Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దయ్యాలున్నాయేమో

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘దయ్యాలున్నాయేమో’. రచన మద్దూరి నరసింహమూర్తి.]

బ్రాంచ్ మేనేజర్ రమేష్ పని చేస్తున్న ఊరికి కొంత దూరంలో దట్టమైన అడవి దారిగుండా మూడు ఘాటీ దార్లు ఉన్నాయి. ఆ మూడు ఘాటీల ఎత్తు బాగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, ఆ మూడు దారులలో ఏ బండీ అయినా నెమ్మదిగా వెళ్లవలసినదే.

రాజధానిలోని ముఖ్యకార్యాలయంలో పని ఉండి రెండు రోజుల క్రిందట వెళ్తున్నప్పుడు పగటి ప్రయాణంలో రమేష్ అద్దెకు తీసుకున్న కారు ఆ మూడు ఘాటీలు దాటేసినా, తిరుగు ప్రయాణంలో వాటిని రాత్రి సమయంలో దాటవలసి వస్తున్నందుకు –

కారు నడుపుతున్న డ్రైవరు మూర్తి రమేష్ తో –

“సార్, మనం మొదటి ఘాటీ ఎక్కే ముందర అక్కడున్న పల్లెటూరి వారితో మాట్లాడి మన ప్రయాణం కొనసాగిస్తే మంచిది”

“ఎందుకు”

“చీకటి పడిందంటే, ఆ ఘాటీల దారిలో పులులు ఎలుగుబంట్ల ఏనుగుల సంచారం ఎక్కువ అంటారు సార్”

“కిటికీ అద్దాలు మూసుకున్న కారులో మనం ఉంటే, పులులు ఎలుగుబంట్లు ఏనుగులు మనల్ని ఏమి చేస్తాయి మూర్తి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అయినా, పల్లెటూరి జనంతో మనం మాట్లాడితే ఏమి లాభం”

“ఆ ఆడవులు అందులో తిరిగే జంతువుల గురించి వారికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి, మనకు ఏమైనా మంచి సలహా దొరికే అవకాశముంటుంది సార్”

“సరేలే, వీలైనంత త్వరగా ఆ పల్లెటూరు దగ్గరకు చేరుకొనే ప్రయత్నం చేయి” అని కారు వెనక సీటులో విశ్రాంతిగా చేరపడి కళ్ళు మూసుకున్నాడు రమేష్. కారులో ఉన్న స్టీరియోలో పాటలు పెట్టుకొని వింటూ కారు నడపసాగేడు డ్రైవరు మూర్తి.

“సార్, పల్లెటూరు వచ్చింది, ఎవరితోనైనా మాట్లాడదాం రండి” అంటూ బండీ దిగుతున్న మూర్తితో – “ఏడున్నర అయిందోయి అప్పుడే!” అంటూ రమేష్ కారు దిగేడు.

రచ్చబండ మీద ఉన్న నలుగురి దగ్గరకు వెళ్ళిన మూర్తి తనను పరిచయం చేసుకొని, రమేష్‌ను వారికి పరిచయం చేసేడు.

వెంటనే వారిలో ఒకడు వెళ్ళి పాతబడిన కర్ర కుర్చీ తెచ్చి రమేష్‌ని కూర్చోమని చెప్పేడు.

మూర్తి రచ్చబండ మీదనే వారి పక్కన కూర్చొని –

“ఇప్పుడు ఈ ఘాటీ మీద ప్రయాణం చేయడం క్షేమమేనా” అని వారిని అడిగేడు.

