‘డిస్‌గ్రేస్’ జె. ఎమ్. కోట్జీ అనే రచయిత రాసిన నవల. 1999లో ఈ నవలకు బూకర్ ప్రైజ్ వచ్చింది. నాలుగు సంవత్సరాల తరువాత ఈ రచయితకే 2003లో నోబల్ బహుమతి లభించింది. సౌత్ ఆఫ్రికా లోని రాజకీయ సంక్షోభంలో ఆ దేశంలోని ట్రాన్సిషన్ పీరియడ్‌ను ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవల ఇది. తెల్ల జాతీయుల నుండి అధికారం నల్ల జాతీయుల పరమవుతున్నప్పుడు, నల్ల జాతీయులు తెల్లవారిపై ఆధిపత్యం సాధించాలని తపన పడుతున్న సమయంలోని పరిణామాలను చెప్పిన రచన ఇది. రచయిత ఈ నవలలో ప్రదర్శించిన శైలి చాలా తాత్వికంగా ఉంటుంది. ఆఫ్రికన్ సమాజంలో రాజకీయంగా జరుగుతున్న మార్పులను తన దృక్కోణంలో చూపించే ప్రయత్నం చేసారు రచయిత. పాఠకులకు జాత్యహంకారం లోని మరో కోణాన్ని చూపే ప్రయత్నం చేసిన గొప్ప నవల ఇది. సౌత్ ఆఫ్రికాలోని జాత్యాహంకార నేరాలను, పాఠకులకు మరో కోణంలో చూపించే ప్రయత్నం ఈ నవల ద్వారా జరిగింది.
ఈ నవలలో ప్రధాన పాత్ర డేవిడ్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. వృత్తిపై ఇష్టం లేకపోయినా బ్రతుకుతెరువు కోసం ఆ ఉద్యోగంలో ఉండిపోయిన సాధారణ వ్యక్తి. 52 సంవత్సరాల వయసున్న అతనికి రెండు పెళ్ళిళ్ళు జరిగినా అవి విడాకులకే దారి తీసాయి. వేశ్యల దగ్గరకు వెళ్ళడం అతనికి అలవాటు. ఒక వేశ్య నచ్చి ఆమెతో ఎక్కువ కాలం సంబంధం పెట్టుకోవాలని అతను కోరుకుంటాడు. కాని ఆమె దానికి ఒప్పుకోదు. అతని జీవితంలోని పెద్ద ఆనందం తన శారీరిక కోరికలను తీర్చుకోవడమే. అందులో అతని మగ అహంకారం తృప్తి పడుతూ ఉంటుంది. ఒక అధికారాన్ని అతను అనుభవిస్తాడు. ఆ క్రమంలోనే తన దగ్గర చదువుకునే ఒక అమ్మాయితో అతను సంబంధం పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి నిస్సహాయురాలని, ఇష్టపడి కాక, పరిస్థితులకు తలవంచి తనకు లొంగిపోయిందని తెలిసినా అతను ఆ సంబంధాన్ని ఎంజాయ్ చేస్తాడు. తన శారీరిక వాంఛ తీర్చుకోవడం ముఖ్యం అని అది తన హక్కు అని అతను అనుకుంటాడు కాని తాను చేసే పని ఎంత అనైతికం అనే విషయం గురించి ఆలోచించడు. అతని అధికారం, మగ అహంకారం, ఆ అమ్మాయి నిస్సహాయ స్థితి, చేతకాని తనం కారణంగా అ సంబంధం కొన్నాళ్ళు సాగుతుంది. సమాజంలో ఒక ప్రొఫెసర్‌గా అతనికున్న గౌరవప్రదమైన స్థానం కూడా ఆ అమ్మాయి అతన్ని ఎదిరించకుండా నిస్సహాయంగా లోంగిపోవడానికి కారణమవుతుంది. చివరకు ఎంతో ఆలోచించి చివరకు తెగించి ఆ అమ్మాయి కాలేజీ అధికారుల వద్ద తనపై జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుంటుంది. ఈ సంగతి అందరికీ తెలిసి పెద్దగా గోల అవుతుంది. డేవిడ్‌ని కాలేజీ కమిటీ ప్రశ్నించి క్షమాపణ కోరతారు. డేవిడ్ క్షమాపణ చెప్పుకోవాలనుకోడు. తన శారీరిక వాంఛలే ఈ సంబంధానికి కారణం అని, అవి సహజమైన వాంచలని, తీర్చుకోవడం తన హక్కు అని అతను నమ్ముతాడు. అందువలన క్షమాపణ చెప్పకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు.
డేవిడ్ కూతురు లూసి, ఒక పల్లెటురిలో వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తుంటుంది. ఉద్యోగం వదిలేసినందువలన, ఉండే చోటు లేక అతను కూతూరు లూసీ దగ్గరకు వెళతాడు. లూసి లెస్బియన్. ప్రపంచానికి దూరంగా ఉండాలని ఆమె ఆ స్థలం ఎంచుకుని అక్కడ ఉండిపోతుంది. తన గడిచిన అనుభవాలను మర్చిపోవడానికి డేవిడ్ కూతురు వద్ద కొంత కాలం గడుపుదామనుకుంటాదు.
