిన నవనీతాన్ని అరచేతులతో రంగరించి, నా రెండు కాళ్లకూ ఆప్యాయంగా రాయడం మొదలుపెట్టింది బామ్మ.
కాళ్ల నొప్పిని ఆమెకు చెప్పనే లేదు.. అయినా నా మనసులోని బాధను తన చేతులతోనే కనిపెట్టేసింది.
నా కాళ్లకు నూనె రాస్తున్న ఆమె చేతులవైపు ఆశ్చర్యంగా చూస్తూ, “నా నొప్పి గురించి నీకు చెప్పకుండానే ఎలా తెలిసింది” అని అడిగాను.
నా తల నిమురుతూ, “ముద్దుల మనుమలు గురించి నాన్నమ్మలకు అన్నీ అలాగే తెలిసిపోతాయి” అంటూ నా నుదుటిమీద రెండు ఆప్యాయమైన ముద్దులు పెట్టింది..
***
మా కడుపు నిండితేనే తన మనసు నిండినట్టుగా భావించే బామ్మ, పెరుగు అన్నంలో తియ్య ఆవకాయ ముక్క వేసి, పిల్లలందరికీ గోరుముద్దలు తినిపించింది. మా కడుపులు నింపిన తృప్తితో, మమ్మల్నందరినీ వెంటబెట్టుకుని మేడమీద తన గదిలో బొమ్మల కొలువు సర్దే పనిలో పడిపోయింది బామ్మ..
నేను పెద్దదాన్ని కాబట్టి బామ్మకి బొమ్మలు నేను మాత్రమే అందిస్తాను అంటే, నేను కూడా అని చెల్లి వంత పాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఎవ్వరూ చూడకుండా రెండు చిన్న మొట్టికాయలు దాని నెత్తిమీద వేసాను. అంతే.. కొంపలు యేవో అంటుకుని పోయినట్లు, “అమ్మో!! అక్క నా బుర్రకి కన్నం పెట్టేసింది. రక్తం కారిపోతోంది బాబోయ్” అంటూ అమ్మకి తప్పుడు ఫిర్యాదు చేయడానికి క్రిందకి పరుగులు పెడుతుంటే దాని వెనుక తందానా అనడానికి తమ్ముళ్ళిద్దరూ బయలు దేరారు.. హమ్మయ్య!! ఇప్పుడు ఇక నేనూ బామ్మా మాత్రమే ఆ గదిలో మిగిలాం.. ఇక పెద్దరికం అంతా నా నెత్తిమీద వేసుకుని బొమ్మల కొలువంతా నా ఆధ్వర్యం లోనే జరగాలనే ఆరాటంతో.. క్రింద నుండి పైకి ఒక్కో పెట్టే మోసుకెళ్తూ నా మీద అమ్మకి పిర్యాదు చేసిందనే అక్కసుతో చెల్లిని మళ్ళీ మేడ పైకిరాకుండా ఒక కాపు కాస్తూ చేయాల్సిన హడావిడి అంతా చేసాను.
“నువ్వు మొదటిసారి బొమ్మల కొలువు పెడుతున్నావు కాబట్టి మూడు మెట్లు పెడదాం కాముడూ..” బామ్మ అన్న మాటలకి బుద్ధిగ తల ఊపి.. యింట్లో వున్న పెద్ద మేజాబల్లని చివరి మెట్టుగా పెట్టి , దాని మీద ఇంకా ఎత్తు రావడానికి బామ్మా ట్రంకు పెట్టెని పెట్టాను.
దానికి కొంచం కిందగా అమ్మ అపురూపంగా దాచుకునే గాజు సామానుల పెట్టె పెడుతున్నప్పుడు మాత్రం బామ్మా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.. “జాగ్రత్త అమ్మడూ గాజుసామానుల పెట్టె ఏమాత్రం చెయ్యజారినా మీ అమ్మ మనకి బువ్వ పెట్టదు” అనేసరికి ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకునే చివరి మెట్టుకి ముక్కాలిపీటతో సరిపెట్టాను.