అక్కడ కూర్చున్న వారిలో ఒకడు –

“ఇక్కడ నుంచి పది కిలోమేటర్లు దాటితే ఒచ్చే ఘాటీ మీద అడవిలో పులులు ఎక్కువగా రేత్రి యేల తిరుగతా ఉంటాయి. ఆటికి కళ్ళు సీకట్లో సానా బాగా కనిపిస్తాయి. అయి రస్తాలో తొంగుంటే, బండీ మీదైనా ఆటి పక్కనుండి ఎల్లడం పెమాదమే. అందుకే, అయి లేచి సెట్ల తోపుల్లోకి ఎల్లిపోనాదాకా ఆగి బండీ తోలాలి”

“ఎలుగుబంట్లు కూడా తిరుగుతూ ఉంటాయా”

“ఎలుగులైతే ఉన్నాయి. అయి బండీ మీదకి రావు, బండీ సూస్తే సెట్ల తోపుల్లోకి పారిపోతాయి. కానీ, మడిసి ఆటి కంట పడితే ఒదలౌ. మీరు ఇనే ఉంటారు, ఎలుగు పట్టుకుంటే ఓ పట్టానా ఒదల్దు”

“ఏనుగులు కూడా తిరుగుతూ ఉంటాయా”

“ఈ ఘాటీ తరువాత ఒచ్చే ఘాటీ మీద ఏనుగులు తిరుగుతా ఉంటాయి. ఏనుగు అంత దూరాన కనపడగానే బండీ ఆపేయాలి, ఏ సవ్వడీ సేయకూడదు, బండీ దిగకూడదు. బండీ కసింత సవ్వడి సేసినా, మడుసులు కంట పడినా, ఏనుగు ఏమి సేస్తాదో సెప్పడం సానా కష్టం. ఏనుగు సెట్ల తోపుల్లోకి ఎల్లినా, సానా సమయం దాకా బండీ నడపకూడదు, ఎందుకంటే, అది సెట్లలోకి ఎల్లినట్టే ఎల్లి, బండీ శబ్దం ఇని రస్తా మీదకు మల్లా జల్దీగా ఒచ్చేస్తాది. ఏనుగులు గుంపులుగా కనిపిస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి”

“మూడో ఘాటీ మీదకు చేరుకుంటే మరేమీ ప్రమాదం లేదు కదా” అని మూర్తి కుతూహలంగా అడిగేడు.

“అసలు పెమాదమంతా అక్కడే ఉండిపోనాది”

“అంటే”

“రేత్రైతే ఆ ఘాటీ మీద ఆడ దయ్యం రకరకాల ఏసాలతో తిరుగుతా ఉంటుంది. రస్తా మధ్యన అందమైన అమ్మాయిలానో చిన్న పిల్లాడిలానో నిలబడి చిన్న బండీ ఏదైనా అగపడితే ఆపమంటాది. ఆపితే, అందులో ఉన్న మడుసుల రకతం చాయ్ తాగినట్టు తాగేస్తాది”

“సార్ మనం ఇక్కడ బండీలోనే ఉండిపోయి తెలవారగానే పోదాం”

“ఈ ఆధునిక కాలంలో దయ్యాలు గియ్యాలు ఏంటి మూర్తి” అని బయటకు అంటున్నా, రమేష్ గుండె లోపల గుబులు మెల్లగా నిండసాగింది.

“సార్, మనం తొందరపడి వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకుంటామేమో”

“పోనీ ఒక పని చేద్దాం మూర్తి, మనం ముందుగా వచ్చే రెండు ఘాటీలు దాటేసి ఆ తరువాత ఏమిటి చేయాలన్నది మూడో ఘాటీ ఎక్కే ముందర ఆలోచిద్దాం” అని మూర్తితో అని,

“థాంక్స్ అండీ, మేము వస్తాం” అంటూ వెళ్లబోతున్న రమేష్‌తో ఆ పల్లెటూరి జనం —

“బాబూ ఏమేనా తిని ఎల్లండి, లేకపోతే మూడు ఘాటీలు దాటే దాకా చాయ్ కూడా దొరకదు మీకు”

“ఇక్కడ హోటల్ ఎక్కడుంది”

“ఇక్కడ ఓటల్ అంటూ ఏమీ లేదు. అయిదు నిమిషాల్లో రొట్టెలు కూర పట్టుకొస్తాను ఎల్లిపోకండి” అని ఆ నలుగురిలో ఒకతను వెళ్ళి, పది నిమిషాలలో జొన్న రొట్టెలు శెనగలకూర ఊరగాయతో వచ్చేడు.

