[డా. శ్రీమతి కొఠారి వాణీచలపతి రావు గారు రచించిన ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
మాది చాలా చిన్న ఇల్లు.
అగ్గిపెట్టెలాంటి బుజ్జి బుజ్జి బెడ్ రూములు రెండు.
చిన్న పక్కబట్టను పరిస్తే ఎంత వుంటుందో అంత పొడవు వరండా, మూడు మూరల తండుగుట్టంత దీర్ఘచతురస్రాకారపు వంటిల్లు, వెరసి జానాబెత్తెడు సంసారం అన్నమాట.
మా ఇంట్లో మా అమ్మా, నాన్నా, తమ్ముడు, చెల్లాయి, నేను ఉంటాం.
ఇల్లు ఇరుకవటంతో మా అమ్మ ఇల్లుని సర్దటానికి ఎన్ని ఉపాయాలు పన్నేదనీ. తక్కువ జాగాలో ఎక్కువ సామాన్లు పట్టాలి గనుక అలమారాను చెక్క మీద చెక్క వున్నవి నాలుగు ఐదు అరలుగానో చేయించి గోడకు కొట్టించేది.
పెద్ద నవారు మంచం కింద చిన్న నవారు మంచం; దాని కింద మా చెల్లి పడుకునే మరో బుజ్జి మంచం నెట్టేసాది.
గిన్నెలేవీ కింద వుండి ఫ్లేస్ ఆక్యుపై చేయకుండా ఉట్లలాంటి హ్యాంగింగ్ తాళ్ళను పైన దూలాలకో, ఇనప హుక్కులకో వ్రేలాడదీసేది. డబ్బా మీద డబ్బా, బుట్ట మీద బుట్ట పెట్టేది.. వాటిని కొనేటప్పుడూ అలా ఉండేలా చూసి కొనేది.
కొన్ని మా నాన్న బజారు నుంచి కొనుక్కొచ్చేవారు.
రాత్రి కాగానే మంచాలను బయటికి గుంజటం, మళ్ళీ పొద్దున కాగానే పెద్ద మంచం కిందకి తోసేయటం! నాకయితే అది భలే ఫార్స్‌గా ఉండాది.
అప్పడూ, మా ఒక్క ఇల్లు అనే కాదు. మా ఊళ్ళో దాదాపు అన్ని ఇళ్లు అలాగే వుండేవి. ఎవరు ఏ ఇంటిని ఎంత తెలివిగా, ఉపాయంగా సర్దుకున్నారో చూసొచ్చి వీళ్ళూ అలాగే సర్దుకునేవాళ్ళు.
ఒక్క సామాన్లు సర్దుకోవటం అనే ఏంటి – ఆ మధ్యతరగతి జీవితాల్లో సర్దుబాటు ముందు, సంసారం తర్వాత అన్నట్లు వుండేది.
“ఏమండీ – బియ్యం నిండుకున్నాయి” అని అమ్మ అంటే; “రెండు రోజులు ఆగు, జీతం రానీ” అనేవాడు నాన్న.
“మీ జీతం వచ్చే దాకా ఆకలి ఆగుతుందా – పిల్లలకు ఏం పెట్టను?” అనేది అమ్మ.
“ముందుగా చూసుకోవా నువ్వు. మొత్తం అయిపోయేదాకా ఏం చేస్తున్నావ్?” ఇలా సాగేది ఆ గొడవ కొంతసేపు.
ఒక్కసారి వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నట్టు మెల్లిగా మాట్లాడుకుంటుంటే వినటం నాకు భలే సరదాగా ఉండేది.
“ఈ రోజు ఓ ఐదువేల రూపాయలు విత్‌డ్రా చేద్దామని బ్యాంకుకెళ్లాను. అక్కడ చిన్న బోను లాంటి ఎకౌంట్ సెక్షన్ పేమెంట్స్ డోర్ తిరుచుకొని ఒకే బ్యాంకు ఆఫీసర్ టేబుల్ మీద నోట్లకట్టలు తెచ్చిపెడుతుంటే చూసాను. అబ్బ – ఎన్ని డబ్బులు – కట్టలు కట్టలు! అంత డబ్బు మనకు ఉంటే ఎంత బాగుంటుంది? హాయిగా పెద్ద బంగళా, కారు, ఇంటి నిండా నౌకర్లూ, చాకర్లూ మనకు కూడా ఉండేవాళ్ళు. మన పిల్లలూ కారులో తిరిగేవాళ్ళు” అంటున్నాడు నాన్న.
