Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధర్మర్మం

గవంతుడా! అంటూ ఆర్తనాదం.

ఒక స్త్రీ కంఠం. నిండు చూలాలు. పెద్ద వర్షంలో. ఎక్కడి నుంచీ వచ్చిందో. బాగా గాయపడి ఉంది. మరొక నిముషంలో మరొక శబ్దం. ఒక చిన్న పిల్ల ఏడుపు. పసిబిడ్డ జననం.

కేక చెవిన పడ్డ వృద్ధుడు ఆ వైపు చూశాడు. కాలు బైట పెట్టలేనంత వాన. ఛత్రమా అప్పటికప్పుడు కనుపించలేదు. ఆలస్యం చేయదల్చుకోలేదు.

స్త్రీ.

పసికందు.

వాకిలి దాటబోయి క్షణకాలం ఆగాడు. ఏ భగవంతుడినైతే తను నమ్ముకున్నాడో ఆ భగవంతుడినే పిలిచిందామె. ఒంటరిగా ఉన్నట్లుంది. ఎందుకలా? ఆలోచించలేదు. పిశాచాలు అలా జాలిగొలిపేలా పిలిచి ప్రాణాలు హరించటం తనకు తెలుసు. కానీ తన ఇంటి దగ్గర కాదు. నిత్యాగ్నిహోత్రం, మంత్ర జపాల వల్ల పావనమై ఉన్న శక్తి క్షేత్రం. వాన ఉధృతి పెరుగుతోంది. మరో క్షణం ఆలస్యం చేయలేదు. ముందుకు దుమికాడు. అడుగు వేసిన చేట బురదగా ఉండాల్సిన నేల గట్టిగా, పొడిగా మారింది చిత్రంగా. అది గమనించలేదతను. మరో రెండు క్షణాలలో ఇంటెదురు వీథి దాటాడు. పొదలకు అవతలగా ఉన్న చెట్టు కింది కనిపించిందా మహిళ. పసి బిడ్డను చేతులకందించి ప్రాణం విడిచింది.

ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడాయన ఆ పిల్లను. శ్రద్ధ అని పేరు పెట్టాడు. నాలుగేళ్ళు గడిచి శ్రద్ధ ఐదవ ఏట ప్రవేశించింది. ఊరు కాస్త పెరిగి వారుండే చోట ఇప్పుడు కేక వేస్తే అందేలా ఇళ్ళ పడుతున్నాయి. వారి ఇంటి వెనుక మార్గం గుండా అడవిలో కాస్త ఎడమవైపు వెళితే ఒక కాలిబాట వస్తుంది. దాని మీద ఐదు నిముషాలు వేగంగా నడిస్తే ఆలయాన్ని చేరతారు. ఆ ప్రాంతంలో అదే పెద్ద ఆలయం. సింగారాచార్య దానిలో ప్రధాన అర్చకులు.

అడవిభాగంలో ఉన్నా, ఏమి చిత్రమో పగలు పూట అక్కడ ఏ ప్రమాదాలు జరుగవు. రాత్రులు మాత్రం ఆ వైపు వెళ్ళటానికి జంకుతారు. సింగరాచార్య ఎక్కడి నుంచి ఆ ఊరికి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఇరవై సంవత్సరాల క్రితం అడవి అంచున మూలకున్న ఆ ఆలయాన్ని ఆయనే కనుగొన్నాడు. అందులో ఉన్న బాల కృష్ణుడినే నమ్ముకుని జీవిస్తున్నాడు అప్పటి నుంచీ. స్వయం భూః అయిన ఆ కృష్ణుడికి, ఊరిలో పేరెన్నికగన్న శిల్పి చేత గోదాదేవి విగ్రహాన్ని చేయించాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అప్పటి నుంచీ ఆ ఊరిలో. జనానికి ధర్మ మార్గం బోధిస్తూ, పగలు ఆలయంలో అర్చన చేస్తూ, ఊరివాళ్ళు ఇచ్చే బియ్యం, కూరలు, పళ్ళు మొదలైన వాటితో జీవనం సాగిస్తున్నాడు. నా అన్న వాళ్ళు లేని సింగరాచార్య కు శ్రద్ధే ప్రాణం. నిత్యం దైవ నామస్మరణతో, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్న మాటకు నిదర్శనమైన ఆయన జీవితంలో ఒక దుర్ఘటన జరుగబోతోంది. కాలం పెట్టే పరీక్ష!

