Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దివికేగిన స్వర పారిజాతం.. కోయిల మూగబోయింది!

[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీ కరణం హరి కిషన్.]

సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. ఆరు పదుల పాటు తన అమృత గానంతో కోట్లాది మందిని ఓలలాడించిన ‘గానకోకిల’ ఎస్. జానకి గారు గత వారం అనంత తీరాలకు తరలిపోయారు. ఇంతకాలం ఈ లోకాన్ని తన పాటలతో అలరించి, ఇప్పుడు ఆ దివిలో విరిసిన పారిజాతంలా తన గాన సువాసనలను వెదజల్లడానికి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరికీ తీరని లోటు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె గళం సృష్టించిన అనుభూతులు ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అటువంటి మధుర గళం మన తెలుగు రాష్ట్రాన, కృష్ణా నది ఒడ్డున ఉన్న రేపల్లెలో పుట్టడం నిజంగా తెలుగువాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం, ఒక గొప్ప అదృష్టం. ఆ మట్టిలోని మాధుర్యం, ఆ నదీ తీరపు లాలిత్యం ఆమె గొంతులో నిరంతరం ప్రవహించేవి.

బాల్యంలో, కేవలం ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు రేడియోలో గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాట వింటున్నప్పుడు, అందులో చిన్న పిల్లల గొంతు రాగానే “అసలు నా ఈడు వారే పాడారేమో” అనుకుంటూ వినే ఆ అమాయకత్వం ఒక మధుర జ్ఞాపకం. అలాగే అలకపాన్పు ఎక్కనేలా పాటలో ఒక అవ్వ పాడుతుంటే, నిజంగానే ఏ అవ్వో పాడింది అన్నట్లుగా చూసే రోజులు అవి. ఆ తరువాత కొంత పెద్దయ్యాక ‘ప్లేబ్యాక్ సింగింగ్’ గురించి తెలిసినప్పుడు మాత్రం.. నిజంగా ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా గొంతులు మార్చి పాడుతున్నారు అన్న విషయం తెలిసి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురికావడం ప్రతి సంగీత అభిమాని అనుభవించే ఒక అద్భుత అనుభవం. అసలు సింగర్ పేరు కూడా తెలియకుండానే, కేవలం ఆ గళం సృష్టించిన మాయకే ఆరేళ్ల వయస్సు నుంచే జానకమ్మకు వీరాభిమానులైన నాలాంటి వారు ఎందరో.

ఆమె పాడిన భక్తి గీతాలు వింటుంటే మైమరచిపోతాము. ఓం నమఃశివాయ.. చంద్రకళాధర సహృదయ అంటూ ఆమె పాడుతుంటే, ఆ పాటే పరమశివుని ఆభరణమా అన్నట్లుగా భక్తి పారవశ్యం కలుగుతుంది. ఇక దండాలు సామి దండాలు, దండిగ తెచ్చాము దండలు పూలదండలు అనే పాటలో అయితే ఏకంగా నాలుగు విభిన్న గొంతులతో పాడి అందరినీ అపరిమితమైన ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒకే మనిషి ఇన్ని విభిన్న శ్రుతులలో, ఇన్ని గొంతులలో ఒకే పాటను నడిపించడం సామాన్యమైన విషయం కాదు.

జానకమ్మ గొంతు కేవలం భక్తికో, వేదనకో పరిమితం కాలేదు. మనసా తుళ్ళిపడకే..” అంటూ పాడుతుంటే యువతుల మనసులలో తెలియని గిలిగింతలు రేకెత్తుతాయి. శృంగార, ప్రణయ భావాలను పలికించడంలో ఆమె శైలి అద్వితీయం. ఇక నవ్వింది మల్లెచెండు..” పాటలో అయితే, ఆమె కేవలం తన స్వరంతో పలికించిన ఆ మధురమైన ‘నవ్వు’ తోనే ప్రేక్షకులందరినీ పూర్తిగా కట్టిపడేశారు. ఒక పాటలో కేవలం నవ్వును కూడా ఒక అద్భుత రసంగా మార్చగలగడం ఆమెకే చెల్లింది.

