Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డిమెన్షియా

[మానస రెడ్డి గారు రచించిన ‘డిమెన్షియా’ అనే కవితని అందిస్తున్నాము.]

నేను శోకంలో మునిగిపోయాను,
మౌనం నన్ను పూర్తిగా కప్పేసింది.
ఇప్పుడు నేను
తెరవని పుస్తకంలా మారిపోయాను
పేజీలు ఉన్నా
అక్షరాలు చదవలేని స్థితి..
ప్రతి ఉదయం
అద్దం ముందు నిల్చొని
నన్ను నేనే వెతుక్కుంటాను..
ఈ ముఖం నాదేనా?
అనే సందేహమే
నా రోజు మొదటి జ్ఞాపకం.
ఒకప్పుడు మనం
అత్యంత దగ్గరగా ఉన్నాం –
అది నా గతం.
ఈ వర్తమానం మాత్రం
మాటలేని శూన్యం..
నిన్ను గుర్తుపడుతున్నాను,
ఊగే కుర్చీలో కూర్చుని
నిద్రలోకి జారిపోతున్న నిన్ను..
నీ పాదాలు నేలని తాకుతున్నాయి,
చేతులు కుర్చీని
చివరి ఆధారంలా బిగిపట్టుకున్నాయి.
ఓ నా ప్రియమైన వృద్ధుడా,
మన జీవితం ఒకప్పుడు
నవ్వులతో నిండిపోయేది.
ఇప్పుడు ఆ నవ్వుల స్థానంలో
మౌనం మాత్రమే మిగిలింది.
ఆలోచనల మరణమే
మనల్ని వేరుచేసింది.
నేను బ్రతికే ఉన్నాను.
కానీ
నేను నేనుగా లేను.
ప్రతి క్షణం
నన్ను నేను కోల్పోతున్నాను
నన్ను ప్రేమించిన వాళ్లు
నన్ను చూసి ఏడుస్తున్నారు.
వాళ్ల కళ్లలో నేను ఉన్నాను,
కానీ
నా మనసులో వాళ్లు లేరు
ఓ దేవుడా
మరణం ఒకసారే వస్తే సరిపోతుంది.
కానీ
ఈ డిమెన్షియా
ప్రతిరోజూ
నన్ను మెల్లగా చంపుతోంది.
మరిచిపోవడం శాంతి అనుకున్నాను
కానీ
నువ్వు నేర్పింది వేదన.
పేర్లు నన్ను వదిలేస్తున్నాయి,
ముఖాలు మసకబారుతున్నాయి..
నిన్న ప్రేమించిన మనుషులు
ఈ రోజు
అపరిచితులుగా నిలుస్తున్నారు.
మన పాత జీవితం
ఇక ముగిసింది.
నా జీవితం చిన్నదే కావచ్చు,
కానీ
నా వైపు నుంచి చూస్తే
నేను చాలా నేర్చుకున్నాను
మరిచిపోతూనే
మనిషిగా ఉండటం
ఎంత కష్టం అనేది.

Exit mobile version