[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]
ఋగ్వేదంలో ఋక్కులన్నీ తాత్త్వికత, మర్మార్థం, సంకేతరూపకాలు, దార్శనికతలతో నిండి ఉంటాయి. వేదయుగ శ్రోతలకు ఆనాడు ఈ సంకేతభాష తేలికగానే అర్థమయ్యేది. ఆధునిక పాఠకులకు మాత్రం ఇది విరోధాభాసాల సముదాయంగా అనిపిస్తుంది.
ఋగ్వేదానికి పరిచయ వ్యాసాలు వ్రాసిన కొందరు ఆధునికులు “ఓ ఇంద్రుడా! వారి గోవులన్నీ తెచ్చి మాకిమ్ము” లాంటి భావాలే ఋగ్వేదం నిండా ఉన్నాయనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు. సంక్లిష్టమైన అంశాల తర్కాన్ని వదిలేసి, తోచిన భాష్యాలు వ్రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా 50 యేళ్ళ క్రితం మేథావులు రాసినవే. వాటి పునరావలోకనం జరగలేదు.
దీర్ఘతముని తాత్త్వికతని అర్థం చేసుకోవటానికి మనం మొదట ఆనాటి సాంఘిక, రాజకీయ సామాజిక స్థితిగతులతో పాటు ఋగ్వేదకాలంనాటి మేథోవర్గం ఆలోచనా పరణతి గురించిన అవగాహన మనకు తప్పనిసరిగా ఉండాలి. మన పూర్వులకు జ్ఞానం తక్కువనీ, పాశ్చాత్యులే మనకన్నా ముందున్నారనే భావన లోంచి బైటకు వస్తే, నాగరికతకు దీర్ఘతమో మహర్షి పెట్టిన జ్ఞానభిక్ష ఎంతటిదో అవగతం అవుతుంది.
దీర్ఘతమోమహర్షి కవితలోని తాత్త్వికత గురించి అత్యధికంగా అధ్యయనం చేసి అనేక కొత్త ఆలోచనలు చేసినవారిలో 100 యేళ్ల క్రితం బాలగంగాధర తిలక్, (ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యాస్), 60 యళ్ళ క్రితం సి. కున్హన్ రాజా (పొయెట్ ఫిలసాఫర్స్ ఆఫ్ ది ఋగ్వేద అండ్ ప్రీ వేదిక్) ముఖ్యులు. ఈ ఇద్దరి అభిప్రాయాల సారంగా దీర్ఘతముడి ఋక్కుల పునరావలోకనం ఈ వ్యాసం లక్ష్యం.
ఋగ్వేదకాలంలో కవిసమ్మేళనాలు
ఋషులైన శాస్త్రవేత్తలు ఒక చోట చేరి తాము దర్శించిన శాస్త్ర విషయాలను ఒకరికొకరు వినిపించుకునేవారు. స్తోత్ర సంఘాలు ఆ రోజుల్లో ఉండేవి. తీవ్రమైన వాదోపవాదాలు, అభ్యంతరాలు, సవరణలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు జరిగేవి. శబ్దమా.. భావమా దేనికి ప్రాధాన్యత నివ్వాలనే మీమాంశ ఉండేది. భావం లేనిదే శబ్దానికి విలువ లేదని కూడా చర్చించేవారు. “దేవయాన మార్గం నాకు కన్చిస్తోంది- ‘ఉషఃకాంతకు కిరీటమైన ఒక తేజస్సు’ తూర్పున నన్ను మురిపిస్తోంది-” అంటూ రాగయుక్తంగా పాడి ఒక ఋషి వినిపిస్తాడు. భూమండలానికి ఉత్తర ధృవాన సూర్యుడు ఉత్తరానే ఉదయిస్తాడు. ఉషస్సు తూర్పున ఎలా కనిపిస్తుందని మరొక ఋషి అభ్యంతరం చెప్తాడు. దానికి మరో మహర్షి ఏ దిక్కున నివసించేవారికైనా సూర్యుడు ఉదయించే దిక్కే తూర్పు” అని సమాధానం చెప్తాడు. ఇలాంటి చర్చావేదికలు వేడివేడిగా జరిగేవి.
