[డా. మామిడాల శైలజ గారు రచించిన ‘డెలివరీ బాయ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
రాత్రి పదకొండు దాటి ఇరవై నిమిషాలవుతోంది. నగరానికి చివర్లో ఉన్న ఆ లేన్‌లో నిశ్శబ్దం నెమ్మదిగా పాకుతోంది. పక్క ఇళ్లలో టీవీ శబ్దాలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. కుక్కలు కూడా అరవడం మానేశాయి. వాటికీ అలసట వచ్చిందో, లేక ఈ రాత్రికి ఏమీ మిగలలేదో తెలియదు. రెండు వీధి దీపాలు మాత్రం మినుకు మినుకు మంటూ, తమ ఉనికిని గుర్తు చేస్తూ వెలుగుతున్నాయి.
ఆ భవనం రెండో అంతస్తులోని చిన్న గదిలో ఆర్వి ఒంటరిగా ఉంది. సివిల్స్ కోచింగ్ తర్వాత, తన స్నేహితురాలు శ్రీనితతో కలిసి చదువుకోవడానికి తీసుకున్నగది అది. ప్రస్తుతం శ్రీనిత ఊరెళ్లింది. గది నిండా ఉన్న నిశ్శబ్దం, ఆమె లేనితనాన్ని కాదు ఆర్వి లోపల పెరుగుతున్న ఖాళీని గుర్తు చేస్తోంది.
గదిలో ఒక మూలలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు గుట్టలుగా ఉన్నాయి. కొన్ని తెరిచి ఉన్నాయి, కొన్ని మూసి ఉన్నాయి. గోడల మీద ప్రకృతికి సంబంధించిన చిత్రాలు వేలాడుతున్నాయి. పచ్చని కొండలు, ప్రవహించే నదులు, నీలిఆకాశం. గోడల రంగు వెలిసిపోయి ఉంది. నిజానికి, ఆ గది మొత్తమే వెలిసిపోయినట్టు ఆమెకు అనిపిస్తోంది. బెడ్ మీద నుంచి లేచి, కిటికీ దగ్గర నిలబడి బయటికి చూసింది. బారుగా ఉన్న రోడ్డు. వీధి దీపాల కింద విస్తరించిన చీకటి. ఆమె కళ్ళు ఒకే చోట నిలబడటం లేదు. చూపులు కదులుతున్నాయి. కానీ హృదయంలోని ఆవేదన మాత్రం గడ్డకట్టుకుపోయింది.
ఆమె అక్కడ ఒక జీవం లేని మనిషిలా నిలబడి ఉంది. ఆమె మనసు ఏవో శూన్యాలను తడుముకుంటూ, అధోలోకపు అంచులను పరికిస్తున్నట్టుగా ఉంది. వెనక్కి తిరిగే దారి ఎక్కడుందో తెలియని చీకటి మార్గంలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది.
అమ్మానాన్నల తర్వాత, అంత సన్నిహితంగా తన మనసుకు చేరిన వ్యక్తి అతడే. అతనిలోతన తల్లిలోని మమతను చూసింది. తండ్రిలోని రక్షణను అనుభూతి చెందింది. అతడు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేనట్టుగా అతని దగ్గరయింది. అతనితోనే తన జీవితం పూర్తవుతుందని నమ్మింది.
కానీ ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా తన గుండెను బద్దలు కొట్టి, ఆ శబ్దాలు కూడా వినిపించనంత దూరంగా వెళ్లిపోయాడు. తను మాత్రం అతడు వదిలి వెళ్లిపోయిన ఆనవాళ్లను తడుముకుంటూ, జీవించలేక, బతకలేక రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ, రోజూ రోజూ నరకయాతనను అనుభవిస్తోంది.
చాలాసేపటి తర్వాత కిటికీ దగ్గర నుంచి వెనక్కి తిరిగి, కుర్చీ మీద కూర్చుంది. రెండు మోకాళ్లు పైకి మడిచి, పాదాలను కుర్చీ మీద పెట్టుకుని, రెండు చేతులను చుట్టూ బిగించి పట్టుకుంది. ఆమెకు ఏడవాలని ఉంది. తనివితీరా గుండెలవిసేలా రోదించాలని ఉంది. కానీ గుండె లోతుల్లో పూడుకుపోయి దావనలంలా మరిగిపోతున్న వేదన బయటికి రానంటోంది. ఆమెకి ఎవరిమీద కోపం లేదు. ఎవరి మీద ఫిర్యాదు లేదు. ఆవేశం కూడా లేదు.తన మీద తనకే ఒక రకమైన వైరాగ్యం. జ్వలించడానికి ముందు లోలోపల మరిగే లావాలా, ఆమె హృదయం అతలాకుతలం అవుతోంది.
