Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది ఒకటవ భాగం.]

“అస్య వామస్య పలితస్య హోతుస్తస్య భ్రాతా మధ్యమో అస్త్యశ్నః।
తృతీయో భ్రాతా ఘృతపృష్ఠో అస్యాత్రాపశ్యం విశ్పతిం సప్తపుత్రమ్॥

ఋగ్వేదంలో దీర్ఘతమోమహర్షి దర్శించిన ఈ ఋక్కుతో మొదలయ్యే సూక్తం వైజ్ఞానికంగా ప్రసిద్ధి చెందింది. దీర్ఘతమోమహర్షి తాను దర్శించిన సౌర కుటుంబ వ్యవస్థను, పాలపుంతలో అనేక సూర్యుల కూటమిని ఈ సూక్తంలో 52 ఋక్కుల్లో వివరించాడు. వేద సాహిత్యంలో ఇది కేవలం భక్తి గీతం కాదు, విశ్వ నిర్మాణానికి సంబంధించిన తొలి ఆలోచనలు చేసిన కవితాత్మక గంభీర పరిశీలన.

ద్వాదశార చక్రం=12 ఆకులుగల చక్రం, సప్త శీర్షాణి= ఏడు తలలు కలిగినది, త్రినాభి = మూడు నాభులు కలిగిన చక్రం లాంటి ప్రతీకల వెనుక ఖగోళ, తాత్త్విక, ఆధ్యాత్మిక నిగూఢార్థాలు కలగలసి ఉన్నాయి.

దీని కర్త దీర్ఘతమో మహర్షి అంధుడైన శాస్త్రవేత్త. ఋగ్వేదంలోని అత్యంత గంభీరమైన తత్వవేత్తలలో ఒకరు. ఆయన రచించిన దాదాపు ఇరవై ఐదు సూక్తాలు ఋగ్వేదంలో ఉన్నాయి. వాటిలో ఇరవై నాలుగు సూక్తాలు వివిధ దేవతలను స్తుతించేవి. అగ్ని దేవుని స్తుతితో రెండు సూక్తాలు వాటి తరువాత ‘ఆప్రి సూక్తం’ అని పిలువబడే ఒక ప్రత్యేక సూక్తం, ఆ తర్వాత మళ్లీ అగ్నిపై ఎనిమిది సూక్తాలు వస్తాయి. తరువాత మూడు సూక్తాలు మిత్రా వరుణుల్ని, మూడు సూక్తాలు విష్ణువునీ, రెండు సూక్తాలు అశ్వినీదేవతలను స్తుతిస్తాయి. తర్వాతి రెండు సూక్తాల్లో ద్యావా–పృథివీలు (ఆకాశం మరియు భూమి) ప్రధాన అంశంగా ఉంటాయి. తరువాత ఒక సూక్తం ఋభువుల గురించి ఉంటుంది. ఋభువులు మొదట సుధన్వుని కుమారులుగా మనుషులే; తమ విశిష్ట కర్మల వల్ల దేవత్వాన్ని పొంది, సోమయాగంలో భాగస్వాములైన దివ్య శక్తులుగా నిలిచారు.

చివరగా రెండు సూక్తాలు అశ్వం (గుఱ్ఱం) గురించి ఉన్నాయి. తర్వాతే గంభీరమైన ఈ ‘అశ్వవామస్య’ ఋక్కుతో మొదలయ్యే తాత్త్విక సూక్తం వస్తుంది. ఈ సూక్తం కారణంగా దీర్ఘతమసుడు మహాకవి, దర్శనశక్తి కల మహర్షిగా వెలుగొందాడు.

మంత్రంలోని ఖగోళ సంకేతాలు

అగ్ని నుండి ద్వావా పృథ్వీ దేవతల వరకూ వరుసగా దీర్ఘతముడు చేసిన దేవతా స్తుతులన్నింటినీ పరిశీలిస్తే, సూర్యుడి గమనం, ఇతర గ్రహాల చలనాల ప్రభావం భూమి మీద ఎలా ఉంటుందో ఆయన చాలాకాలం పాటు ఎంతో నిశితంగా పరిశీలించినట్టు అర్థం అవుతుంది.

