Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేశ విభజన విషవృక్షం-33

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

స్లామీయులు ఎంత ప్రయత్నించినా.. భారతదేశం ఒక అరేబియా కాలేదు. ఒక పర్షియా కాలేదు. ఒక మంగోలియా కాలేదు. ఎందుకంటే.. ఇక్కడ ఆలోచనాపరులు, మేధావులు, రుషులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు తమ తలలు తెగ్గోసుకొనైనా సరే.. ఈ దేశాన్ని విదేశీ మూకల నుంచి రక్షించడానికి చివరి శ్వాస వరకూ శ్రమించారు.. శ్రమిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆలోచనాపరులు లేకపోయి ఉంటే.. ఈ దేశం పూర్తిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇస్లామిక్ దేశంగా అవతరించేదనడంలో సందేహమే లేదు. ముస్లిం రాజ ముష్కరులు ఎన్ని గోడలు కూల్చి వేస్తున్నా సరే.. ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టడం వల్లనే.. ఇవాళ ఈ దేశం ఈ మాత్రమైనా మిగిలింది. ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోవడం వల్లనే.. దేశాన్ని ముక్కలు చేయడం మీద కన్ను పడింది. అందుకే దేశం మూడు ముక్కలైంది. రాజా దాహిర్ సేన్ నుంచి విజయనగరంలో అళియ రామరాయలు దాకా ఈ విదేశీ మూకలకు ఎందరు బలైపోతున్నా సరే.. కొత్తగా మరొకరు పుట్టుకొస్తున్నారు. ఒక వీరుడి మరణం.. పది  వీరుల  జననం.. అన్నట్టుగా భారతీయ వీరుల గాథలు ఎప్పటికీ అంతం కావు. కాలేవు. వారి చరిత్రకు మసి పూసి మారేడుకాయ చేయాలని ఎంతగా చూసినా.. వీటిని మౌఖికంగానైనా ప్రజలకు తరతరాలు ప్రేరణ ఇస్తూనే ఉంటాయి.

ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క మార్గంలో దర్శనం చేశారు. రాముడు ధర్మ మార్గాన్ని అనుసరించాడు. కృష్ణుడు క్రియా యోగాన్ని అనుసరించాడు. బుద్ధుడు కర్మ మార్గాన్ని అనుసరించాడు. గురునానక్ జ్ఞాన యోగాన్ని అనుసరించాడు. గురు గోవిందుడు, ఆది శంకరులు, రామానుజులు తదితరులు భక్తి మార్గాన్ని అనుసరించారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే తప్ప వేర్వేరు కానే కాదు.

గురునానక్ నుంచి గురుగోవింద్ సింగ్ దాకా సిక్కు మత గురువులు పది మంది కూడా జ్ఞానులు, మేధావులు, అన్నింటికీ మించి యోధులు.. ఔరంగజేబ్ నుంచి తమను రక్షించాలని కాశ్మీరీ హిందువులు వచ్చి అడిగినప్పడు తన తండ్రి తేజ్ బహదూర్‌ను ‘నిన్ను మించిన త్యాగధనుడు’ ఎవరని పంపించిన తొమ్మిదేండ్ల గురు గోవిందుడి కంటే గొప్పవాడు ఇంకెవరున్నారు.. తండ్రి ఔరంగజేబ్‌ను ఎదిరించడానికి వెళ్తూ.. ఈ తొమ్మిదేండ్ల బాలుడికే గురుపీఠాన్ని అప్పగించి వెళ్లాడు. ఆ తొమ్మిదేండ్ల బాలుడే.. సిక్కుల రూపురేఖలనే మార్చేశాడు. పిల్లులుగా ఉన్నవారిని పులులుగా మార్చాడు. ఒక్క పంజాబ్‌లో మాత్రమే కాదు.. ఉత్తర భారతదేశమంతటా చైతన్య స్రవంతిని ప్రవహింపజేశాడు. ప్రజలను అత్యంత దారుణమైన కష్టాలలో ముంచెత్తుతున్నప్పటికీ మొఘలుల మీద కానీ, ఇస్లాం మీద కానీ గురు గోవిందుడు ద్వేషం పెంచుకోలేదు. అలా అని చూస్తూ ఊరుకోలేదు. ఔరంగజేబ్ పరిపాలనకు సమాధి కట్టేందుకు సమస్త ప్రజానీకాన్ని సమీకరించాడు. ప్రతి ఒక్క పౌరుడిని ఒక యోధుడిగా మలిచాడు. సామాన్య ప్రజలను సైతం సాహస వీరులను చేశాడు.