“పడ్డాయీ కళ్ళు ఆ నోట్ల కట్టల మీద? బ్యాంకుకు దిష్టి పెట్టి వచ్చారన్న మాట. ఎప్పుడో ఒకసారి కంటపడి మీకే అలా అనిపిస్తే – అక్కడ నిత్యం ఉద్యోగాలు చేసే క్లర్కులు, ఎకౌంటెంట్లు, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు వాళ్ళమనుకోవాలి? ఎదురుగా ఉండి అనుభవించే హక్కు లేని వాళ్ళ కన్నా మనం నయం కాదూ. మనకు ప్రాప్తమున్న డబ్బును మాత్రమే చూస్తూ అనుభవిస్తూ ‘ఇదే కదా జీవితం అంటే’ అని అడ్జస్ట్ అయిపోతూ, ఆ సర్దుబాటు తత్వాన్ని వంటబట్టించుకుని ఉన్నంతలో హాయిగా బతుకుతున్నాం – ఈ మాత్రం లేని పేదవాడు ఏమనుకోవాలి?” అనేది అమ్మ.
అలా ఆ ఒక్కరోజేనా? ఎప్పుడూ వాళ్ళ మధ్య డబ్బు ముచ్చట్లు తప్ప మరో ముచ్చట రాదు.
“రేపు – వదిన గారూ వాళ్ళూ వస్తున్నారు పిల్లలతో, పండక్కి రమ్మన్నాను” అమ్మ నాన్నకు కంచంలో అన్నం పెడుతూ ఆ రోజు అన్నమాట అది. నేను పక్కన ఉన్నాను అన్నం తింటూ, నా పక్కన మా చెల్లి, తమ్ముడు.
“పిలిచావా – చుట్టాలొచ్చారంటే ఇల్లు గుల్ల. నెలకు సరిపడా తెచ్చిన సరుకులు పదిహేను రోజులకే అయిపోతాయి. దానికి తోడు వెళ్ళేటపుడు లేక పండగ రోజున పెట్టడానికి బట్టల ఖర్చు అదనం!” అది నాన్న అన్న మాట.
“మీ అక్కయ్యవాళ్ళనేగా పిలిచానూ – మావాళ్ళనేమయినా పిలిచానా? పిలవకపోతే ‘పండుగకు ఆడపడుచును పిలవలేదు’ అని అంతా నన్ను అంటారు. మీకేం, మిమ్మల్ని ఎవరూ అనరు.”
నా వాళ్ళయినా నీవాళ్ళయినా చుట్టాల రాక అంటే అది ఇంటాయనకు మళ్ళీ అంత త్వరగా కోలుకోలేని దెబ్బ. డబ్బుతో పని మరి.
“నీకేం తెలుస్తుంది – బరువు మోసే నాకు తెలుస్తుంది గానీ!”
ఆ వాదన అలా నాన్‌స్టాప్‌గా నడుస్తూనే వుంది. అంతలో ఉన్నట్టుండి “నాన్నా నా స్కూలు ఫీజు కట్టాలి” అన్నాను టెన్త్ వెలగబెడుతున్న నేను. “నేను కూడా” అన్నాడు తమ్ముడు ఎయిత్ క్లాసు వెలగబెతున్నవాడు. మా అమ్మ, నాన్న మా చదువుల గురించి అలాగే మాట్లాడతారు ‘చదువుతున్నాడు’ అని గాక ‘వెలగబడుతున్నాడు’ అని. అందుకని నాకూ అదే భాష వస్తోంది. ఒక్కసారి ‘మిడుకుతున్నాడు’ అని అంటారు. అది డబ్బులు సరిగా వుండని మధ్యతరగతి వాళ్ళ భాష అనుకుంటా. నాకూ తెలియదుగానీ, వినీ వినీ అదే అలవాటయింది.