ఇలాంటి కొన్ని ఋషిగోష్ఠులను చరకసంహితలో ఉదహరించారు కూడా!
ఋగ్వేద కాలంనాటి ఆచారం అది! దీర్ఘతముడి సూక్తాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన పండితుల సభలో వాటిని పారాయణం చేశాడని అర్థం అవుతుంది. మధ్యమధ్య ఆయన సభనుద్ధేశించి ‘ఈ ప్రపంచ సృష్టిని ఎవరు ప్రత్యక్షంగా చూశారు?’ లాంటి ప్రశ్నలు కూడా సంధిస్తాడు. మానవ అనుభవ జగత్తుకీ, మర్మమయమైన మూలసత్యానికి మధ్య నున్న సంబంధాన్ని మన ముందుంచటానికి ఆయన ప్రయత్నించాడు. సత్యజ్ఞానం అనేది ఈ సంబంధాన్ని గ్రహించడంలోనే ఉందని సూచించాడు.
“కవులు తమ హృదయంలో ధ్యానించి, అసత్తుతో సత్తుకి గల బంధాన్ని జ్ఞానంతో కనుగొన్నారు.” (10.129.4) అంటుంది నాసదీయ సూక్తంలో ఓ ఋక్కు. ఇక్కడ కవుల్ని, కవిసమ్మేళనాల్ని ఈనాటి అర్థంలో చూడకూడదు. కవిః క్రాంతిదర్శి… వెలుగును దర్శించగలవాడు అని! దీర్ఘతముడనే ఋగ్వేద కాలం నాటి ఋషి అలాంటి క్రాంతిదర్శి! అనస్తితి (నాన్-ఎగ్జిస్టెన్స్)లో సత్తు (ఎగ్జిస్టెన్స్) బంధాన్ని దర్శించడం అనేది కవిత్వ దృష్టితోనే సాధ్యపడ్తుంది. దీర్ఘతముడు కాల్పనిక కవి కాదు; విశ్వమర్మాన్ని దర్శించిన ద్రష్ట.
సరస్వతీ పుత్రుడు
మహాకవుల్ని సరస్వతీపుత్రుడనటం దీర్ఘతమునితోనే ఆరంభమయ్యింది. దీర్ఘతముడు సరస్వతి నదికి అంకితంగా చెప్పిన ఒక సూక్తంలో సరస్వతి ఒక నదిని, ఒక దేవతను కూడా సూచిస్తాడు.
దీర్ఘతముడు తనను ఆ సరస్వతి కుమారుడిగా భావించాడు. ఆమెను పాలిచ్చే తల్లిగా చిత్రించాడు. “జీవనాహారంతో ప్రవహించే నీ అక్షయస్తనము, ఓ సరస్వతి! కోరికలన్నిటిని పోషించేది, ధనసంపదల ప్రసాదిని. మేము పానంచేయటానికి అది అందుగాక” (1.164.49) అని స్తుతిస్తాడు. ఇక్కడ మాత–శిశు సంబంధం ఒక గంభీర సంకేతం. భౌతిక తల్లి పాలివ్వడం కాలపరిమితి గలది; కానీ, సరస్వతి జ్ఞానస్తన్యం నిత్యప్రవాహం. కవిని నిరంతరం పోషిస్తుందనే భావన కనిపిస్తుంది. సరస్వతీపుత్రుడంటే జ్ఞానస్తన్యం గ్రోలినవాడని!
కవి అంటే?
కవిలో ‘మేధ’ (సృజనాత్మక బుద్ధి) అతని ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది; భావప్రవాహాన్ని నియంత్రిస్తుంది; కళాత్మక సమాప్తిని ప్రసాదిస్తుంది. నిజమైన కవిలో మేధ నిరంతర ప్రవాహంలా ప్రవహిస్తుంది; అతని మనస్సులో ‘చిద్రం’ (అవగాహనలో విరామం) ఉండదు. అందుకే అతను ‘మేధావి’, ‘సుమేధసు’.
