[రాజు యెదుగిరి గారు రచించిన ‘డివోర్స్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
కిటికీలోంచి వస్తున్న సన్నటి సూర్య కిరణాలు మృదుల ముఖం మీద ఏటవాలుగా పడుతున్నాయి. రాత్రంతా నిద్రలేమి వల్ల తన కళ్ళు కాస్త ఎర్రబడి ఉన్నాయి. వంటగదిలో కాఫీ పెడుతూ, ఏవో ఆలోచనల్లో మునిగిపోయి ఉంది మృదుల.
“అమ్మా.. నీకే ఫోను..” అంటూ హాల్లోంచి తన ఏడేళ్ళ కొడుకు సుబ్బు గట్టిగా అరిచాడు.
ఆ పిలుపుతో ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చిన మృదుల, వెంటనే స్టవ్ కట్టేసి, చేతులు తుడుచుకుంటూ హాల్ లోకి వెళ్ళింది. “టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరగొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి సుబ్బు నీకు? వెళ్ళు. వెళ్ళి ముందు మొహం కడుక్కో” అని కొడుకును సున్నితంగా మందలిస్తూ, ఛార్జింగ్ పెట్టిన ఫోన్‌ను చేతిలోకి తీసుకుంది.
మొబైల్ స్క్రీన్ మీద ‘సుధీర్’ అని డిస్ప్లే అవుతోంది. ఆ పేరు చూడగానే తన గుండెల్లో ఏదో తెలియని వణుకు. చేతులు అసంకల్పితంగానే బిగుసుకున్నాయి. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, కాల్ లిఫ్ట్ చేసింది.
“చెప్పు” అంది అయిష్టంగానే. ఆమె గొంతులో ఎక్కడా బెరుకు లేదు.
“ఏంటి.. ఎన్నిసార్లు చెప్పాలి నీకు.. నా టైమ్ వేస్ట్ చేయొద్దని? రెండు రోజుల్లో కోర్టులో విచారణ ఉంది. నీ దగ్గర నన్ను తప్పుబట్టడానికి ఒక్క ఆధారం కూడా లేదు. పైగా నువ్వే నా మీద లేనిపోని అనుమానాలతో నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నావని నేను వేసిన కౌంటర్ పిటిషన్ ఎంత బలంగా ఉందో.. నీ లాయర్ నీకు ఈపాటికి చెప్పే ఉంటాడు. ఇక పరువు పోగొట్టుకునే బదులు, డివోర్స్ కేసు వాపసు తీసుకోని ఇంట్లోకొచ్చి బుద్ధిగా పడి ఉండు. లేదంటే కోర్టులో నిన్ను ఒక మెంటల్ పేషెంట్ గా ప్రూవ్ చేసి, సుబ్బు గాడిని కూడా నువ్వు కలిసే వీలు లేకుండా చేస్తాను. ఆలోచించుకో” ఫోన్లో సుధీర్ గొంతు కరుకుగా, బెదిరింపు ధోరణిలో, తనకే అంతా తెలుసన్న అహంకారంతో వినిపించింది.
మృదుల ఇంకేమి మాట్లాడలేదు. ఫోన్ కట్ చేసింది. చేతిలోని ఫోన్‌ను సోఫా మీద విసిరేసి, సోఫాలోనే కూలబడిపోయింది. ఆమె మనసు ఒక్కసారిగా గతం వైపుకు మళ్ళింది.
***
సరిగ్గా ఎనిమిది నెలల క్రితం.. అప్పుడే నిద్రలేచిన మృదుల భర్త మంచంపై లేకపోవడం గమనించింది. మామూలుగా బాత్‌రూమ్‌కో, వాకింగ్‌కో వెళ్ళుంటాడు అనుకుని ఒళ్ళు విరుచుకుంటూ లేస్తూ నేరుగా కిచెన్‌లోకి వెళ్ళింది.
“రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఫ్లైట్ ఉంది. మూడు రోజులు బెంగుళూరు ప్రయాణం. పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి” అని భర్త సుధీర్ రాత్రి చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి.
ఆదరాబాదరాగా వంట మొదలుపెట్టింది. సుధీర్‌కు కాస్త కోపం ఎక్కువ. ఏది టైమ్‌కి జరగకపోయినా ఇల్లంతా పీకి పందిరేస్తాడు.