ఈ దేవతా స్తుతులు కేవలం దేవతల పొగడ్తల కవితలు కావు. చాలా లోతైన భావాల్ని నర్మగర్భంగా వీటిలో చొప్పించాడు. సౌర వ్యవస్థ గురించిన ప్రాధమిక పరిజ్ఞానం కూడా లేని ఆ కాలంలో దీర్ఘతముడు జనసామాన్యానికి అర్థం కావటం కోసమే ఖగోళ శాస్త్ర పరమైన అంశాల్ని ఆనాటి ప్రజల జీవన విధానానికి తగ్గట్టుగా యఙ్ఞయాగాదులకు సంబంధించిన ప్రతీకలతో వివరించాడు.

పూజనీయుడైన, తెల్లని స్వచ్చమైన వాడైన జగత్పాలకుడు సూర్యుడిని ‘అస్య వామస్య పలితస్య హోతు’ అంటూ, వర్ణించటంతో ఈ సూక్తం ప్రారంభం అవుతుంది! ఉదయించే అగ్ని, ఉదయసూర్యుని తెల్లటి కాంతిని పలితహోతా అని సంబోధించాడు.

తన వేళ్లతో చూపిస్తూ ‘ఇది’ (అస్య) అని చెప్పటాన్ని బట్టి అగ్ని ముందు కూర్చుని చెప్తున్నాడని మనం గ్రహించాలి.

అగ్ని- అది స్వర్గంలో నివసించే అగ్ని దేవతకి ప్రతీక. దానిని ‘హోతా’ (ఆహ్వానకుడు) అంటాడు. సాధారణంగా ‘హోతా’ అనే పదం యజ్ఞవేదికలోని అగ్నికి వర్తిస్తుంది. ఆయన మూడు అగ్నుల్ని ముగ్గురు సోదరులుగా వర్ణించాడు. ఆ మూడు అగ్నుల అర్థాన్ని వివరించటమూ కష్టమే. ఒకటి దివ్యలోకంలోని అగ్ని (సూర్యప్రకాశం), రెండోది మధ్యలోకంలోని అగ్ని (వాయుమండల శక్తి), మూడోది భూమిపై వెలిగే యజ్ఞాగ్ని కావచ్చు.

రెండవ సోదరుడు మధ్యమ భ్రాత! భూమి ఆకాశాల మధ్య అంతరిక్షంలో గ్రహగమనాల మాధ్యమాన్ని ఆయన మధ్యమ భ్రాతగా భావించాడని అర్థం అవుతోంది. ఈ మధ్యమభ్రాత ‘అశ్నా’ అంటే తినేవాడుగా చెప్తాడు. ‘అనశ్నాన్’ అంటూ, తినని ఒక మూలశక్తిని వేరే మంత్రంలో పేర్కొనటాన్ని బట్టి ఈ అశ్న శబ్దం హవిస్సులు స్వీకరించే దేవతలను ఉద్ధేశించినట్టు కనిపిస్తుంది.

ఇంక మూడవ సోదరుడు ‘ఘృతపృష్టభ్రాత’ – వెనుక భాగంలో నెయ్యి కలిగినవాడు – అంటాడు. ఇది భూమిపై వెలిగే యజ్ఞాగ్ని. దేవతలకు నైవేద్యాలు సమర్పించే అగ్ని ఇదే. ఈ ముగ్గురు అగ్ని సోదరుల్లో మొదటి అగ్ని దివ్యలోకంలోని ప్రకాశం – సూర్యుడుగా, మధ్యాగ్నిని ఖగోళంలో గ్రహ చలనాల ప్రాతంగానూ, మూడో అగ్నిని భూమ్మీద యజ్ఞాగ్నిగానూ భావించాడని అర్థం చేసుకోవచ్చు.

కాలగమన చిహ్నం ద్వాదశార చక్రం

సౌరకుటుంబంలో సూర్యుడు పెద్దన్న! అతని సోదరులు వాయువు, అగ్ని. ఈ ముగ్గురూ హవిస్సులందుకొంటున్నారు. అగ్ని, వాయువుల మధ్య ఏడు కిరణాలతో సూర్యుడు లోకానికి దర్శనం ఇస్తున్నాడు. వీళ్ళంతా అదితి పుత్రులే! వీరిది ఒకే సౌర కుటుంబం. ఏడు గ్రహాల సిద్ధాంతం ఈ సూక్తంలో సంకేత రూపంలో కనిపిస్తుంది. దీర్ఘతముడితోనే సూర్యసిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు ఆరంభమయ్యాయన్నదే విజ్ఞుల భావన.