బొమ్మల కొలువంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ వరుసగా మెట్ల మీద అందంగా అలంకరించడం.. ఒక్కో మెట్టు మీద ఒక్కో రకమైన బొమ్మలను సర్దుకోవాలి. పై మెట్టు మీద దైవ ప్రతిమలు, వాటి కింద వరుసల్లో ఇతర బొమ్మలు.. అందంగా పేర్చాలి.
శివపార్వతుల బొమ్మలను నా చేతులతోనే పై మెట్టు మీద పెట్టించి, మిగతా బొమ్మలన్నీ నా ఇష్టానుసారం సర్దుకోమని చెప్పింది బామ్మ.
తనకు కాస్త ఒంట్లో నలతగా ఉందని, మిరియాల చారు అన్నం తిని కాసేపు నడుం వాలుస్తానని చెప్పింది. “ఈలోపు ఏ కోతి పనులూ చేసి మీ అమ్మతో చివాట్లు తినకు సుమా!” అని నన్ను హెచ్చరిస్తూ, తన దిండును చేతపట్టుకుని కింద ఉన్న కొట్టుగదిలోకి బయలుదేరింది బామ్మ.
నవరాత్రుల్లో అష్టమి, నవమి, దశమి మూడు రోజులూ తెల్లవారుజామునే బామ్మ లేచి, నన్నూ లేపేది. నాకు తలస్నానం చేయించి, తాను మడి బట్టలు కట్టుకుని, నన్ను పట్టుపరికిణీ, జాకెట్టు వేసుకోమని చెప్పేది. ఆ తర్వాత మడిగా పిండి వంటలు చేసి, మహానైవేద్యం సిద్ధం చేసేది. బొమ్మల కొలువులో మొదటి మెట్టుపై ఉన్న శివపార్వతుల ముందు నాతో దీపారాధన చేయించి, నైవేద్యం పెట్టించేది.
“శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే కాముడూ!” అంటూ ఆ మూడు రోజులూ పరమశివుడి దగ్గర దీపం పెట్టించి, భక్తితో పూజ చేయించేది.
“మన శివయ్య.. అర్ధనారీశ్వరుడు. భార్యకి తనలోనే సగభాగాన్ని ఇచ్చి ఆమెకి ఏ కష్టం రాకుండా వెన్నంటే వున్నాడు. నీకు కూడా అర్ధనారీశ్వరుడులా నీ వెంట నిలిచే భర్తే రావాలని నేను కోరుకుంటాను. మన అందరినీ చల్లగా చూసే వాడు ఈ ఉబ్బుశంకరుడేనే అమ్మడూ” అంటూ తలమీద అక్షంతలు వేసి దీవించింది. ఆ వయసులో బామ్మ చెప్పిన మాటల్లోని అంతరార్థం నాకు పూర్తిగా తెలియకపోయినా, ఆమె వెంట నడుస్తూ ఆ పూజ చేయడంలో ఏదో తెలియని ఆనందం వుందనిపించింది..
“కాముడూ..” అంటూ ప్రేమగా పిలిచే మా బామ్మ, నాకు చెప్పా పెట్టకుండా.. దసరా గడిచిన కొన్ని నెలలకే శివసాన్నిధ్యం చేరుకుంది.
బామ్మ లేని లోటును చదువులో మునిగిపోయి మరచిపోవాలని ప్రయత్నించేదాన్ని. కానీ, ఎంతగా చదువులో నిమగ్నమైనా.. ఆమె జ్ఞాపకాలు మాత్రం అప్పుడప్పుడు మనసును ముళ్లలా గుచ్చుకుంటూ, గుండెను బరువెక్కిస్తూనే ఉండేవి..!!
***
రోజులు, వారాలు, నెలలూ సంవత్సరాలు.. గిరగిరా తిరుగుతూ నన్ను గౌనుల నుండి లంగా వోణికి తీసుకుని వచ్చాయి.. మగరాయుడిలా కాకుండా వొద్దికగా అందరికీ నచ్చినట్లు యిప్పుడు అమ్మాయి లాగానే ఉంటున్నాను..
బామ్మ జ్ఞాపకాలతో ఎన్నో దసరాలు సందడి చేయకుండానే గడచిపోయాయి..