వేడిగా లేకపోయినా అవి తిని, ‘ఆకలికే కాదు అవసరానికి కూడా రుచి తెలియదు’ అనుకున్నాడు రమేష్.

మూర్తి కూడా తిన్న తరువాత “మాకు ఈ రాత్రికి ఆకలి సమస్య లేకుండా చేసేరు ధన్యవాదాలు. ఏమీ అనుకోక ఈ డబ్బు తీసుకోండి” అని ఇవ్వబోతున్న రమేష్ తో అందులో ఒకాయన –

“మాకు దుడ్డు ఏమీ ఒద్దు బాబూ, మేమిచ్చిన రొట్టెలు తిన్నారు, అదే సంతోసం మాకు. రేత్రి యేల ఎల్లకపోతే తెల్లారగానే ఎల్లకూడదూ”

“ఘాటీ ముందు వరకూ వెళ్ళి ఏదైనా బస్సు లేదా లారీ వస్తే, ఆ బండీ వెనకాల వెళ్లిపోతాము”

“ఏ పెద్ద బండీ రాకపోతే మాత్రం ఎల్లిపోక ఎనక్కి ఇక్కడికే వచ్చేయండి”

వారి ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పి కారులో కూర్చున్న రమేష్ —

“మూర్తి, ఘాటీ ఎక్కే ముందర కారు ఆపు” అని చెప్పి విశ్రాంతిగా వెనక సీట్లో చేరపడ్డాడు రమేష్.

“సార్, ఇప్పుడు రాత్రి పది దాటింది. ఇంతవరకూ ఏ బస్ కానీ లారీ కానీ రాలేదు. వెనక్కి వెళ్లిపోదామా”

“వద్దు మూర్తి, ఇంత రాత్రి వెనక్కి వెళ్ళి మరలా వారిని ఇబ్బంది పెట్టడం బాగుండదు. కారులో పడుకోవడం బదులు, ముందుకు ప్రయాణం చేయడమే మంచిది. పులి కానీ ఎలుగుబంటి కానీ కనిపిస్తే, కారు ఆపి అవి చెట్ల తుప్పల్లోకి వెళ్ళిపోయిన తరువాత ముందుకు పోదాం. ఏం భయం లేదు పద”

అయిష్టంగానే మూర్తి కారుని ముందుకు కదిలించేడు.

వీళ్ళ అదృష్టం బాగుండడంతో దారిలో ఎక్కడా పులి కానీ ఎలుగుబంటి కానీ కనపడలేదు.

రెండో ఘాట్ రోడ్డు ఎక్కే ముందర, మూర్తి – “సార్, ఈ ఘాటీ మీద ఏనుగులుంటాయన్నారు కదా, ఇక్కడే ఆగి పోదామా”

“ముందు ఘాటీ మీద పులులు ఎలుగుబంట్లు ఉంటాయన్నారు. మనకు ఏ ఒక్కటీ కనపడలేదు. అలాగే, ఈ ఘాటీ మీద కూడా ఏనుగులు ఉండకపోవొచ్చు, అందుకే, ముందుకు పద”

వీళ్ళ అదృష్టం బాగుండడంతో దారిలో ఎక్కడా ఏనుగు కనపడలేదు.