‘డబ్బు అంటే ఎంత ఇష్టం వీళ్ళకు!’ ఎప్పుడూ అదే మాట, అదే ధ్యాస అన్నట్టుంటారు అందుకే. అమ్మేమో ‘అవసరాలు – పరిస్థితులు’ అని అంటూ ఉంటుంది. మిడిల్ క్లాస్ ‘వే ఆఫ్ టాకింగ్’ అది అని అనిపిస్తుంది నాకు.
***
ఈ మధ్యే మేము పెద్ద బంగళా ఇల్లు కట్టుకున్నాం. కొంచెం ఖరీదైన ఫర్నిచర్ కొనుక్కున్నాం.
మోటార్ బైక్‌తో పాటు సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాం.
ఎందుకంటే – మా ఇంట్లో ఎర్నింగ్ మెంబర్స్‌తో పాటు ఎర్నింగ్ కూడా పెరిగింది. నేను, తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం చెరొక మల్టీనేషనల్ కంపెనీలో, లక్షల్లో జీతం, చెల్లి ఎమ్.సి.ఏ ఫైనల్ ఇయర్లో వుంది.
సంపాదనలు పెరిగాక మాకు పాత ఆ ఇల్లు, ఆ మిడిల్ క్లాస్ లైఫ్ నచ్చలేదు. అందుకే మా life style ని మార్చేశాం.
దాంతో మా బంధువులంతా పెరిగిన మా లెవెల్ వంక ఈర్ష్యగా చూస్తున్నారు.. కొంతమంది ఆశగా కూడా చూస్తున్నారు.
మా అమ్మ నలుగురు ఆడవాళ్ళ మధ్యకు వెళ్తున్నప్పుడు ‘కొంచెం అతిశయం చూపిస్తున్నది’ అని మాకే అనిపించటం మొదలైట్టింది.
“చంద్రహారం మా పెద్దబ్బాయి కొనిచ్చాడు మొన్న నా పుట్టిన రోజుకు, ‘ఇప్పుడెందుకురా?’ అని ఎంత చెప్పినా వినలేదు. ఒక్క తీరుగా గొడవ పెట్టాడు. ‘తీసుకో అమ్మా – నాకు నీకన్నా ఎక్కువ ఇంకెవరన్నారు.’ అంటూ” అనీ, – “ఈ రాళ్ల గాజులు మా చిన్నబ్బాయి చేయించాడు మొన్న పండగకి. దీనికి తోడు ఇరవై వేలు పెట్టి పట్టుచీర ఒకటి-” అంటూ గొప్పగా మాట్లాడుతోంది.
నాన్న సైతం ఈ మధ్య రిటైర్ అయి తిరుగుబడిగా ఉండటంతో మా లక్షల శాలరీస్ని జమాఖర్చులు పెట్టడంలో – ఒకటికి పదింతలయ్యేలా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఆ లెక్కల్లో, ఆర్థిక ఆలోచనల్లో మునిగిపోతున్నాడు.
ఇంతకు ముందు అక్కడక్కడే గిరగిర తిరిగే రంగులరాట్నంలా మా రెండు పడకల చిన్న ఇల్లు వసారా కిచెన్‌తో కలిపి వుండేవేమో, అక్కడక్కడే ఒక్కొళ్ళకొకళ్ళమే కనబడుతూ, వినబడుతూ గిరగిర తిరిగేవాళ్ళం.
