[2022 సెప్టెంబరు నెలలో కేరళ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
మా సురేష్ రడీగా ఉన్నాడు కారుతో. ఆకాశమెత్తు పెరిగిన యూకలిప్టస్ (నీలగిరి) ప్లాంటేషన్ల గుండా సాగింది మా ప్రయాణం. ఒక చోట సమోసా తిని టీ తాగాం. ఆ టీ ఫ్లేవరే వేరుగా ఉంది. నీలగిరి చెట్ల మధ్య విశాలమైన గడ్డి మైదానాలున్నాయి. వాటిని ‘pastures’ అంటారట. అందులో అడవి ఏనుగులు తమ గున్న ఏనుగులతో కలిసి మేస్తున్నాయి. వాటిని జూమ్ చేసి వీడియోలు, ఫోటోలు తీశాము.
‘ఏనుగులు రోడ్డు దాటే ప్రాంతం! వాహనాలు ఆపి దిగరాదు’ అన్న బోర్డులు అక్కడక్కడా కనబడ్డాయి. అక్కడ నుంఛి ‘ఎలిఫెంట్ సఫారీ’కి వెళ్ళాము. ఏనుగు అంబారీ మీద ఎక్కి ఊరేగవచ్చు. ఎక్కడానికి వీలుగా step case లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఏడు వందలట. మా యోగానంద్ “వద్దులే శర్మా” అన్నాడు.
ఇంతలో ఒక అబ్బాయి వచ్చి “చెరో వంద ఇవ్వండి సార్, రెండు బుట్టలతో పైనాపిల్ ముక్కలు తెస్తాను. ఏనుగును మీ వద్దకు తీసుకువస్తాను. మీ చేతులతో మీరే తినిపించవచ్చు. తొండాన్ని ముట్టుకోవచ్చు. ఫోటో తీసుకోవచ్చు” అన్నాడు.
‘ఇదేదో బాగానే ఉంది’ అనుకుని “సరే” అన్నాము. వెళ్ళి ఏనుగును పిలుచుకొని వచ్చాడు. చాలా పెద్దది. బుద్ధిమంతుడిలా అతని వెంట నడిచి వచ్చాడు గజరాజు. రెండు చిన్న బుట్టలలో, ఆరు చొప్పున పెద్ద పైనాపిల్ ముక్కలు ‘చెక్కు’తో సహా తెచ్చి, మాకు చెరొకటి ఇచ్చాడు. ఈ వ్యవహారం గజస్వామివారికి బాగా అలవాటయినట్లుంది రోజూ. తొండం చాచి పండు పెట్టమని అడుగుతున్నాడు. తొండానికి అందిస్తే చటుక్కున నోట్లో పడేసుకుని మళ్ళీ చాస్తున్నాడు. చాలా ముచ్చటేసింది మాకు. తొండం మీద చేయి వేసి నిమిరాము.
వెనక్కు వెళ్లిపోబోతుంటే, “మరి ఫోటో?” అని అడిగాము. ఆ కుర్రవాడు మలయాళంలో దాన్ని పిలిస్తే, బుద్ధిగా, అంత శరీరాన్ని మరల్చుకుని వచ్చేసింది. మేమిద్దరం చెరో వైపు నిలబడ్డాం. “కొంచెం ముందుకురా, కొద్దిగా వెనక్కు” అని మలయాళంలో అతను చెబుతుంటే దానికి చక్కగా అర్థమవుతూంది. చక్కగా మాతో పాటు పోజు ఇచ్చి ఫోటో తీయించుకుని వెళ్ళిపోయింది, తాను ఉన్న చోటుకు. గొలుసులు, అంకుశాలు అలాంటివి ఏవీ లేవు.
అక్కడ నుంచి ‘ఎల్లాక్కల్’ సెలయేరు చేరుకున్నాము. కొండల మధ్య స్వచ్ఛమైన నీరు. అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. దాన్నే ‘ఎకో పాయింట్’ (Echo Point) అంటారు. మనం బిగ్గరగా అరిస్తే, కొండల్లో దాని ప్రతిధ్వని వినబడుతుంది. కొమ్దరు ఔత్సాహికులైన యువతీయువకులు రకరకాలుగా అరుస్తూ ప్రతిధ్వనులను వింటూ కేరింతలు కొడుతున్నారు. వారిని చూసి ముచ్చటేసింది మాకు.