“సూర్యుడిది ఏకచక్రరథం. దానికి ఏడు గుఱ్ఱాలు పూన్చి ఉన్నాయి. చక్రానికి దృఢమైన మూడు నాభులున్నాయి. సర్వ లోకాలూ వాటినే వానినే ఆశ్రయించి ఉన్నాయి. ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఈ రథం ముందు నడుస్తున్నారు. ఇందులో 7 గోవులు లేక కిరణాలు లేక స్వరాలున్నాయి. వేగవంతుడు, అందగాడైన ఆదిత్యుడి స్వరూపం అతి నిగూఢం. అతని కిరణాలు పాలు పితుకుతాయి. అంటే తెల్లని కాంతిధారల్ని ప్రసరిస్తాయి. అవి తేజః స్వరూపాలు” అంటాడు దీర్ఘతమోమహర్షి.

ఈ చక్రం కాలచక్రమే! అది మూడు నాభులు కలిగినది. ముడుచుకుపోదు, పాడవదట! అంటే కాలం వినాశానికీ అతీతమైందని! మూడు నాభులు ఉన్నాయని చెప్పడం మూడు పొద్దులకు ప్రతీక కావచ్చు.

గోవుల 7 పేర్లు కూడా ఈ రథంలో ఉన్నాయనటాన్ని బట్టి. ఈ గోవులు కిరణాలు, వాక్కు, జ్ఞానం, లేదా వేదఛందస్సులకు సంబంధించిన పదం కావచ్చు. ఆ రథంలో ఏడుగురు వ్యక్తులు కూర్చున్నారని, ఏడు చక్రాలు, ఏడు గుర్రాలు ఉన్నాయని, ఆ రథాన్ని ఎదురుగా చూసుకుంటూ ఏడు సోదరీమణులు గీతాలు పాడుతున్నారని ఈ 7 శబ్దాన్ని రకరకాలుగా ప్రయోగిస్తాడు.

వరుణుడు తనకు “మూడుసార్లు ఏడు గోవుల పేర్లు” బోధించాడని ఋషి వశిష్ఠుడు చెప్పాడు. ‘అఘ్న్యా’ అంటే హింసించరాని గోవు అనే పదం కూడా వస్తుంది. ఇక్కడ గోహింస కూడదనే నైతిక నియమం మాత్రమే ఉద్దేశం కాదు; అది ఒక గూఢార్థపదం.. జ్ఞానం, వాక్కు, కిరణం వంటి ప్రతీకార్థాలతో కూడినది కావచ్చు.

సృష్టి అవతరణ సిద్ధాంతాలకు బీజావాపన

ప్రాచీన భారతీయ మేధస్సు కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు; ప్రకృతి పరిశీలనలోనూ అత్యంత లోతైనది. దీర్ఘతమోమహర్షి సూక్తం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.. విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే కవితా దృష్టి, తాత్త్విక చింతన, శాస్త్రీయ పరిశీలన అవసరం అని! వేదాల్లోని ఈ ఖగోళ సంకేతాలను ఆధునిక విజ్ఞానంతో సమీక్షించడం, విశ్లేషించడం ఒక బాధ్యత కూడా.

“కోదదర్శ ప్రథమం జాయమానం” మొట్టమొదటగా పుట్టిన ప్రాణిని ఎవరు చూశారు? అది ఎముకల్లేని ప్రాణి. వాటికి ఎముకలు ఎప్పుడు కలిగాయి? ఎప్పుడు ఈ భూమి నుండి ప్రాణం, రక్తం పుట్టాయి? ఆత్మలు ఎక్కణ్ణుంచి పుట్టాయి? ఈ జిజ్ఞాస తీరటానికి ఎవ్వరి దగ్గరకు ఎవరు వెడతారు? ఇవి దేవరహస్యాలు. ఒక సంవత్సరపు సూర్యుడి కోసం 7 సోమయజ్ఞాలు చేసిందెవరు? ఈ లోకాల్ని నిలిపి ఉంచిందెవరు? జన్మరాహిత్యాన జీవించే జీవుడెవ్వరు?” ఇలా జిజ్ఞాసను రేకెత్తిస్తాయి ఈ సూక్తంలో ఋక్కులు.”