వసంత ఋతువు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఆ రోజే చివరి రోజు. రథోత్సవం కూడా ఉండటం మూలాన ఆయన రోజూకన్నా ముందే ఆలయానికి వెళ్ళాలి. సాధారణంగా తెల్లవారుఝామునే వెళ్ళే పనైతే శ్రద్ధ కూడా ఆయనతో గుడికి వెళ్తుంది. కానీ ఆరోజు మరింత ముందే వెళ్ళాలి. పైగా శ్రద్ధకు జ్వరంగా ఉండటాన పిల్లను ఇంట్లో ఉంచే బయలుదేరాడు. ఎవరన్నా ఆడపిల్లను పంపి శ్రద్ధను కాస్త ఆలస్యంగా ఆలయానికి రప్పించవచ్చు అన్నది ఆలోచన. మరోవైపు గుడిగాడు కూడా లేడు. పదిహేను రోజులైంది. కనపడి. ఉత్సవాలప్పుడు ఒళ్ళు తెలియకుండా పని చేస్తాడు. వాడు లేని లోటు తెలుస్తూనే ఉంది. అందుకే ఆయన మరింత ముందు వెళ్ళాల్సి వచ్చింది.

శ్రద్ధ తండ్రికి తగ్గ కూతురు. బంగారు బొమ్మ. చామనచాయతో, చూడగానే ఏ దేవతన్నా పసిపిల్ల రూపంలో వచ్చిందేమో అనిపించేంత తేజస్సుతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రద్ధ అంటే ఊళ్లో జనానికి కూడా అభిమానం. తండ్రి లాగానే జాలి గుండె. దేవుడి మీద నమ్మకం. తెగువ కూడా. ఎవరికి సహాయం కావాలన్నా తన చేతనైనంత చేస్తుంది.

ఆరోజు అటు తండ్రి వెళ్ళగానే శ్రద్ధకు మెలకువ వచ్చింది. జ్వరపు బడలిక ఎక్కువగా ఉంది. పక్కన నాన్న కనపడలేదు. గుడికి వెళ్ళాడేమో అనుకుంది. దీపపు వెలుగులో చిన్నగా బడలికతో కూడిన అడుగులతో శ్రద్ధ మంచినీళ్ళ కుండ దగ్గరకు వెళ్ళి నీళ్ళు తాగబోతోంది. ఇంతలో పెద్ద కేక. అది రాజన్న స్వరం. శ్రద్ధమ్మా! అంటూ. ఆ స్వరంలో కంగారు పసిగట్టిందా పసిది. ఏమైందా అనుకుంటూ ఆత్రుతగా తలుపు తీసి చూసింది. రాజన్న ఆ ఊరి శిల్పి శిష్యుడు. మొహంలో కంగారు.

“నాన్నకు పెద్ద ప్రమాదమైందమ్మా, త్వరగా పద వెళ్దాం,” కంగారుగా అన్నాడు. శ్రద్ధ ఆ మాటలను అర్థం చేసుకునే లోపలే చంకనేసుకుని పరిగెత్తటం ప్రారంభించాడు. ఎదుడుదిగుడు నేల మీద వంకర టింకర అడుగులతో. శ్రద్ధ ఏడుపు బిగపట్టుకుని ఉంది. ఇంతలో ఎడమవైపు తిరగాల్సింది కుడివైపు తిరిగాడు రాజన్న. శ్రద్ధకు అర్థమయ్యే లోపల వేగం మరింత పెంచాడు. అసలే జ్వరం. తండ్రికి ప్రమాదమన్న వార్త. ఇప్పుడీ అనుకోని ఉపద్రవం. శ్రద్ధకు కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి.

