Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధైర్యమేవ జయతే

[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘ధైర్యమేవ జయతే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

సాయంకాలపు నీరెండలో, ఎగిసిపడుతున్న అలల అంచుల వెంబడి బంగారు గొలుసులను అంటించినట్టుగా మెరుస్తున్నాయి!

ఓ ఎనిమిదేళ్ళ పాప ఇసుకలో కాళ్ళు జారిపోకుండా వాళ్ళమ్మ చేయి పట్టుకుని సముద్రపు ఒడ్డున కేరింతలు కొడుతోంది.

పౌర్ణమికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉండగానే సముద్రం పోటుమీద ఉన్నట్టుగా ఉంది!

మనిషి అక్కడే ఉన్నా, ఆలోచనలతో ఎక్కడో ఉన్నట్టుగా నడుస్తున్న 28 ఏళ్ళ దివాకర్‌ని తట్టుకుని పడబోయిన ఓ పదేళ్ళ పిల్లాడు ‘‘సారీ’ చెపుతూ ముందుకు కదిలాడు.

వెనక్కి తిరిగి ఆ పిల్లాణ్ణి చూస్తూ సముద్రం వైపు అడుగులేయసాగాడు దివాకర్.

అతని మనసులో ఉన్నది ఒక్కటే. ఎక్కువ లోతు ఉన్నవైపు వెళ్ళిపోయి, తన బాధలన్నింటినీ శాశ్వతంగా ఆ నీళ్ళల్లో కలిపేయడం! నిజానికి తన సమస్యకు అదే పరిష్కారమో కాదో కూడా అతనికి ఇప్పటికీ తెలియదు!!

“నీ దగ్గరేమైనా మంత్రదండముందా? వారంలో మొత్తం డబ్బులెలా ఇస్తావు?”

ఆరు నెలల నుంచీ అద్దె కట్టలేదని అందరి ముందూ నిలదీసిన ఇంటి యజమాని మాటలు అలలతో పోటీ పడి దివాకర్ చెవుల్లో హోరెత్తుతున్నాయి!

“నీలాంటి వాణ్ణి నమ్మాను చూడు!”

పాత ఉద్యోగం పోయి ఆరునెలలైనా మళ్ళీ ఉద్యోగం సంపాందించలేదని తానెంతగానో ప్రేమించిన ప్రియ నిలదీస్తూ అడిగిన మాటలు!

“త్వరలో చెపుతాం, వెయిట్ చేయండి.” అంటూ పదే పదే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళిస్తున్న సమాధానాలు. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి గుండె బరువును పెంచేస్తుంటే, సముద్రంవైపుగా పరుగెత్తసాగాడు దివాకర్!

ఇంతలో “పట్టుకోండి, పట్టుకోండి” అంటూ తన వైపే ఇద్దరు ముగ్గురు గబగబా పరుగెత్తుతూ వస్తున్నారు!

దివాకర్ మొండిగా మరింత లోతు నీళ్ళల్లోకి వెళ్ళబోతుంటే చేతికి తాడు లాంటిదేదో చుట్టుకుంది. దాని చివర నీళ్ళల్లో మునకలేస్తూ ప్రయాస పడుతున్న ఓ నల్ల కుక్క. దాని మెడకున్న బెల్టు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య నీళ్ళు మింగేస్తున్న 11-12 ఏళ్ళ చిన్న పిల్లాడు!

ఎవరో ముందుకు తోసినట్టుగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరినీ చెరో చేత్తో ఒడిసిపట్టుకుని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చాడు దివాకర్!

కొద్దిగా రొప్పుతున్నాడు పిల్లాడు. కుక్క కూడా బాగానే ఉంది.

“నువ్వు చల్లగుండాలి బాబూ.” దగ్గరికొచ్చి తలపై చేయి పెట్టింది ఓ నడివయసావిడ, ఆ పిల్లాడి అమ్మమ్మ.

“హీరోలు ఎక్కడో ఉండరు, మన మధ్యే తిరుగుతూ ఉంటారు.” అంటూ ఓ పెద్దాయన మీసాలు సవరించుకుంటూ దివాకర్ వంక చూసి నవ్వాడు!!

అక్కడున్న ప్రతి ఒక్కరూ తన ధైర్యాన్ని మెచ్చుకుంటూ కళ్ళింతలు చేసుకుని చూస్తుంటే, దివాకర్‌లో ఏదో ధైర్యం లీలగా మొదలయ్యింది. వారి పొగడ్తలకు తలూపుతూ మొహమాటంగా అక్కడి నుండి కదిలాడు.

తడిసిన తలను, సెల్ ఫోనును దులుపుకుంటూ ‘పోనీ,ఇంకో రెండు ఇంటర్వ్యూలున్నాయి కదా, అవి కూడా ప్రయత్నిస్తే’ అనుకున్నాడు.

ఒక్కసారిగా దిశ మారిన దివాకర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఫోన్ వైబ్రేట్ అయింది.

‘యు ఆర్ సెలెక్టెడ్’ మెసేజ్ చదువుతూనే నిటారుగా నిలుచున్నాడు దివాకర్! సముద్రపు నీటిలో తడిసి వణుకుతున్న చేతుల్తో మళ్ళీ మళ్ళీ చదివాడు.

‘విశాఖపట్నం సముద్రం తనని లోతునుండి శిఖరం పైకి విసిరినట్టనిపించింది!!’

తనకి కొత్త ఉద్యోగం వచ్చేసింది!

వెనక్కి తిరిగి, వచ్చే పోయే అలలను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలో మరో మెసేజ్,

‘ఇంకోసారి అలా బాధపెట్టను దివూ. నిన్న అనుకోకుండా మాటలనేసానూ! నీ ప్రియ’. పక్కనే మెరుస్తున్న ఎర్రటి హార్ట్ ఎమోజీ.

నీళ్ళల్లో తడిసి ధైర్యం నింపుకున్న దివాకర్ మనసులా మెరుస్తోంది!

Exit mobile version