ఉదయం ఏడున్నరకల్లా సుధీర్ తయారైపోయాడు. “నాకు లేట్ అవుతోంది. క్యాబ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. సుబ్బు గాడ్ని జాగ్రత్తగా చూసుకో” అని గబగబా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. సుధీర్ వెళ్ళిపోయాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మృదుల. భర్త ఇంట్లో ఉంటే ఒక రకమైన టెన్షన్. అతను వెళ్ళాక సుబ్బుని స్కూల్ కి పంపి, ఇల్లంతా సర్దుతూ సుధీర్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద అతని ల్యాప్‌టాప్ అలాగే ఓపెన్ చేసి ఉంది. ‘అరె, ల్యాప్‌టాప్ తీసుకెళ్ళలేదా? బెంగుళూరులో మీటింగ్ అన్నాడు కదా’ అనుకుంది మృదుల.
‘సరే, ఎలాగూ వైఫై బిల్లు కట్టాలి కదా’ అని ల్యాప్‌టాప్ ఆన్ చేసింది. సుధీర్ దానికి పాస్వర్డ్ ఏమి పెట్టలేదు, ఎందుకంటే ఇంట్లో అతని ల్యాప్‌టాప్ మృదుల ముట్టుకోదు అన్న ధీమా. ఆ నమ్మకాన్ని కలిగించింది స్వయంగా మృదులే. భార్యాభర్తల మధ్య అనుమానాలు, అవమానాలు ఉండకూడదు. ఈ ఫోన్లు చెక్ చేసుకోడాలు, పాస్వర్డ్లు అడిగి తెలుసుకోవడాలు ఇవేమీ ఉండకూడదు అని మృదుల అభిప్రాయం. అందుకే తను ఏ రోజు సుధీర్ పై స్పై చేయలేదు. అసలు ఆ అవసరం రాలేదు.
మృదుల ల్యాప్‌టాప్ లో బ్రౌజర్ ఓపెన్ చేయగానే, ఆటోమేటిక్‌గా ‘వాట్సాప్ వెబ్’ ఓపెన్ అయి ఉంది. సుధీర్ తన ఫోన్ లోని వాట్సాప్‌ను ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి, లాగౌట్ చేయడం మర్చిపోయాడు. మృదుల దాన్ని క్లోజ్ చేద్దామని అనుకునేలోపే ఒక కొత్త మెసేజ్ పాప్ అప్ అయింది.
“బోర్డింగ్ అయిపోయిందా? వెయిటింగ్ ఫర్ యు మై డార్లింగ్..” అంటూ రోజా నుండి మెసేజ్. రోజా సుధీర్ దగ్గర కొన్నాళ్ళ క్రితం చేరిన జూనియర్ అడ్వకేట్.
ఆ మెసేజ్ చదివిన వెంటనే మృదుల గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతులు వణకడం మొదలయ్యాయి. ‘ఇది నిజమా లేక కలనా?’ అంటూ భయం భయంగానే చాట్ ఓపెన్ చేసింది. అంతే.. ఆమె ప్రపంచం తలకిందులైంది. గత ఆరు నెలలుగా సుధీర్, ఆ రోజాతో జరుపుతున్న చాటింగ్, వాళ్ళు పంచుకున్న అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు అన్నీ అందులో ఉన్నాయి. బెంగుళూరు వెళ్ళింది క్లయింట్ పని మీద కాదు, రోజాతో కలిసి ఒక రిసార్ట్‌లో ఎంజాయ్ చేయడానికి అని మృదులకు అప్పుడు అర్థమైంది. ఆ మాటలు, ఆ వర్ణనలు చదువుతుంటే తనకి అసహ్యంగా అనిపించింది. ఇన్నాళ్ళు నేను దేవుడిలా పూజించిన భర్త ఇంత నీచమైనవాడా? ఇంత కపట నాటకం ఆడుతున్నాడా? అంటూ ఆమె కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి. గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏ ఆడదైనా భర్త కోపాన్ని, పేదరికాన్ని భరిస్తుందేమో కానీ, తన స్థానంలో ఇంకొకరిని చూసి భరించలేదు. ల్యాప్‌టాప్‌ను బలంగా విసరబోయింది.. కానీ క్షణం ఆగి ఏదో ఆలోచించి మళ్ళీ ఆ ల్యాప్‌టాప్‌ను యధావిధిగా అక్కడే వదిలేసి, తన గదిలోకి వెళ్ళి గట్టిగా తలుపులు వేసుకుంది.
