Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం-5

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 5వ భాగం.]

సూర్యసిద్ధాంతం సూర్యుడు స్వయంగా మయుడికి బోధించాడని చెబుతుంది. అమెరికాలో వివక్షకు గురవుతున్న ఆదివాసీ ప్రజల్లో మయ, ఇంకా జాతులు తమ ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుకుని జీవిస్తున్నారు. వారి భాషలు, సంస్కృతులు, ఆకృతులు అచ్చంగా భారతీయులను పోలి ఉంటాయి. వీరిలో మయా జాతి ప్రాచీన నాగరికత గురించి 1940లలో భిక్షూ చమన్‌లాల్ ‘ది హిందూ అమెరికా’ అనే గ్రంథంలో చాలా వివరాలు పేర్కొన్నాడు. మయ, ఇంకా ప్రజలకు భారతీయతతో ఉన్న అనుబంధాన్ని వారి సూర్యారాధనకు సంబంధించిన అనేక ఆధారాలను ఆయన సోదాహరణంగా చూపించాడు.

ఋగ్వేద ప్రజలు, మయాజాతి ప్రజలు ఒకే మూలస్థానం నుండి బయలుదేరి ఒకరు తూర్పు, మరొకరు పడమర దిశగా పరివ్యాప్తి చెంది ఉంటారని ఒక అభిప్రాయం ఉంది. సూర్యుడు మయుడికి సత్య(కృత) యుగాంతంలో సూర్యసిద్ధాంతం బోధించాడని ఆ గ్రంథం చెబుతుంది. ఇది సృష్టిచక్రంలోని ప్రథమ స్వర్ణయుగంలో జరిగిన పరిణామానికి చిన్న ఆధారం.

కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో మొదటి యుగం చివర లేదా త్రేతాయుగం ప్రారంభంలో మయా జాతి ప్రజలు మయుడి నాయకత్వంలో అమెరికా చేరి ఉండవచ్చు.

ఋగ్వేదంలో శిల్పఋషులు

మను, మయ, త్వష్ట ,శిల్పి, విశ్వజ్ఞ అనే ఋగ్వేద కాలం నాటి ఐదుగురు శిల్ప బుషులు కృతయుగంలో మానవ శిల్పగణాలకు మూలపురుషులుగా అవతరించినట్టు శిల్పశాస్త్రాలు చెప్తాయి. రామాయణంలో పుష్పక విమానం, భారతంలో ఖాండవ వనంలో మయసభ, పురాణాలలో త్రిపురాసులకు మూడు నగరాలను మయుడు నిర్మించాడని కథనం.

మయుడి వంశీయులు రామాయణ కాలంలోనే పాతాళం అంటే అమెరికాలోని నేటి మెక్సికో ప్రాంతానికి వలస వెళ్ళినట్టు ఉత్తర రామాయణంలో ప్రస్తావన ఉంది. ఈ మెక్సికన్లను చూసే ఇండియన్లని పొరబడి కొలంబస్ వాళ్లను రెడ్డిండియన్స్ అన్నాడు! అతను పొరబడలేదు. వాళ్లు వేలయేళ్ల క్రితం ఇండియన్లే! వాళ్లే మయుడి వంశీయులు, మయా జాతీయులుగా తమను నేటికీ చెప్పుకుంటారు. దక్షిణ మెక్సికో, గ్వాటిమాలా, బెలిజె, పశ్చిమ ఎల్ సాల్వడార్, హోండురాస్ ప్రాంతాలలో ఈ మయా ప్రజలు నేడు అధికంగా జీవిస్తున్నారు.

గ్వాటిమాలా కు చెందిన ఓ మయా జాతీయురాలు సంప్రదాయిక వస్త్రధారణతో

దైవజ్ఞానాన్ని మానవ విజ్ఞానానికి అనుసంధానించే మధ్యవర్తిగా భారతీయ శాస్త్రగ్రంథాలు మయుణ్ణి చిరస్మరణీయుణ్ణి చేశాయి. కాగా, అమెరికా ఆదివాసీ ప్రజలు తమను మయాప్రజలుగా పిలుచుకుని మయుణ్ణి శాశ్వతుణ్ణి చేశారు.

సూర్యుడి గురించి తొలి ఆలోచనలు చేసిన దీర్ఘతముడిని చర్చించే సమయంలో, సూర్యసిద్ధాంత పరివ్యాపకుడైన మయుణ్ణి స్మరించుకోవటం సందర్భోచితం.

