రైతు రంగరాజు తన ఇంటి పెరడులో మంచం మీద కూర్చుని, భాగవతంలోని కథలు చదువుతున్నాడు. ఇంటి పెరడు చాలా పెద్దది! అందులో బోలెడు రకాల పండ్ల, పూల చెట్లు పెంచుతున్నాడు రంగరాజు. రంగరాజుకు చెట్లంటే మహా ప్రేమ.
పెరడులోకి ఒక వింత రంగుల ఈకలతో ఉన్న పక్షి ఒకటి ఎగురుతూ వచ్చి వేప చెట్టు కొమ్మ మీద కూర్చుని ఒక విత్తనాన్ని జారవిడిచి శ్రావ్యంగా పక్షి పాట పాడింది, రంగరాజు ఇంతకుముందు అంత శ్రావ్యమయిన పక్షి పాట విని ఎరుగడు, అంత అందమైన పక్షిని కూడా చూడలేదు!
కొంతసేపటికి పక్షి ఎగురుతూ వెళ్లి పోయింది.
“ఎటువంటి విత్తనం చేసిందో చూద్దాం” అని రంగరాజు విత్తనం జారవిడిచిన చోటుకి వెళ్ళాడు కాని ఏ విత్తనం కనబడలేదు!
రెండవ రోజు పొద్దున్నే లేచి పెరడు లోకి వచ్చి చూసేసరికి విత్తనం పడిన చోట్లో ఒక అడుగు ఎత్తులో ఒక వింత మొక్క ఎదిగి కనిపించింది! దాని ఆకులు రంగు రంగులుగా విచిత్రంగా ఉన్నాయి! దానిని చూసి రంగరాజు ఆశ్చర్యపోయి మొక్కకు నీళ్ళు పోశాడు.
రోజు రోజుకూ అలా అది రంగు రంగుల ఆకులతో అందమైన మొక్కగా మారి రెండు నెలల్లోనే అది పెద్ద చెట్టుగా మారిపోయింది!
రకరకాల మొగ్గలు రకరకాల రంగుల్లో ఉన్నాయి! ఇంకా ఆకులు కూడా వింత రంగులు సంతరించుకున్నాయ చెట్టు కళాత్మకంగా కనబడసాగింది. దాని పండ్లు కూడా వివిధ రంగుల్లో ఉండి ఏ దేవతలో సృష్టించిన చెట్టు లాగ కనబడసాగింది!
రంగరాజు అతని భార్య, కొడుకు ఆ చెట్టును చూసి ఆశ్చర్య పోయారు.
చెట్టు అభివృద్ధి చెందినపుడల్లా ఆ పక్షి వచ్చి చక్కని పాట పాడి పోతున్నది.
రంగరాజు కుటుంబం పండ్లు కోసి తినాలనుకొన్నారు.
రంగరాజు కొడుకు నందుడు కొంత దూరదృష్టి కలవాడు,
“నాన్నా, ఈ చెట్టును గురించి, పండ్లను గురించి మనకు తెలియదు, తెలియని వాటిని తింటే అవి ఏ విష పండ్లో అయితే కష్టం కదా, అందుకని మనం రాజుగారి ఆస్థాన ఆయుర్వేద వైద్యుడు శివాక్షుడిని కలసి చెట్టును గురించి వివరిద్దాము, ఆయన చెట్టును గురించి చెప్పగలడు” అని చెప్పాడు.
నందుడు చేసిన సూచన రంగరాజుకు నచ్చి మరుసటి రోజే ఇద్దరు శివాక్షుడిని కలసి చెట్టును గురించి అన్ని వివరాలు వివరించారు.
వారి మాటలు విన్న శివాక్షుడు ఆశ్చర్యపోయి, వెంటనే రంగరాజు పెరడులో ఆ చెట్టును చూసి ఆశ్చర్య పోయాడు.
“రంగరాజూ, ఈ చెట్టు ధన్వంతరి చెట్టు, ఇది ఆరోగ్య ప్రదాయిని, ఇది కేవలం హిమాలయాల పర్వత ప్రాంతాలలో పెరుగుతుంది! నిజానికి ఈ చెట్టు ఇక్కడి వాతావరణంలో పెరుగదు, కానీ కొన్ని రకాలు చల్లని వాతావరణం లేక పోయినా పెరుగుతాయి, అటువంటి చెట్లు కనిపెట్టడం చాలా కష్టం, అటువంటి మహత్తర చెట్టు మీ ఇంట పెరిగింది. దీని విత్తనం మీకు ఎక్కడిది?” అని అడిగాడు.
“ఒక వింత రంగుల పక్షి విత్తనం మా పెరడులో పడేస్తే ఇదుగో ఈ విధంగా పెరిగింది”చెప్పాడు రంగరాజు.
“మనిషికి దొరకని విత్తనం ఆ వింత పక్షికి దొరికింది, అది మన రాజ్యం చేసుకున్న అదృష్టం! దీని ఔషధ గుణాలు అద్బుతం ఊపిరితిత్తి, క్షయ,ఉదర సంబంధ వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు, నా అభ్యర్ధన ఏమిటంటే ఈ చెట్టును జాగ్రత్తగా కాపాడండి, దీని విత్తనాలు రాజు గారి తోటలో కూడా వేద్దాము, దీని పండ్లు మీరు భేషుగ్గా తినవచ్చు, ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ చెట్టు వలన నేను ప్రజలకు మేలైన వైద్యం చేస్తాను” అని చిరునవ్వుతో చెప్పాడు.
“తప్పకుండా, శివాక్షుడు గారు, మా పెరడులో పెరిగిన చెట్టు వలన ప్రజలకు మేలు జరిగితే అంతకన్నా కావలసిందేముంది? చెట్టు విత్తనాలు తీసి రాజు గారికి అందిస్తాను”
శివాక్షుడు రాజు గారికి చెట్టును గురించి వివరించాడు. రాజు గారు కూడా చెట్టును చూసి ఆశ్చర్య పోయారు. అంత అరుదైన చెట్టువిత్తనాలు ప్రజల ఆరోగ్యం కోసం రంగరాజు ఇస్తున్నందుకు, రంగరాజును ఆస్థానానికి పిలిపించి సన్మానం చేసి ఎకరం భూమిని ఇచ్చి ‘వృక్ష మిత్ర’ అనే బిరుదు ఇచ్చారు! దూరంగా చెట్టు కొమ్మ మీద కూర్చున్న రంగుల పక్షి ఆనందంగా రాగం ఆలపించింది.