మూడు రోజుల తర్వాత సుధీర్ ఎంతో ఉత్సాహంగా ఇంటికి తిరిగొచ్చాడు. “హాయ్ మృదులా.. మీటింగ్స్‌తో చాలా అలసిపోయాను, ఒక మంచి కాఫీ ఇవ్వవా ప్లీజ్” అంటూ సోఫాలో వాలిపోయాడు.
మృదుల కాఫీ తీసుకురాలేదు. చేతిలో ల్యాప్‌టాప్‌తో వచ్చి అతని ముందు నిలబడింది. “ఏంటిది సుధీర్?” సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది.
సుధీర్‌కి ఏమీ అర్థం కాలేదు. “ఏంటది?”
“బెంగుళూరు మీటింగ్స్ చాలా బాగా జరిగినట్టున్నాయి కదా..? నేను అడుగుతుంది నువ్వు రోజాతో కలిసి చేసిన ఈ ప్లాన్స్ గురించి” అంది మృదుల.
వెంటనే సుధీర్ ముఖం చిన్నబుచ్చుకుంది. ల్యాప్‌టాప్ వైపు చూశాడు. వాట్సాప్ లాగౌట్ అవ్వడం మర్చిపోయిన విషయం అప్పుడు గుర్తొచ్చింది అతనికి. తన బండారం బయటపడిందని అర్థమైంది. కానీ అతడొక క్రిమినల్ లాయర్. తప్పును ఒప్పుకునే రకం కాదు.
ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. “నా పర్సనల్ ల్యాప్‌టాప్ ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నా ప్రైవసీలోకి వస్తావా?” అని అరుస్తూ మృదుల చెంప చెల్లుమని పగలగొట్టాడు.
మృదుల కళ్ళలో ద్వేషం ఉప్పొంగింది. “చదువుకున్న వాడివి, పైగా చట్టం తెలిసిన వాడివి.. ఇలాంటి నీచానికి ఎలా ఒడిగట్టావు? నాకంటే ఆ అమ్మాయిలో అంతలా ఏముందని?” అని నిలదీసింది.
“అవును.. అయితే ఏంటిప్పుడు? నువ్వు ఏం చేయగలవు? చట్టంలోని లొసుగులన్ని నాకు తెలుసు. నా మీద కేసు వేసి నువ్వు ఏమీ పీకలేవు. నోరు మూసుకుని, ఏమీ తెలియనట్టు పడి ఉండు. లేదంటే ఇంట్లోంచి గెంటేస్తాను” అంటూ అహంకారంతో విర్రవీగుతూ అన్నాడు.
ఆ క్షణమే ఆ రాక్షసుడితో ఇక కలిసి బ్రతకకూడదని నిర్ణయించుకుంది మృదుల. ఆ రోజే సుబ్బుని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒక వారం తర్వాత సుధీర్‌కు విడాకుల నోటీసులు పంపింది.
కానీ కోర్టు మెట్లు ఎక్కాక మృదులకి వాస్తవం ఎంత కఠినంగా ఉంటుందో తెలిసొచ్చింది. చట్టం ఆధారాలను నమ్ముతుంది, కన్నీళ్ళను కాదు అని తెలుసుకుంది. సుధీర్ ఒక పేరుమోసిన అడ్వకేట్ కావడం వల్ల, తనకున్న పరపతితో ఆధారాలన్నీ మాయం చేశాడు. తను చేసిన తప్పును తెలుసుకుని, తన ఫోన్ లోని వాట్సాప్ హిస్టరీ అంతా ఎప్పుడో డిలీట్ చేసేశాడు. ఎవరికి తెలియకుండా రోజాను వేరే ఊరికి పంపించేసాడు. పైగా, మృదుల తన మీద లేనిపోని అనుమానాలతో, తన పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని, ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశాడు.
“మై లార్డ్, నా భార్య ఒక సైకో. ఆమెకు అనుమానపు వ్యాధి ఉంది. ఆమె నాతో ఉంటే నా ప్రాణానికే ప్రమాదం. పైగా నా కొడుకు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి విడాకులతో పాటు, పిల్లాడి కస్టడీ కూడా నాకే ఇవ్వాలి” అని కోర్టులో తన తోటి లాయర్ల ముందు గట్టిగా వాదించాడు.