కళింగ దాకా ఋగ్వేద ప్రజల విస్తరణ

పంజాబ్ నుండి బెంగాల్ దాకా గంగాతీరానికి ఋగ్వేద ప్రజలను పరివ్యాపింప చేసినవాడు దీర్ఘతముడు. దీర్ఘతముడి తాతగారు బ్రహ్మమానస పుత్రుడైన అంగీరసుడు. ఆర్యగణాల విస్తరణకు నాయకత్వం వహించినవాడుగా ఋగ్వేదంలో కనిపిస్తాడు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి జనావాసాల విస్తరణకు ప్రధాన కారణం జనాభా పెరుగుదల, భూమికొరత, ఆహారం కొరతలు కారణాలు. ఈ కొరత వల్లే వంశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. దేవతలు–పణులు మధ్య జరిగిన యుద్ధం ఆర్థిక విభేదాలను సూచిస్తే, దేవతలు–అసురులు మధ్య జరిగిన యుద్ధం (అభి)మతపరమైన విభేదాలను సూచిస్తుంది.

సింధు, పంజాబ్ ప్రాంతంలోని (పంచ+ఆప) ఐదు నదుల పరిధిలో మాత్రమే ఆర్యులు ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వారు త్వరలోనే గంగ–యమునా నదుల పరిసర పచ్చికబయళ్ళకు, అలాగే ఆధునిక గుజరాత్, సింధ్ ప్రాంతాలకు అంగీరసుని కాలంలోనే విస్తరించారు. ఈ పరివ్యాపనం ఋగ్వేద కాలంలోనే జరిగిందనటానికి దీర్ఘతముడి జీవితంలోని సంఘటనలే తార్కాణం.

అంగీరసుని కుమారుడు ఉతథ్యుడు యజ్ఞకార్యక్రమాలకు పురోహితుడిగా వ్యవహరిస్తూ, కొత్త ప్రాంతాల్లో వేదసంస్కృతిని పరి వ్యాప్తి చేశారు. మాంధాత (అయోధ్య) ప్రభువుని శిష్యుడిగా చేసుకుని రాజధర్మాన్ని ఉపదేశించాడు. ఇదే ఉతథ్యగీతగా ప్రసిద్ధి పొందింది.

ఉతథ్యుడి కొడుకు దీర్ఘతముడు. దీర్ఘతముడు పుట్టుగుడ్డి కాదని, దీర్ఘతముడంటే సూర్యుడికి మరో పేరు కావచ్చనీ మనం మొదటి సంచికలోనే వివరంగా చర్చించాం. అతన్ని గంగా ప్రవాహంలోంచి బలి అనే ప్రభువు కాపాడాడు. ప్రత్యుపకారంగా అతనికి 5గురు పుత్రుల్ని తన విద్యతో ప్రసాదించగా వాళ్లు అంగ, వంగ, కళింగ, పుండ్ర, సుంహ రాజ్యాలను స్థాపించారన్న కథను బట్టి కళింగ దాకా ఋగ్వేద ప్రజలు విస్తరించారని అర్థం అవుతోంది. ఈ విస్తరణ ఋగ్వేద కాలంలోనే జరిగింది. అయోధ్య, మిథిలా, వైశాలి, అంగ, వంగ, కలింగ, పుండ్ర, సుహ్మ ప్రాంతాల వరకు దీర్ఘతముడి ప్రభ వ్యాపించిందని కూడా తెలుస్తుంది.

వేద హరిశ్చంద్రుడు తన పుత్రుడికి మారుగా శునశ్శేపుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడటం, ఆ శునశ్శేపుణ్ణి విశ్వామిత్రుడు దత్తత తీసుకోవటం ఈ కథంతా అందరికీ తెలిసిందే! కావ్య హరిశ్చంద్రుడు సత్యవాది. సత్యం కోసం రాజ్యాన్ని భార్యాపిల్లల్ని త్యాగం చేసిన ధన్యజీవి. కాగా, వేదహరిశ్చంద్రుడు దేవుడి కిచ్చిన మాటనే తప్పి, అబద్ధాలకోరుగా ముద్రపడ్డాడు. అన్యాయంగా పరాయివాడి పిల్లవాణ్ణి చంపబోయాడు కూడా!

