Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డిసెంబర్ రోజులు

[అనూరాధ బండి గారు రచించిన ‘డిసెంబర్ రోజులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ప్రశ్నలన్నీ పొగమంచు దుప్పటి క్రింద
మనుషులని కప్పుకుని ఉన్నాయ్.
బద్ధకపు ఆవలింతల్లో జవాబులు
చలిగా తిరుగుతున్నాయ్.

పక్షుల మేలుకొలుపుల్లోకి లేత ఎండ చేరీచేరంగనే
పచ్చని తడినవ్వుతో ఆకులన్నీ కళ్ళు తెరిస్తే
మొగ్గలేమో అరనవ్వు..

ఇక కొమ్మకొమ్మనా బింకంతో
మొక్కల సూటిదనం.

ఆగిపోతావా.. ముందుకువెళతావా..
నువ్వు నత్తవా.. కొంగవా..

ఆగమేఘాలపై అల్లిబిల్లి ఆటలు తెలుసా
పోనీ క్రిస్మస్ ట్రీకి రంగు బల్బులనూ నక్షత్రాలనూ పేర్చడం.

ఏమోలే! డిసెంబర్ చలిలో
స్తబ్ద హృదయాలు
ప్రార్థన కూడా చెయ్యొచ్చు.

చలిమొక్కులు మొక్కొచ్చు.
ప్రశ్నలు వేసుకోనూవచ్చు
బదుళ్ళు తెచ్చుకోనూవచ్చు

పుల్లనితియ్యని రేగుపళ్ళని తింటూ
కాలాన్ని తెంపనూవచ్చు.

Exit mobile version