మృదుల పెట్టుకున్న లాయర్ రమాకాంత్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, సుధీర్ ఎత్తుగడల ముందు అతడు నిలబడలేకపోయాడు. మృదుల దగ్గర ఆ రోజు తన ఫోన్లో తీసిన ఒకే ఒక్క స్క్రీన్ రికార్డింగ్ వీడియో తప్ప వేరే ఏమీ లేదు. దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలని చూస్తే, “ఇది ఎడిట్ చేయబడిన వీడియో.. నాపై లేనిపోని సాక్ష్యాలు సృష్టించారు” అంటూ సుధీర్ తన వాదనలతో దాన్ని సాక్ష్యంగా చెల్లనివ్వకుండా చేశాడు.
కేసు ఓడిపోయేలా ఉంది. తన వాళ్ళు కూడా, “ఆడదానివి, ఎలాగోలా సర్దుకుపో. పిల్లాడి కోసం రాజీపడు” అని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
***
గతమంతా కళ్ళముందే కదలాడటంతో బాధతో మృదుల కన్నీరు మున్నీరయింది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, తన ప్రాణమైన కొడుకును కూడా తననుండి దూరం చేస్తాడేమో అన్న భయం ఆమె మనసును తొలిచివేస్తోంది. సుధీర్‌కి కూడా ఒక భయం ఉంది.. ఒకవేళ తను కేసు ఓడిపోతే, తన వృత్తిపరమైన జీవితానికి, సొసైటీలో తనకున్న పరువుకి తీరని మచ్చ పడుతుందని. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు గెలవాలని, మృదులను రోడ్డున పడేయాలని కుట్రలు పన్నుతున్నాడు.
ఆలోచనల నుండి బయటకు వచ్చింది మృదుల.
“అమ్మా..” అంటూ సుబ్బు వచ్చి తనను గట్టిగా హత్తుకున్నాడు. “నాన్న ఫోన్ చేశాడా అమ్మా? మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తాం? నాకు నా బొమ్మలు కావాలి” అంటూ వాడి అమాయకపు ప్రశ్నలు ఆమెను కదిలించాయి.
వాడి బుగ్గలు నిమురుతూ, “మనం ఆ ఇంటికి ఇకపై వెళ్ళబోము నాన్నా. మనం ఇక్కడే ఉంటాం. నీకు కొత్త బొమ్మలు నేను మళ్ళీ కొనిస్తాను” అంది మృదుల కన్నీళ్ళు దిగమింగుకుంటూ.
సుబ్బు అమాయకపు స్పర్శ మృదులలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఈ బురదలో పోరాడి తాను గెలిచేది ఏంటి? న్యాయవ్యవస్థలోని లొసుగులు తెలిసిన వాడితో, వాడి ఇలాకాలో న్యాయపోరాటం చేయడం మూర్ఖత్వం అనిపించింది. సుధీర్ బలం చట్టం. మరి వాడి బలహీనత ఏంటి? అని ఆలోచించింది.
సొసైటీలో తను ఒక పెద్ద లాయర్ అన్న ఇమేజ్. ఆ ఇమేజ్ డ్యామేజ్ అయితే వాడు తట్టుకోలేడు. పరువున్న మనిషిగా వాడి బండారం బయటపెడితే? మృదుల కళ్ళలో ఒక కొత్త వెలుగు, ఒక స్థిరమైన నిశ్చయం కనిపించాయి. ఆమె తన లాయర్ రమాకాంత్‌కు ఫోన్ చేసి, “సర్, నేను చెప్పినట్లు ఒక డాక్యుమెంట్ రెడీ చేయండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పింది.
***
మరుసటి రోజు మధ్యాహ్నం కోర్టు ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కోర్టు ఆవరణలోని తన ప్రైవేట్ ఛాంబర్లో దర్జాగా కూర్చుని ఉన్నాడు సుధీర్. మృదుల పని ఇక అయిపోయినట్టే, గెలుపు నాదే అన్న ధీమా అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
తలుపు తీసుకుని నేరుగా లోపలికి వచ్చింది మృదుల. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఏడుస్తూ బతిమిలాడుకోవడానికి వచ్చిన బాధితురాలిలా కనిపించలేదు. యుద్ధానికి సిద్ధమైన ఒక పోరాటయోధురాలిలా కనిపించింది. ఆమె వెనకే లాయర్ రమాకాంత్ కూడా లోపలకి వచ్చాడు.