గురుగోవింద్ సింగ్ చరిత్రను కాదని భారత దేశ చరిత్రను వేరుగా చూడటం సాధ్యమే కాదు. గురుగోవింద్ సింగ్ భాగవత పురాణాన్ని బాఖా జియో గా అనువదించాడు. కృష్ణావతారం, రామావతారాలను పంజాబీలో రచించాడు. అకాల స్తుతి రచించాడు. ఎంత జ్ఞాన భాండాగారం అంటే వర్ణించడానికి ఎలాంటి మాటలు కూడా సరిపోవు. గురుగ్రంథ సాహిబ్ రాగాల్లో ఉంటుంది. మన దేశంలో స్క్రిప్టింగ్ అనేది చాలా తక్కువ. మన ప్రధానమైన రచనా సంప్రదాయమే మౌఖిక సంప్రదాయం. రుగ్వేదం ఛందోబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పాడుకోవడం ద్వారా మనకు మనసులో అది జీవితాంతం నాటుకొని పోయి ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకున్న పాటైనా.. పద్యమైనా.. జీవితాంతం గుర్తుండి పోతుంది. అదే వచనంలో రాసింది రాసిన వారికే గుర్తుండదు. అందుకే పాట, పద్యం అన్నవి భారతదేశానికి జ్ఞాన సముపార్జనకు ప్రధాన పరికరాలయ్యాయి. గురుగోవింద్ కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. ఇంగ్లీష్‌లో రీ టెల్లింగ్ మెథడాలజీ అనే పద్ధతి ఉన్నది. అంటే చెప్పినదాన్ని సరికొత్తగా చెప్పడం.. గురుగోవింద్ సింగ్ కూడా అదే చేశాడు. గురు గ్రంథ్ సాహిబ్ కూడా అలా అద్భుతంగా ఆవిష్కారమైందే. తాను నడుచుకుంటూ వెళ్తుంటే.. అప్రయత్నంగా వచ్చిన పదాలను అతని శిష్యులు నోట్ చేసి పెట్టారు. జీవితమంతా సంక్షోభమే. సమస్యలే. యుద్ధాలే.. కండ్ల ముందే తండ్రి చనిపోయాడు. నలుగురు కొడుకులూ చనిపోయారు. తాను జీవించింది కూడా కేవలం నలభై ఏండ్లు.. ఈ నలభై ఏండ్ల వయసులోనే.. ఎంత జ్ఞానాన్ని పంచాడు. ఎన్ని యుద్ధాలు చేశాడు.. ఎన్ని సామాజిక సంస్కరణలను తీసుకొచ్చాడు.. ఆశ్చర్యమేస్తుంది. తాను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలివ్వడానికి తన తండ్రి కానీ, తాను కానీ, తన కొడుకులు కానీ.. ఎవరూ కూడా క్షణం కూడా సంకోచించలేదు. ఇద్దరు కొడుకులు.. ఒకరి వయసు ఐదేండ్లు.. మరొకరు వయసు ఎనిమిదేండ్లు.. బతికుండగానే మెడ వరకు సమాధి చేసి తలలు నరికినా.. ఇస్లాంలోకి మారడానికి అణుమాత్రం అంగీకరించలేదు. గురు గోవిందుడు కొంచెం కూడా చలించలేదు. ఆయన గురించి ఏమని చెప్పేది.. కవి, సాధువు, స్కాలర్, అన్నింటికీ మించిన గొప్ప యోధుడు. ఫోర్ ఇన్ వన్. ఇలాంటి మహానుభావుడు మనకు వెతికినా కనిపించడు. ఇప్పుడు మన వారికి కనీసం ఈయన గురించి తెలియనైనా తెలియదు. ఆయన కొడుకులను సజీవంగా సమాధి చేసిన రోజున మన యువతీ యువకులు వాలెంటైన్ డే జరుపుకుంటారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది ఈ దేశానికి?

