Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆసక్తిగా చదివించే క్రైమ్ థ్రిల్లర్ ‘డెవిల్స్ మైండ్’

[శ్రీ సత్యవోలు కిరణ్ కుమార్ రచించిన ‘డెవిల్స్ మైండ్’ అనే అపరాధ పరిశోధనా నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

శ్రీ సత్యవోలు కిరణ్ కుమార్ వర్ధమాన రచయిత. కథలు, నవలలు రాస్తున్నారు. టీవీ సీరియల్స్‌కి, సినిమాలకి కథలందిస్తున్నారు. వీరి ‘పిపాసి’ నవల అంతర్జాలంలో ఓ సంచలనం సృష్టించింది. ‘డెవిల్స్ మైండ్’ వీరి తాజా నవల, క్రైమ్ థ్రిల్లర్.

క్రైమ్ ఫిక్షన్ అనేది సాహిత్యంలో ప్రముఖమైన జానర్. క్రైమ్ ఫిక్షన్‌కి ప్లాట్, కథానిర్మాణం చాలా ముఖ్యమైనవి. కథలోని గుట్టుని క్రమంగా, నియంత్రిత వేగంతో విప్పాలి, ఆధారాలని తెలివిగా, నేర్పుగా జొప్పించాలి. నవల ముగింపు సముచితంగా, ఆశ్చర్యపరుస్తూ, సహజంగా ఉండాలి. ఇతివృత్తం చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకోవాలి, వాక్యాలు చదివించేలా ఉండాలి. అప్పుడే క్రైమ్ ఫిక్షన్ పండుతుంది.

క్రైమ్ ఫిక్షన్‌లో సెటింగ్ చాలా ముఖ్యం. పాఠకులలో ఉత్కంఠనీ, కుతూహలాన్ని కలిగించడంలో సెటింగ్ కీలకం. జటిలమైన ప్లాట్, కథనంలో మలుపులు, పాత్రల వ్యక్తిత్వం.. లాంటివి క్రైమ్ ఫిక్షన్‌ని ఆసక్తిగా నడిపించడంలో దోహదం చేస్తాయి. అలాగే కథ ఎక్కడ సాగుతోందన్నది – నిరంతరం రద్దీగా ఉండే మహానగరమా, లేక సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉండే ఓ చిన్న ఊరా అన్నది కూడా ముఖ్యమే. ఆ ప్రాంతాన్ని స్పష్టంగా ప్రస్తావించడం పాఠకులు కథలో లీనమయ్యేలా చేస్తుంది. చక్కని సంభాషణలు కూడా క్రైమ్ ఫిక్షన్ విజయానికి తమ వంతు దోహదం చేస్తాయి.

వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, ‘డెవిల్స్ మైండ్’ ఓ చక్కని క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.

ఓ వ్యక్తి తనని తాను గుంతలో పాతిపెట్టుకోడంతో ప్రారంభమైన ఈ నవల, మున్నా, శశి అనే ఇద్దరు దొంగలు – వికారాబాద్‍లో దొంగతనం చేయడానికి వెళ్తూ ఓ శవాన్ని చూసి, ఆ శవం ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోవడంతో మొదటి మలుపు తిరుగుతుంది. చనిపోయిందెవరు, చంపిందెవరు వంటి ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. పోలీసు అధికారులుగా, పరశురామ్, జేమ్స్ పరిశోధన ప్రారంభిస్తారు. ఒక దాని తర్వాత ఒకటిగా వరుస హత్యలు జరుగుతుంటాయి. ఒక సందర్భంలో హత్య చేస్తున్నది వనమాలి అని భావిస్తారు. కానీ వనమాలి చచ్చిపోయి చాలా కాలమైందని ఓ సాక్షి చెప్తాడు. హత్య చేయబడుతున్న వాళ్ళంతా, ఏదో ఒక రకంగా వనమాలితో సంబంధం ఉన్నవాళ్ళే. దాంతో ఈ కేసుని ఎలాగైనా ఛేదించాలన్న పట్టుదల పరశురామ్‍లో పెరుగుతుంది. అలా నవలలోని ఒక్కో పాత్ర ముందుకొస్తుంది. పరశురామ్, జేమ్స్ వారిని ప్రశ్నిస్తుంటారు, వారితో వనమాలికి ఉన్న సంబంధాన్ని బట్టి, వనమాలి తదుపరి టార్గెట్ ఎవరో ఊహిస్తూంటారు. కానీ పోలీసుల కన్నా, నేరస్థుడే ఓ అడుగు ముందుంటాడు.