అసలు ఒకే పాటలో విభిన్న భావాలు పలికించడం ఆమెకు మాత్రమే సాధ్యం. తొలిసారి చూసింది మొదలు..” అన్న పాటలో ఆమె పలికించిన భావాలు అనితరసాధ్యం. ఆ స్వరంలో ఒలికిన సుకుమారమైన శృంగార హావభావాలు అద్భుతం. ఇంకా కొన్ని తరాల వారు వచ్చినా కూడా ఆమె స్థాయిని చేరుకోలేరు. ఆమె పాట పాడుతుంటే మైక్ ముందు జానకమ్మ కనిపించదు. తెరపై ఉండే హీరోయిన్ పాత్రలోకి ఆమె ‘పరకాయ ప్రవేశం’ చేసి భావాలు పలికిస్తుంది. అందుకే ఆమె పలికించే ప్రతి భావన, పాడే ప్రతి పాట వర్ధమాన గాయనీ గాయకులకు ఒక నిఘంటువు, వారు నేర్చుకోవాల్సిన పాఠాలు. నిజం చెప్పాలంటే, ఆమె పాటలే ఒక గొప్ప విశ్వవిద్యాలయం. పగలే వెన్నెలా.. జగమే ఊయలా అనే పాట వింటుంటే అసలు పగటిపూట కూడా వెన్నెలను కురిపించగల శక్తి ఆ గొంతుకు ఉందా అనిపిస్తుంది. అంతటి లాలిత్యం, మాధుర్యం ఆ స్వరంలో ఉన్నాయి. లాలిత్యాన్ని ఒలికించిన అదే గొంతుతో అమ్మ పాడిన దుర్యోధన దుశ్శాసన..” పాట వింటుంటే వినేవారి ఒంటి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ద్రౌపది ఆవేదనను, ఆక్రోశాన్ని, రౌద్రాన్ని ఆ గొంతులో పలికించిన తీరు అసలు స్త్రీ మూర్తి పట్ల సమాజానికి ఉన్న దృక్పథాన్ని మార్చేంత శక్తివంతమైనది.

జానకమ్మ కేవలం ప్రేమకే కాదు, ఆత్మభిమానానికి కూడా పెట్టింది పేరు. అవార్డులు అనేవి కళాకారుడి ప్రతిభకు ఇచ్చే గుర్తింపు మాత్రమే కానీ, అంతకంటే మిన్న అయినది ప్రేక్షకులకు మనస్సులో ఉండే స్థానం అని నమ్మి, దానికి కట్టుబడిన ధీశాలి ఆమె. తనకు ప్రేక్షకుల మనస్సులో ఉండే స్థానమే అన్ని అవార్డులకన్నా మిన్న అని ధైర్యం చెప్పగలిగిన నిఖార్సయిన వ్యక్తిత్వం ఆమెది.

కోకిలకు సహజసిద్ధంగా కుహూ కుహూ రాగాలను ఆలపించే శక్తిని ఆ జగన్మాత ఇస్తే.. మన జానకమ్మకు ఆ పరదేవత ముక్కోటి రాగాలను పలికించే గళాన్ని వరంగా ఇచ్చింది. నేడు ఆ పరదేవత సహజసిద్ధంగా ఇచ్చిన ఆ గళం మూగబోయిందనే చేదు నిజాన్ని నమ్మడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా.. చిన్నారి చిలకమ్మా..” అంటూ ఆమె పాడిన విరహ గీతం వింటే ఇప్పటికీ గుండె కరుగుతుంది. ఈ పాట పాడిన ఆ స్వర సిరిమల్లె పువ్వు భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆ పాట రూపంలో అది ఎప్పటికీ వాడిపోకుండా మన అందరి హృదయాలలో అలాగే వికసించి ఉంటుంది.

తరువాతి కాలంలో టీవీ ప్రోగ్రాంలలో జానకమ్మను చూస్తుంటే ఎందుకో ప్రతి ఒక్కరికీ తమ స్వంత అమ్మ గుర్తుకు రావడం ఖాయం. ఆమె ముఖంలోని ఆ అమాయకపు నవ్వు, అసూయ లేనటువంటి ఆ నిష్కల్మషమైన మాటలు నిజంగా ఆమెను ఒక సింగర్‌గా కంటే, ఒక మంచి మానవత్వపు విలువలున్న మనిషిగానే అందరి మనసుల్లో స్ఫూర్తిగా నిలిపాయి.

జానకమ్మ మనల్ని విడిచి వెళ్ళిన వేళ, ప్రతీ సంగీత ప్రేమికుడి గుండెల్లో అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా..” అనే పాట నిరంతరం ప్రతిధ్వనిస్తోంది. మాటే లేకుండా నువ్వే మాయం.. కన్నీరవుతోంది యదలో గాయం.. అయ్యో వెళ్ళిపోయావే.. నన్నొదిలేసి ఎటు పోయావే..” అని రోదిస్తున్న సగటు శ్రోత హృదయానికి.. ఆ కోకిలమ్మ దివి నుంచే ఓదార్పునిస్తూ, తన పాటల రూపంలో వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా..” అని మనకు అభయమిస్తున్నట్లు అనిపిస్తుంది. శారీరకంగా దూరమైనా, ఆమె పాడిన ప్రతి పాట ఒక లాలిపాటై మన జీవితాంతం తోడుగానే ఉంటుంది.

జానకమ్మ భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా.. ఆమె పాటల రూపంలో ఎప్పటికీ అమరురాలే. యుగాలు మారినా, తరాలు మారినా ఆ కోకిలమ్మ పాటలు తెలుగు నేలపై, విశ్వవ్యాప్తంగా వినబడుతూనే ఉంటాయి. ఆ దివిలో విరిసిన పారిజాతానికి, తెలుగు నేల కన్న అరుదైన గాన విశ్వవిద్యాలయానికి మనస్ఫూర్తిగా అశ్రు నివాళులు. జానకమ్మ ఒక స్వరం కాదు.. అదొక సజీవ గాన ప్రవాహం!

Exit mobile version