Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కూరెళ్ళ విఠలాచార్య గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం – వార్త

మా అమ్మానాన్నల (దాసోజు వజ్రమ్మ – విశ్వనాథాచారి) పేరుతో జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయాలన్న సంకల్పంతో ఏర్పడిన సంస్థ ‘దాసోజు ఫౌండేషన్’. తేదీ 10-10-2025 శుక్రవారం నాడు దాసోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిర్భవించినది.

‘దాసోజు ఫౌండేషన్’ గౌరవాధ్యక్షులుగా దాసోజు గోవర్ధనాచారి (దాసోజు వజ్రమ్మ – విశ్వనాథాచారి కొడుకు, అడ్వకేట్) డాక్టర్ దాసోజు పద్మావతి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాము. ప్రతి సంవత్సరం సాహిత్య- సామాజిక – సాంస్కృతిక -సేవా రంగాల్లో విశేషమైన కృషి చేసిన ఒకరికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయాలని సంకల్పించాము. 10,116/- (పదివేల నూట పదహార్లు) నగదు, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కారించాలనుకున్నాము.

2026వ సంవత్సరానికి దాసోజు వజ్రమ్మ – విశ్వనాథాచారి జీవన సాఫల్య పురస్కారం ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ‘దాశరథి పురస్కారం’ అందుకున్న ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారికి ప్రదానం చేయాలని దాసోజు ఫౌండేషన్ తీర్మానించింది.

పురస్కారం ప్రదానం చేయడానికి 17 -1-2026 శనివారం రోజు దాసోజు ఫౌండేషన్ సభ్యులం వెల్లంకి గ్రామం వెళ్ళి ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయంలో ప్రముఖ కవి – రచయిత – పరిశోధకులు ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసామని తెలుపుటకు ఆనందిస్తున్నాను.

సంస్థ గౌరవాధ్యక్షులు దాసోజు గోవర్ధనాచారి, భాస్కరాచారి గారు, డాక్టర్ విశ్వపతి గారు, డాక్టర్ అపర్ణ, దాసోజు పద్మావతి మదనాచారి గారు పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నాము. కూరెళ్ళ గ్రంథాలయ కమిటి ఛైర్మన్ భోగోజు గోవర్థన్ గారి అధ్యక్షతన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. గ్రంథాలయ కార్యదర్శి శ్రీమతి నర్మద (కూరెళ్ళ వారి పెద్ద కూతురు) గారు, ఆచార్యుల వారి ద్వితీయ పుత్రిక శ్రీమతి తపతి గారు, మహిళా భారతి సభ్యురాలు శ్రీమతి రాపోలు అరుణస్వామి, గ్రంథ పాలకులు తాటిపాముల స్వామి గారు మరియు గ్రంథాలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఆచార్యుల వారు మాట్లాడుతూ మా నాన్నగారితో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1957 నాటి పరిస్థితులను, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమ్మానాన్నల పురస్కారం అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇంటికి ఎవరు వచ్చినా శాలువా కప్పి పుస్తకాలు ఇచ్చి పంపడం గురువుగారు మొదటి నుంచి ఆచరిస్తున్న ఒక విలువైన సంప్రదాయం. అదే విధంగా పురస్కార ప్రదాన కార్యక్రమానంతరము మాకందరికి ఘనంగా సన్మానం చేసి పుస్తకాలు మరియు షీల్డ్ బహుకరించారు.

నేను మరో ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఉంది. 1957 సంవత్సరంలో మా నాన్నగారు రామన్నపేట (అప్పుడు నల్లగొండ జిల్లా, నేటి యాదాద్రి భువనగిరి జిల్లా) రెవిన్యూ డిపార్ట్మెంట్లో సూపరిండెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వారి వద్ద కూరెళ్ళ విఠలాచారి గారు కాపీ రైటర్ గా ఉద్యోగం చేసారట. ఆ విషయాన్ని కూరెళ్ల విఠలాచార్య గారు వారి జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఇది వారి విశాల హృదయానికి నిదర్శనం.

ఈ విషయం ఆచార్యుల వారు చెప్పేవరకు మాకు తెలియదు. వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి జీవిత చరిత్రలో చోటిచ్చారు. మంచితనం, మానవత్వం, మూర్తిభవించిన వ్యక్తిత్వం ఆచార్యుల వారి సొంతం.

ఊహ తెలిసిన నాటినుండి పత్రికలు స్థాపించారు. ప్రభుత్వం కన్న ముందు అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టారు. ఆరు (6) ఎకరాల పంట భూమిని పేదలకు పెంచడం కోసం ప్రభుత్వానికి అందజేశారు. వివిధ సాహిత్య -సాంస్కృతిక- సామాజిక -సేవా సంస్థలను స్థాపించారు.

20 సంస్థలు ‘భారతి’ పేరుతో వారి చేతిలో రూపుదిద్దుకున్నాయి. ఆత్మీయ భారతి, ప్రజా భారతి, మహిళా భారతి ఈ విధంగా 20 సంస్థలు స్థాపించినారు. ‘మహిళా భారతి’ సంస్థకు నేను (డాక్టర్ దాసోజు పద్మావతి) రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆచార్యుల వారి స్ఫూర్తితో వారి మార్గదర్శకత్వంలో, ఈ సంస్థల ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు లక్షల పుస్తకాలను సేకరించి వారి సొంత ఇంటినే గ్రంథాలయానికి ఇచ్చారు. తన పెన్షన్ డబ్బులతో ‘వెల్లంకి’ గ్రామంలో (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. జీవితమంతా పల్లె పురోగమనానికి అవిశ్రాంత కృషి చేస్తున్నారు. ‘సమాజ సేవే దైవారాధన’గా పరిశ్రమిస్తున్నారు. పల్లె వెల్లంకి నుండి ‘పద్మశ్రీ’ దాకా సాగిన వీరి జీవన ప్రస్థానంలో 75 వసంతాల అవిశ్రాంత కృషి ఉంది.

జీవితకాలం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయులకు మా అమ్మానాన్నల పేరిట ‘దాసోజు వజ్రమ్మ-విశ్వనాథాచారి జీవన సాఫల్య పురస్కారం’ ఇవ్వాలన్న మా ఆకాంక్ష నెరవేరింది. పురస్కారం పునీతమైనది.

ప్రతి సంవత్సరం సామాజిక సేవా రంగాలలో కృషి చేసిన వారికి ‘దాసోజు ఫౌండేషన్’ మా అమ్మానాన్నల పేరుతో (దాసోజు వజ్రమ్మ-విశ్వనాథాచారి) జీవన సాఫల్య పురస్కారం అందజేస్తుందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నాను.

Exit mobile version