ఈ శునశ్శేపుడు దీర్ఘతముడికి సమకాలికుడు. శునశ్శేపుని దత్తతను వ్యతిరేకించిన విశ్వామిత్రుడి పుత్రుల్లో ‘ఆంధ్ర’ అనే వాడి సంతతే ఆంధ్రులయ్యారని ఐతరేయబ్రాహ్మణం ఇస్తోన్న కథనం. మొత్తం మీద మన పూర్వీకుడైన ఆంధ్రుడు, ఈ దీర్ఘతముడు సమకాలికులని గ్రహించాలి. ఋగ్వేద ఆర్య సంతతికి సమాంతరంగా దక్షిణాదిన ఆంధ్రులున్నారు, కానీ, వారు ఆర్య సంస్కృతిని స్చీకరించలేదు, అందువలన అంధ్రులపట్ల చిన్నచూపు, శాపగ్రస్థులన్న ముద్ర ఆనాటి నుంచీ ఉన్నాయి.

ఆ కాలానికి వర్ణవ్యవస్థ కూడా బలంగా వేళ్లూనుకుని ఉంది. ఎంత ప్రయత్నించినా విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాలేక పోయాడు. శునశ్శేపుడు క్షత్రియుడూ కాలేకపోయాడని ఈ కథలు చాటి చెప్తున్నాయి. ఈ శునశ్శేపుడే తరువాతి కాలంలో దేవరాతుడిగా ప్రసిద్ధిపొందాడు.

ఋగ్వేద కథనాలను బట్టి మహర్షులు జాతి వ్యాపనానికి నాయకత్వం వహించారన్నది స్పష్టం. భరతుల్ని శుతుద్రీ నది దాటించటానికి విశ్వామిత్రుడు నాయకత్వం వహించి చేసిన నదీస్తుతి “విశ్వామిత్ర నదీసంవాదం” పేరుతో ఒక నృత్య రూపకంలా సాగుతుంది ఋగ్వేదంలో! అలాగే, దీర్ఘతముడూ తన జ్ఞానంతో మార్గదర్శనం చేసి ఉండవచ్చు. అనేక సామ్రాజ్యాలు అవతరించటానికి కారకుడూ అయి ఉండవచ్చు.

దీర్ఘతముడికి కళ్ళు తిరిగి వచ్చాయి

ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఏ జన్మలో ఎవరికి ఏ అపకారం చేశాడో అంటాం చూశారా.. దీర్ఘతముడి కథలన్నీ అలా అల్లినవిగానే కనిపిస్తాయి. వ్యక్తిత్వ హననం ఎక్కువగా కనిపిస్తుంది. మత్స్యపురాణంలో దీర్ఘతముడు తన తమ్ముడి కోడలు గౌతమిని చెరచబోయాడన్న కథ ఉంది. ఆవిడే ఈ ముసలోణ్ణి ఓ పెట్టెలో కుక్కి నదిలోకి విసిరేయించిందని కూడా ఉంది.

దీర్ఘతముడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రార్థన చేసి తిరిగి చూపు పొందాడని మరో కథనం ఉంది.

అధర్వణ వేదం మరో అడుగు ముందుకు వేసి మంత్ర ప్రభావం గుడ్డివాణ్ణి చూడగలిగేలా చేస్తుందని చాటటానికి ఈ దీర్ఘతముని కథను ఉపయోగించుకుంది. కళ్ళు తిరిగివచ్చాక ఏ గౌతముని భార్యను చెరచబోయాడో ఆ గౌతముడి పేరునే పెట్టుకుని కొన్ని ఋక్కులు వ్రాశాడని డా|| కుణ్హణ్ రాజా పేర్కొన్నారు.

దీర్ఘతముడి ద్వారా ఒక దాసీ స్త్రీకి పుట్టాడన్న కక్షివంతుడు తనను దీర్ఘతముడి పుత్రుడుగానే చెప్పుకున్నాడు. ఈ కక్షివంతుని కుమార్తే ‘ఘోష’ పేరుతో ఋగ్వేదంలో ప్రసిద్ధి చెందిన మహిళ!

దేవతల గోవు అయిన కామధేనువు పేరు ‘సురభి’. ఈ సురభి దీర్ఘతముని నుదురు వాసన చూడగానే అతనికి తిరిగి కళ్లొచ్చాయనే కథనం కూడా ఉంది.