‘ద్యులోకం’లో ఉన్న సూర్యుణ్ణి భూమాత పూజించింది. సూర్యుడు తండ్రి. భూమి తల్లి! వారిద్దరి సంగమంతో భూమాత గర్భం ధరించి రసాలను దాల్చింది. వారిద్దరు సస్యాల్ని ఫలింప చేయటం గురించి మాట్లాడుకొంటున్నారు. ఆమె గర్భంలో జలాలను దాల్చిన మేఘం ఉంది. వర్షజలం కురిసింది. మేఘవాయు కిరణాల సంయోగం భూమిని సస్యశ్యామలం చేసింది.. ఇలా సూర్యుడి ప్రాధాన్యత, సౌరకుటుంబంలో భూమి ఒకటిగా ఉండటం, ఈ భూమ్మీద వృక్ష జంతుజాలాలు అవతరించటం, చివరిగా మానవుడి ఉనికి వీటిని వివరించటానికి దీర్ఘతముడు ఈ ఋగ్వేద సూక్తంలో ప్రయత్నించాడు.

భూమి, ఆకాశం, అంతరిక్షం ముగ్గుర్నీ తల్లులన్నాడు. అగ్ని, వాయువు, సూర్యుడు ముగ్గుర్నీ తండ్రులన్నాడు. ఆదిత్యుడు ఆ తలిదండ్రులతో ఊర్థ్వాన ఉన్నాడని పేర్కొన్నాడు.

“సత్యాత్మకమైన ఆదిత్యుడి పన్నెండు ఆకుల చక్రం స్వర్గం చుట్టూ భ్రమిస్తూ ఉంటుంది. ఆ చక్రం 360 పగళ్లు, 360 రాత్రుల రూపంలో 720గా ఉంటుంది..” అంటాడు. ఋతువుల ఆకు చక్రంలో భువనాలన్నీ ఇమిడి ఉన్నాయనీ, సమానమైన అంచులు కలిగిన కాలచక్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుందనీ ఆయన వివరించాడు.

“ప్రజల అధిపతి” (ప్రజాపతి భావం)ని చూశానని అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారనీ పేర్కొంటాడు. ఏడుగురు కుమారులు ఆది నుంచీ శనిదాకా ఏడు గ్రహాలకు సంకేతం కావచ్చు.

ఈ ప్రజల అధిపతి నిమిత్తమాత్రుడని, సృష్టిని నియతి ప్రకారం నడిపిస్తాడని ప్రతీకగా చెప్పటం కోసం:

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే।
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి॥

అనే ఋక్కుని ఈ సూక్తం లోనే 20వ ఋక్కుగా చెప్పాడు.

ఒకే వృక్షంపై రెండు పక్షులు సమానంగానే నివసిస్తున్నాయని, “ఒక పక్షి ఫలాల్ని ఆస్వాదిస్తుంటే, ‘అనశ్నన్ అన్యః’ ఏమీ తినని రెండో పక్షి ‘అభిచాకశీతి’ ఊరకే చూస్తోంది..” అంటాడు.

“జీవాత్మ, పరమాత్మ అనే రెండు పక్షులు ఒకే దేహంలో లేదా ఒకే చెట్టుమీద నివసిస్తుంటాయి. జీవాత్మ దాని ఫలాల్ని ఆరగిస్తుంటే, పరమాత్మ దేన్నీ అనుభవించకుండా ద్రష్టమాత్రంగా ఉంటాడు” అని దీని భావంగా పెద్దలు విశ్లేషిస్తారు. ఇక్కడ దీర్ఘతమసుడు అగ్ని, వృక్షం, పక్షులు, తండ్రి, కుమారులు వంటి ప్రతీకల ద్వారా లోకసృష్టి, జీవాత్మ–పరమాత్మ సంబంధం, ప్రళయం, ప్రకృతి- పురుష తత్వాలు వంటి గంభీర తాత్త్విక భావాలను సంకేతరూపంలో వ్యక్తం చేశాడు. అందుకే ఆయన కవిత్వం సాధారణ

స్తోత్రకావ్యం కాదు; అది దర్శనశాస్త్రపు రహస్యభాషలో రాసిన ఒక తాత్త్విక గాథ.

(ఇంకా ఉంది)

Exit mobile version