కానీ ఇప్పుడు అలా కాదు మూడు డెకాలామ్ మంచాలు, పట్టేంత గదిలో ఒక్కో మంచం మీద ఒక్కొక్కళ్ళం. ఎవరి గదుల్లో వాళ్ళం ఉండటం – అందరికీ తలా ఒక సెల్ ఫోన్ ఉండటంతో దాగుడుమూతలాడుకుంటున్నట్టు ఎవరి ప్రపంచంలో వాళ్ళం దాక్కుంటున్నాం. మాటలు, ముచ్చట్లు, కలిసి భోజనాలు, హాల్లో కింద పక్కలేసుకొని పడుకోవటం, తరతరాల ముచ్చట్లు చెప్పుకొనే నవ్వుకోవటాలూ అన్నీ పోయాయి. ఎంతసేపూ ఫోన్లలోనే హస్క్. ల్యాప్‌టాప్‌లో వర్క్..!
మోడ్రన్ టెక్నాలజీనంతా అవపోశన పట్టినట్టు మా చెల్లి మా అమ్మకు రోజు సెల్ ఫోన్ పాఠాలు చెపుతుండటంతో మా అమ్మ ఇప్పుడు అమ్మలా గాక మమ్మీలా మోడ్రన్‌గా మారిపోయింది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్, రాత్రికి రొట్టెలు, కూర అన్నీ online లో తెప్పించేస్తోంది. దాంతో మా గాస్ పొయ్యి ఎప్పుడూ ఆఫ్ మోడ్ లోనే ఉంటోంది, ఎప్పుడో తప్ప.
మా ఇంట్లో అనుకోకుండా వచ్చిన ఆ మార్పును గమనిస్తున్న నేను మనసు లోలోపల ఆశ్చర్యపోతున్నాను.
డబ్బు జీవితాలను ఇంతగా మార్చేస్తుందా! అని ఆశ్చర్యం వస్తోంది. ముందు ముందు ఈ డబ్బు ఒక జబ్బుగా దీర్ఘవ్యాధిగా మారదు కదా. ఇప్పటికే వస్తున్న సుఖాల మీద తప్ప పోతున్న బాంధవ్యాల మీద, సంబంధాల మీద ధ్యాస వుండటం లేదు. డబ్బులు లెక్కపెట్టుకోవడమే తప్ప లెక్క తప్పుతున్న జీవితపు విలువలను పట్టించుకోవడం లేదు.
‘తప్పిన లెక్కను మళ్ళీ సరిచూసుకోవటం లేదు.’ అని ఆలోచనలో పడుతోంది నా మనసు.
ఆధునికత అంటే యాంత్రిక జీవితం. అంటే దానికి ఊడిగం చేసే స్టేజ్‌కి జారిపోయిన నా అందాల చెల్లి ఒక బిజినెస్ మాగ్నెట్‌కి ప్రేమ వల విరిసి, పెళ్ళి కూడా చేసేసుకొని మా కన్నా ఒకించుక లెవల్‌కు తన స్టేటస్‌ను పెంచుకొని ఆయనతో, ఆయన డబ్బుతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మేము గుర్తుపట్టలేనంతగా తన వేషాన్ని, భాషని మార్చేసి మనిషి చాలా మారిపోయింది. దాంతో పాటు మనసూ మారిపోయింది.
అది చూసి మా అమ్మ, అదే మా మమ్మీ మురిసిపోతోంది.
అమ్మను కూతురు పట్టించుకోకపోయినా కూతుర్ని మాత్రం అమ్మ అనుక్షణం తలుచుకుంటోంది.
ఇల్లాలితనం, అమ్మతనపు ఆలోచన లేని ఆ కొత్త మమ్మీని చూసి ఈ పాత మా మమ్మీ ‘ఇది కదా ఆడదాని జీవితం అంటే. అప్పుడెప్పుడో పెళ్ళి చేసుకుని నేను జీవితంలో ఎంత మిస్ అయ్యాను’ అని బాధపడుతోంది.
జీవితంలో సగభాగాన్ని మిస్ అయినట్టు నిరాశపడిపోతోంది.
అది అలా ఉండగా నాకు పెళ్ళి చేసుకునే తరుణం వచ్చింది. ఆడపిల్లల తండ్రులు మా స్టేటస్ చూసి నాకు పిల్లనిస్తామని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంకా ‘పిల్లను ఎవరో ఇవ్వడం, మనం పుచ్చుకోవడంనా?’ అని మనసు లోనే ప్రిస్టేజికి పోయి, కొద్ది రోజులుగా నా మనసులో మెదులుతున్న, మా ఆఫీసులోనే పని చేసే నా కొలీగ్కి నా లైఫ్ హిస్టరీని చెప్పి ప్రపోజ్ చేశాను.
