[బానోత్ అనిల్ కుమార్ గారు రచించిన ‘దేవులపల్లి కృష్ణమూర్తి సాహిత్యం – ఎప్పటికీ స్పూర్తిదాయకం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
కథా రచనలో దేవులపల్లి కృష్ణమూర్తి గారిది విశిష్ట శైలి. నిత్యజీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. నల్లగొండలో నోముల సత్యనారాయణ, పిట్టల రామచంద్రు, కొల్లోజు కనకాచారి, బోయ జంగయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి వంటి రచయితల పరిచయం వల్ల తన జీవితంలో సాహిత్యానికి నాంది పడిందన్న దేవులపల్లి కృష్ణమూర్తి గారు 1940లో ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని అనంతారం అనే గ్రామంలో జన్మించారు. పదవ తరగతి చదువుతుండగానే వివాహమయ్యింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక లోయర్ డివిజన్ క్లర్కుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కృష్ణమూర్తి బదిలీపై నల్లగొండకు వచ్చారు. రెవెన్యూ శాఖలో పనిచేసి 1998లో ఎమ్మార్వోగా పదవి విరమణ చేశారు.
‘ఊరువాడ బతుకు’, ‘కథలగూడు’, ‘యక్షగానం’, ‘బయటి గుడిసెలు’ ‘తారుమారు’ వంటి ఏడు అపూర్వమైన కథల పుస్తకాలను పాఠక లోకానికి అందించారు. దేవులపల్లి కృష్ణమూర్తి కథలలో తెలంగాణ జన జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. 1947-48 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దాకా ఉద్యమాలే ఊపిరిగా బతికిన తెలంగాణ జీవితం కృష్ణమూర్తి కథల్లో కనిపిస్తుంది.
కృష్ణమూర్తి గారు ‘ఊరువాడ బతుకు’ అందించి తెలంగాణ సాహిత్యానికి, సామాజిక చరిత్రకు ఒక మేలును చేకూర్చారు. తన జీవితంలో వస్తున్న సామాజిక మార్పులను ఆయన కలగలుపుతూ రాసినప్పుడు, తన అనుభవాలను వ్యక్తీకరించినప్పుడు ఆ సందర్భానికి, అప్పుడు ప్రచారంలో ఉన్న జానపద గేయాలను, ఉద్యమ గేయాలను ఉటంకిస్తూ పోయారు. దానివల్ల రచనకు సహజమైన సొబగు అబ్బింది. దానివల్ల ఆయా సందర్భాలలోని సామాజిక స్థితి అవగతం కావడమే కాకుండా పాఠకుడి అనుభవంలోకి వస్తుంది.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆ తర్వాతి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి చాపకింద నీరులా పరుచుకుంటూ పోయింది. కృష్ణమూర్తి గారు వివాహం చేసుకునే వరకు గల తెలంగాణ సామాజిక చరిత్ర తెలిసి వస్తుంది. ఆ సామాజిక చరిత్రను తెలంగాణ మేధావులకు కోణం నుంచి నిర్మించడానికి వీలవుతుంది. నల్లగొండ జిల్లాలోని ఒక పల్లెటూరి పేద కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు సామాజికుడిగా ఎదిగిన వైనం కళ్ళకు కడుతుంది. ప్రాపంచిక జ్ఞానాన్ని పొంది పదిమంది కోసం ఆలోచించడం నేర్చుకున్న వైనం తెలిసి వస్తుంది. ఇప్పటివరకు చలామణిలో ఉన్న కొన్ని సామాజిక సూత్రీకరణలు కృష్ణమూర్తి రచనల వల్ల తలకిందులవుతున్నాయి. ఆయన ఉన్నది ఉన్నట్లుగా రాయడం వల్ల, వ్యాఖ్యానాలు చేయకపోవడం వల్ల ఆ పని జరిగింది. దానివల్ల తెలంగాణ సమాజానికి చాలా మేలు జరుగుతుంది.
హైదరాబాద్ రాజ్యం మీద సైనిక దాడి కేవలం రజాకార్లను రూపుమాపడానికి మాత్రమే జరగలేదు. కమ్యూనిస్టుల అంతం చూడడానికి కూడా వచ్చిందనే విషయం “నైజాం పాలన పోయి యూనియన్ మిలట్రీ పాలనొచ్చింది. సంగపోల్ల మీద నిర్బంధం పెరిగింది” అనే కృష్ణమూర్తి మాట వల్ల తెలియడమే కాకుండా ఆయన తాను చూసిన కొన్ని సంఘటనలను చెప్పడం వల్ల కూడా తెలిసి వచ్చింది. మిగతావారు చెప్పే మాట కన్నా కృష్ణమూర్తి చెప్పే ఈ మాటకు బలం చేకూరడానికి ఆయన ఎంచుకున్న రచనా శిల్పం ప్రత్యేకంగా దోహదపడింది.
