Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం-4

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 4వ భాగం.]

బోధా మే అస్య వర్చసో యవిష్ట మంహిష్టస్య ప్రభూతస్య స్వధావః।
పీయతి త్వోను త్వో గృణాతి వందారుష్టే తత్వం వందే అగ్నే॥

“ఓ అగ్ని! సంకల్పాలను ఆలకించే శక్తివంతుడా! స్వతంత్రంగా, సౌఖ్యంగా జీవించే యువతీ యువకులు నా ఈ మహత్తర వాక్యంలోని అంతర్భావాన్ని గ్రహించాలి. ఇది గంభీరమైనది, శ్రద్ధార్హమైనది, లోతైన సూచనలతో నిండి ఉంది. ఎవరు నిందించినా, ఎవరు ప్రశంసించినా, నేను నీ అభిమానినే. నీ శరీరం ఆరోగ్యమయం, నీ మనస్సు జ్ఞానమయం; నీ బుద్ధి వైభవాన్ని నేను గౌరవిస్తున్నాను.”

దీర్ఘతముని ఈ ఒక్క మంత్రం చాలు అతని అంతరంగాన్ని చదవటానికి. తనకు అగ్నితో అభేదం చూపిస్తూ, అగ్ని ఎంత పావనుడో తన వాక్కు కూడా అంతే తీక్ష్ణమని సూచిస్తాడు. తన మాటల లోతు, గంభీరతను వెల్లడిస్తూ, కనీసం రేపటి తరాలయినా ఆ భావాలను గ్రహించాలని ఆశించాడు. ఎంత ప్రతిభ ఉన్నా సమకాలీనులు మెచ్చరు కదా.. అందుకే యువతీ యువకులకు చెప్పుకున్నాడు.

వాగ్దేవి సరస్వతిని ప్రార్థిస్తూ, తనను ఆమె పుత్రుడిగా భావిస్తాడు.

“ఓ సరస్వతి! శిశువుకు అమృతంలా పొంగే తల్లిపాలవంటి ఆనందమయి, జీవన వరాల నిధివి! నీవు ప్రసాదించే వాక్కు, దృష్టి, మానవజాతిని పోషించే అపారశక్తులు. ఓ తల్లీ! నీ వాక్ప్రవాహం, దృష్టిప్రవాహం ఈ భూమిపై నిరంతరం ప్రవహించనీ; నీ సంతానం అంతా పోషణ పొందనీ. నేను కూడా ఆ వాణిని అనుసరించి విశాల ఆకాశాల వైపు ఎదగాలని కోరుకుంటున్నాను” అని ప్రార్థిస్తాడు.

దీర్ఘతముని ప్రతి మంత్రంలోనూ అద్భుతమైన కవితాత్మకత నిండి ఉంటుంది. లోతైన భావస్ఫూర్తితో చదివినవారిని ఆలోచింప జేసేవిగా ఉంటుంది. ఆయన దృష్టి శాస్త్రవిషయాల మీదే ఉన్నా, హృదయం కవితామయం. అందుకే, ఆయన ప్రతి మంత్రం భావగర్భిత కవితాతత్త్వంతో నిండి ఉంటుంది.

అంగీరసుడి మనుమడు

అంగీరసుడు అత్యంత ప్రాచీన మహర్షి. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు, సృష్టికార్యంలో బ్రహ్మకు సహకరించినవాడు. బ్రహ్మ మానసపుత్రులలో మూడవవాడు.

కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతుల కుమార్తె శ్రద్ధాదేవిని ఈ అంగీరసుడు వివాహమాడాడు. పురాణాల ప్రకారం, వీరికి దేవతల ఆచార్యుడైన బృహస్పతి సహా అనేకమంది పుత్రులు, సినీవాలి వంటి పుత్రికలు జన్మించారు. పుత్రులలో జ్యేష్ఠుడు ఉతథ్యుడు, మహాజ్ఞాని, సాత్త్వికుడు, తపోనిధి. సప్తమహర్షుల వద్ద సమస్త శాస్త్రాలను అభ్యసించాడు.

ఉతథ్యుడు మమత అనే కన్యను వివాహమాడాడు. ఆమె భక్తిశ్రద్ధలతో అతన్ని సేవించింది. ఉతథ్యుడు ఆమెకు సంతానం అనుగ్రహించి, తపస్సులో నిమగ్నుడయ్యాడు.