ఈ సంవత్సరం బామ్మకి ఇష్టం అయిన బొమ్మలకొలువుని చెల్లీ తమ్ముళ్ళ సహాయంతో మళ్ళీ మొదలు పెట్టుకుందామని అనుకున్నాం. ‘మా పెళ్ళిళ్ళు అయ్యిపోయి వెళ్ళిపోతే ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళకు ఈ శ్రద్ద వుండచ్చు వుండకపోవచ్చు..’ అనుకుంటూనే, పంచమిరోజు మంచిదని ఆ రోజు బొమ్మల కొలువుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. చెల్లీ తమ్ముళ్ళతో బామ్మా గదిలోకి అడుగుపెట్టాను.
“ఈసారి నీ పెద్దరికం పేరుతో మొట్టికాయలు పెట్టడం లేదు కదా” అంటూ చెల్లి బుర్ర తడుముకుంటూ నవ్వుతుంటే, “నువ్వు కూడా నా మీద లేనిపోని చాడీలు అమ్మకు చేరవేయ్యవు కదూ..” అంటూ దానినవ్వుతో నేనూ తమ్ముళ్లు శృతి కలిపాము..!!
బోషాణం పెట్టె ఎత్తి ఒక్కొక్క బొమ్మ తీస్తుంటే బామ్మా జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి.
బామ్మ చెప్పినట్టుగా బొమ్మల కొలువులో శివుడిని పై మెట్టుపై కాకుండా ఆఖరి మెట్టుపైనే పెట్టాలని.. దీపధూప నైవేద్యాలన్నీ నాకు ఇష్టమైన రాధామాధవులకే సమర్పించాలని.. ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నాను.
మా బామ్మను నాకు కాకుండా చేసిన పరమేశ్వరుడిపై కోపంతో, బొమ్మల కొలువులో ఆయన స్థానాన్ని ఒక మెట్టు కిందికి దించితే.. ఆయన్ని ఓడించినట్టేనని సంబరపడ్డాను.
కానీ, ఆ ఒక్క మెట్టు దించాననే అహంకారంలో.. నా బామ్మను తిరిగి తీసుకురాలేని ఓటమిని మర్చిపోయి, నన్ను నేనే గెలిచానని చాలా కాలం భ్రమలో బతికాను..
***
కాలచక్రంలో దశాబ్దకాలం కళ్లముందే ఇట్టే గడిచిపోయింది. పెళ్లిళ్లు, పిల్లలతో మా నలుగురం నాలుగు దిక్కుల్లో స్థిరపడ్డాం.
ఒకప్పుడు పండుగొచ్చిందంటే చాలు.. ఇల్లంతా మా అందరి సందడితో కళకళలాడేది. ఇప్పుడు పండుగలకైనా, పబ్బాలకైనా అందరం ఒకచోట చేరడం గగనమైపోయింది.
ఒకవైపు ఉద్యోగాల ఒత్తిడి.. మరోవైపు పిల్లల చదువులు.. బాధ్యతల తులాభారంలో ఏ వైపూ మొగ్గలేక, కలుసుకోవాలన్న ఆశను మనసులోనే దాచుకుంటున్నాం. ఒకప్పుడు మమ్మల్ని ఒకే ఇంట్లో కలిపి ఉంచిన బంధాలు.. ఇప్పుడు మొబైల్ ఫోన్ తెరపై ఒకరినొకరికి దగ్గర చేస్తున్నాయి. దూరాలు తగ్గుతున్నాయి.. కానీ, కలిసి గడిపిన క్షణాలే కరువైపోతున్నాయి.
మనుమలందరితో కలిసి బొమ్మల కొలువు పెట్టిద్దామనుకుంటున్నాను. “ఈసారి దసరాకి రావే కాముడూ..” అంటూ అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లో, ఆమెతో నాలుగు ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేశాను.
“శివుడు ఉబ్బులింగడే కాముడూ.. భార్యకు తనలోనే సగభాగాన్ని ఇచ్చి, ఆమెకు ఏ కష్టం రాకుండా వెన్నంటే ఉండే అర్ధనారీశ్వరుడు..”