చూపులకు తను మధ్యతరగతి అమ్మాయిలా కనిపించటంతో నా మనసు పాస్ట్ లోకి వెళ్ళిపోయి ‘తనను పెళ్ళి చేసుకుంటే నా జీవితం సంతోష భరితంగా, భావాత్మకంగా, రసాత్మకంగా ఉంటుంద’ని ఆశ పడ్డాను. మా అమ్మకు ఆ అమ్మాయిని చూపిస్తే ‘చీప్ సెలెక్షన్’ అన్నట్టు నొసలు చిట్లించింది. మా నాన్న “ఆర్థిక లాభం అయితే ఏముండదు. హై క్లాస్ వాడివి అయిన నువ్వు ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీని భరించగలననుకుంటే నీ ఇష్టం” అన్నాడు, తను అక్కడ హై క్లాసులో పుట్టిపెరిగిన వాడిలా.
అయినా నా పెళ్ళి తనతోనే అయింది.
***
రిచ్ పీపుల్ వుండే పెద్ద పాష్ లోకాలిటీలో ఓ బంగళాను కొన్నాం ఈ మధ్యే. మా తమ్ముడికి కోటీశ్వరుడైన మామగారి కూతురితో పెళ్ళి కుదరటం – ఎన్నో సంవత్సరాలుగా వేస్ట్ భూమిగా పడివున్న మా ప్లాట్ పక్కనుంచి నేషనల్ హైవే రోడ్డు పడటంతో కోట్ల ధర పలికి మేమంతా ఉన్నట్టుండి – ఇంకా ఇంకా రిచ్ అయిపోవడంతో మాకు ‘వద్దంటే డబ్బు’ అన్నట్టు కట్టలు కట్టలుగా, ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు’ అన్నట్టు వచ్చి మా బ్యాంకు ఎకౌంట్లలో, లాకర్లలో, అందులోనే బ్లాక్ మనీ రూపంలో పేరుపోవడం జరిగింది.
అంతకు ముందు వందకు రెండుందలకు కూడా వెతుకున్న రోజులు వున్నాయి. అప్పులు చేసిన రోజులు వున్నాయి.
డబ్బులు లేక కోరికలను వాయిదా వేసుకున్న రోజులు వున్నాయి.
అవసరాలకు కూడా డబ్బు లేక ఉన్నవాటితో సర్దుపోయిన రోజులు వున్నాయి.
అలాంటి పరిస్థితి నుంచి ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు వచ్చిపడుతోంది. ఒకరోజు ఏభయ్ లక్షల క్యాష్ నేను ఇంటికి తెస్తే ఇంట్లిల్లిపాదీ బాగ్ లోకి తొంగిచూసి “అబ్బో – ఎంత డబ్బు – ఎన్ని నోట్ల కట్టలో – ఏం చేయాలి? ఇంత డబ్బు – ఎక్కడ దాచుకోవాలి?” అన్నారు. ఎకౌంట్లో వేసుకోంటే సైబర్ నేరగాళ్ళ హస్తగతమవుతుందని భయం.
ఇనకమ్ ట్యాక్సులూ కట్టలేక చావాలి.
లాకర్లలో దోపితే అన్యాయార్జన అంటారు ఏ.సి.బి. వాళ్ళు. రైడ్ చేసి సీజ్ చేస్తారేమోనని భయం.
దాంతో మా ఇంట్లిపాదికి కంటిమీద కునుకు లేదు.
గోడలకు రంధ్రాలు చేసి అందులో – ఆ రహస్య స్థావరంలో దాచేసి పైన సిమెంట్ పూసి అక్కడో పెద్ద పెయింటింగ్ తగిలించాం. మంచాల కింద వుండే స్టోరేజీలో, వంటింటి చెక్క అలమారాలో కూడా దాచేశాం.
