Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధనుర్మాసం

[(2023 డిసెంబర్ 17 నుంచీ 2024 జనవరి 16 వరకు ధనుర్మాసం సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

సంవత్సరం మార్గశిర మాస బహుళ పంచమి నుంచీ పుష్యమాస బహుళ పంచమి వరకు (అంటే 2023 డిసెంబర్ 17 నుంచీ 2024 జనవరి 16 వరకు) ధనుర్మాసంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రాశస్త్యం ఏమిటి, దాని వెనుకఉన్న కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గోపికలు శ్రీకృష్ణుడే తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసినట్లుగా శ్రీ విల్లిపుత్తూరులోని గోదాదేవి శ్రీకృష్ణుడు తన భర్త కావాలని నెలరోజుల పాటు ధనుర్మాస వ్రతం చేస్తుంది. భగవంతుని స్తుతిస్తూ రోజుకొక్క పాశురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశురాలు రచిస్తుంది. దక్షిణ భారతదేశంలో లక్షలాది భక్తులు వేకువనే వినిపించే ఈ దివ్యప్రబంధం తమిళ రచన అయినప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది.

గోదాదేవి కథను గురించి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ పేరుతో కావ్యంగా రచించాడు. రాయలవారు ఈ కావ్యాన్ని నారికేళ పాకంలో రచించారు (అంటే కొబ్బరిచెట్టు మీద ఉన్న కాయను కోసుకుని తినటం ఎంత కష్టమో ఇందులోని పద్యాలు అర్ధం చేసుకోవటం అంత కష్టం). ఈ కావ్యంలో ఎక్కువగా వర్ణనలు కనిపిస్తాయి. ప్రధాన కథతో పాటు ఖాండిక్య కేశిధ్వజ సంవాదం, యమునాచార్య విజయం, మాలదాసరి మొదలైన ఉపకథలు కూడా వస్తాయి.

పాండ్యదేశంలో గల ఒక ప్రదేశం శ్రీవిల్లిపుత్తూరు. శ్రీ అంటే శుభకరమైన అని, విల్లి అంటే ఉపవనాలతో, పుత్తు అంటే కొత్త, ఊరు అంటే గ్రామం అని అర్థం. అక్కడ శ్రీరంగనాథ స్వామి వటపత్రశాయిగా కొలువై ఉన్నారు. శ్రీ విల్లిపుత్తూరు గురించి కృష్ణదేవరాయలు ఇలా వర్ణిస్తాడు.

“లలితోద్యాన పరంపరా పిక శుకాలాప ప్రతిధ్వానముల్
వలభీనీల హరిన్మణీ పికశుకస్వాన భ్రమంబాస్స మి
న్నులతో రాయు సువర్ణ సౌధముల నెందుంజూడ జెన్నొంది శ్రీ
విలుపుత్తూరు సెలంగు పాండ్యనగరోర్వీ రత్న సీమంతమై”

(ఉద్యానవనాలలో అందమైన చిలుకలు, కోయిలలూ కిలకిలారావాలు చేస్తున్నాయి. ఆకాశాన్ని అంటే బంగారు మేడలు ఆ శుకపికాలాపాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ధ్వనులకు వీధుల వెంట వెళ్ళేవారు తలెత్తి చూస్తే ఆ మేడలలో అలంకారానికి అమర్చిన నీలాలు కోయిలలుగా, పచ్చలు చిలుకలుగా అనుకుని అవి కూస్తున్నాయా అని భ్రమిస్తున్నారు. ఈ విల్లిపుత్తూరు పాండ్య దేశానికి భూమి అనే స్త్రీ నుదుటన పెట్టుకున్న బొట్టులా ప్రకాశిస్తున్నది.)

శ్రీ విల్లిపుత్తూరునే వరహక్షేత్రం అని కూడా అంటారు. ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసుకునే మునులను హింసించేవాడు. భూదేవిని చాపగా చుట్టి సముద్రంలో వేయబోయాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు వరాహావతారమెత్తి భూమిని రక్షిస్తాడు. భూదేవి కోరిక మీద వరాహస్వామిగా ఇక్కడ అవతరిస్తాడు. అందువల్ల ఈ ప్రాంతానికి వరహక్షేత్రం అని పేరు వచ్చింది.

శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీరంగనాథుడి భక్తుడు విష్ణుచిత్తుడు. తన ఇంటి పెరటిలో అనేక తులసి మొక్కలు నాటి ఆ తులసీ దళాలతో మాలలు అల్లి ప్రతిదినం శ్రీరంగనాధ స్వామికి మాలా కైంకర్యం చేస్తూ ఉంటాడు. జనకమహారాజుకి సీతాదేవిలా ఆయనకి అయోనిజగా తులసివనంలో దొరుకుతుంది ఒక పాప. ఆ పాపకి గోదాదేవి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. తనతో పాటు ప్రతిరోజూ దేవాలయానికి తీసుకువెళుతూ ఉంటాడు. భాగవతంలోని శ్రీకృష్ణ లీలలు చదివి వినిపిస్తూ ఉంటాడు.

గోదాదేవి పెరిగి పెద్దయి పదహారేళ్ళ పడుచు అయింది. చుట్టుపక్కల ఇళ్ళలోని ఆడపిల్లలు ఆమెకి చెలికత్తెలు అయ్యారు. వారి పేర్లు మరాళిక, ఏకావళి, మనోజ్ఞ, హరిణి, స్రగ్విణి. భాగవతంలోని గోపికలలాగా గోదాదేవి కూడా శ్రీకృష్ణుడే తన భర్త కావాలని కలలు కంటూ ఉంది. ఒక్కోసారి విరహం ఎక్కువై నిందిస్తూ ఉంటుంది కూడా.

“ఆ దేవుడు ఎప్పుడూ మత్స్య వరాహ వామనావతారాల్లోనే ఉంటే బాగుండేది. తతిమ్మా అవతారాల్లో ప్రేమించిన వాళ్ళను విరహంతో వేగించటమే కదమ్మా అయన చేసిన నిర్వాకం!” అనేది.

“రామావతారంలో సీతను ఎన్నోసార్లు విరహబాధకు గురిచేశాడు కదా! పైగా వలచి వచ్చిన శూర్పణఖను అనాకారిగా చేయటం మగవాడికి తగునటమ్మా! ఆమెను చేసుకున్నట్లైతే అటు సీతకూ, ఇటు శూర్పణఖకూ విరహబాధ తగ్గేది. రావణుడికి సీతను అపహరించాల్సిన అవసరమూ ఉండేది కాదు. బావమరదిగా ఎంతో గౌరవించేవాడు. శూర్పణఖను ఏవగించు కున్నవాడు కృష్ణావతారంలో కుబ్జ అనే మరుగుజ్జు దాన్ని ఎలా ప్రేమించాడే! విరహంతో వేగిపోయే గోపికలను మోసం చేసి, వారిని వ్రేపల్లెలోనే వదిలేసి, మధురానగరం పారిపోయాడు కదా!” అనేది.

ఆమె మాటలు విని చెలికత్తెలు నవ్వుకునేవారు. పరిహాసాలతో మరింత ఉడుకెత్తించేవారు. “మనోజ్ఞా! తాము ప్రేమించిన పురుషులు దగ్గర లేనప్పుడు అందరూ ఇలాగే నిష్టూరంగా దెప్పుతూ ఉంటారే! ప్రేమించినవాడు దక్కినప్పుడు ఇంద్రుడవు, చంద్రుడవు అని పొగిడేస్తూ ఉంటారు” అన్నది హరిణి ఎకసక్కెంగా.

గోదాదేవి శ్రీరంగనాథుడే భర్త కావాలని ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. శ్రీ విల్లిపుత్తూరునే వ్రేపల్లెగా, అక్కడ కొలువై యున్న రంగనాథస్వామినే శ్రీకృష్ణ పరమాత్మగా, తను, తన చెలికత్తెలు గోపికలుగా ఆ భావనా ప్రకర్షతో వ్రతాన్ని తలపెట్టింది. దీనినే ద్రావిడ భాషలో తిరుప్పావై వ్రతం అంటారు. రోజుకొక్క పాశురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశురాలు రచించింది. “నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినదానను కాదు. ఆయన అనుగ్రహం తప్ప మరేదీ నాకు రుచించదు” అని తెలియజేయటమే ధనుర్మాస వ్రత పరమార్థం.

