వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అంటే ఈయన పాదాలు వ్యాఘ్రము (పులి) యొక్క పాదాలు వలె ఉంటాయి అని అర్థము. లేదా వ్యాఘ్రము వలె సంచరించేవాడు అని కూడా అర్థము. అంతే కాదు వ్యాఘ్రపాదుడు జంతువులలో ఉండే కామ క్రోధ మద మాత్సర్యాలనే నాలుగు చెడు లక్షణాలను వదలి వాటి యందు వ్యాఘ్రము వలె ఉండేవాడని కూడా అర్థము. ఈయన కృత యుగములో ధర్మ ప్రవచన దక్షుడు. వేద వేదంగ విదురుడు ఈ మహా ముని. హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహామహ రుషులలో ఒకడు. వీరిలో ఒకొక్కరికదీ ఒకో కథ. ప్రస్తుతము వాటిలో ఒకటైన వ్యాఘ్రపాద మహర్షి గాథను తెలుసుకుందాము.
వ్యాఘ్రపాదుడు ‘మధ్యందిన’ అనే మహర్షి కుమారుడు. శివభక్త తత్పరుడు. చిదంబరంలోని ఒక శివలింగాన్ని అర్చిస్తూ, శివుని గురించి తపస్సు చేసుకుంటూ కాలాన్ని గడిపేవాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వ్యాఘ్రపాదుని మదిని ఒక చింత తొలవసాగింది. అది ఏమిటి అంటే శివుని అర్చన కోసం తాను సమీపంలోని తిల్లై అనే అడవి నుంచి రకరకాల పుష్పాలను తెస్తున్నాడు. కానీ ఆ పూలను తాను కోయకముందే, శివునికి అర్పించక ముందే తేనెటీగలు వాటిని ఆఘ్రాణిస్తున్నాయి, వాటిలోని సారాన్ని పీల్చేసుకుంటున్నాయి. అలా నిస్సారమైన పుష్పాలను తాను స్వామివారికి అర్పించడం ఏమిటన్న ఆలోచన వ్యాఘ్రపాదుని మనసుని తొలవసాగింది.
తన సమస్యకు పరిష్కారము చూపమని వ్యాఘ్రపాదుడు ఆ పరమశివునే ప్రార్థించాడు. నిజానికి పరమశివుడు భక్తితో, ప్రేమతో ఏ పుష్పాన్ని ఉంచినా, ఆఖరికి బిల్వపత్రంతో తనను అర్చించినా అంగీకరిస్తాడు, జలముతో అభిషేకము చేసిన శివునికి అభ్యంతరం లేదు. కానీ స్వచ్ఛమైన పూలనే తన చెంత ఉంచాలనుకునే వ్యాఘ్రపాదుని కోరికను ఆయన తీర్చదలుచుకున్నాడు. అందుకని అతను మూలమూలలా ఉండే స్వచ్ఛమైన పూలను సేకరించేందుకు అనువుగా పులి (వ్యాఘ్రము) పాదాలను అనుగ్రహించాడు. అందుకనే ఆయనకు వ్యాఘ్రపాదుడు అన్న పేరు స్థిరపడిపోయింది. అమలినమైన పూలు ఎంతటి ఎత్తులో ఉన్నా, ఏ పొదలో దాగున్నా కాళ్లకు ముళ్లు గుచ్చుకోకుండా నేర్పుగా వాటిని కోసేందుకు వ్యాఘ్రపాదాలు ఉపయోగపడసాగాయి.
వ్యాఘ్రపాద మహర్షి ఒక మునికన్యను వివాహము చేసుకొని గృహస్థ ఆశ్రమ ధర్మములు ఆచరించెను. వ్యాఘ్రపాదునకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఉపమన్యుడు, రెండవ కుమారుడు ధౌమ్యుడు. ఇద్దరూ పరమశివభక్తులే అసాధారణ దక్షత కలిగిన వారే. ఉపమన్యుడు తల్లి అనుమతితో శివుడు యొక్క అనుగ్రహంతో మహాజ్ఞాని, మహాయోగి అయ్యాడు. ఉపమన్యుడు సంతానాన్ని అనుగ్రహించగల ఓ వ్రతాన్ని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణునికే ఉపదేశించాడు. అలాగే ధౌమ్యుడు కూడ పరమశివుని అనుగ్రహముతో మహర్షి అయ్యి, పాండవులకు పురోహితుడు అయ్యాడు.
చిదంబరంలో శివుడు తాండవాన్ని ప్రదర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ అద్భుత ఘట్టానికి వ్యాఘ్రపాదుడు కూడా ఒక సాక్షిగా నిలిచాడట. అందుకే చిదంబరాన్నివ్యాఘ్రపురి అని కూడా పిలుస్తారు. అందుకే ప్రాచీన చిత్రాలలో పతంజలి రుషితో కలిసి నటరాజ స్వామిని కొలుస్తున్న వ్యాఘ్రపాదుని రూపం కనిపిస్తుంది. వ్యాఘ్రపాదునికి సంబంధించి ఇంతకంటే ప్రముఖమైన కథలు లేకపోయినప్పటికీ, ధార్మిక సాహిత్యంలో ఆయన పేరు అడపాదడపా కనిపిస్తూనే ఉంటుంది. సనాతన ధర్మ పరిరక్షణకై ‘వ్యాఘ్రపాద స్మృతి’ పేరుతో అనేక వైదిక కర్మల గురించిన సంకలనం కూడా ప్రచారంలో ఉంది. ఈ గ్రంథము ద్వార యుగ ధర్మాలను ఆశ్రమ ధర్మాలను పిండ ప్రధాన పితృ తర్పణ మహత్యాన్ని, శ్రాద్ధ విధి మొదలైన అంశాలను తెలుసుకోవచ్చు.
అలాగే వ్యాఘ్రపాద మహర్షి ఒకానొకప్పుడు కాశీ పట్టణం లోని విశ్వేశ్వరుడిను సందర్శించి అనన్య నిరుపమానమైన అయిన భక్తితో విశ్వనాథాష్టకమును స్తుతించాడు. వ్యాఘ్రాపాదుడు ఋగ్వేదంలోని అనేక మంత్రాలను తెలిపిన మంత్ర ద్రష్ట. వ్యాఘ్రపాద మహర్షి గాథ ద్వారా మనకు కావలసినది నిష్కామ భక్తి మాత్రమే. ఆ నిష్కామ భక్తి ద్వారా మాత్రమే పరమేశ్వరుని తృప్తి పరచవచ్చు.
పరమేశ్వరునికి కావలసినది స్వార్థముతో కూడిన భక్తి కాదు అని ఈ కధలోని నీతి.