మాంధాతృ చక్రవర్తికి రాజధర్మాన్ని ఉపదేశించినవాడే ఉతథ్యుడు. రాజు తన ఇష్టప్రకారం కాక, ధర్మమార్గాన నడవాలని నిర్దేశించిన ఈ బోధనే ‘ఉతథ్యగీత’గా ప్రసిద్ధి పొందింది.

ఉతథ్యుని తరువాతి వాడు బృహస్పతి. దీర్ఘతమ మహర్షి చరిత్ర ఈ అంగీరసపుత్రులైన ఉతథ్య, బృహస్పతుల కథతో ముడిపడి ప్రారంభమవుతుంది; అందువల్ల వీరి ప్రస్తావన ఇక్కడ ముఖ్యమైంది!

బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు దానవుల గురువు. ఈ ఇద్దరూ తమ తమ శక్తి, యుక్తులతో దేవాసుర సంగ్రామాల్ని నడిపిస్తారు. ఒక సందర్భంలో శుక్రాచార్యుడు పరమశివుని అనుగ్రహంతో శస్త్రాస్త్రాలు సంపాదించి తిరిగి వస్తూ, ఇంద్రుని కుమార్తె జయంతి మోహంలో పడి కొంతకాలం ఆమెతో గడుపుతూ ఉండిపోతాడు. ఆ సమయంలో బృహస్పతి శుక్రుడి రూపంలో దానవుల్ని చేరి, వారిని దానవమార్గం నుంచి మళ్లించాడు.

తరువాత నిజమైన శుక్రుడు వచ్చి మోసాన్ని గ్రహించి, బృహస్పతిని “భ్రాతృపత్నీ సమాగమ పాపం కలుగుగాక” అని శపించాడు. బృహస్పతి మారు మాట్లాడకుండా దేవలోకానికి వెళ్లిపోయాడు. కాలక్రమంలో ఈ సంఘటనని అందరూ మరిచిపోయారు.

తల్లిపై అత్యాచార ప్రతిఘటన

అదే సమయంలో మమత గర్భవతి. దీర్ఘతముడు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. ఉతథ్యుడు తపోవనానికి వెళ్లిన సందర్భంలో బృహస్పతి అన్నగారిని దర్శించాలనే ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చాడు. వదినగారైన మమత అతిథి మర్యాదలతో అర్ఘ్యపాద్యాలు సమర్పించి గౌరవించిందా దేవ గురువుని!

అయితే, శుక్రాచార్యుని శాపప్రభావాన బృహస్పతిలో కామవాంఛ ఉద్రేకించింది.

మమత తను తల్లితో సమానురాలినని, పైగా గర్భవతినని, కులగురువైన బృహస్పతికి ఇలాంటి ప్రవర్తన తగదని హితవు పలికింది. అయినప్పటికీ, శాపవశుడైన బృహస్పతి ఆమె మాటల్ని లెక్కచేయలేదు. దేవతలకు ఇది తప్పుకాదంటాడు. బలవంతంగా లోబరచుకుని వీర్యం విడిచాడు.

ఆ సమయంలో మమత గర్భంలో పెరుగుతున్న శిశువు దీర్ఘతముడు బృహస్పతి వీర్యం తన స్థలంలోకి ప్రవేశించనీయకుండా కాలితో తన్ని బైటకు నెట్టివేస్తాడు. అతనికి వినిపించేలా “ఈ గర్భంలో నేనున్నపుడు వేరొక వీర్యానికి స్థలం లేదు” అంటాడు.

అలా నేలపై పడిన ఆ వీర్యం అప్పటికప్పుడు ఒక బాలుని రూపం దాల్చింది. ఈ అధర్మసంతానాన్ని తీసుకుపో అని మమత చెప్పగా, బృహస్పతి నిరాకరించాడు. చివరికి తల్లిదండ్రులిద్దరూ విసర్జించిన ఆ శిశువును భరతుడు తీసుకుపోయి పెంచగా, అతడే భరద్వాజుడయ్యాడు!

గర్భస్థుడైన దీర్ఘతముడు బృహస్పతిని శపించి,“నీ భార్య వేరొకరి ద్వారా పుత్రుణ్ణి ప్రసవిస్తుంది; ఆ పుత్రునివల్ల నీవు జీవితాంతం అవమానాన్ని అనుభవిస్తావు” అన్నాడు. దానికి ప్రతిగా బృహస్పతి “అంధుడివిగా పుడతావు” అని శపించాడు.