“ఒరేయ్ యోగా! నేను అలా అరుస్తారా!” అన్నాను మావాడితో.
“నీవెంత అరిచినా ప్రతిధ్వని రాదు” అన్నాడు వాడు.
“ఎందుకు రాదు?”
“అంత గట్టిగా నీవు అరవలేవు గనుక!”
నిజమే చెప్పాడు!
తర్వాత మా గమ్యం ‘ముట్టుపేట్టి’ నది, దాని మీద కట్టిన పెద్ద డ్యాం. అది ఎంత పొడవుందంటే దాదాపు నాలుగు వందల మీటర్లు ఉంటుంది. డ్యామ్‍కు ఒక వైపు అపార జలరాశి. రెండో వైపు, చివర మూడు గేట్లు తెరిచారు. వాటిలో నుంచి నీరు ఉధృతంగా దూకుతూ ఉంది. డ్యాంను, రెండు వైపులా ఫోటోలు, వీడియోలు తీసుకొన్నాము.
అక్కడ నుంచి ‘మున్నార్ టీ మ్యూజియం’ చేరుకున్నాము. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక బుజ్జి థియేటర్ ఉంది. ఒక యాభై మంది పడతారు. తెరపై 30 నిమిషాల నిడివి గల వీడియో ప్రదర్శించారు మా కోసం. దాంట్లో తేయాకులు తెంచడం (procure), ఎండబెట్టటం, ప్రాసెస్ చేయటం, ఫ్లేవర్స్ కలవడం, పొడిగా చేయడం, ప్యాక్ చేయడం అన్నీ వివరంగా ప్రదర్శించారు. ‘వాయిస్ ఓవర్’ ఇంగ్లీషులో ఉండడం వల్ల మాకు బాగా అర్థమయింది. మలయాళంలో ఉండి ఉంటే చచ్చేవాళ్ళం!
అక్కడ టీ పౌడర్ అమ్మే ఔట్‍లెట్ కూడా ఉంది. అరగంట పాటు టీ పొడి తయారు అయ్యే విధానాన్ని ప్రత్యక్షంగా చూశాము. అంతా యంత్రాల సహాయం తోనే జరుగుతుంది. ‘మనం రోజూ తాగే టీ వెనుక ఇంత కథ ఉందా?’ అని ఆశ్చర్యపోయాం.
ఔట్‍లెట్‌లో ఎన్నో రకాల టీ పౌడర్లు రీఫిల్ ప్యాక్‍లో అమ్ముతున్నారు. టీ బ్యాగ్స్ ఉన్న ప్యాకెట్లు కూడా. అక్కడ ఒక కౌంటర్‍లో ‘టీ’ చేసి ఇస్తున్నారు. ఫ్లేవర్‍ని బట్టి కప్పు టీ ధర పది రూపాయల నుండి 25 రూపాయల వరకూ ఉంది. మేం పది రూపాయల టీయే తాగాము. చాలా రుచిగా ఉంది.
ఔట్‍లెట్‌లో ధరలు కారు చౌకగా ఉన్నాయి. అంటే ‘కారు ధరలంత చౌకగా’ అని కాదండోయ్! అదేదో సినిమాలో శ్రీలక్ష్మి రాస్తుంది కదా – ‘బస్సు మబ్బులు కమ్ముకున్నాయి’ అని! ‘కారు మబ్బులున్నప్పుడు బస్సు మబ్బులు ఎందుకు ఉండకూడదు’ అని ప్రశ్నిస్తుంది భర్త వేషం వేసిన సుత్తివేలుని అమాయకంగా! చక్కని నటి ఆమె.
‘టీ’ కంపెనీ పేరు ‘రిపిల్’ టీ! మున్నార్ లోని జలపాతం పేరది. అరకేజీ ప్యాకెట్ కేవలం 125 రూపాయలు మాత్రమే. 150 బ్యాగులున్న ప్యాకెట్ వంద! మన డిపార్టు‘మెంటల్’ స్టోర్సులో పావుకిలోనే రెండు వందల యాభై పైన ఉంటుంది!
అక్కడి నుంచి వెళ్ళి ‘వ్యూపాయింట్’ అనే చోటికి వెళ్ళాము. అందాలు కళ్ళు తిప్పుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయి. దూరంగా మిన్నంటే కొండ శిఖరాలు, వాటి నిండా పచ్చని చెట్లు. క్రింద అగాధమైన లోయ. రెండు పక్కలా విశాలంగా పరుచుకుని ఉన్న పచ్చికబయళ్ళు (pastures).
కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. బంగారు రంగులో, నీరెండ, కొండల మీదంతా పరుచుకుని, అవి సూర్యకాంతిలో లేత నారింజ రంగులో తళుకులీనుతున్నాయి. చూస్తేనే గానీ ఆ ప్రకృతి శోభ తెలియదు. దానిని ఫోటోలు, వీడియోలలో బంధించాము.
చీకటి పడింది. అడవులు, కొండలు నిశీధిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయినా, ప్రకృతికి విశ్రాంతి ఎక్కడిది? కొండలలో కట్టిన గెస్ట్ హౌస్‌లలోని లైట్ల వెలుగులతో ఆ ప్రాంతమంతా నిజంగా ‘దేవుని సొంత దేశం’ (God’s Own Country) లా ఉంది.
మేము కేరళకు వచ్చి అప్పుడే మూడు రోజు లయ్యింది. సాయంత్రం 7.30కి రిసార్టు చేరుకున్నాము. స్నానాలు చేసి రిఫ్రెష్ అయ్యాము. ఆ వాతావరణంలో అసలు ఆ అవసరమే లేదు.
రాత్రి 9 గంటలకు సురేష్ వచ్చాడు. మున్నార్ టౌన్‌షిప్ లోని ఒక పంజాబీ రెస్టారెంట్‍కి (Pure Veg) తీసుకెళ్ళాడు. అక్కడ అద్భుతమైన పుల్కాలు, చనా మసాలా తిన్నాము. తర్వాత జీరా రైస్ విత్ బూందీ రైతా. అలా మా డిన్నర్ మున్నార్‍లో సుసంపన్నమైంది. వచ్చి, మందపాటి కంఫర్టర్లు కప్పుకుని, వెచ్చగా బజ్జున్నాం, ఈలపాట రఘురామయ్య గారు పాడిన ‘ఔనులే, ఈ సుఖమే సుఖము!’ అన్నట్లుగా. అదన్నమ్మాట.
మర్నాడు 24వ తేదీ. మేం చెప్పకుండానే సరిగ్గా ఏడు గంటలకు వేడి వేడి కాఫీ వచ్చింది. నిన్న అడిగాం కదా! అదీ ఆతిథ్యమంటే. కాఫీలకు, వాటర్ బాటిళ్లకు ఛార్జి చెయ్యలేదు వాళ్ళు. ఎనిమిది కల్లా రెడీ అయ్యి, చెక్ అవుట్ చేశాము. బ్యాగులు రిసెప్షన్ లోకి పట్టుకెళ్ళారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం రెస్టారెంట్‌కి వెళ్ళాము.
ఆ రోజు సెట్ దోశెలు, వడ, చట్నీ, సాంబారూ, టీ బాగున్నాయి అన్నీ. బయలుదేరే ముందు మా ‘ఫీడ్‍బ్యాక్’ ఇవ్వమని ఒక ప్రశ్నావళి (questionnaire) ఇచ్చాడు మేనేజర్. అతని పేరు జాన్ వర్గీస్ అట. అన్నీ positive గా జవాబులు వ్రాశాము. కొన్ని చోట్ల ప్రశంసలు కూడా. నిజమే కదా!
కారు వరకూ వచ్చి మాకు వీడ్కోలు పలికారు మేనేజర్, స్టాఫ్. “మీ వాళ్ళు ఎవరైనా కేరళ టూర్‍కు వస్తే మా రిసార్టును రికమెండ్ చేయండి సార్” అని కార్డు ఇచ్చారు వినయంగా.
మా కారు, మా తదుపరి గమ్యమైన ‘టెక్కడి’ వైపుకు సాగిపోయింది.
***
‘టెక్కడి’ కేరళ లోని మరో ముఖ్యమైన పట్టణం. మున్నార్ లాగానే దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. టూరిస్టులకు ఎన్నో ఆకర్షణలు అక్కడ వున్నాయి. మున్నార్ నుంచి 120 కిమీ దూరం. కానీ నాలుగు గంటలు పట్టింది, మలుపులతో కూడిన అడవి ఘాట్ రోడ్ వల్ల. ఆ ఘాట్ రోడ్డు సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల మీటర్లు ఎత్తున ఉంటుంది.