బామ్మ చెప్పిన మాటలు నా మనసులో మారుమోగుతూనే ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ జీవితంలో కొన్ని నిజాలను కళ్లారా చూసి, అనుభవంలోకి వచ్చాక.. ఆనాడు ఆమె చెప్పిన మాటల్లోని అంతరార్థం అర్థమై, అవే నాకు వేదవాక్కుల్లా అనిపించాయి.
ఇన్నాళ్లూ ఆ పరమేశ్వరుడిపై పెంచుకున్న కోపం నన్ను నేనే ప్రశ్నించుకునేలా చేసింది. బామ్మను నాకు దూరం చేశాడని ద్వేషించిన ఆ దేవుడిలోనూ, భార్యను తనలో సగంగా చేసుకున్న ప్రేమమూర్తిని చూడలేకపోయానే అనిపించింది.
ఈ ఆలోచన రాగానే మనసులో పేరుకుపోయిన బాధంతా కన్నీటి రూపంలో కను కొనల్లోకి చేరింది. నాకు నేను సర్దిచెప్పుకుంటున్నా.. కళ్లల్లో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి నానా తంటాలు పడ్డాను.
నాలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానదీపాన్ని వెలిగించడానికి మహేశ్వరుడు ఆడిన లీలను అర్థం చేసుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది.
దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.
మనలోని అహంకారాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని జయించి మంచివైపు అడుగేయడమే అసలైన విజయమేమో!
ఇన్నాళ్లూ శివుడిని ఒక మెట్టు దింపి ఆయన్ని ఓడించాననుకున్న నేను.. ఈసారి నా నెత్తిన పేరుకుపోయిన అహంకారాన్ని దించి, ఆయన ముందు తలవంచాలని నిర్ణయించుకున్నాను.
బాల్యచాపల్యంతో ఆనాడు నేను చేసిన తప్పును పరమేశ్వరుడు క్షమించాడని.. నన్నూ, నా కుటుంబాన్నీ అనుక్షణం కాపాడుతున్నాడని మనస్ఫూర్తిగా నమ్మాను. బామ్మతో కలిసి ఆనాడు ఆ పరమేశ్వరుడి ముందు వెలిగించిన దీపం వృథా పోలేదని అనిపించింది.
ఈసారి బొమ్మల కొలువులో శివుడిని మొదటి మెట్టుపై పెట్టాలి. దీపధూప నైవేద్యాలన్నీ ఆయనకే సమర్పించి, తెలియక చేసిన నా తప్పుల్ని క్షమించమని వేడుకోవాలి.
అర్ధనారీశ్వరుడి రూపంలోనే భార్యాభర్తల అనుబంధానికి ఓ గొప్ప అర్థం దాగుంది. తనలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చిన పరమేశ్వరుడిలా.. జీవితంలో ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు తోడుగా నిలవాలి. ఒకరి లోపాలను మరొకరు క్షమించుకుంటూ, ఒకరి బలహీనతలకు మరొకరు బలంగా మారాలి. అలాంటి అన్యోన్య దాంపత్యాలపై ఆ ఉమాశంకరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకున్నాను.
పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరిగిరాని లోకాలకు వెళ్లక తప్పదని తెలిసినా, ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనసు ఆ నిజాన్ని అంగీకరించదు. వయసు పరిపక్వత లేనప్పుడు దేవుడినే నిందించడం సహజమే. కానీ కాలం గడిచేకొద్దీ అనుభవాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మనలోని అజ్ఞానాంధకారపు పొరలను ఒక్కొక్కటిగా తొలగిస్తాయి.
నిజమే.. మనకు అర్థం కానిదంతా అన్యాయం కాదు. మనకు నచ్చనిదంతా దేవుడి తప్పు కాదు.
“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు” అని బామ్మ చెప్పిన మాట అక్షరాలా నిజమని తెలుసుకున్నాను.
ఆనాడు బామ్మ మాటల్లో వినిపించిన జ్ఞానం.. ఈనాడు నా జీవితానుభవంలో సత్యమై నిలిచింది.