“నేను ఎటువంటి వాడినో నాకు తెలియదు. ఆలోచనలో మునిగిపోయి, దాగివుంటాను. ఋత యొక్క మొదటిపుత్రుడు నా దగ్గర కొచ్చినప్పుడు, ఈ వాక్కులో నాకు భాగం లభించింది.” (1.164.37) లాంటి వాక్యాలు దీర్ఘతమో మహర్షిలోని కవితనంతో పాటు మార్మికతను చాటుతాయి. ‘ఋత’ (Cosmic Order) అంటే సర్వనియమిత సత్యం. దాని అనుభూతి వలన కవికి వాక్కులో భాగం దక్కుతుంది. ఇది పాత కొత్త స్వరూపాల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణ మనిషి బాహ్యప్రపంచంలో మునిగిపోతే, కవి పరమసత్యం వైపు దృష్టి సారిస్తాడు.
క్షరము అంటే అశ్వరమైనది – అనుభవ జగత్తు. అక్షరము అంటే, అనశ్వరమైనది- పరమసత్యం.ఈ వ్యత్యాసం అనుభవాత్మక ప్రపంచం మరియు అతీత సత్యం మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అనుభవ జగత్తు అతీతసత్యంలోనే ఆధారపడి ఉంది. దీర్ఘతముడి దృష్టిలో ‘అక్షరాలు’ దేవతల నిత్యనిలయాలు. “అమరమైన గీతాక్షరం దేవతల అంతిమనిలయం” (1.164.39)
కవిత్వ భాష సాధారణ సంభాషణ కాదు; అది దేవసాన్నిధ్యాన్ని కలిగించే మాధ్యమం. కవిత్వాన్ని గ్రహించినవాడు దేవతలతో ఏకత్వాన్ని పొందగలడు. కవి సత్యాన్ని సృష్టించేవాడు. రసజ్ఞుడు దాన్ని గ్రహించేవాడు. ఇద్దరి మధ్య భేదం ఉండకూడదనీ, ఇద్దరూ అంతిమంగా ఏకత్వాన్ని పొందుతారనీ అంటాడు దీర్ఘతముడు.
వేదసాహిత్యంలో కవిత్వాన్ని తత్వశాస్త్రంతో సమన్వయపరిచిన ఆ మహోన్నతుని దృష్టిలో కవి= ద్రష్ట, వాక్కు= దైవనిలయం మేధ= సృజనాత్మక జ్ఞానం. క్షర అక్షర= అనుభవాతీత సంబంధం.
కవిత్వం కళ కాదు; అది విశ్వమర్మాన్ని దర్శించే సాధన. దీర్ఘతముని మార్గంలో కవి మరియు తత్వవేత్తలు సత్యసాధకులు.
1798లో రొమాంటిసిజం ఉద్యమానికి పితామహుడిగా ప్రసిద్ధుడైన William Wordsworth పురాతన శిధిలాలయం Tintern Abbey గురించి రాసిన కవితలో తన బాల్యం, యౌవనం, పరిఫూర్ణత సిద్ధించిన దశలలో ప్రకృతి తనపై చూపిన ప్రభావాన్ని వర్ణిస్తూ, సంక్షిప్త స్వీయచరిత్రను చిత్రిస్తాడు. ఇది దీర్ఘతముడి శైలి! “unknown modes of being” (మనం గ్రహించని ఉన్నతమైన మన ఆత్మీయ స్థితులు) అనే వర్డ్స్వర్త్ భావన దీర్ఘతముడి ఆలోచనలకు దగ్గరగా ఉందని బాలగంగాధర తిలక్ అంటారు.
వాక్కు అంటే ఏది?
కవిత్వ భాష అనేది ప్రకృతి సత్యాన్ని సూచించే మాధ్యమంగా దీర్ఘతముడు భావించాడు. బృహస్పతిని కవీనాం కవిః (కవులలో కవి), పథికృత్ (మార్గం వేసినవాడు-స్రష్ట) వాక్మార్గ స్రష్ట ఇలా సంబోధిస్తాడు. యఙ్ఞపురోహిత స్వరూపం ఆయన! బృహస్పతిని, సరస్వతిని తన ఊహలకు ఆకృతి కల్పించిన ప్రేరక శక్తులుగా భావించాడు. వాక్స్వరూపమే దైవస్వరూపం అన్నాడు. కవిత్వం ద్వారా వాక్కు దేవతలకు నిలయమౌతుందన్నాడు. వాక్ప్రేరకుడు, సృజనాత్మకతకు కారకుడుగా బృహస్పతిని అభివర్ణిస్తాడు.