ముస్లింలు, హిందువులు కలిసి జీవించే సందర్భాలను, కలిసి చేసుకునే పండగలను ఆయన తన అనుభవం లోంచి చెప్పారు. పత్తి పండించడం తెలంగాణ రైతుకు ఎవరూ నేర్పలేదని, వారి వ్యవసాయంలో ఎప్పటినుంచో ఉందని కూడా మనకు తెలిసి వస్తుంది. ఈ విషయాన్ని వి. వి. తన ముందుమాటలో ప్రస్తావించారు కూడా. తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు కొంతమంది మధ్య దళారులుగా, నెహ్రూ సోషలిస్టుగా మారిన వైనాన్ని ఆయన తన జీవితంలోంచి చూసి చెప్పారు. దానివల్ల సామాజిక విశ్లేషకులు, మేధావులు చెప్పే మాటలకు కృష్ణమూర్తి గారు చూపిన రుజువుల వల్ల మరింత విశ్వనీయత చేకూరింది.
తెలంగాణ సాయుధ పోరాట అనుభవాన్ని తన కుటుంబంలో చూసిన దేవులపల్లి కృష్ణమూర్తి గారు దాదాపుగా 1958 వరకు తెలంగాణ సమాజాన్ని ‘ఊరువాడ బతుకు’ పుస్తకం ద్వారా మనకు ఆవిష్కరణ చేశారు. తెలంగాణలోని కులాల, మతాల ఉమ్మడి సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని మనకు స్పష్టంగా చూపించారు. పైకి చూడడానికి కృష్ణమూర్తి గారి జీవిత కథ లాగే అనిపించినా లోనారసి చూడ తెలంగాణ సామాజిక చరిత్ర సుస్పష్టంగా ఆవిష్కృతమైన వైనం తెలిసి వస్తుంది, మనసుకు పడుతుంది.
ఆ యాత్ర చేసినప్పుడు కలిగిన అనుభవాలు జోడించడమే కాకుండా కల్పిత అంశాలను కూడా చర్చి ‘మా యాత్ర’ కథల పుస్తకాన్ని రాశారు. కృష్ణమూర్తి రాసిన కథల పుస్తకాల్లో తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల జీవన విధానాలు కనిపిస్తాయి. తన జీవిత చరిత్ర అనుభవాలతో పాటు ఊరు అంటే తనకు ఎందుకు అనాసక్తి కలిగిందో అందులో తెలిపారు.
దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన కథల పుస్తకాలకు ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ బొమ్మలు వేశారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి ప్రముఖులైన రచయితలంటే దేవులపల్లి కృష్ణమూర్తి చాలా ఇష్టపడేవారు. వారి ప్రభావం కృష్ణమూర్తి పై చాలా వరకు కనిపిస్తుంది.
దేవులపల్లి కృష్ణమూర్తి రచనలు సాదాసీదాగా కనిపిస్తాయి. ఏ అలంకరణలు, ఆర్భాటాలు ఉండవు, మంచి పుస్తకం అలాగే ఉంటుంది. కవర్ పేజీ నుంచి చివరి పేజీ దాకా ఒక ప్రామాణికతను కలిగి ఉంటుంది. కృష్ణమూర్తి రాసిన కథల్లో సరళమైన వాక్యాలు, అలతి అలతి పదాలు సాగిపోయినట్లు ఉంటాయి. మాట్లాడే విధంగానే వున్న పదాలు పుస్తకాల్లో కనిపిస్తాయి. దేవులపల్లి కృష్ణమూర్తి గారి సాహిత్యం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
ఉపయుక్త గ్రంధాలు:-
- ఊరువాడ బతుకు – దేవులపల్లి కృష్ణమూర్తి – అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126, శాంతి నగర్, హైదరాబాదు.
- మా యాత్ర – దేవులపల్లి కృష్ణమూర్తి – అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126, శాంతి నగర్, హైదరాబాదు.
- కథలగూడు – దేవులపల్లి కృష్ణమూర్తి – అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126, శాంతి నగర్, హైదరాబాదు.