దారిలో ‘వందన్‍మేడు’ అనే ఊరు వచ్చింది. అక్కడ ముప్ఫై అడుగుల, నల్లని ఏకశిల నిర్మిత, వినాయకుని విగ్రహం ఆరుబయట ఉంది. ప్రసన్నత స్వామి ముఖంలో ఉట్టిపడుతోంది. ఆయనను వాశిష్ఠ గణపతి అంటారు. ఆయనతో ఫోటోలు దిగాము. అక్కడ టీ తాగి, బయలుదేరాము.
దారిలో నాలుగు జలపాతాలు దర్శించాము. అవి రోడ్డు పక్కనే ఉన్నాయి. చాలా మనోహరంగా ఉన్నాయి. వాటిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము.
‘టెక్కడి’ చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. అక్కడ కేరళ టూరిజం వారి ‘కథాకళి నాట్య ప్రదర్శన’కు, ‘కేరళ యుద్ధ విద్యల ప్రదర్శనకు’కు సాయంత్రానికి టికెట్లు రిజర్వ్ చేసుకున్నాము. అక్కడ మాకు ‘వైట్‍ఫోర్ట్ రిసార్ట్స్’లో బస ఏర్పాటు చేశారు.
రెండు గంటలకు ‘ఆర్యాస్’ అనే వెజ్ రెస్టారెంటుకు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు మా గైడ్/డ్రైవర్. అక్కడ 90 రూపాయలకే చక్కని దక్షిణ భారత భోజనం లభించింది. ఆకుకూర పప్పు, బీన్స్ ఫ్రై, స్పైసీ సాంబారు (కారం పులుసు), మామూలు సాంబారు, పాపడ్, రెండు బుల్లి పూరీలు, ఆనపకాయ గ్రేవీ కూర, సగ్గుబియ్యం పాయసం ఇచ్చారు. పెరుగుతోనే చిక్కంతా. గట్టిగా మూడు స్పూనులు కూడా లేదు. మా మిత్రుడు సర్వరుతో “ఇంతింత పెరుగు ఇస్తున్నారు! మీకు నష్టం రాదా?” అని హిందీలో అడిగాడు. అతనికి అర్థం అయిందో లేదో! మలయాళంలో మాతో ఏదో అన్నాడు. మేమేం తక్కువ తిన్నామా? మాకూ అర్థం కాలేదు!
రూమ్‍కి వెళ్ళి నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకొన్నాం. నాలుగున్నరకి రెడీ అయి, ఆడిటోరియం చేరుకున్నాం. దాని ముందు రోడ్డు పక్కన బండి మీద మిరపకాయ బజ్జీలు, దాల్ వడలు వేడి వేడిగా వేయిస్తున్నాడు. పక్కన టీ కొట్టు కూడా వుంది.
మాకు ప్రాణం లేచి వచ్చింది. తలా ఒక బజ్జీ, వడ తిన్నాము. ఏమీ బాగోలేవు. బజ్జీల పిండిలో ఏం కలిపారో గాని లోపల కాలలేదు. దాల్ వడ ఎంత గట్టిగా ఉందంతే, దానితో కొడితే, ఎవరికైనా గట్టి దెబ్బే తగులుతుంది. స్నాక్స్ తినడం వల్ల వచ్చిన ఆశాభంగాన్ని, టీ పునరుద్ధరించింది. మంచి ఫ్లేవర్‌తో, చిక్కగా ఉంది. వితవుట్ షుగరే!
సరిగ్గా ఐదు గంటలకు ప్రభుత్వ కథాకళి ఆడిటోరియంలో ప్రవేశించాము. మాకు ఎలాట్ చేసిన నంబర్లు గల కుర్చీలలో కూర్చున్నాము. స్టేజి మీద ఒక కళాకారునికి మేకప్ వేస్తున్నారు. ఐదుంబావుకు ప్రదర్శన ప్రారంభమయింది. ఒక సూత్రధారి ఒక వైపు కూర్చున్నాడు. ఆయనే గాత్ర సహకారం అందిస్తున్నాడు. ఆయన చేతిలో పెద్ద పెద్ద తాళాలు ఉన్నాయి కంచువి.
రెందో వైపు ఇద్దరు కుర్చీలలో కూర్చుని, పెద్ద ఢక్కా ఒకరు, పెద్ద తబలా లాంటిది ఒకరు ముందు పెట్టుకుని కూర్చున్నారు. వాటిని వాయించడానికి, చివర బుడిపెలున్న కర్రల్లాంటివి వారి చేతుల్లో ఉన్నాయి.