“దైవనిలయమైన ఈ వాక్కు నాలుగు భాగాలుగా ఉంటుంది. అందులో మూడు భాగాలు గూఢరహస్యంగా అంతర్ముఖంగా దాగి ఉంటాయి. దివ్యప్రేరణ పొందిన ఋషులు మాత్రమే వాటిని గ్రహిస్తారు. సాధారణ మానవులు వాటిని ప్రవర్తింప చేయలేరు. నాలుగవ భాగమే మనం మాట్లాడే భాష.” అంటాడు దీర్ఘతముడు (ఋగ్వేదం 1.164.45). అగోచరమైన ఆ మూడు భాగాలు మానవ సాధారణ సంభాషణకు అతీతమైన దివ్యస్థితులు.
కవికి కలిగిన ‘ప్రతిభ’ వల్ల ఈ నాలుగు స్థాయిలకూ అతనికి స్వేచ్ఛాయుత ప్రవేశం ఉంటుంది. అందువల్లే అజ్ఞాతసత్త్వ స్థితుల్ని కూడా భాష ద్వారా కవి వెల్లడించగలుగుతాడనేది దీర్ఘతముడి వివరణ.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇంత పరిశ్రమ చేయగలడా.. అని ఆశ్చర్యపోయేంత కృషిచేసిన మహామహోపాధ్యాయులు పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆచార్య శలాక రఘునాథశర్మ ఇత్యాది పుణ్యశ్లోకులకు వాక్కులోని అగోచరమైన ఆ 3 భాగాలూ తెలుసు!
పదం అనేది భిన్నమైన అర్థాలను కలిగింది. శాస్త్రపరమైన అంశాలలో పదం అంటే, స్పష్టమైన అర్థాన్ని ప్రతిపాదించేదని!
అదే పదం ఇతిహాసాల కొచ్చేసరికి కథారూప అర్థాన్నిస్తుంది. కవిత్వానికొచ్చేసరికి సూచన లేదా ధ్వని ప్రధానంగా ఉంటుంది. శాస్త్రంలో ప్రాముఖ్యతను, ఇతిహాసంలో అర్థాన్ని, కవిత్వంలో సూచనశక్తిని పదం పొందుతుందని అగ్నిపురాణం పేర్కొంది!
దీర్ఘతముడంటే ‘పుట్టుగుడ్డి’ కాదు!
దీర్ఘతమోమహర్షి తన అంతర్ముఖ దృష్టి ద్వారా వెలుగును ప్రసరించిన ఋషి. వెలుగును పొంగించగల మనస్సు కలిగినవాడే అంతరానుభూతిని దర్శించగలడనేది ఆయన సిద్ధాంతం. ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం దీర్ఘతముడు జన్మాంధుడు. సూర్యుడి వంక తదేకంగా చూస్తూ పరిశోధనలు చేసి కళ్ళు పోగొట్టుకున్నాడనేది మరికొందరి కథనం. ‘దీర్ఘతమః’ అనే పదానికి “దీర్ఘకాలం చీకటిలో ఉన్నవాడు” అనే అర్థాన్ని ఇంకొందరు చెప్తారు.
ఈ చీకటి భౌతిక అంధత్వం కాదు; అది అవిద్యాంధకారం, అజ్ఞానాంధకారం. విశ్వమర్మాలపై అవగాహనలేమి, జ్ఞానదౌర్బల్యానికి సంకేతం అనుకున్నప్పుడు సృష్టి రహస్యాలను వెలికితీసే పనిలో దీర్ఘకాలం కృషిచేసినవాడనే అర్థం స్ఫురిస్తుంది.
చీకటి అంతర్ముఖ దర్శనానికి పునాది. బాహ్యచక్షువులతో నిమిత్తం లేకుండా ఆయన అంతర్చక్షువులు తెరచుకున్నాయి. అందువల్లే ఆయన ఋషిగా, ద్రష్టగా నిలిచాడు.