సాధారణంగా క్రైమ్ ఫిక్షన్‍లో చాలాసార్లు హంతకుడెవరనేది చివరివరకూ తెలియదు, కానీ ఈ నవలలో హంతకుడు వనమాలి అని అనిపించినా, హత్యలు చేస్తున్నది వనమాలి ఆత్మ అని పాత్రలు నమ్మేలా రాశారు కిరణ్ కుమార్. క్రైమ్ థ్రిల్లర్ మధ్యలో హారర్ స్టోరీ చదవబోతున్నామా అని పాఠకులకు కించిత్ సంశయం కలిగినా,  చిన్న చిన్న క్లూల ద్వారా వనమాలి పాత్ర స్వరూప స్వభావాల్ని వెల్లడి చేస్తూ వస్తారు. ఆత్మ కాదు మనిషేనని పాఠకులకి అర్థమైనా, వనమాలి మాత్రం తాను చచ్చిపోయానన్న భ్రమలో ఉండడానికి ఓ కారణం ఉంటుంది. అదేంటో చివర్లో తెలుస్తుంది. ఇంతకీ అందరూ అనుకుంటున్నట్లు అసలు హంతకుడు వనమాలేనా? మరొకరా?

పుస్తక సమీక్షలో ఓ క్రైమ్ ఫిక్షన్‍ని ఇంతకు మించి వివరించడం సమంజసం కాదు. ఇంకా చెప్తే spoiler అయిపోతుంది.

~

అపరాధ పరిశోధనా రచనల్లో, నేరస్థుడి మోటివ్ వాస్తవికంగానూ, నమ్మదగ్గదిగా ఉండాలి. ఈ నవలలో వనమాలి మోటివ్ స్పష్టం! అందువల్ల పాఠకులలో ఆసక్తి పెరుగుతుంది. గబగబా చదివేస్తారు.

ఒక క్రైమ్ ఫిక్షన్ పాఠకుల ఆదరణ పొందడానికి, పైన చెప్పుకున్నట్టు, అవసరమైనవన్నీ ‘డెవిల్స్ మైండ్’లో ఉన్నాయి. ఆసక్తికరమైన ప్లాట్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, పాఠకులను కథనంలో లీనం చేసే శైలి, కొండోకచో హాస్యం, స్పష్టమైన సంభాషణలు – ఈ నవలని ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

~

“బేసిక్‍గా నాకు ఎవరినీ చంపాలనే ఇంటెన్షన్ ఉండదు. కానీ ఇంటెన్షన్ కలిగాకా చంపకుండా వదిలేది ఉండదు.”

“ఎలా వుంది రావు గారు?” – “వెలితిగా ఉంది సార్! నాకంటూ ఎవరూ లేరని తలచుకుంటే బాధగా ఉంది సార్.”

“యాక్షన్ మీరు చేశారు, రియాక్షన్ మీ అబ్బాయి నుంచి వచ్చింది.”

“కాలం కొన్ని రహస్యాలను దాచి, కామ్‍గా కదిలిపోతుంది.”

“దాన్ని తెరిచి చదివాకా, కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది.”

ఇలాంటి వాక్యాలు సన్నివేశాలలోని సందర్భానికి బిగిని అందించాయి.

చదవడం మొదలుపెట్టినవారు, చివరిదాకా ఆపకుండా చదివేస్తారు. చక్కని నవలని పాఠకులకు అందించినందుకు కిరణ్ కుమార్ అభినందనీయులు.

***

డెవిల్స్ మైండ్ (నవల)
రచన: సత్యవోలు కిరణ్ కుమార్
ప్రచురణ: గోదావరి ప్రచురణలు
పేజీలు: 176
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
గోదావరి ప్రచురణలు: ఫోన్: 9553084268
సత్యవోలు కిరణ్ కుమార్ ఫోన్: 9703222329
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Devils-Mind-Kiran-Satyavolu/dp/B0DG62Z1XG/

 

~

సత్యవోలు కిరణ్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-satyavolu-kiran-kumar/

Exit mobile version