ఇల్లంతా డబ్బు మయం.
వళ్ళంతా గోల్డ్ మయం.
మనసంతా భయం, భయం. డబ్బు ఎక్కువయేసరికి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
“ఆడపిల్లలని ఆస్తులన్నింటా తనకు వాటా ఇవ్వకుండా పుట్టింటి వాళ్ళు మోసం చేశార’ని మా చెల్లెలు అలకలు, ఏడ్పులు మొదలుపెట్టింది. మా తమ్ముడు కాస్తంత అధికంగా ఉండి తన సంపాదన జాయింట్ ప్రాపర్టీగా మారిపోయిందని – పంపకాలు చేయమని పోరి తన వాటా తను తీసుకొని పెళ్ళాం పిల్లలతో వేరు కాపురానికి వెళ్ళిపోయాడు.
చుట్టాలు సైతం హై- ఎక్స్‌పెక్టేషన్స్‌తో బెల్లం చుట్టూ ఈగల్లా ముసరటం మొదలు పెట్టారు. ఇవ్వకపోతే ‘నడమంత్రపు సిరి!’ అంటూ మూతులు విరవటం మొదలుపెట్టారు.
అంతకు ముందు ఇచ్చిన పాకెట్ మనీతో ముఖ్యావసరాలు, పరిమిత ఖర్చులు మాత్రమే పెట్టిన మా పిల్లలు పబ్బులు, క్లబ్బులు, రేవ్ పార్టీలు అంటూ తిరగటం, జల్సాలకు మంచి నీళ్ళలా డబ్బు ఖర్చుచేయటం మొదలుపెట్టారు.
ఒక్కడు ఇంటిపట్టున ఉండటం లేదు. పగలు పార్టీలు, నైట్ స్పోర్ట్స్ బైకులు వేసుకొని రింగ్ రోడ్డు మీద డెడ్లీ ఫీట్స్ చేయడం చేస్తున్నారు.
పోలీసులు ఒకరోజు పట్టుకొని, ఫోన్ చేసి చెప్పేదాకా మాకు ఆ విషయం తెలియదు.
సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు, వీడియోలతో సహా కనిపించి మమ్మల్ని తలవంచుకునేలా చేస్తున్నాయి.
‘డబ్బు’ మనుషుల జీవితాలను ఇంతగా మార్చేసిందా?
డబ్బు ఒక జబ్బా!? అవసరాలను మించిన డబ్బు మనిషిని వ్యసనాల పాలు చేస్తుందా!? అని ఆలోచిస్తూ, ఆశ్చర్యపోతూ తలపట్టుకుంటున్నాను నేను.
***
డబ్బు మనిషికి పిచ్చెక్కిస్తోంది.
రాక ముందు ఎలా రప్పించాలని పిచ్చి, వచ్చాక దాన్ని ఎలా ఖర్చు చేయాలా అన్న పిచ్చి –
ఆ ప్రయత్నంలో మనిషి పోని పోకడలు లేవు – వెయ్యని వేషాలు లేవు. డబ్బు యావ ఒక తీరని దాహం లాంటిది.
అందుకే – ఉన్నోడికే – ఇంకా సంపాదించాలన్న తాపత్రయం.
దానికోసం మోసాలు, దోపిడీలు, స్కీములు, జూదాలు.
ప్రస్తుతం నా కళ్ళకు కడుతున్నది అదే.
నా తమ్ముడైతే భారీ ఎత్తున బ్యాంకులను, ప్రభుత్వ నిధులను గట్టుచప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా స్వాహా చేస్తున్నాడని నా అనుమానం,
డబ్బున్నవాడు రాజకీయాల్లో రాణించగలడు గనుక మరింకొన్ని డబ్బుల్ని సంపాదించగలడు గనుక పార్టీ ఫండ్ అంటూ ఒక పార్టీకి డబ్బు కట్టలు బాగానే ఇస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
‘చిన్నవాడు బాగా పైకొస్తున్నాడు’ అని మురిసిపోవటమే తప్ప నా తల్లిదండ్రులకు ఎలా పైకొస్తున్నాడన్నది పట్టదు, డబ్బు అనే కొండచిలువను పట్టుకొని పైకి ఎగబాకాలని చూస్తే, అదే ఏదో ఒకరోజు ఏదో ఒక బట్టబయలైన స్కామ్ రూపంలో గటుక్కున మింగేస్తుంది.