ఈ కామధేనువు పుత్రుడు స్వయంగా వచ్చి దీర్ఘతముడికి సంతాన సాఫల్య విద్యను ప్రసాదించాడనే కథనం గురించి మనం మొదటి అధ్యాయంలోనే చెప్పుకున్నాం!

అసూయాగ్రస్థుల అసత్య ప్రచారం

బలి ప్రబువుగారి రాణికి సంతానం కలగాలంటే దీర్ఘతముడు తన దేహానికి తేనె ఉప్పు పట్టించి నాలుకతో నాకమన్నాడని, అతని మర్మస్థానం దగ్గరకొచ్చేసరికి రాణీ సుధేష్ణాదేవి తట్టుకోలేక వాంతి చేసుకుందనీ, నువ్వు వాంతి చేసుకున్న భాగంలో నీకు పుట్టబోయే బిడ్డ మర్మావయవం పోయిందని దీర్ఘతముడు అన్నాడని ఇంకో కథనాన్ని కూడా జుగుప్సాకరంగా ప్రచారం చేశారు. అంటే, అంగ వంగాది 5 రాజ్యవంశ ప్రతిష్ఠాపకులు మగతనం లేనివారని హేళన చేయటానికే ఈ కథని పంచాప (పంజాబ్)ప్రాంతం ఋషులే ప్రచారం చేశారని అర్థం అవుతోంది. ఇదంతా సమకాలీనులు, అసూయాగ్రస్థులు చేసిన పనే కావచ్చనేది కుణ్హణ్ రాజా అభిప్రాయం.

కవిత్వంలో నిలుపుకున్న వ్యక్తిత్వం

దీర్ఘతముని సమకాలికులు అతని శేముషీ కృషిని తక్కువ చేసి చూడటానికి, పెద్దగా పట్టించుకోకపోవటానికి డా|| కుణ్హణ్ రాజా ఒక కారణాన్ని పేర్కొన్నారు. సింధ్, పంజాబ్ లలో స్థిరపడిన ఋగ్వేద ప్రజలకు, ముఖ్యంగా మహర్షులకు బెంగాల్ వరకూ విస్తరిస్తూ వెళ్లిన ఋగ్వేద ప్రజల పట్ల చిన్న చూపు ఉండేదని, తక్కువగా చూసేవారని, ఎవరు అంగ, వంగదేశాలు వెళ్లి తిరిగి వస్తే వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చేదని కుణ్హణ్ రాజా ‘అస్య వామస్య’ అనే పుస్తకంలో కొన్ని ఉదాహరణలు అందించారు. ఏదేమైనా, ఈ తూర్పుయాత్రకు నడిపించినవాడు కావటాన అతన్ని ఒక విధంగా శీల రహితుడిగా పాపిగా చిత్రించారన్నది నమ్మదగిన సత్యం.

దీర్ఘతముడి వ్యక్తిత్వాన్ని అతని రచనలే చాటుతాయి. తనను ఎవరు ఎన్ని నిందించినా తన మీద ఎన్ని నీలాపనిందలు వేసినా భవిషత్తరాలవాళ్లైనా తన భావాల్ని అర్థం చేసుకుంటాని ఆశిస్తాడు. అగ్నిని స్తుతిస్తూ, 140వ సూక్తంలో వివిధ వర్గాల పట్ల ఈ సమాజానికి గల బాధ్యతను గుర్తు చేస్తాడు.

వేదిషద్ ప్రియధామాయ సుద్యుతె ధసిమ్ ఇవ ప్ర భరా యోనిమగ్నాయె
వస్త్రెణేవవాసయా మనమనా శుచిమ్ జ్యోతిరథమ్ శుక్రవర్ణమ్ తమోహనమ్||

కవి అంటే మేధావి, శాస్త్రవేత్త, పండితుడు అని! కవి అనగానే గౌరవించాలనే పిలుపు ఇచ్చినవాడు దీర్ఘతముడు. జ్ఞానాగ్ని, విద్యాశక్తి కలిగిన వ్యక్తులవలనే ఈ సమాజం నిలబడుతోంది, పోషించబడ్తోంది. కాబట్టి ఈ మేథావులకు తిండి, బట్ట ఇల్లు, ప్రయాణించేందుకు వసతి కల్పించాలన్నాడు దీర్ఘతముడు. అల్లసాని పెద్దన ఊయలమంచం, నిరుపహతి స్థలం, పరిచారికలు కావాలని కోరాడు. కానీ దీర్ఘతముడు కాసింత గౌరవప్రదమైన జీవితం మాత్రమే కోరాడు. కవిని బతికించండి-కవి.. లోకాన్ని బతికిస్తాడనేది అతని నినాదం.