తొమ్మిదేండ్ల వయసులో గురుపీఠాన్ని స్వీకరించిన గురుగోవింద్.. పదేండ్ల కాలంలోనే.. అత్యంత సమర్థంగా, సర్వ స్వతంత్రంగా సిక్కు సమాజాన్ని పరిపాలించగలిగాడు. సిక్కు ధర్మావలంబులందరినీ ఏకతాటికి తీసుకొని రావడంలో గురుగోవింద్ సంపూర్ణ విజయం సాధించాడు. దీనికి తోడు.. తన ప్రజలను సంరక్షించుకోవడం కోసం సైనిక సంపత్తిని కూడా బాగా పెంచుకున్నాడు. అశ్విక, గజ బలాన్ని ప్రధానంగా పెంచుకున్నాడు. లక్షల సంఖ్యలో పదాతి దళం సిద్ధమైంది. మొదట ఆనంద్‌పూర్ పైకి దండెత్తిన భీమ్ చంద్‌ను ఓడించాడు. తరువాత మొఘల్ సామ్రాజ్యం నుంచి తన ప్రాంతానికి రక్షణ కల్పించడం కోసం రెండేడ్ల వ్యవధిలోనే నాలుగు కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. అనంద్, కేశ్, ఫతే, లోహ్ గఢ్ లను గురుగోవింద్ నిర్మించాడు. మొఘల్ సైన్యాలు, కొండ రాజులతో 1688 నుంచి 1707 వరకు మొత్తం 19 సంవత్సరాలలో 18 యుద్ధాలు చేశాడంటేనే ఆనాడు గురు గోవిందుడు ఏ విధమైన పరిస్థితుల మధ్యన సిక్కు సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత భయంకరమైన పరిస్థితులను చిన్న వయసు నుంచే ఎదుర్కొన్న ఒక వీరుడిని ముస్లిం చరిత్రకారులు మాత్రం ఔరంగజేబ్ కోణంలోనే చూశారు. అతడు పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించడం ద్వారా.. సిక్కులను యోధులుగా తయారు చేయడం ద్వారా సిక్కు మతాన్ని భ్రష్టు పట్టించాడని రాశారు. పర్షియన్ భాషలో ఉన్న ఈ రచనలను ఇంగ్లీష్ లోకి అనువదించిన ధవన్ పేర్కొన్న ప్రకారం ముస్లిం చరిత్రకారులు గురుగోవింద్ చనిపోయిన దశాబ్దం తరువాత ఆయన గురించి పర్షియాలో రాశారని, ఇందుకోసం మొఘల్ దర్బార్‌లో సుల్తాన్‌కు అనుకూలంగా రచించిన వాటిని ఎక్కువగా ఆధారపడి రాశారని పేర్కొన్నారు. ఎంతటి గొప్ప చరిత్రనైనా సంకుచితం చేయగల సిద్ధహస్తులు మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తారు. నిజమే.. ప్రతి సిక్కును ఒక యోధుడిగా తయారు చేయడం గురుగోవింద్‌కు తప్పలేదు. ఎందుకంటే మొఘలుల అరాచకాలు అలాంటివి. ముఖ్యంగా ఔరంగజేబ్ గురించి ఎంత చెప్పుకొన్నా కూడా తక్కువే. మొదట గురు అర్జున్ దేవ్‌ను దారుణంగా హతమార్చిన నాటి నుంచే.. గురు గోవింద్ తీసుకొన్న చర్యలు తీసుకొని ఉంటే.. మొఘలుల పాలన ఎప్పుడో అంతమై ఉండేది. మహిళలు, చంటి పిల్లలు అన్న తేడా లేకుండా అప్రతిహతంగా కొనసాగుతున్న మహా మానవ హననాన్ని ఆపాలంటే.. అడ్డుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ కత్తి పట్టక తప్పదు.. అన్న నిర్ణయానికి వచ్చిన తరువాత గురు గోవింద్ తన ప్రజలలోపల ఉన్న శక్తిని వారికి తెలియజెప్పాలనుకున్నాడు. ఆయన చరిత్రాత్మకమైన దర్శనానికి నిదర్శనమే ఖల్సా ఆవిర్భావం. 1699 వ సంవత్సరంలో.. తన ధర్మావలంబులందరినీ సమావేశపరిచాడు. అత్యున్నత ఆత్మ త్యాగం కోసం ఎవరు ముందుకు వస్తారని గట్టిగా అడిగాడు. ముందు కూర్చొని ఉన్న భక్తుల లోంచి ఒకే ఒక్కరు లేచి నిలుచున్నారు.. అతడిని వెంటబెట్టుకొని వెనుక ఉన్న గుడారంలోకి తీసుకొని వెళ్లిన గురు గోవిందుడు.. నెత్తుటి కత్తితో బయటకు వచ్చాడు. మళ్లీ అదే ప్రశ్న వేశాడు. ఎవరు ముందుకొస్తారని.. నెత్తుటి కత్తి చూసిన వారికి కొంత భయమేసింది. కానీ వారిలో మరొకరు ముందుకు వచ్చారు. ఈసారీ అదే విధంగా చేశాడు. ఆ భక్తుడిని వెంట బెట్టుకొని లోపలికి వెళ్లి మళ్లీ నెత్తుటి కత్తితో బయటకు వచ్చాడు. అలా మొత్తం ఐదుగురిని లోపలికి తీసుకొని వెళ్లి బయటకు వచ్చాడు. ఆ ఐదుగురికి ఒకే రకం దుస్తులు ధరింపజేసి అందరి ముందుకు తీసుకొని వచ్చి వారిని మొదటి ఖల్సా అని ప్రకటించాడు. మరింత వివరంగా ప్రొఫెసర్ ఆర్సీ మజుందార్ రచించిన హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ గ్రంథాన్ని పరిశీలించవచ్చు. ఈ ఐదుగురు పేరు చివరన సింహం పేరును తగిలించాడు. సింగ్ అన్న పేరు అప్పటి నుంచే వచ్చింది. మంచినీళ్లు, చెక్కర వేసి చురకత్తితో కలగలిపి వారికి దానికి పంజ్ ప్యారే అని పేరు పెట్టాడు. దాన్ని అమృతం అని పిలిచాడు. దానితో ఆ అయిదుగురికి దీక్షను ఇచ్చాడు. తానూ దీక్ష తీసుకొని గురు గోవింద్ సింగ్ అయ్యాడు. ఆ వెంటనే కేశ్ (పొడవైన జుట్టు), కంఘా(దువ్వెన), కచ్చా (లంగోటీ), కర (ఇనుపగాజు లేదా కంకణం), కృపాణం (కత్తి) అనే ఐదు కకారాలను విధిగా ధరించాలని నియమం విధించాడు. ఈ నియమం వల్ల సిక్కులు తమను తాము ఆత్మ రక్షణ చేసుకోవడానికి గొప్ప బలాన్ని ఇచ్చినట్టయింది.