ఇదంతా దీర్ఘతముడు తల్లి గర్భంలో ఉండగానే జరిగిన కథ. ఇలాంటి గాథలలో లోతైన తాత్త్విక సూచనలు, మర్మాలు దాగి ఉంటాయి; స్థూలదృష్టితో చూస్తే  మనకు వింతగా అనిపిస్తాయి.

ఔతథ్య మామతేయుడిగా దీర్ఘతముడు

ఋగ్వేదంలో దీర్ఘతముణ్ణి ‘ఔతథ్యుడు’ (ఉతథ్యుని కుమారుడు), ‘మామతేయుడు’ (మమత కుమారుడు)గా పిలుస్తారు. అలాగే, భరద్వాజుడు ‘బృహస్పత్యుడు’ (బృహస్పతి పుత్రుడు), ‘మామతేయ భరద్వాజుడు’గా ప్రసిద్ధి. పండితుల అభిప్రాయం ప్రకారం మమతకు ‘వజిని’ అనే మరో నామం ఉంది! అందువల్ల భరద్వాజుడు ‘వాజినేయుడు’ అని కూడా తనను చెప్పుకున్నాడు.

ఋగ్వేద సంప్రదాయంలో వ్యక్తిని తండ్రి పేరుతోనే కాక తల్లి పేరుతో కూడా గుర్తించే పద్ధతి ఉంది. ఈ నేపథ్యంలో, ఒకే తల్లికి భిన్న పితృసంబంధాల ద్వారా జన్మించిన అన్నదమ్ములు భరద్వాజుడు, దీర్ఘతముడు. తల్లిగర్భంలో పడినది వీరిలో ముందుగా దీర్ఘతముడే అయినప్పటికీ మొదటగా జన్మించిన భరద్వాజుడే అగ్రజుడు!

ఉతథ్య మహర్షి తపస్సు ముగించి తిరిగి రాగానే మమత జరిగినదంతా వివరించి, తనలో తప్పు ఉంటే శిక్షించమని వేడుకుంది. ఉతథ్యుడు జరిగిందంతా గ్రహించాడు. ఈ సంఘటనకు మూలం శుక్రాచార్యుడు ఇచ్చిన శాపమని, మమత బృహస్పతులు నిమిత్తమాత్రులేనని చెప్పి, ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని నిర్ధారించాడు. “ఒక స్త్రీగా నీకు జరిగిన అన్యాయానికి ఆజన్మాంతం వగచే విధంగా బృహస్పతికి నీ కడుపులో పెరుగుతున్న శిశువే విధించాడు” అని ఊరడించాడు.

తరువాత కొంత కాలానికి మమత దీర్ఘతముని ప్రసవించింది! సూర్యునితో సమానమైన జ్ఞానదృష్టి కలిగినవాడిగా, మహా తపశ్శాలిగా ప్రసిద్ధి పొందాడు దీర్ఘతముడు.

ఋగ్వేద సంబంధిత కథనాలలో చాలా మంది మహర్షులు, రాజర్షులు, రాజుల గాథలు కలిసిపోయాయి.  ఒకే పేరుతో వేర్వేరు కాలాల, ప్రాంతాల వ్యక్తుల కథలు ఒకరికి ఆపాదించబడటంతో కొంత గందరగోళం ఏర్పడుతుంది.

దుష్యంతుడు శకుంతల ద్వారా భరతుడనే పుత్రుణ్ణి పొందాడు. ఈ భరతుణ్ణి దీర్ఘతముడే ఐంద్రమహాభిషేక విధానంతో రాజ్యాభిషేకం చేశాడని ఉంది. ఇదే సమయంలో, దీర్ఘతముని అగ్రజుడైన భరద్వాజ బృహస్పత్యుని భరతుడు తన కుమారుడిగా దత్తత తీసుకున్న గాథ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమవయస్కులైన దీర్ఘతమ భరద్వాజుల్లో భరద్వాజుణ్ణి భరతుడు దత్తత తీసుకుంటే, ఈ భరతుణ్ణి దీర్ఘతముడు రాజుగా ప్రతిష్ఠించటమే ఈ కథలో విశేషం.