మూడో ఘాట్ రోడ్డు ఎక్కే ముందర, మూర్తి – “సార్, ఈ ఘాటీ మీద దయ్యం ఉంది అన్నారు కదా, ఇక్కడే ఆగిపోదామా”

“ముందు ఘాటీ మీద పులులు ఎలుగుబంట్లు ఉంటాయన్నారు, రెండో ఘాటీ మీద ఏనుగులు ఉంటాయన్నారు, కానీ, మనకు ఏ ఒక్కటీ కనపడలేదు. అలాగే, ఈ ఘాటీ మీద కూడా దయ్యం ఉండకపోవొచ్చు, ఈ ఘాటీ దిగేవరకూ ఎక్కడా కారు ఆపకు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కారు నడుపుతూ ముందుకు పద”

విధిలేక మూర్తి కారుని ముందుకు పోనిస్తున్నాడు.

కొంత దూరం వెళ్ళేసరికి, తెల్లటి చీర కట్టుకున్న సుమారు పదహారేళ్ళుండే అందమైన అమ్మాయి రోడ్డు మధ్యలో నిలబడి కారు ఆపమని చేతులు ఊపుతూ కనిపించింది.

“సార్, ఈ అమ్మాయే దయ్యం అయి ఉంటుంది, నాకు భయం వేస్తోంది”

“నువ్వు ఆక్సలరేటర్ మీద నుంచి కాలు తియ్యకుండా త్వరగా పోనీ”

కారు దగ్గరగా వచ్చేస్తున్నా ఎటూ కదలక నిల్చున్న ఆ అమ్మాయిని చూస్తున్న మూర్తి –

“సార్, ఆ అమ్మాయి కదలడం లేదు చూస్తున్నారా”

“చూస్తున్నాను, నువ్వు ఆ అమ్మాయికి గుద్దుకున్నా కూడా కారు ఆపకుండా పోనీ”

“ఆ అమ్మాయి దయ్యం కాకుండా నిజమైన అమ్మాయి అయితే, కారుతో గుద్దెస్తే చనిపోతుంది కదా సార్”

“ఏమైనా అవనీ, నువ్వు కారు ఆపకుండా పోనీ”

దారిలో అడ్డుగా కదలకుండా ఉన్న ఆ అమ్మాయికి కారు బానేట్ గుద్దుకోవడం, ‘ధన్’ మని పెద్ద శబ్దం రావడం, పెద్ద కేకతో అమ్మాయి ఎగిరి రోడ్డుకి ఒక పక్కగా పడిపోవడం కనిపించిన మూర్తికి నోటి వెంట మాట రాలేదు.

“ఏమీ ఆలోచించక త్వరగా పోనీ మూర్తి” అంటూ రమేష్ ఆ పక్కకు చూసేడు.

కారు దాటిపోగానే, పడిపోయిన ఆ అమ్మాయి ఏమీ జరగనట్టు లేచి నిలబడి, రాళ్ళు విసరడం చీకట్లో లీలగా కనిపించిన రమేష్ కి నోటి వెంట మాట రాలేదు.

“సార్, ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి అయితే, రేపు పోలీసులు నన్ను పట్టుకుంటారు” అని భయ పడుతూ అడుగుతున్న మూర్తితో –

“ఘాటీ దిగినవరకూ ఏమీ మాటలాడకుండా త్వరగా మన కారుని పోనివ్వు మూర్తి, నీకేమీ ఆపద రానివ్వను, నేనున్నాను కదా” అన్న రమేష్‌తో –

“మీరు కూడా కారులో ఉన్నారనే నేను ధైర్యంగా బండీ నడుపుతున్నాను సార్”

మరో పదిహేను నిమిషాలు గడిచే సరికి, సుమారు పదేళ్ళుండే అబ్బాయి చిరిగిపోయిన బట్టలతో చెదిరిన జుట్టుతో రోడ్డు మధ్యలో నిలబడి కారు ఆపమని చేతులు ఊపుతూ కనిపించేడు.