టేబుల్ మీద మొబైల్ ఉంది. చాలాసేపటి నుంచి అచేతనంగా ఉంది అది ఆమె లాగే. దాన్ని చేతుల్లోకి తీసుకుంది. స్క్రీన్ ఆన్ అయింది. కొన్ని క్షణాలు ఏమీ చేయకుండా అలాగే చూసింది. తర్వాత గూగుల్ ఓపెన్ చేసింది. వేళ్లు టకటక టైప్ చేశాయి
“How to die immediately without any pain”
స్క్రీన్ మీద ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపించసాగాయి. ఆర్వి శీర్షికలు మాత్రమే చూసింది. మందుల పేర్లు, రసాయన పదార్థాలు, మోతాదులు. ఒక లింక్ ఓపెన్ చేసింది. తర్వాత ఇంకొకటి. సమయం గడుస్తున్నట్టే అనిపించలేదు. గడియారంలో నిమిషాల ముల్లు కదులుతుందన్న విషయమే ఆమెకు తెలియలేదు.
చివరికి ఒక పదం దగ్గర ఆమె చూపు ఆగింది. Pesticide. Weed killer. ఆమె మనసులో ఏదో కదిలింది. అది భయం కాదు. ఉపశమనంలాంటి భావం. ఆన్‌లైన్ యాప్ ఓపెన్ చేసింది. సెర్చ్ బాక్స్‌లో అదే టైప్ చేసింది. ఫోటోలు కనిపించాయి. బాటిళ్లు, ప్యాకెట్లు.
ఒక్క దానిపై క్లిక్ చేసింది. Buy Now.
ఆ బటన్ మీద ఆమె వేలు ఒక క్షణం ఆగింది. వేలు కదిలింది. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది. ఆర్వి మొబైల్‌ను టేబుల్ మీద పెట్టింది. గదిలో మళ్లీ అదే నిశ్శబ్దం.
అరగంట తర్వాత వీధిలోకి ఒక బైక్ మలుపు తిరిగి వచ్చింది హెడ్లైట్ కాంతి రెండు క్షణాలు చీకటిని చీల్చింది. ఇంజన్ ఆపిన శబ్దం నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది.
డెలివరీ బాయ్ ఫోన్ చూసుకున్నాడు అడ్రస్ మరోసారి కన్ఫామ్ చేసుకొని మెట్లు ఎక్కుతూ ఆలోచించాడు. ఈ టైమ్‌లో ఈ ఐటెం అవసరం ఎందుకు పడింది? ఇది పొలాలు ఉన్న గ్రామం అయితే కాదు, నగర శివారులలో ఉన్న ఇల్లు. రెండవ అంతస్తు చేరి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల ఎలాంటి కదలిక లేదు. మళ్లీ బెల్ నొక్కాడు అడుగుల శబ్దం. తలుపు తెరిచింది 22 ఏళ్ల అమ్మాయి. ఆమె కళ్ళు లోతుగా ఉన్నాయి, నిర్వేదంగా చూస్తున్నాయి. “డెలివరీ” అన్నాడు. ప్యాకెట్ తీసుకొని డోర్ మూసేయబోయింది. “మేడం కాస్త మంచినీళ్లు దొరుకుతాయా?” ఆర్వి అతడిని చూసింది. “నీళ్లు” అన్నాడు. ఆమె తలుపు సగం తెరిచి లోపలికి వెళ్ళింది. అతడు లోపలికి అడుగు పెట్టాడు. టేబుల్ పై చెల్లాచెదురుగా ఉన్న పుస్తకాలు, మంచం మీద సర్దని దుప్పటి. ఆమె గ్లాస్ ఇచ్చింది. అతడు తాగకుండా అలాగే పట్టుకున్నాడు.
“మీరు స్టూడెంటా?”
“అవును” అంది అసహనంగా
“ఏ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు?” పుస్తకాలు చూస్తూ అన్నాడు.
“మీ పని అయిపోయింది కదా! ఇక వెళ్లొచ్చు” మీరు తలుపు వైపు చేయి చూపిస్తూ అంది.
“మేడం ఒక్క నిమిషం.. ఈ మందు అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు ఇది మీకు ఎందుకు?”
“ఏం మీకు ఇవన్నీ అవసరమా? మీ పని పూర్తయింది.. వెళ్ళండి”
“మేడం మీరేదో డిప్రెసెడ్ గా కనిపిస్తున్నారు అని అడిగాను. మీరు చనిపోవాలని అనుకోవడం లేదు కదా! అయితే ఎందుకు?”
“బతకడానికి కారణం లేక” అంది కోపంగా.