వారిలో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. భయం పోయింది. అంతేకాదు ఖాల్సా స్థాపనతో కులమనే మాటే లేకుండా పోయింది. మరాఠాల మాదిరిగానే సిక్కులూ విజృంభించారు. గురు గోవింద్ ఏదైతే దర్శించాడో అదే జరిగింది. తమ ధర్మాన్ని, తమ సహచరులను రక్షించడానికి సిక్కులు నిజంగానే కొదమసింహాలై చెలరేగిపోయారు. 1704 దాకా వారికి ఎదురే లేకపోయింది. 1704లో ఆనంద్‌పూర్ కోటను.. కొండ రాజులను సాయం తీసుకొని.. మొఘల్ సైన్యం ముట్టడించింది. ఇది చాలా రోజులు సాగటంతో నిత్యావసరాలు తగ్గిపోయి.. ఆకలి చావులు తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో గురు గోవింద్ ప్రజల సంరక్షణకు సంధికి అంగీకరించాడు. తమను క్షేమంగా బయటకు వెళ్లనిస్తే కోట ఖాళీ చేస్తామని కబురంపాడు. మొఘల్ సేనాని వజీర్ ఖాన్ ఖురాన్ మీద ప్రమాణం చేసి సరేనన్నాడు. గోవింద్, ఆయన అనుచరగణం కోట దాటి కొంత ముందుకు పోగానే మొఘలులు దారి కాచి దొంగదెబ్బ తీశారు. గురువు, మరి కొందరు సిర్సా నది దాటి వెళ్లగలిగారు కానీ.. మహిళలు, పిల్లలు మొఘలుల దాడిలో మృత్యువాత పడ్డారు. అదే దాడిలో గురుగోవింద్ తల్లి, ఆయన ఇద్దరు కుమారులు వజీర్ ఖాన్‌కు చిక్కారు. వారిని నానమ్మ కండ్ల ముందరే ఆ ఇద్దరు కుమారుల చుట్టూ ఇటుకలు పేర్చి గోడ కట్టించాడు. మతం మారాలని ఒత్తిడి తీసుకొని వచ్చారు. కానీ వారిద్దరూ అందుకు అంగీకరించకపోవడంతో మెడవరకు గోడ కట్టి.. కత్తితో ఇద్దరి తలలను దారుణంగా నరికేశాడు. దీంతో గురు గోవింద్ తల్లి తట్టుకోలేక ప్రాణం విడిచింది. మరోవైపు గురువు పరివారాన్ని వెంబడించిన మొఘలు సైన్యంతో జరిగిన యుద్ధంలో మరో ఇద్దరు కొడుకులూ చనిపోయారు. చివరకు గురుగోవింద్‌తో పాటు మరో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీరు ఎలాగోలా తప్పించుకొని ముక్తసర్ ప్రాంతానికి చేరుకున్నారు. మొఘలుల విజృంభణ తగ్గిన తరువాత ఆయనకు దూరమైన శిష్యులంతా వచ్చి ఆయనను చేరుకున్నారు. ముక్తసర్‌లో ఉన్నప్పుడే యుద్ధాల వల్ల పోగొట్టుకున్న ఆది గ్రంథ్‌ను గురువు మళ్లీ తిరగరాశాడు. అదే సమయంలో దక్కన్‌లో మరాఠాలతో యుద్ధంలో తలమునకలై పోయిన ఔరంగజేబ్‌కు జఫర్ నామా పేరుతో పర్షియన్ కవితలో ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఈ లేఖ ఎంతో అద్భుతమైంది. దేవుడి గురించి, ఔరంగజేబ్ గురించి.. యుద్ధంలో మొఘలుల బీభత్సం గురించి మొత్తం 111 పాదాల్లో కవితాత్మకంగా వివరించాడు. వీటిలో 34 పాదాలు దేవుడిని కీర్తించడం.. దేవుడితో మిత్రత్వం నెరిపితే జరిగే మేలు గురించి పేర్కొన్నాడు. 32 పాదాలలో తనకు ఔరంగజేబ్‌కు మధ్య జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. తనను కలవడానికి రావాల్సిందిగా గురు గోవింద్ కు ఔరంగజేబ్ ఆహ్వానం.. తన తిరస్కరణకు సంబంధించిన అంశాలు అందులో ఉన్నాయి. 1704 డిసెంబర్ 22న చమ్కౌర్ లో జరిగిన యుద్ధంలో చోటు చేసుకొన్న ఘటనల గురించి 24 పాదాలలో వివరించారు. మరో పదిహేను పాదాలలో ఔరంగజేబ్ ఏజెంట్ చేసిన మోసం గురించి నిందించాడు. 78, 79 పాదాలలో మొఘల్ సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేంత వరకు ఖల్సా విశ్రాంతి తీసుకోదని తీవ్రంగా హెచ్చరించాడు. ఒక్క ఆరు పాదాలలో మాత్రం ఔరంగజేబ్‌ను కాస్త పొగిడాడు. లేఖ మెత్తగా ఉన్నట్టు కనిపించినా.. తీవ్రమైన హెచ్చరికలు అందులో కనిపిస్తాయి. హింస, దుర్నీతి, అనైతికత, దారుణ రాజకీయాలతో కూడి సాగుతున్న మొఘల్ సామ్రాజ్యం పతనం కావడం ఖాయమని ఆ లేఖలో పేర్కొన్నాడు. జఫర్ నామాలోని కొన్ని పాదాలను చూడండి..