‘మనిషిని మరో మనిషి మోసం చేయవచ్చుగానీ స్పై కెమేరా కన్నును ఎవరూ మోసం చేయలేరు.’ అని ఆలోచిస్తుంటే ‘ఎటుపోతోంది మా కుటుంబం, ఒకప్పుడు ఎలా వుండేది – ఇప్పుడు ఎలా వుంది-?’ అని ఆశ్చర్యంతో పాటు విచారమూ కలుగుతోంది నాకు.
ఆ రెండూ, మా ఫ్యామిలీలో నా ఒక్కడికి తప్ప మరెవరికీ కలగటం లేదు. ‘ఆ దిశగా ఆలోచనలు సాగటం లేదు ఎందుకు?’ అని ఆలోచిస్తుంటే ‘వాళ్ళంతా డబ్బు వ్యామోహంలో మునిగివున్నారు గనుక’ అని సమాధానం దొరికింది నా మనసుకు.
‘కోరిక వేరు వ్యామోహం వేరు.
ఆశ వేరు అత్యాశ వేరు.
సంతోషం వేరు సుఖం వేరు.’ అని రెండింటినీ తక్కెడలో వేసి తూకం వేస్తుంటే నా మనసు అవసరాలకు తగినంత డబ్బున్న ఆ రోజులే, ఆ జీవితమే బాగున్నట్టు అనిపించింది.
మనిషిని మనిషి నుంచి దూరం చేసి – భావనాలోకం నుంచి యంత్ర ప్రపంచంలోకి బలవంతాన నెట్టేసే – ఈ నడమంత్రపు సిరి నచ్చటం లేదు ఈ మధ్య.
డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాడికి డబ్బు విలువ తెలిసి దానధర్మాలు చేస్తాడు, చారిటీ సంస్థలు ఏర్పరుస్తాడు, ‘సమాజం నాకిచ్చిన దాన్ని తిరిగి నేను ఈ సమాజానికి ఇచ్చేయాలి’ అన్న సిద్ధాంతాన్ని వంటబట్టించుకుంటాడు.
‘తన సంపాదనను ఒక దగ్గరే మురగబెట్టి కుళ్ళు కంపు కొట్టనివ్వకుండా – దానికి ప్రవాహశీలతను కల్పించి నలుగురికి ఉపయోగపడేలా చేస్తాడు’ అని ఆలోచన రాగానే నేను నా డబ్బును నలుగురికి, అవసరంలో ఉన్నవారికి పంచెయ్యాలి, అలా నా పుత్రరత్నాలకు నా తోబుట్టువులకు డబ్బు లక్ష్యాన్ని తెలియచెప్పాలి’ అనుకున్నాను గట్టి నిర్ణయం తీసుకుంటూ.
అప్పుడు నా మనసుకు ఎంతో శాంతి లభించినట్టు అయింది – ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరినీ మార్చలేరు.
మనమే మారి మన ప్రవర్తనతో, చేసే పనులతో ‘జీవితం అంటే ఏంటో చెప్పాలి.’ అనుకున్నాను నిశ్చింతగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటూ.
ఆ రాత్రంతా నాకు ఆనాటి మా చిన్నిల్లు, ఆ సగటు సంసారమే కలలో!
ఆ మర్నాడు నేను నిద్రలేచేసరికి నా చెవుల్లో ‘ధనమేరా అన్నిటికీ మూలం – ధనము విలువ తెలిసికొనుట మానవ ధర్మం’ అన్న పాట వినిపించటం మొదలుపెట్టింది.. కానీ అది నా ఊహ అని ఆ తర్వాత అర్థమై నాలో నేను నవ్వుకున్నాను.
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 1500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448
