Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధర్మనిరతియే మన కర్తవ్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ధర్మనిరతియే మన కర్తవ్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః।

యానేవ హత్వా న జిజీవిషామః తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః॥

(భగవద్గీత 2వ అధ్యాయం, 6వ శ్లోకం)

ఓ కృష్ణా! ఈ కురుక్షేత్ర యుద్ధం యొక్క ఫలితం చివరకు ఎలా వుంటుందో, అసలు అది మనకు మంచిదో కాదో, మన శత్రువులను జయించడం లేదా వారిచే జయించబడడం అనేది కూడా మనకు తెలియదు. వారిని చంపిన తర్వాత కూడా మనం జీవించాలని కోరుకోము. అయినప్పటికీ వారు ధృతరాష్ట్ర కుమారుల పక్షం వహించి, ఇప్పుడు యుద్ధరంగంలో మన ముందు నిలబడ్డారు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. వ్యక్తి ధర్మం వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఉండవచ్చు. వృత్తి ధర్మం వ్యక్తి ధర్మానికి ఆటంకమవవచ్చు. ఆందోళన కలిగించవచ్చు. ధర్మం వ్యక్తిపరంగా, వృత్తి పరంగా, వ్యవస్థ పరంగా, మత పరంగా, బాంధవ్యాల పరంగా, సంబంధాల పరంగా, బంధనాల పరంగా, ఒక్కో స్థితిలో ఒక్కోలా, వేర్వేరు పరిస్థితులలో వేర్వేరుగా ఉన్నట్లు అనిపించవచ్చు. వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి ధర్మ నిర్ణయం చేసే సందర్భంలో ఎన్నింటినో పరిగణించాలి. పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా పనులను ప్రారంభించేటప్పుడు వాటి ఫలితాలపై సమగ్ర మూల్యాంకనం చేయడం ఎంతో అవసరం. ఆ పనులను చేసేందుకు వివిధ ప్రత్యామ్నాయాలు మరియు వాటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. అర్జునుడు కౌరవులను ఓడించడం మంచిదా  లేదా వారి చేతిలో ఓడిపోవడం మంచిదా అని చర్చించుకుంటున్నాడు. చివరకు రెండు ప్రత్యామ్నాయాలు ఓటమిలా అనిపించాయి, ఎందుకంటే అతను కౌరవులను చంపడం ద్వారా యుద్ధంలో గెలిస్తే, అతనికి ఇక జీవించాలనే కోరిక ఉండదు. ఈ విధంగా అర్జునుడు బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు అనే మోహావేశంలో ఇరుక్కొని తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. అయితే ధర్మనిరతికి మారు పేరైన  భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనవారు అధర్మపరులైన కౌరవుల పక్షం వహించి ధర్మాన్ని విస్మరించి ప్రవర్తించారనేది వాస్తవం. అందుకే వారి ధర్మ నిరతి ఎందుకూ పనికి రాకుండా పోయింది.

రామాయణంలో శ్రీరాముడు ఒకసారి ధర్మ నిరతి గురించి ఈ విధంగా చెప్పాడు.

“న సా సభా యత్ర న సన్తివృద్ధా

వృద్ధా నతే యేన వదన్తి ధర్మమే”

అంటే వృద్ధులు లేని సభ సభే కాదు. ధర్మము చెప్పనివారు వృద్ధులు కాదు కదా. సత్యము లేనిదే ధర్మం కాదు. సత్యం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించే ఉంటుంది. కపటముతో కూడిన సత్యం సత్యమే కాదు. సభ్యులు తెలిసి ఉండీ కూడా మాట్లాడకుండా చూస్తుంటారు.

అర్జునుడి గురువులు మరియు పెద్దలు అతనిచే చిన్ననాటి నుండి కూడా అమితంగా గౌరవించబడ్డారు. వారందనినీ అత్యంత పూజ్య భావంతో అర్జునుడు బాల్యం నుండి సేవించాడు. అయితే విధివశాత్తు వారు అతనికి వ్యతిరేక పక్షంలో నిలబడి అతనితో యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు. అదే విధంగా, జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అనుభవంలో వ్యక్తులలో దాని ప్రతికూల అంశం ఉంటుంది. ఇది జీవితం గురించి ఆసక్తికరమైన అంతర్దృష్టి. మనకు అన్ని సమయాలలో ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులు, అనుభవాలు లేదా వస్తువులు దొరకడం చాలా అరుదు అని ఈ ఘటన తెలియజేస్తోంది.

Exit mobile version