[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘దయామృతం’ అనే కవితని అందిస్తున్నాము.]
రానీయకు.. మనసుకి సునామీ
ఏటికి ఎదురీదైనా.. వెల్లువలో
గడ్డిపరక.. పట్టి ఏటి గట్టుకి రా
నిలబడు నీవు నిలచి
అభాగ్యులకు ఆలంబనగా
నీ.. జీవితం చరితార్థం చేసుకో..
మనసుకి సునామీ రానీయకు
అలల.. అలజడి.. సముద్రునిది..
మానససాగరానిది.. కాదు సుమా
బైటపడు.. అదరకు బెదరకు
ఆలోచనాతరంగాలను.. తరిమికొట్టి
ప్రశాంతంలోకిరా.. మది గుడిలోకి
దైవాన్ని.. ఆహ్వానించు.. ధ్యానించు
దైవచింతనలో ప్రశాంతత ఆస్వాదించు
పట్టించుకోకు.. ఏ అర్ధరహిత విషయాలు
వ్రణాన్ని శస్త్రచికిత్సతో నిర్మూలిస్తాం
అనుకోని ఆపద మనసుకి సంభవిస్తే
వ్రణాన్ని తీసినట్లు తీసిపడేయి
అవాంతరం శరీరానికి వస్తే మూట కట్టి
సప్తసాగరాల ఆవలకు విసిరేసి
మనోప్రక్షాళన చేసుకో, చింతించక
దైన్యానికి తావీయకు పరుషాలను
మనసుకి తీసుకోకు.. మిత్రమా
కరుణ దయాగుణం ఆర్తులపై చూపు
దైవస్వరూపుని.. వారిలో చూసుకో
పరమాత్మ.. దయామృతం.. నీదే.. నీదే
మానవత్వపు.. విలువ తెల్సుకో
అభాగ్యల పాలిట ఆత్మీయసింధువుగా
ప్రేమైకరూపానివై.. మనసుకు హత్తుకో
మాతృత్వానికి ప్రతినిధిగా..
నీ మనసు మళ్ళించు.. దీనులపై
మాతృభావనతో ప్రేమ చూపు..
అక్కున చేర్చుకో.. మనసారా
మమతపంచు.. చరితార్థమే నీ జీవితం