ముందుగా సూత్రధారి ‘కథాకళి’ పుట్టుక, ప్రాశస్త్యం, ప్రదర్శనా రీతులు ఇంగ్లీషులో ఐదారు నిమిషాలు చక్కగా వివరించాడు. తర్వాత ఒక కళాకారిణి కథాకళి సంప్రదాయ వేషధారణలో, స్టేజిపైకి ప్రవేశించింది. ఆమె నడుము, ఊరుభాగాల చుట్టూ, ఒక గుడారం లాగా లేచి ఉన్న గౌను లాంటింది ఉంది. ముఖానికి డార్క్ కలర్స్ వేసి ఉన్నాయి.
సూత్రధారి మొదట గణపతి ప్రార్థన చేశాడు. అది సంస్కృత శ్లోకం. రాగయుక్తంగా, శ్రావ్యంగా పాడాడు అతడు. చిన్న వయసే. మహా అయితే 35-40 సంవత్సరాల మధ్య ఉంటాయి. శాస్త్రీయ సంగీతం, దక్షిణ భారతమంతా, కర్నాటక సంగీతమే.
తర్వాత ‘కథాకళి’లో కళ్ళు, రకరకాలుగా తిప్పడం, ముఖాన్ని చిత్రవిచిత్రంగా కదిలించడం, నవరసాలను ముఖంలో తద్వారా పలికించడం ఎలా చేస్తారో ఆయన ఇంగ్లీషులో వివరిస్తూ ఉంటే, ఆమె అద్భుతంగా అభినయించి చూపింది. తర్వాత పదహారు రకాల హాస్తముద్రలను అభినయించి చూపింది.
‘నరకాసుర వధ’ అనే ప్రదర్శన ప్రారంభమయింది. ఢక్కా, తబలా, తాళాలు లయబద్ధంగా నేపథ్యంలో వినిపిస్తుండగా, మలయాళంలో, సూత్రధారి శ్రావ్యంగా పాడుతూ ఉండగా ఇద్దరు కళాకారులు, ఒక మగ, ఒక ఆడ, అద్భుతంగా నృత్యం చేశారు. అంతా ‘మైమ్’, అంటే మూకాభినయమే. మాటలు, పాటలు పాడకుండా కేవలం ముఖ, నేత్ర, హస్త చాలనం ద్వారా ‘రససిద్ధి’ మాకు కల్పించారు ఆ కళాకారులు. మాకు జరుగుతున్న కథ అర్థం కాలేదు. కానీ నేపథ్య సంగీతాన్ని, గాత్ర సహకారాన్ని, అభినయ కౌశలాన్ని చక్కగా ఎంజాయ్ చేశాము.
“Music has no language” అన్నారు కదా! సంగీతాన్ని, నృత్యాన్ని అనందించడానికి భాషతో పనేముంది? ఆరుంబావుకు ప్రదర్శన ముగిసింది. కొందరు స్టేజి మీద కళాకారులతో ఫోటోలు తీసుకుంటుంటే మేమూ వెళ్ళి వారితో ఫోటో దిగాము.
నేను సూత్రధారి వద్దకు వెళ్ళి, ఇంగ్లీషులో ఆయన్ని అభినందించి, ఆశీర్వదించాను. ఆయన గాత్రం గొప్పదన్నాను. ఆయన చాలా సంతోషించి, మా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆయన పేరు ‘అంబు నాయర్’ అట.
తర్వాత ‘కాలరి’ అనే కేరళ యుద్ధ విద్యలు ప్రదర్శించే చోటుకు వెళ్ళాము. క్రింద పన్నెండు అడుగుల లోతున 30 అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు గల గుంత లాంటిది ఉంది. దానిని ‘ఎరీనా’ అంటారు. తెలుగులో ‘బరి’ అంటారు. దెబ్బలు తగలకుండా మెత్తని ఇసుక క్రింద పరిచి ఉంది.
ఒక చిన్న వేదిక లాంటి దాని మీద పెద్ద ఓంకారం, సర్పము బొమ్మ, జ్యోతి బొమ్మ పెయింట్ చేసి ఉన్నాయి. వాటి ముందు, పక్కన రకరకాల ఖడ్గాలు, డాళ్ళు, బరిసెలు, ఈటెలు, పెద్ద పెద్ద ఇనుప రింగులు గోడలకి ఆనించి ఉన్నాయి.