తల అటూ ఇటూ విదల్చాలని ప్రయత్నం చేసింది. వడలిపోయి, వంగి పోయిన చిన్న మొక్క సన్నటి గాలికి కదిలినట్లు కదిలిందంతే. అంతేనా? లేక వాడి పరుగు వేగానికా? స్పృహ తప్పేలా ఉంది. నోటితో పెద్ద కేక పెట్టాలనుకుంది. కుదరలేదు. వాడి వీపు మీద తన ఎడమచేతి వాడి గోళ్ళను దింపాలనుకుంది. వల్లకాలేదు. మరోక్షణంలో స్పృహ కోల్పోయింది. ఎక్కడో ఏదో లీలగా కృష్ణుడి రూపు కళ్ళముముందు మెదలాడటమే ఆఖరి ఙ్ఞాపకం. అది భ్రమా?

వెలుతురు వస్తున్న వేళ!

భీభత్సమైన అరుపుకు శ్రద్ధకు మెలకువ వచ్చింది. కంటపడిన దృశ్యానికి మరోసారి స్పృహ తప్పబోయి బిగుసుకు పోయింది. ఎదురుగా బ్రహ్మ రాక్షసి. ఒక మనిషిలాంటి ఆకారాన్ని సగానికి విరవటం చూసింది. ఛిప్పున చిమ్మింది రక్తం. రెండు భాగాల నుంచీ. ఎగసి ఆ రాక్షసి మొహానే పడింది. మరోక్షణంలో ఆ మానవాకారాన్ని నములుకు తినేసింది. మొహం మీద పడిన రక్తాన్ని నాలుకతో నాకేసింది. ఆ వికృతమైన చర్య చూసిన శ్రద్ధ తెలివితప్పి పడిపోయింది.

ఎక్కడి నుంచో మొహాన నీళ్ళు పడటంతో శ్రద్ధకు తెలివి వచ్చింది. ఆ బ్రహ్మ రాక్షసి శ్రద్ధను తన ఎడమ చేతి అంగుష్ఠం, తర్జనిలతో డొక్కల దగ్గర పట్టుకుని తన పైకి ఎత్తింది. ఎర్రటి అగ్ని గోళాల లాంటి కళ్ళతో శ్రద్ధ వైపే చూస్తూ, చూశావుగా. ఈ రోజు నాకు మధ్యాహ్న భోజనానివి నువ్వే అంది. శ్రద్ధకు అదే క్షణంలో నాన్న గుర్తొచ్చాడు. ఆయనకు ప్రమాదం జరిగింది. ఏమయ్యుంటుంది?

తెల్లవారుఝామున తనకు మెలకువ రావటం, నీళ్ళు తాగబోవటం, గుక్కెడు తీర్థం గొంతులో పడబోయేలోగా రాజన్న జరుగురుగా రావటం, నాన్నకు ప్రమాదమని చెప్పి తనను ఎత్తుకుని పరిగెత్తటం గుర్తుంది. ఆ తరువాత ఎదురుగా రాక్షసి. భయంకరాకారంలో. నాన్నకేమైంది? రాజన్న ఏమయ్యాడు? ఆ బ్రహ్మరాక్షసి చెవి మీదగా కారుతూ గడ్డకట్టిన రక్తం వికృతమైన కర్ణాభరణంలా గోచరిస్తోంది.

“ఎందుకు నన్ను తినటం?” శ్రద్ధ అడిగింది. ఆ రాక్షసి నోటి పక్క నుంచీ నెత్తురు కారుతోంది. ఇందాకటి జీవి తాలూకుది.

“ఆకలి.” గొంతులో అడ్డం పడబోయిన ఎముకను వేళ్ళతో బైటకు తీసి పక్కకు విసిరేస్తూ చెప్పింది. ఆ పైన నోటి పక్కన నెత్తురును నాలుకతో తుడిచేసుకుంది.