“ఒక్క విషయం చెప్తాను. ఈ మందు తాగితే వెంటనే చావు రాదు. శరీరం ముందు పోరాడుతుంది. ఆ పోరాటం భయంకరంగా ఉంటుంది.”
ఆమె కళ్ళు ఒక్కసారిగా మూసుకున్నాయి. భయంతో కాదు అసహనంతో.
“నేనేమైతే మీకెందుకు? అసలు మీరు ఎవరు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్..”
“ఈ గడ్డి మందు మీరు చనిపోవడానికి ఇవ్వలేదు. మీ ఇంటి తలుపులు తెరిపించడానికి మాత్రమే..” కులాసాగా అన్నాడు అతడు.
“అంటే ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు”.
“నేను డెలివరీ బాయ్ కాదు. ఆన్లైన్ మెంటల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేస్తాను. సూసైడల్ టెండెన్సి ఉన్న వాళ్ళ డేటా ఆటోమేటిక్‌గా మా దగ్గరికి వస్తుంది.. మీరు చనిపోవాలనుకుని సెర్చ్ చేసినప్పుడే నీ పేరు, మా లిస్టులో పడిపోయింది. నీ సెర్చ్ హిస్టరీ మొత్తం నా దగ్గర ఉంది. నిన్ను ట్రాక్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది.”
మాట రాలేదు ఆర్వికి.
“చూడు ఆర్వి. మాది మారుమూల కుగ్రామం. ఈ గడ్డిమందుతో చనిపోయిన వాళ్లను నేను చాలామందిని చూశాను. అది కూడా చిన్న చిన్న కారణాలతో.. అందులో ఒకరు నా చెల్లి. నీ వయసే. అచ్చు నీలాగే ఉంటుంది. చదువు పేరుతో పట్నానికి వచ్చి ప్రేమలో పడి మోసపోయింది. ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజులు నరకం చూసి మరణించింది” అతని కళ్ళు తడి అయ్యాయి.
ఆర్వి అచేతనంగా నిలబడిపోయింది.
“నువ్వు కూడా నాకు చెల్లివే. ఒక విషయం చెప్తా విను. చచ్చిపోతే ఆ బాధ పోదు. అది ఇంకొకరికి బదిలీ అవుతుంది. ఇప్పటికీ మా అమ్మ లేవగానే ‘ అను.. కాలేజీకి టైం అవుతుంది లే తల్లి’ అని పిలుస్తుంది. నాన్న అయితే మొబైల్ ఎప్పుడు మోగినా ‘ చెల్లి చేస్తుంది’ అంటూ పరిగెడతాడు.”
వింటున్న ఆమె శరీరం ఒక్కసారిగా వణికింది. తన కుటుంబం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
“నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులు చావరు. కానీ రోజు చస్తూ బతుకుతారు.. నీ బాధ వల్ల వాళ్లు చావాల్సిన అవసరం ఏముంది? ఎవరి బాధ అయినా బాధే కదా..”
“అసలు మీరెవరు? నాకెందుకు ఇవన్నీ చెబుతున్నారు..?”
“నేను నీ అన్నని. నా ప్రాణ సమానమైన చెల్లిని కోల్పోయి ఆమె జ్ఞాపకాల్లో జీవిస్తున్న నాకు నీ రూపంలో మరో చెల్లి దొరికింది. ఒక్కసారి ఆలోచించు చెల్లి. ఎంత పెద్ద సమస్య అయినా చావు మాత్రం పరిష్కారం కాదు..”
అంతే ఆర్వి ఒక్కసారిగా బరస్ట్ అయింది. కుర్చీలో కూలబడి అప్పటివరకు లోలోపల దహించి వేస్తున్న దావాగ్నిని కన్నీళ్ళ రూపంలో వర్షించసాగింది. ఆమె దుఃఖం ఉపశమించే దాకా అతడు అలాగే నిలబడ్డాడు. చాలాసేపటికి ఆమె కళ్ళు తుడుచుకొని లేచి నిలబడింది.
“అన్నా.. ఈ బాటిల్ తీసుకెళ్లండి”
అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది.. కిందికి వెళ్తూ అనుకున్నాడు.. ‘నువ్వు బతికింది నువ్వు చనిపోవాలని సెర్చ్ చేసినందుకే.. ఈ రాత్రి నీ ప్రాణాన్ని కాపాడింది మనిషి కాదు ఆల్గోరిథమ్. అలాగే అనాథనైన నేను నీ మనసు మార్చడం కోసం ఒక చెల్లిని సృష్టించాను. కానీ నీ రూపంలో ఒక కొత్త చెల్లిని దక్కించుకున్నాను..’
*అయిపోయింది*
డాక్టర్ మామిడాల శైలజ
సహాయ ఆచార్యులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంగశాయిపేట, వరంగల్.