ఇదే సూక్తంలో కవిని కన్న తల్లితో పోలుస్తాడు దీర్ఘతముడు: తల్లి, దత్తత తీసుకున్న తల్లి ఆ ఇద్దరూ పిల్లవాణ్ణి అన్ని కష్టాల నుండి కాపాడాలని ప్రయత్నిస్తారు. పిల్లవాడు ఇద్దరి తల్లుల వైపు పాలకోసం ఆశతో చూస్తాడు. కవి కూడా సాధారణ ప్రజల పట్ల అదే విధమైన శ్రద్ధ చూపుతారు, వారు సమాజాన్ని రక్షించి, పోషించి, జ్ఞానంతో వెలిగిస్తారని!

దీర్ఘతమునిది విద్య వైజ్ఞానికవేత్తలు జనించిన అంగీరస వంశం. అంగీరసుల్లో చాలా ప్రసిద్ధుడు దీర్ఘతముడు. బ్రహ్మమానస పుత్రుడైన అంగీరసునికి 9 మంది పుత్రులు, 8 మంది కుమార్తెలు. వారిలో అందరికంటే పెద్దవాడైన ఉతథ్యుని కుమారుడు దీర్ఘతముడు. ఋగ్వేదం 1.160.6 ప్రకారం తన 70వ యేట దీర్ఘతముడు మరణించాడు. 70- యేళ్ల వయసంటే చిన్నవయసే! నిజానికి పరిణతి పొందిన ప్రయోగాలు చేయటానికి తగిన ఆ వయసు వచ్చేసరికి ఆయన చనిపోవటం మన దురదృష్టం.

అతని చరిత్ర అంతా కలగా పులగంగా విద్వేష పూరితంగా రికార్డయి ఉంది. మహాభారతం కూడా అతనికి న్యాయం చేయలేదు. అతనిదే పాపం అన్నట్టుగా అతని జీవిత చరిత్రను పేర్కొంది.

ఈ దేశ ఘనతకు మూలపురుషుడైన భరతుడికి పురోహితుడిగా భరతుల్ని నడిపించినవాడు, కళింగ దాకా ఆర్యసంస్కృతిని వ్యాపింపచేసినవాడు. స్వయంగా యోథుడు. రథికుడు. తల్లి గర్భాన ఉండగానే జ్ఞాన ధర్మాలను గ్రహించినవాడుగా ప్రసిద్ధి పొందిన వాడు. ఈఅతన్ని జ్ఞానంతో ఎదుర్కోలేని వాళ్లు వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. వీళ్లు కల్పించిన కథలే గాథలై చరిత్రలో నిలిచిపోయాయి.

ఇప్పటి మనం అధిక జ్ఞానవంతులం కదా.. బియ్యంలోంచి రాళ్ళను ఏరినట్టు అవాస్తవాల్ని గాలిస్తే, జ్ఞానానికి మూలాలు దొరుకుతాయి. ఇప్పటి మన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో చూస్తే చాలా స్వల్పమైనవిగా దీర్ఘతముని పరిశోధనలు కనిపిస్తాయి. కానీ 12 నెలలు, 7 వారాలు 365 రోజుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని ప్రతిపాదించిన వేలయేళ్ళనాటి ఒక శాస్త్రవేత్త శేముషీ కృషిని తక్కువ అంచనా వెయ్యలేము కదా!

అతని పట్ల ఎంత వ్యతిరేక భావనతో కుళ్ళు కథలు సృష్టించినా తిరిగి కళ్ళు తెచ్చుకున్నాడన్న ఒక్క సత్యం చాలు, దీర్ఘతముడు పుట్టి గుడ్డి కాదని నిరూపించటానికి! టానికి. గుడ్డిగా పుట్టినంత మాత్రాన ఉతథ్యుడు లాంటి రాజనీతి, సమాజ ధర్మ్నాలెరిగిన మహా పండితుడు తన కొడుక్కి ‘పుట్టుగుడ్డి’ అనే పేరుపెడతాడంటే నమ్మలేము.

మనం మొదటే నిరూపించకున్నట్టు దీర్ఘతముడంటే సూర్యుడే!

(సమాప్తం)

Exit mobile version