“అన్నం తినవచ్చుగా?” శ్రద్ధ అడగబోయి తమాయించుకుంది. నాన్న కళ్ళ ముందు మెదిలాడు. గుడిగాడన్న ఏమయ్యాడు? ఆలోచన. మరోవైపు ఈ పరిణామాలు, తనకున్న జ్వరం వల్ల కలిగిన నీరసం. తల పక్కకు వాల్చేసింది శ్రద్ధ. వికృతమైన ఆ రాక్షసి నవ్వుకు మరోసారి ఉలిక్కి పడింది. బెదురుగా, ఏ నూతిలోంచో వస్తున్నంత చిన్నగా…

“ఒక్కసారి నన్ను మా ఊరి గుడికి పంపిస్తే మా నాన్నను చూసి వస్తాను. ఆయనకు ప్రమాదమైందట!” శ్రద్ధ చెప్పింది. అశక్తత వల్ల పొడిదగ్గు వచ్చింది. వోరు పిడచగట్టుకుపోతోంది. పైగా సూర్యుడి కిరణాలు కళ్లలో పడి పోట్లు పొడుస్తున్నట్లైంది.

“తప్పించుకు పోవటానికేనా కట్టు కథ?” ఆ రాక్షసి కోపంగా గుడ్లురిమింది.

“లేదు లేదు. ఆకలి అన్నావుగా. ఆకలి అని అడిగిన వారికి ఆహారం ఇవ్వటం మన ధర్మం అని మా నాన్న చెప్పాడు. నీకు నేనే ఆహారమైతే వచ్చేస్తాను. మధ్యాహ్నానికి. నాన్నను చూసి.”

వికటాట్టహాసం చేసిందా బ్రహ్మ రాక్షసి. నమ్మనంది. ప్రమాణం చేసినా నమ్మనంది. మరింత గట్టిగా పట్టుకుంది శ్రద్ధను.

“నేను ప్రమాణం చేయను. అయినా వస్తాను. నన్ను పంపు. మా నాన్నను చూడాలి. చూసి వచ్చేస్తాను. నీ ఆకలి తీరుస్తాను.” ఏడుపు స్వరమే అయినా దృఢంగా అన్నది. ఆ బాలిక కళ్ళలో వింత తేజస్సుకు ఆ బ్రహ్మ రాక్షసి ఆశ్చర్యపడి తల తిప్పుకుంది.

అక్కడ ఆలయంలో.

ఇంటికి పంపిన పడుచు కంగారుగా పరిగెత్తుకుని వచ్చి శ్రద్ధ కనపడలేదని, చుట్టూ చూసినా ఎక్కడా లేదని చెప్పబోయే సమయానికి కృష్ణాష్టకం చదువుతున్నాడు సింగరాచార్య. కష్ణాష్టకాన్ని చదువుతూనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడాయన. లిప్తపాటు. విషయం అర్థం అయ్యింది. కృష్ణుడే చూసుకంటాడు. మనం చేయవల్సిన ఉత్సవం మనం చేద్దాం. అనే భావం వచ్చేలా సైగచేస్తూండగా, రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ అని పలికిందాయన స్వరం. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు స్త్రీలు ఘొల్లుమన్నారు. ఆయన చేయి పైకి ఎత్తి భయం వలదు అన్నట్లు సైగ చేశారు.

“ఆకలి అన్న వారికి ఆహారం ఇవ్వకుండా పంపలేదు మా నాన్న. అలా ఇస్తే మాకు అవసరమైనవి దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు. నన్ను నాన్న దగ్గరకు పంపు. చూసి వచ్చేస్తాను. నువ్వు నన్ను తిన్నా మా నాన్నకు కూతురిని దేవుడే ఇస్తాడు.” నమ్మకంగా చెప్పింది శ్రద్ధ.

ఆశ్చర్య పోయిందా నమ్మకానికి ఆ బ్రహ్మ రాక్షసి. ఎందుకో మంత్రం వేసినట్లు శ్రద్ధ కళ్ళలోకే చూస్తుండి పోయింది. నిమేష కాలం. “సరే! వెళ్ళి రా!” అంది. “నువ్వు రాకపోతే మీ నాన్ననే కాదు. మీ ఊరిలో జనాన్నందరినీ తినేస్తాను.” హెచ్చరించింది.