“సార్, ఈ అబ్బాయి దయ్యామే కాబోలు సార్”

“ఎవడైతే మనకెందుకు, ఇందాకట్లాగే నువ్వు కారు ఆపకుండా త్వరగా పోనీ”

“ఆ అబ్బాయి దయ్యం కాకుండా నిజమైన అబ్బాయి అయితే, పాపం చనిపోతాడు కదండీ”

“ఏమైనా అవనీ, నువ్వు కారు ఆపకుండా పోనీ”

ఆ అబ్బాయిని కారు బంపర్ గుద్దుకోవడం, ‘ధన్’ మని పెద్ద శబ్దం రావడం, పెద్ద కేకతో అబ్బాయి ఎగిరి రోడ్డుకి ఒక పక్కగా పడిపోవడం కనిపించిన మూర్తికి నోటి వెంట మాట రాలేదు.

“ఏమీ ఆలోచించక త్వరగా పోనీ మూర్తి” అంటూ రమేష్ ఆ పక్కకు చూసేడు.

కారు దాటిపోగానే, పడిపోయిన అబ్బాయి ఏమీ జరగనట్టు లేచి నిలబడి నడుస్తూ వెళ్లిపోవడం చీకట్లో లీలగా కనిపించిన రమేష్ కి నోటి వెంట మాట రాలేదు.

“సార్, వాడు దయ్యం కాకుండా నిజంగా అబ్బాయి అయితే, రేపు పోలీసులు నన్ను పట్టుకోరూ” అని భయ పడుతూ అడుగుతున్న మూర్తితో –

“ఘాటీ దిగినవరకూ ఏమీ మాటలాడకుండా త్వరత్వరగా మన కారుని పోనివ్వు మూర్తి, భయపడకు. అన్నింటికీ నీకు అండగా నేనున్నాను కదా” అన్నాడు రమేష్.

మరో అరగంటకు ఘాటీ దిగిన కారు, అక్కడకు కొంత దూరాన ఉన్న టీ బడ్డీ దగ్గర, ఆపబోతున్న మూర్తితో రమేష్ – “ఇక్కడ ఆపొద్దు మూర్తి, ఇంకా కొంత దూరం పోనీ, నేనే చెప్తాను అక్కడ ఆపి చాయ్ తాగుదాం”

“సరే సార్” అంటూ కారు పోనిస్తున్న మూర్తితో కొంత దూరం వెళ్ళిన తరువాత –

“మూర్తి, అగో అక్కడ నాలుగు దుఖానాలు తెరిచి ఉన్నాయి, రెండు లారీలు ఆగి ఉన్నాయి, కొంతమంది మనుషులు కూడా ఇటూ అటూ తిరుగుతున్నారు, అక్కడ కారు ఆపు, చాయ్ తాగుదాం”

చాయ్ త్రాగిన తరువాత మూర్తి అటూ ఇటూ తిరుగుతూ కారు బానేట్ బంపర్ చూస్తూ, ఏమీ అర్ధం కాక, లోపల కూర్చొని కారు నడుపుతూ “సార్, ఘాటీ మీద అమ్మాయిని అబ్బాయిని గుద్దిన మన కారు బానేట్ కానీ బంపర్ కానీ చెక్కు చెదరకపోవడం ఒక్క రక్తం చుక్క కూడా ఎక్కడా అంటుకోకపోవడం ఆశ్చర్యం వేస్తోంది. నేను గుద్దినది దయ్యాన్నేమో అని అనుమానంగా ఉంది”

తాను రెండు సార్లు చూసిన దృశ్యాలు తలచుకుంటూ – దయ్యాలున్నాయేమో – అనుకున్న రమేష్, తాను చూసిన వివరాలు చెప్తే, మూర్తి ఇంకా భయపడొచ్చన్న అనుమానంతో –

“ఇంటికి వెళ్ళిన తరువాత ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో మూర్తి, మనసు ప్రశాంతంగా ఉంటుంది” అని మేకపోతు గాంభీర్యంగా సాంత్వన వాక్యం పలికి డ్రైవరు మూర్తికి ధైర్యం నూరిపోసేడు.

Exit mobile version