గుహలో మసక చీకటిలో నీడలను మాత్రమే చూసే మనిషి బయటకు వచ్చి సూర్యుని దర్శించినప్పుడు నిజమైన వెలుగు నిజస్వరూపం అతనికి తెలుస్తుందంటాడు ప్లేటో తన రిపబ్లిక్లో! అవిద్య అనే చీకటి గుహనుండి బయలుదేరి సూర్యప్రకాశాన్ని, సత్యజ్ఞానాన్ని దర్శించినవాడు దీర్ఘతముడు! వేదసాహిత్యం జ్ఞానానికి, చైతన్యానికి, సత్యానికి సంకేతంగా సూర్యుణ్ణి భావించటానికి ప్రేరకుడు కూడా దీర్ఘతముడే..!
దీర్ఘతముడంటే సూర్యుడే!
సూర్యుని కాలచక్ర రహస్యాలు వివరిస్తూ, దీర్ఘతముడు “ద్వాదశ ప్రధ్యశ్చక్రమేకం త్రిణి నభ్యాని..” అంటూ12 అంచుల్తో తిరుగుతున్న చక్రానికి 3 నాభులు ఉన్నాయంటాడు. 12 నెలల్ని, వేసవి, వర్షాకాలం శీతాకాలాలను, ఒక సంవత్సర కాలాన్ని కవితాత్మకంగా చెప్పాడు. కాలచక్రం అనటంలోనే మార్మికత ఉంది. 360 చువ్వలు (స్పోక్స్) కదలకుండా స్థిరంగా అమరి ఉన్నాయని, ఒక చక్రాన్ని 7 పేర్లు కలిగి ఉన్న శక్తులు నడిపిస్తాయని, “ఏకం చక్రం వహతి సప్తానామా” అంటూ సప్తగ్రహాల్ని (నవగ్రహాల్లో రాహుకేతువులు ఛాయా గ్రహాలే కదా!), సప్త ఋషుల్ని, సప్త వేద ఛందస్సుల్ని ఈ వాక్యంలో స్ఫురింపచేస్తాడు.
సూర్యుడు పది యుగాలు తన గమనాన్ని కొనసాగించి వృద్ధుడిలా క్షీణిస్తాడని, తరువాత సముద్రంలో ప్రవేశిస్తాడని మరో మంత్రంలో చెప్తాడు. దీర్ఘతముని ఈ ఋక్కు చాలా చార్చలకు దారితీసింది. పది యుగాలు, సూర్యుడు వృద్ధుడు కావటం, సముద్రం లోకి ప్రవేశించటం అనే పదాలకు సరైన అర్థాన్ని మనం పట్టుకోగలగాలి. ఈ మాటలలోని తాత్విక అన్వయం దొరకకే.. దీర్ఘతముణ్ణి వృద్ధాప్యంలో అతని కుటుంబీకులు కాళ్లూ చేతులు కట్టి జలాల్లోకి విసిరేశారని, అతను కొట్టుకుపోయి అంగదేశ రాజు సాయంతో బతికాడనీ కథలు పుట్టి ఉంటాయి. ఈ కథలకు చారిత్రక ప్రాధాన్యత లేదు. అంగ, మగథ దేశాలలో ఆర్యసంస్కృతి వ్యాపకుడిగా దీర్ఘతముణ్ణి నేటికీ గౌరవిస్తారు. అంగదేశంలో అతను చేసిన కృషి గురించి మనం వేరే చర్చిద్దాం.
10వ నెలలో సూర్యుడు వృద్ధుడౌతాడనటానికి శీతాకాలంలో సూర్యుని కాంతి తగ్గిపోవటాన్ని అన్వయించి పాశ్చాత్యులు వ్యాఖ్యానించారు కానీ, తిలక్ లాంటి భారతీయ పండితులు ఆ వ్యాఖ్యానాన్ని అంగీకరించలేదు.
సముద్రం అంటే తూర్పు, పడమర దిక్కుల అంచు (horizon). సాయంత్రం పడమటి సముద్రంలోకి లయమౌతున్నట్టుగా కనిపిస్తాడు కాబట్టే, సూర్యాస్తమయం అంటున్నాం. వెలుగే తానైన సూర్యుడు పగలంతా వెలిగి సముద్రం లోపల చీకట్లో దీర్ఘకాలం గడుపుతున్నాడు కాబట్టి, సూర్యుణ్ణి దీర్ఘతముడన్నారు.
