[డా. మామిడాల శైలజ గారు రచించిన ‘దిగ్గజాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]
తూర్పున ప్రభవిస్తాడు రవి!
జనజీవనంలోని అస్తవ్యస్తలను తూర్పారపడతాడు కవి!
సందుగొందు చేరలేకపోయినా సమస్త విశ్వాన్ని పాలిస్తారు ఒకరు!
అణువణువును శోధిస్తూ
రవికాంచని చోటును సైతం
కలం కళ్ళతో వీక్షిస్తారు మరొకరు!
పగటి వెలుగులకే పరిమితం ఒకరు!
దివారాత్రాలు జ్ఞాన దివిటీల ఉషస్సులను
వెదజల్లుతూనే ఉంటారు మరొకరు!
అంధకారాన్ని దునుమాడుతారు ఒకరు!
అవినీతిని చెండాడుతారు మరొకరు!
పుడమిపై జీవానికి ఆధారం ఒకరు
బడుగు జీవుల వ్యధలపై పోరాడుతారు మరొకరు!
ఏడుగుర్రాలతో ఏడేడు లోకాలను కాంతివంతం చేస్తారు ఒకరు!
కలంపాళి పదునుతో కుళ్ళు కుతంత్రాల
కుత్తుకలను ఉత్తరిస్తారు మరొకరు!
రవి లేకపోతే ప్రళయమే..
కవి ఉన్నచోట ప్రభాతమే..
సమస్త విశ్వంలోని అజ్ఞానాంధకార చీకట్లను చెరిపివేసి
దీప్తిమంతం చేయడంలో దిగ్గజాలే ఇరువురూ!
డాక్టర్ మామిడాల శైలజ ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రి. వరంగల్లోని రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. సమకాలీన తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలజగారు సమాజంలోని రుగ్మతలు, మహిళల సమస్యలు, సామాజిక న్యాయం, మానవ సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని అనేక రచనలు చేశారు. ఆమె కలం నుండి దాదాపు 300 కవితలు, 4 నవలలు మరియు 50కి పైగా కథలు జాలువారాయి.
సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గాను ‘ఉమెన్ లెజెండరీ అవార్డు’, ‘సంక్రాంతి సాహితీ రత్న అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. ఇటీవలి కాలంలో ఆమె ప్రచురించిన కవితా సంపుటి ‘మెరికలు’ (2024), నవల ‘ది ఎకోస్ ఆఫ్ ఎ సైలెంట్ హార్ట్’ (2025), పాఠకులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తిత్వ వికాస పుస్తకం ‘నౌ విక్టరీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్’ (2026) పాఠకులను అలరించాయి.