“మా ఊరికి ఎంత దూరంలో ఉన్నాము? నీకు తోవ తెలుస్తే చెప్పు.

ఊరి పేరు చెప్పి తోవ అడిందా బ్రహ్మ రాక్షసినే శ్రద్ధ.

రాక్షసి వదిలాక, ఒక కోసు రాయి తీసుకుని దారి గుర్తు కోసం చెట్ల మీద గుర్తులు పెడుతూ పరిగెత్తింది.

ఎక్కడిదా బలం!

పాదరక్షలు లేని అరికాళ్ళలో రాళ్ళని గుచ్చుకుంటున్నాయి. నెత్తురు కారుతూన్నా గమనించటం లేదు శ్రద్ధ. నొప్పిని లెక్కచేయటం లేదు. తండ్రిని కడసారి చూడటం, ఆ రాక్షసి ఆకలి తీర్చటానికి తనను తాను అర్పించుకోవటం. అంతే! ఆ పిల్ల మనసులో. మూడు గడియల తరువాత ఆలయం చేరింది.

అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సింగరాచార్య శ్రద్ధను చూసి కాస్త దగ్గరగా వచ్చాడు. విషయం క్లుప్తంగా చెప్పింది పసిపాప. ఇందాకటి పడుచుకే అప్పచెప్పి, స్నానం చేయించి తీసుకు రమ్మన్నాడాయన. పూర్తి వివరం తెలియని భక్తులు, ఊరి జనాలు శ్రద్ధ క్షేమంగా వచ్చినందుకు సంతోషించారు.

ఉత్సవం చూసింది శ్రద్ధ. తండ్రితో ప్రసాదాలు పంచింది. అందరినీ పంపించాక పిల్లను ఎత్తుకుని, శ్రద్ధ గుర్తులు వేసిన మార్గంలో సింగరాచార్య నడిచాడు. పెద్ద అంగలతో రెండు గడియలలో బ్రహ్మ రాక్షసిని సమీపించాడాయన.

ఆశ్చర్యం. ఆ బ్రహ్మ రాక్షసి దేవతలా మారింది ఆయనను చూస్తేనే.

“బ్రహ్మానందం కలిగింది సింగరాచార్యా! నీ ధర్మపరాయణతే గొప్పదనుకుంటే, నీ కూతురి నమ్మకం, ధర్మాచరణ మరింత గొప్పగా ఉన్నాయి. నేను ధర్మ దేవతను. ఇందాకన ధూమ్ర పిశాచి నీ పుత్రికను ఎత్తుకుపోతుంటే కాపాడును. మీ ధర్మపరాయణతను పరీక్షిద్దామని బ్రహ్మ రాక్షసి రూపంలో అలా నాటకమాడాను. ఎంతటి గొప్ప మనసు ఈ పిల్లది. ఎంతటి నమ్మకం తండ్రి మాట మీద! మెచ్చాను ఆ భూత దయను. వరం కోరుకో.”

వరమొద్దన్నాడు.

ధర్మదేవత శ్రద్ధను ఎత్తుకుని ముద్దాడి శరీరాన్ని నిమిరింది. అంతే. శ్రద్ధ అలసట పోయింది. గాయాలు మటుమాయ మయ్యాయి. అంటే… రాజన్న రూపంలో వచ్చింది ధూమ్ర పిశాచా? అనుకుంది శ్రద్ధ.

జరగాల్సినది కాలమే చూస్తుందని ధర్మ దేవత అనుమతి తీసుకుని ఊరిబాట పట్టాడు. తండ్రి భుజం మీద నుంచీ ధర్మ దేవతను చూస్తూ, “నా తండ్రికి తన కూతురును ఆయన ధర్మాచరణమే తిరిగి ఇచ్చింది,” అన్న అర్థం వచ్చేటట్లు నవ్వింది శ్రద్ధ. ఆ దేవత కళ్ళ నుంచీ ఆనందబాష్పాలు.

మాఫలేషు కదాచన!

Exit mobile version