తిరుప్పావై ప్రబంధంలో మూడు దశలు ఉన్నాయి. మొదటి అయిదు పాశురాలలో వ్రత పూర్వరంగం, వ్రతంలోని భాగాలు ఉన్నాయి. ఆరవ పాశురం నుంచీ పదిహేనవ పాశురం వరకు నిద్రలో ఉన్న గోపికలను మేలుకొలిపి వ్రతంలో చేర్చుకోవటం ఉంటుంది. పదహారవ పాశురం నుంచీ ముప్పైయ్యవ పాశురం వరకు నందగోపుని, యశోదమ్మను, బలరాముని మేల్కొలిపి, తాను నీలాదేవిగా శ్రీకృష్ణుని కూడా మేల్కొలిపి చివరకు మంగళాశాసనం చేసి, తన వాంఛితం నేరవేర్చమని వేడుకుంటుంది. ఉదాహరణకు ఒక పాశురం, దాని భావం ఇలా —

“నాయగనాయ్ నిర్ర నందగోపనుడై య
కోయిల్ కాప్పానే! కోడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరో ముక్కు అరైపరై
మాయన్ మణివణ్ణన్ నేన్నలే వాయ్ నేర్ర్దాన్
తూయో మాయ్ వన్దొమ్, తుయిలెద ప్పాడువాన్
వాయాల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా! నీ,
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్!”

(మనకందరకునూ నాయకుడై యున్న నందగోపుని భవన ద్వారపాలకుడా! గరుడ ధ్వజము ఎగురుచూ కనబడేడి తోరణము ప్రకాశించెడి రెండవ వాకిట నుండు ఓ రెండవ ద్వారపాలకుడా! మాణిక్యమయమైన తలపుల తాళములను తెరువుమా! మా గురించిన భయముచే అనుమాన పడనవసరము లేదని అజ్ఞానులమయిన చిన్ని గోపికలము కదా! మా వ్రతభాగము అగు ‘పరై’ అనే దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై, మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినముననే వాగ్దానమొనర్చినాడు. అందుకొరకై మేము నిదుర నుండీ మేలుకొలుపును గానమొనరించుటకు పవిత్రులమై ఏతెంచితిమి. మొదటగానే అడ్డును పెట్టవద్దు స్వామీ! శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగ బంధితమై యున్న కవాటములను తెరువవలసినదిగా కోరుచున్నాము).

శ్రీకృష్ణుని భార్యలైన రుక్మిణి, సత్యభామల వంటి వారితో సమానమైన సౌందర్యం కలదాననేనా అనుకుంటూ తండ్రి మాలాకైంకర్యం కోసం తాయారు చేసి ఉంచిన తులసిమాలను సిగలో ధరించి బావి నీటిలో చూసుకుని, సంతృప్తి పడి మళ్ళీ యథాస్థానంలో ఉంచేది గోదాదేవి. ఇలా ప్రతిరోజూ చేసేది. ఈ సంగతి తెలియక ఆమె ధరించిన మాలను మళ్ళీ స్వామికి సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. ఒకరోజు అనుకోకుండా ఇదంతా కంటబడింది. “అయ్యయ్యో! స్వామికి సమర్పించాల్సిన మాల నువ్వు ధరించి అపవిత్రం చేశావా! పాపిష్టి దానా! మైలపడిన దాన్ని ఎలా సమర్పించను?” అని చివాట్లు వేశాడు.