భరతుడి తరువాత భరద్వాజుడు అధికారానికి రాలేదు. భరద్వాజుని కుమారుడు విదథ (విటథ) సింహాసనానికొచ్చాడు. ఆ వంశక్రమం దుష్యంతుడు → భరతుడు → భరద్వాజుడు → విదథుడు ఇలా కనిపిస్తుంది.

దీర్ఘతముని మేనమామ గౌతమ వంశీకుడైన శారద్వంతుడు ఈ గౌతముడు అహల్యను వివాహమాడాడు; అహల్యను శ్రీరాముడు పవిత్రం చేసిన గాథ ప్రసిద్ధి. అంగీరస వంశీకుడైన దీర్ఘతముడు కొన్ని సందర్భాల్లో “గౌతమ దీర్ఘతముడు”గా కూడా ప్రస్తావించబడుతాడు. ఈ ఇద్దరూ ఒకరేనని పండితుల భావన.

సంతాన సాఫల్య విద్య

దీర్ఘతముని భార్య ప్రద్వేషిణి, పేరుకు తగిన స్వభావం. ద్వేషం ఆమెకు సహజలక్షణం. అయితే దీర్ఘతముడు ఆమెను గాని, ఆమె విద్వేషాన్ని గాని పట్టించుకోకుండా తన తపోసాధనలో, పరిశోధనల్లో నిరంతరం మునిగి ఉండేవాడు. ఆమె కోరినప్పుడల్లా సంతానాన్ని అనుగ్రహించాడు; గౌతముడు మొదలైన అనేకమంది పుత్రులు ఆమెకు జన్మించారు. పుత్రులపట్ల అనురక్తి, భర్తపట్ల విరక్తి.. ఇవి ప్రద్వేషిణి స్వభావ లక్షణాలు.

దీర్ఘతముడు అమోఘవీర్యుడు. స్త్రీ కోరుకున్న విధమైన సంతానాన్ని ప్రసాదించగల శక్తి అతనికి ఉందని కథనాలు చెబుతాయి. సంతానహీనులకు పుత్రప్రాప్తిని కలిగించే సామర్థ్యంతో కారణజన్ముడిగా నిలిచాడు. ‘ప్రకాశమైథునం’ అనే విద్యను కామధేనువు పుత్రుడు అతనికి ప్రసాదించాడని పురాణాలు సూచిస్తాయి.

ఈ సంతానసాఫల్య విద్య వల్ల దీర్ఘతమునికి అపార ఖ్యాతి లభించింది. అనేక వంశాలు అతని అనుగ్రహంతో పుత్రసంతతిని పొందగా, కొందరు ఆయన్నే తమ మూలపురుషుడిగా భావించారు. ఈ నేపథ్యంలో పురాణాలు–ఇతిహాసాలు అతని పాత్రను పరశురాముని క్షత్రియ సంహార గాథతో ముడిపెట్టి, క్షత్రియ వంశాలను పునరుద్ధరించినవాడిగా చిత్రించాయి.

వాస్తవానికి ఇది వైద్యశాస్త్రపరమైన విద్య మాత్రమే. కానీ, తన వద్దకు వచ్చిన వంధ్యాస్త్రీలను రమించి గర్భవతులను చేశాడనే అపవాదు వ్యాపించింది. ఈ అపనిందే భార్య ప్రద్వేషిణి అతనిపట్ల పెంచుకున్న ద్వేషానికి ఒక కారణమై ఉండవచ్చు. ఆమె ప్రభావంతో పుత్రులు కూడా తండ్రిపట్ల విరక్తిని పెంచుకున్నారు.

విఫల వైవాహిక జీవితం

భారతం ఆదిపర్వంలో నన్నయ ఈ వృత్తాంతాన్ని సూచిస్తూ ఇలా పేర్కొన్నాడు,

“పతియు భరియించుఁ గావున భర్తయయ్యె,
భామ భరియంపఁబఁడు గాన భార్యయయ్యె;
పరగనవి మనయందు వీడ్వడియె నిన్ను,
నేనెల్ల కాలము భరియింపఁ గాన.”

“భరించేవాడు కాబట్టి భర్త, భరించబడేది కాబట్టి భార్య. ఇప్పుడు ఆ సంబంధమే విచ్ఛిన్నమైంది; నిన్ను నేను ఇక భరించలేను” అని ప్రద్వేషిణి స్పష్టం చేస్తుంది. ఇంకనుండి నేను నీ భార్యను కాదు; నువ్వు నా భర్తవు కాదు. ఇంట్లోంచి పొమ్మంటుంది కఠినంగా!