O man, beware and fear thy God,

For, though flattery or cajolery He can be deceived not. (70)

He, the King of kings, fears no one,

And is the True Sovereign of the earth and heaven. (71)

God is the Master of the earth and the sky:

He is the Creator of all men, all places. (72)

He it is who Creates all – from the feeble ant to the powerful elephant,

And is the Embellisher of the meek and Destroyer of the reckless. (73)

His name is: “Protector of the meek”.

And Himself He is dependent upon no ones support or obligation. (74)

He has no twist in Him, nor doubt.

And, He shows man the Way to Redemption and Release. (75)

You are bound, indeed by your word on the Koran,

Let, therefore, the matter come to a good end, as is your promise. (76)

It is but meeting that you act wisely,

And be discreet in all that you do. (77)

What, if you have killed my four tender sons,

When I, like a coiled snake remain behind. (78)

It is not brave to put out a few sparks,

And stir up a fire to rage all the more! (79)

What a beautiful thought has Firdausi, the sweet-tongued poet, expressed:

“He who acts in haste, plays the devil”. (80)

If the One God is one’s Friend, what harm can the enemy do,

Even if he multiplies himself a hundred times? (110)

A thousand times let an enemy assault him,

And yet touch not even a hair on his head. (111)

జఫర్ నామా చదివిన తరువాత ఔరంగజేబ్‌కు పశ్చాత్తాపం కలిగిందని చరిత్రకారులు రాసిన దాంట్లో ఎంత నిజమున్నదో తెలియదు. అలాంటి పాషాణుడికి తాను చేసిన పనులపైన పునరాలోచన కలింగిందనడమే హాస్యాస్పదం. 1707లో ఔరంగజేబ్ మారాఠాల వెంటపడీ పడీ చచ్చిపోయాడు. ఆ తరువాత బహదూర్ షా జఫర్ (అసలు పేరు మువాజం) సిక్కులతో వైరానికి స్వస్తి పలికాడు కానీ.. పగ పెంచుకున్న వజీర్ ఖాన్ అనుచరులు గోదావరి తీరంలో నాందేడ్‌లో విడిది చేసిన గురుగోవింద్‌ను నిద్రిస్తుండగా దారుణంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆయన తన తరువాత గురుపీఠాన్ని రద్దుచేసి ఆది గ్రంథాన్ని గురుపీఠంగా ప్రకటించి శరీరాన్ని విడిచిపెట్టాడు.

గురునానక్ నుంచి గురుగోవింద్ వరకూ ఒక పరంపరగా సాగిన సిక్కు మతం.. దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో శక్తి వంచన లేకుండా కృషి చేసింది కాబట్టే.. మన ధర్మం కాస్త మిగిలింది. కాకపోతే.. ఈ పౌరుషం బ్రిటిష్ కాలంలో నాయకులైన వారికి లేకుండా పోయింది. ఫలితం.. దేశ విభజన.

(సశేషం)

Exit mobile version