Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ధృవ ప్రాంతాల ప్రజలకి జవ, జీవాలిచ్చే ‘సీల్’

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

చలి ప్రదేశంలో ముఖ్యంగా ధృవప్రాంతాలలో నివసించే జంతువులను గురించి మీరందరూ వినే ఉంటారు. అవునా! మా గురించి వినే ఉంటారేమో!

మేము ‘సీల్’ జంతువులం, మేము సుమారు 16 అడుగుల పొడవు, 500 పౌన్ల బరువుతో ఉంటాం. చుట్టూ చలి గదా! మేము ఎలా తట్టుకోగలుగుతున్నాము అనుకుంటున్నారు కదూ! మా శరీరాన్ని కప్పి ఉంచే వెంట్రుకలు-చర్మం క్రింద ఉండే క్రొవ్వు చలి నుండి కాపాడి – మాకు వెచ్చదనాన్ని యిస్తాయి. మా చర్మపు వెంట్రుకలు సంవత్సరానికి ఒకసారి రాలి మళ్ళీ వస్తాయి.

మేము నీటిలో మునిగి సుమారు అరగంట వరకు హాయిగా ఉండగలుగుతాం. మా కళ్ళు మేము నేలమీద ఉన్నా, నీటిలో ఉన్నా స్పష్టంగా కన్పిస్తాయి.

మేము మా అమ్మ పొట్టలో సుమారు 9 నెలలు ఉండి బయటకు వస్తాము. మేము మా అమ్మల దగ్గర పాలు తాగేది సుమారుగా నెలలోపే! ఇన్ని తక్కువ రోజులే తల్లిపాలు తాగినా మేం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకో తెలుసా! మా అమ్మపాలలో 53% ఉండే కొవ్వు పదార్ధములు మాకు బలాన్ని, శక్తిని యిస్తాయి.

మేము ధృవప్రాంతాలలో జీవించేవారికి చాలా ఉపయోగపడతాము. మేము వారికి తినడానికి తిండిని యిస్తాము. కట్టు కోవడానికి వస్త్రాలు, కోట్లు, స్వెటర్లు వంటి వాటిని అందిస్తాము. దీపాలు వెలిగించుకోవడానికి కొవ్వును యిస్తాము. వేటాడుకోవడానికి బాణాలు, విల్లంబులు తయారు చేసుకోవడానికి, కప్పుకోవడానికి చర్మాన్ని అందిస్తాం. ఇంకా మా చర్మంతో పడవలు గూడా తయారు చేసుకుంటారు.

మా స్నేహితులయిన మా తోటి సీళ్ళు కొన్ని మీకు నాణ్యమయిన ‘పట్టు’ని (ఫర్‌ని) అందిస్తున్నాయి. ఆ ఫర్‌తో చేసిన కొన్ని వస్త్రాలు లక్షల ఖరీదు చేస్తాయట.

మీలో చాలామంది భూమికి భారంగా ఎవరికీ ఉపయోగపడకుండా బతుకుతున్నారు. మాలాంటి వారిని చూసి అయినా (అంటే శరీరాన్ని మాలా ఉపయోగించమని కాదు) మంచి మనసుతో తోటి వారికి సాయపడే గుణాన్ని అలవరచుకోవాలి.

తెలిసిందా? పిల్లలూ! మీరుండే ప్రాంతాలకి దూరంగా ఉంటూనే మీ జాతికి ఎంత ఉపయోగపడుతున్నామో? ఇక ఉండమా!

గుడ్ బై!

Exit mobile version