Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేవ భూమి

[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘దేవ భూమి’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

యమున దాటిన ఆ శిశువు ఎవరమ్మ?
అవతార పురుషుడు! ఆదినారాయణుడు!
ఆ శిశువు తలపైన ఛత్రముగ ఎవరే?
వేయి పడగల ఆదిశేషుడే ఛత్రము!
కన్నయ్య శిఖ పైన శిఖి పింఛమెవరే?
హరిస్మరణ చేసే పరమ భక్తుడతడు!
వ్రేపల్లె యాదవులు ఎవ్వరనుకొంటివే?
ఎవరమ్మ వారూ? అంత పుణ్యాత్ములు!
యోగివరులందరూ గోపాలురే!
పాలు పెరుగులు అమ్ము గోపికలు ఎవరే?
దివి లోన అచ్చరలు, దేవతలు, గోపికలు!
గోవులు వృషభములు లేగలెవరె?
చెలియరో వినవమ్మ! తాపసులు వారు!
బృందావనములోన తరువులు ఎవరె ?
తరువులా! నిశ్చలధ్యాన మునిశ్రేష్ఠులమ్మా!
ఓ చెలీ పరిమళభరిత కుసుమమ్ములెవరే?
ఏమా సందేహము!
గగనమున మెరిసేటి తారకలె విరులు!
నవనీతమును తరచు కవ్వమెవరు?
దధికుంభ మెవ్వరో ఓ సఖీ చెప్పవే!
నిరతమూ హరినామ స్మరణ చేసేవారు!
వనములలో తిరిగేటి పక్షితతి ఎవరే?
పక్షి సమూహములు యక్ష కిన్నెరలు!
పరుల పీడించేటి మృగములెవరమ్మ?
క్రూరాత్ములైనట్టి రాక్షసులు, దానవులు!
వారి నుండీ మనకు రక్షకుండెవరే?
కరిమేనువాడు! నవనీత చోరుడు!
వ్రేపల్లె వాడల్లో ఏల నున్నాడే?
వ్రేపల్లె వాడయే దేవభూమమ్మా!
గోవులు గోపాలురూ నడయాడు భూమి!
గోపాలురందరూ ఎచటనున్నారే?
వటవృక్షఛాయలో ఆడుతున్నారమ్మ!
నందనందనుడేడి? ఎచట దాగాడమ్మా?
వటవృక్షముల చెంత సంచరిస్తున్నాడమ్మ!
వటపత్రములోన వటపత్రశాయియై
పవళించిన వాసుదేవుని గాంచి
స్తుతి, స్తోత్ర ముల నుతించి మొక్కిరి?
మధురానగర భామినులు!
గోవిందునర్చించు గోపాలబాలురు
కృష్ణునకు ప్రియమైన తులసీవనము
బృందావనమే పరమపావనము
బృందావన విహారి! భక్తమానస సంచారి!

Exit mobile version