‘ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ గ్రంథంలో తిలక్ ఈ భావాన్ని ఆర్కిటిక్ ఖండానికి అన్వయించి పరిశీలించారు. అక్కడ ఏడాదిలో సగకాలం పగలు, సగకాలం రాత్రి, పగలు నుంఛి రాత్రిగా మారేప్పుడు, రాత్రి నుంచి పగలుగా మారేప్పుడు సందెవెలుగూ ఉంటాయి ఈ సందె వెలుగు రోజుల తరబడీ దీర్ఘకాలం ఉంటుంది. అరోరాబొరియాలిస్ అంటారు దీన్ని! ఋగ్వేద కవులు దీర్ఘ ఉషస్సు అని పిలిచారు! వాళ్లు ఉషస్సుని ఒక దేవతగా కూడా స్తుతించారు. ఈ ఆర్కిటిక్ ఉత్తర ధృవంలో దీర్ఘ ఉషస్సు లాగే కనీసం 4 నెలలు చీకటిగా ఉంటుంది. దీర్ఘ ఉషస్సుని దీర్ఘతమస్సుని ఇక్కడ మాత్రమే మనం చూడగలం.
ఎండకన్నెరగకుండా చీకట్లోనే సుదీర్ఘకాలం గడపాల్సిన ఆ కాలంలో మనుషులు వెలుతురు కోసం పడే ఆరాటాన్ని జ్ఞానం కోసం వెదకులాటగా వర్ణించాడు దీర్ఘతముడు. బృహదారణ్యకోపనిషత్తు ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నది కూడా ఈ ప్రేరణతోనే! చీకటిని అవిద్యకీ, అజ్ఞానానికి, సూర్యుని జ్ఞానానికి సంకేతంగా ప్రకటించాడాయన!
తమోగుణం అంటే ఉత్ప్రేరకం
భారతీయ తత్త్వశాస్త్రాలన్నీ మనసుకు మూడు ప్రధాన గుణాలను పేర్కొన్నాయి. తమోగూణం ఆలోచనని నియమిస్తుందని, రజోగుణం ప్రవర్తింపచేస్తుందనీ సత్త్వగుణం దాన్ని ప్రకాశింపచేస్తుందనీ కాశ్యపసంహిత అనే ఆయుర్వేద గ్రంథం పేర్కొంది.
ఫ్రాయిడ్ చెప్పిన ఇద్, ఈగో సూపర్ ఈగో అనే మూడు గుణాలకూ ఇవే ధర్మాలను పేర్కొనటం విశేషం.
ఇక్కడ తమోగుణం ఒక అజ్ఞానాంధకారం ఎంతమాత్రమూ కాదు. ఒక మోటారు సైకిలుకు ఇంజనులాంటిది తమోగుణం. ఇంధనం లాంటిది రజో గుణం. దాన్ని నడిపే చోదకశక్తి సత్త్వగుణం. తమోగుణం మౌలికమైన మానసిక స్థితి. ఒక ప్రేరణ మనసుకి కలిగించేది తమోగుణం. దాన్ని ఆచరణాత్మకం చేసేది రజోగుణం. దాని మంచీ చెడుల్ని తర్కించి నియంత్రించేది సత్త్వ గుణం. ఇందులోంచే కోరికలు ఆలోచనలు, భావనలు జనిస్తాయి. ప్రేరణ లేనిదే జగత్తులో ఏదీ సాధ్యం కాదు. ఆ ప్రేరణ దీర్ఘ ప్రేరణ అయితే, అద్భుతమైన నూతన శాస్త్రీయ కాంతి లోకంపైన విరజిమ్ముతుంది. దీర్ఘతమస్సు అంటే అది! సృష్టి రహస్యాలను కనుగొనే తీవ్రమైన ప్రేరణ కలిగిన శాస్త్రవేత్త కాబట్టే దీర్ఘతముడు సార్థక నామధేయుడు అయ్యాడు. ఆయన్ని గుడ్దివాడనుకోవటమే గుడ్డితనం.
(ఇంకా ఉంది)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