ఆ పల్లెటూరి పరిస్థితులు అతనికి అర్థం కావు. అక్కడ అతను ఉండగాని ముగ్గురు నల్ల జాతీయులు ఆ ఇంట్లోకి చొరబడి లూసీపై అత్యాచారం చేస్తారు. అడ్డుకున్న అతన్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారు. ఆ సంఘటన జరిగిన తరువాత కూతురు వారిపై కంప్లైంట్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మాత్రమే ఆమె పోలీసులకు చెబుతుంది కాని అత్యాచారం ప్రసక్తి తీసుకురాదు. ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఆ నల్ల జాతీయులు ఎంతగా వారిని ద్వేషిస్తారంటే వారు ప్రేమతో పెంచుకున్న కుక్కలను కూడా చంపేస్తారు. అప్పుడు అవి కెనెల్‌లో బంధింపబడి ఉంటాయి. వారికి అడ్డు కూడా రావు. అయినా ఆ కుక్కలను కసిగా చంపేస్తారు ఆ దుండగులు. కుక్కలను చూస్తే తెల్లవారు తమపై జరిపిన దారుణాలు వారికి గుర్తుకు రావడం జాతి వివక్షత మిగిల్చిన గాయాలకు నిదర్శనం. లూసీకి ఆ వ్యవసాయ క్షేత్రంలో పెట్రస్ అనే ఒక సహాయకుడు ఉంటాడు. జరిగిన సంఘటనకు అతనికి సంబంధం ఉండి ఉంటుందన్నది డేవిడ్ అనుమానం. లూసీపై అత్యాచారం చేసిన వారిలో చిన్నవాడు పెట్రస్‌కు బంధువు.
ఆ అత్యాచారం కారణంగా లూసీ గర్భవతి అవుతుంది. అంతా తెలిసినా తన వ్యవసాయ క్షేత్రాన్ని పెట్రస్‌కు అప్పగించి అతని ఉంపుడుగత్తెగా ఉండిపోవడానికి సిద్దపడుతుంది. అలా అతని రక్షణలో ఉండాలని నిశ్చయించుకుంటుంది. తండ్రికి ఈ ప్రాంతంలో జీవితం ఇలానే ఉంటుంది అని చెబుతుంది. తెల్లజాతీయుల పట్ల నల్లవారిలో ద్వేషం ఇలానే ఉంటుందని దాన్ని తాము అనుభవించడం తప్పదని చెబుతుంది. కంప్లేంట్ ఇవ్వడం వల్ల ఏమీ జరగదనీ నల్లవారు వారి చర్యలను ఎలాంటి పరిస్థితులలోనయినా సమర్ధించుకుంటారని, తెల్లవారిపై వారు ఆధిపత్యం సంపాదించించుకోవడానికి ప్రయత్నించడమే ఇలాంటి సంఘటనలకు కారణం అని వివరిస్తుంది.
డేవిడ్ తన స్టూడెంట్‌ని శారీరికంగా వాడుకిని తనను తాను సమర్థించుకోవడంలో ఏ అధికార ధాహం, అహం ఉన్నాయో ఇక్కడా అవే కనిపిస్తాయి. మగ అహంకారంతో ఒక స్త్రీని తాను స్థాన బలం, అంగబలం, అధికార బలంతో లొంగదీసుకున్న విధానంలో తన తప్పు లేదు అని తాను అనుకున్నట్లే ఈ సంఘటనలో నల్ల జాతీయులు తెల్లవారి పై తాము జరిపిన దౌర్జన్యాన్ని కూడా అదే పంధాలో సమర్థించుకుంటారు అన్నది అతనికి అర్థం అవుతుంది. మైనారిటీలైన తెల్ల జాతీయులు కొన్ని తరాలుగా పెద్ద సంఖ్యలో ఉన్న తమపై చూపిన అధికారానికి, వివక్షకు నల్లజాతీయులు బదులు తీర్చుకునే పంథాలో ఈ అత్యాచారం జరిగిందన్నది అతనికి అవగాహన కొస్తుంది. అధికారం నల్ల జాతీయుల పరం అయినప్పుడు తెల్ల జాతీయులపై తమ కసిని, కోపాన్ని వారు ప్రదర్శించే పద్ధతి ఇది అని తెలుసుకుంటాడు డేవిడ్. అలాగే తమదైన దేశంలో తెల్ల జాతీయులను ఒక మూలకు తోసి వేయడానికి వారి తరతరాల ఆధిపత్యానికి తెర దించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలలో ఈ సంఘటన కూడా ఒకటి కావడం అతనిలో వివక్ష, అధికారం అనే భావజాలం పట్ల ఆలోచనలను కలిగిస్తుంది.
కుక్కలకన్నాహీనమైన స్థితికి మానవ మాన, ప్రాణాల ఉనికి చేరిన సమాజ పరిస్థితుల పట్ల ఆలోచన రేకెత్తించె పదునైన నవల DISGRACE. అధికారంలో ఉన్నవాడు తన ఆధిపత్యంలో ఒక వర్గాన్ని కుక్కల వలే తనకు విశ్వాసంగా ఉండాలని వారిపై నియంతృత్వ ధోరణులు ప్రదర్శించి వారిని అణిచివేసి, తాము యజమానులమని వారిని బానిసలని ప్రకటించుకుంటే, ఆధికారం మారినప్పుడు అధికారులు బానిసల స్థితికి చేరవలసి వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పే నవల ఇది. అధికారులు మారుతారు కాని ఆధిపత్య భావజాలం మాత్రం అలాగే ఉండిపోయి, పాత్రలు తారుమారయినా సమజంలో అనిశ్చితి అలాగే ఉండిపోతుందని ఆలోచింపచేసే నవల ఇది. మానవులందరికీ సమానత్వం, సమ సమాజం లభించాలంటే ఆధిపత్య భావజాలం సమూలంగా నశించాలని చెప్పే నవల DISGRACE.