Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేహ రథం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘దేహ రథం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


సర్వాంగ సుందర సజీవ
దేహ రథానికి
దశేంద్రియాలు దివ్యాశ్వాలు!
మనోబలాలు పఠిష్ఠమైన పగ్గాలు!
బుధ్ధి మహా సారథి!
జ్ఞానం దిక్సూచి సాధనం!
మానవ ధర్మం ప్రశస్త కేతనం!
లక్ష్యం
జన్మపరమార్థ సంపాదనం!

దారులను తప్పించే
దారులు, తీరులూ ఎన్నో ఎదురైనా
ధ్యేయంపై అచంచల ధ్యానం
పయనానికి ప్రధానం!

ప్రతి విఘ్నం
క్రొత్త ప్రారంభానికి శుభ లగ్నంగా,
ప్రతి పతనం
నవ్యోత్థానానికి ఆలంబనగా,
ప్రతి యత్నం
లక్ష్య సాధక యజ్ఞంలా
సాగే ప్రయాణానికి
విజయం తథ్యం నిత్యం!
ఇది రుజువైన సత్యం!

అంతర్గత దుర్గుణాల
దూకడును దమిస్తూ,
బాహ్య అవరోధాల
తాకిడిని ప్రతిఘటిస్తూ
గమ్యానికి చేరే గమనం
విశిష్టం! ఘనం!
విజయాభిలాషులకు
ఉన్నత ఉదాహరణం!

ప్రమాదాల పద్మ వ్యూహాలను,
కష్టాల చక్ర వ్యూహాలను,
సంక్షోభాల మకర వ్యూహాలను
నిరాశల మండల వ్యూహాలనూ
ధైర్యంగా ఛేదిస్తూ
ఆశంసిత ఫలాన్ని అందుకునే యానం
అనుసరణీయం!
అభినందనీయం!

క్షణం క్షణం
వర్తమానాన్ని గతంగా మార్చుకుంటూ
సదా ముందుకే సాగే కాలంతో పాటు
రథ యాత్ర భావి దిశగా కదలవలసిందే!

ప్రకృతి నిర్ణయానుసారం
ఒక నిర్దేశిత స్థలం వద్ద
తనువు తేరు
తానున్న లోకాన్ని త్యజించి
ఆత్మ రూపంలో
అన్య లోకానికి వెడలే వేళ
సత్కీర్తి కిరీట ధారియై
తెరలడం ఉన్నతం!
అమరత్వంతో అలంకృతయై
తరలడం ఉత్తమం!

Exit mobile version