మొదట తొమ్మిది మంది యువకులు బరిలో ప్రవేశించి, ఓంకారానికి, సర్పానికి, ఆయుధాలకు నమస్కరించారు. వారు పసుపు పచ్చ అంచు గల, ఎర్రని అంచుగల లంగోటాలనీ, బిగుతు బనీయన్లను ధరించి ఉన్నారు. వారి దేహాలు దృఢంగా ఉన్నాయి. భుజాల కండలు పొంగి ఉన్నాయి. శారీరిక సౌష్టవానికి ప్రతిరూపాల్లా ఉన్నారా కొదమసింహాలు. వారి పిక్కలు ఉక్కుతో చేసినట్లుగా ఉన్నాయి.
ఎక్కడి నుండో ‘వాయిస్ ఓవర్’ మొదలయింది. ముందుగా జరగబోయే ఈవెంట్‌ను పరిచయం చేస్తున్నారెవరో, కానీ మలయాళంలో.
మొదట నలుగురు యువకులు ప్రవేశించారు. ఎరీనా చుట్టూ ఎత్తగా ఉన్న గ్యాలరీ నిండా ప్రేక్షకులు కూర్చున్నారు. ఇక్కడా, ‘కధాకళి’ లోనూ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. యువకులు ఓంకారం, సర్పాలకు నమస్కరించి, ప్రేక్షకులకు అభివాదం చేసి, తలా ఒక ఖడ్గాన్ని, డాలును తీసుకున్నారు.
ఇక చూడండి వారి ఖడ్గ విన్యాసం! ఐదారడుగులు గాలి లోకి ఎగురుతున్నారు. లాఘవంగా కత్తి దెబ్బలు తప్పించుకుంటున్నారు. అలా ఐదు నిమిషాలు సాగింది. తర్వాత ముగ్గురు కలిసి నాలుగో వాడిపై దాడి చేశారు. అతడు పక్షిలా ఎగురుతూ, ఉడుములా పడుతూ, వారి చేతుల్లోని ఖడ్గాలను ఎగురగొట్టాడు. ముగ్గుర్నీ ఒకే పట్టుతో మట్టి కరిపించాడు. అందరం కరతాళ ధ్వనులతో, కేకలతో, వారిని అభినందించాం. మన ఎన్.టి.ఆర్., కాంతారావు సినిమాల్లో చూడడమే గాని ప్రత్యక్షంగా అంత గొప్ప కత్తి యుద్ధాన్ని మా జీవితంలో తొలిసారి చూశాము.
తరువాత కర్రసాము, బరిసెలతో యుద్ధం, ఇనుప రింగులను వెలిగించి ఆ మంటల సందుల్లోంచి దూకడం, కాగడాలతో యుద్ధం, ఇంకా రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. అన్నీ ఊపిరి బిగపట్టుకొని చూశాం.
ఏడున్నరకు ‘ప్రాణమయ’ అనే ఆయుర్వేద ప్రకృతి చికిత్సా కేంద్రానికి వెళ్ళాం. మధ్యాహ్నమే దానికి కూడా అపాయింట్‍మెంట్ తీసుకున్నాం.
అక్కడ ఫుల్ బాడీ మసాజ్ చేయించుకున్నాం. మైకేల్ రాజు అనే ఆయన కాషాయ వస్త్రాలలో ఉన్నాడు. దాదాపు గంట పాటు, రకరకాల తైలాలతో మసాజ్ చేశాడు. గంట తర్వాత స్నానం చేయమన్నాడు. శరీరం మీద జిడ్డంతా మెత్తని గుడ్డతో తుడిచేశారు. ఒళ్ళంతా తేలికయిన ఫీలింగ్ కలిగింది.
డిన్నర్‍కు ‘టేస్ట్‌బడ్స్’ అనే గుజరాతీ వెజ్ రెస్టారెంటుకు తీసుకుని వెళ్ళాడు మా చోదక మార్గదర్శి. అక్కడ మెత్తగా పొంగిన, మృదువైన పుల్కాలు, దాల్ తడ్కాతో తిన్నాము. అద్భుతంగా ఉంది. తర్వాత వెజ్ బిర్యానీ (వన్ బై టు) తిన్నాము. డిన్నర్ సుసంపన్నమైంది!
రాత్రి తొమ్మిది గంటలకు రిసార్టు చేరుకుని విశ్రమించాము.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.