ఏనాడూ తనని పల్లెత్తి మాట అనని తండ్రి అన్ని మాటలు అంటుంటే గోదాదేవి ఏడుస్తూ కూర్చుండిపోయింది. విష్ణుచిత్తుడు కూడా విచారిస్తూ ఆలయానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఆనాటి రాత్రి రంగనాథుడు కలలో కనబడి “విష్ణుచిత్తా! ఈరోజు నాకు మాలా కైంకర్యం చేయలేదే!” అని అడిగాడు. “ఎలా చేయను స్వామీ! నా కుమార్తె వాటిని అపవిత్రం చేసింది కదా!” అన్నాడు.

“వెర్రివాడా! ఆమె ధరించిన మాలలే నాకు ప్రియమైనవి. ఈనాటి నుంచీ నీ కుమార్తె ‘ఆముక్తమాల్యద’ అని పిలవబడుతుంది (ఆముక్త – అంటే అలంకరించుకోబడిన, మాల్య – అంటే పూదండ అనీ, ద – అంటే ఇచ్చినది అనీ అర్ధాలు). భూదేవి నీ కుమార్తెగా పుట్టి నన్నే చేరుకోవాలనే కాంక్షతో విరహ తాపం పొందుతున్నది. నీ కుమార్తెని శ్రీరంగం తీసుకువెళ్ళి నాకు సమర్పించు. నీకు శుభం కలుగుతుంది” అని అంతర్ధానమయ్యాడు స్వామి.

తెల్లవారిన తర్వాత విష్ణుచిత్తుడు మహదానందంతో కుమార్తెను పల్లకీలో ఎక్కించుకుని బంధుమిత్రుల సమేతంగా శ్రీరంగం బయలుదేరాడు. శ్రీవిల్లిపుత్తూరులో కుమార్తె పెళ్ళికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశాడు విష్ణుచిత్తుడు. శ్రీమహావిష్ణువు గరుత్మంతునిపై ఊరేగుతూ సకల దేవతలు వెంటరాగా పెళ్ళికి తరలివచ్చాడు. నారదుడు, తుంబురుడు సంగీత మంగళధ్వనులు చేశారు. సరస్వతి వేదమంత్రాలు చదివింది. శాస్త్రోక్తంగా కన్యాదానం జరిగింది. విష్ణువు గోదాదేవి మెడలో మంగళసూత్రం కట్టాడు. గోదాదేవి తను రచించిన పాశురాలు భక్తితో క్రమం తప్పకుండా పఠించేవారికి తనకు కలిగిన ఫలమే లభిస్తుందని మంగళా శాసనం చేసింది. పెళ్లి అనంతరం భార్యను తీసుకుని వైకుంఠం తరలి వెళ్ళాడు శ్రీమహావిష్ణువు.

గోదాదేవి వివాహవృత్తాంతాన్ని నేటికీ ఆలయాల్లో స్వామి కళ్యాణ వేళ పాడుకోవటం ఆచారంగా ఉంది. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని రచించి లోకాన్ని ఉజ్జీవింప చేసింది కనుక ఆమెను భక్తులు ఆండాళ్ అని పిలుస్తారు. ఆండాళ్ అంటే ఉద్ధాపకురాలు అని అర్ధం. శ్రీరంగనాథుని భార్య అయింది కనుక రంగనాయకి అని కూడా పిలుస్తారు. గోదాను రంగనాయకిని చేసిన భగవదనుగ్రహానికి భోగము అని పేరు. గోదా రంగనాధుల కళ్యాణ దినమునే తెలుగువారు ‘భోగి’ అనే పేరుతో జరుపుకుంటారు. అదే సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ.

తిరుమలలో శ్రీనివాసుని వక్షస్థలంలో కుడివైపు బంగారు చిలుక బొమ్మను, ఎడమవైపున పూల చిలుకబొమ్మను అలంకరిస్తారు. ధనుర్మాసం అంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు. ప్రతిరోజూ ఏకాంత సేవలో శ్రీనివాస మూర్తికి బదులుగా చేతిలో వెన్నముద్ద ఉన్న కృష్ణునికి శయన భాగ్యం కలిగిస్తారు.

(ఈ వ్యాసంలోని బొమ్మలను గీసినది రచయిత గారి శ్రీమతి, డ్రాయింగ్ టీచర్ సరళ గారు.)

Exit mobile version