దానికి దీర్ఘతముడు, “నేను ధనం సంపాదించకపోవడమే నీ అభ్యంతరమైతే, నన్ను రాజు వద్దకు తీసుకువెళ్లు; ఆయన నీకు కావలసినంత ధనం ఇస్తాడు” అంటాడు.

కానీ, ప్రద్వేషిణి, “నీ వంటి నీచుడివల్ల వచ్చే ధనం కూడా నీచమే! నాకు అవసరం లేదు” అంటూ తిరస్కరిస్తుంది.

ఆ సందర్భంలో దీర్ఘతముడు కోపించి ఒక శాపం ఇచ్చాడు:

“పతిహీనలైన భామిను
లతి ధనవతులయ్యున్ గులజలయ్యున్ ననలం,
కృతలయ్యెడు మాంగల్యరహితలయ్యెడున్,
గృవణవృత్తి నిదియు మొదలుగన్.”

అంటే,భర్తను వదలిన స్త్రీలు ధనవంతులైనా, మంచి వంశంలో పుట్టినవారైనా సరే, అలంకరణ చేసుకోరాదు, మాంగల్యం ధరించరాదు. మరొక పతిని స్వీకరించరాదు: అని! భర్తని విడిచిన స్త్రీ ధనవంతురాలైనా పాపేనని, ఆమె భోగం వ్యర్థం, ఆమెకు అకీర్తి, నిందలు తప్పవని దీని సారాంశం.

ఇదే భావాన్ని సంస్కృత మహాభారతం కూడా

“అద్య ప్రభృతి మర్యాదా మయాలోకే ప్రతిష్ఠితాః।
ఏక ఏవ పతిర్నార్యా యావజ్జీవం పరాయణమ్॥”

అంటూ వివరించింది.

ఇలా దీర్ఘతముని ఆవేశోద్భవ శాపం లోకంలోని స్త్రీలందరికీ వర్తించిన నియమంగా రూపుదిద్దుకుంది!

మూఢమతి అయిన ప్రద్వేషిణి దీర్ఘతముని పలుకుల్లోని అంతరార్థాన్ని గ్రహించలేకపోయింది. కోపంగా  “ఈ పిచ్చివాడు తండ్రిగా యోగ్యుడు కాదు. కాళ్లు, చేతులు కట్టి గంగలో పడేయండి” అని పుత్రుల్ని ఆజ్ఞాపించింది. మాతృవాక్య పాలకులైన ఆ పుత్రులు ఆమె అన్నట్టుగానే చేశారు.

గంగలో కొట్టుకుపోతున్న దీర్ఘతముణ్ణి బలి అనే ఒక రాజుగారు రక్షించి, బంధనాలను విప్పించి, ఉతథ్య–మమతల పుత్రుడిగా గుర్తించి గౌరవంతో ఆదరించాడు.

సంతానహీనుడైన బలి మహారాజు తన రాణి సుధేష్ణకు సంతానప్రాప్తి కలిగించమని దీర్ఘతముణ్ణి ప్రార్థించాడు. అయితే సుధేష్ణకు ఈ చికిత్సపై విశ్వాసం లేక, తన దాసిని తన స్థానంలో పంపింది. దీర్ఘతముడు ఆమెకు పదకొండు మంది పుత్రులను అనుగ్రహించాడు. వారిలో కక్షివానుడనే ఋగ్వేద ఋషి కూడా ఉన్నాడు!

తాను దీర్ఘతముని పుత్రుడని ప్రకటించుకున్నాడు. రాజుకు అసలు సంగతి చెప్పి, ఈ 11 మందీ దాసికి పుట్టిన వాళ్లని చెప్తాడు దీర్ఘతముడు. అప్పుడు రాణిని మందలించి మళ్ళీ సుధేష్ణను పంపటం, దీర్ఘతముడు ఆమెకు 5 గురు సూర్యసములైన పుత్రుల్ని అనుగ్రహించటం మహాభారత కథ.

ఈ ఐదుగురే అంగ, వంగ, కళింగ, పుండ్ర, సుంహ రాజవంశాలకు మూలపురుషులయ్యారని వ్యాస మహాభారతం పేర్కొంది!

(ఇంకా ఉంది)

Exit mobile version