మృదులను చూడగానే సుధీర్ ముఖంలో వెటకారం పుట్టుకొచ్చింది. “ఏంటి మృదులా.. జ్ఞానోదయం అయిందా? ఫైనల్‌గా రాజీకి వచ్చావా? నేను చెప్పినట్లు వింటే నెలకి కనీసం ఓ ఇరవై వేలు భరణం వచ్చేలా చూస్తానులే, పిల్లాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళు” అన్నాడు.
మృదుల అతని మాటలను పట్టించుకోలేదు. తన బ్యాగ్ లోంచి రెండు పేపర్లు తీసి టేబుల్ మీద పెట్టింది. “ఇది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ పేపర్. దీని మీద సంతకం పెట్టు. నాకు నీ ఆస్తిలో చిల్లిగవ్వ అవసరం లేదు. సుబ్బు కస్టడీ మాత్రం నాకే సొంతం అన్న క్లాజ్ ఇందులో రాసుంది. ఇద్దరం ఇది కోర్టులో సబ్మిట్ చేసి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం” అంది.
ఆమె మాటలకు సుధీర్ నవ్వి, “నువ్వు నిజంగానే పిచ్చిదానివి మృదుల. నేనెందుకు సంతకం చేస్తాను? కేసులో ఎలాగూ నేనే గెలుస్తున్నాను. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు” అన్నాడు అహంకారంగా.
మృదుల ఏమాత్రం తొణకకుండా ముందుకొచ్చి, తన బ్యాగు లోంచి ఒక చిన్న పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టింది. “నీ ప్రతాపం కోర్టులోనే సుధీర్. ఇక్కడ కాదు. ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో తెలుసా..?”
సుధీర్ ఆశ్చర్యంగా కుర్చీలోంచి ముందుకు జరిగాడు.
“అన్నింటినీ తుడిచేయగలిగావు. కానీ నీ నుండి నాకు విముక్తి కలగాలని ఆ దేవుడు కూడా అనుకున్నాడేమో.. నువ్వు సాక్ష్యాలన్నీ మాయం చేశానని అనుకున్నావ్.. కానీ ఈ ఒక్క ఆధారం చాలు నీ జీవితం నాశనం అవ్వడానికి” అంటూ ఆ పెన్ డ్రైవ్‌ను అతని ల్యాప్టాప్కే కనెక్ట్ చేసింది మృదుల.
మృదుల అలా అనగానే సుధీర్ ముఖంలో రంగులు మారాయి. “ఏంటి.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు” అంటూ కంగారు పడిపోయాడు.
“అవును.. అన్నీ బాగానే మేనేజ్ చేశావు గానీ.. ఆ రోజా మొబైల్ ను మాత్రం ఎలా వదిలేశావు? నువ్వు రోజాను వేరే ఊరికి పంపించేసి అంతా సేఫ్ అనుకున్నావు. కానీ, నీకు అనుమానం రాకుండా నేనే స్వయంగా వెళ్ళి ఆమెను నిలదీస్తే ఈ సాక్ష్యం బయటపడింది”
సుధీర్‌కు తను చేసిన పొరపాటు ఆ క్షణం స్పష్టంగా అర్థమైంది. ల్యాప్‌టాప్ లో అతనూ – రోజా కలిసి ఉన్న వీడియో ఒకటి ప్లే అవుతోంది. తన వీడియో తానే చూస్తుంటే, అది కూడా కట్టుకున్న భార్య ముందు.. ఆ క్షణం అతనికి తనపై తనకే వెగటుగా అనిపించింది. తానెంత తప్పు చేశాడో పూర్తిగా తెలిసొచ్చింది. వెంటనే ల్యాప్‌టాప్ ను కోపంగా మూసేశాడు.
“ఇప్పుడు నీకేం కావాలి?” అంటూ నెమ్మదిగా గొణిగాడు సుధీర్.
మృదుల సూటిగా సమాధానం ఇచ్చింది. “నీ నుండి విముక్తి.. నా కొడుకు నాకు కావాలి!!”
మృదుల అలా అనగానే సుధీర్ నోరు మూగబోయింది. కొడుకును ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందోనన్న భయం మొదలయింది. ఒక్కసారిగా తన కొడుకు నవ్వులు, అల్లరి కళ్ళముందే కదలాడాయి.
“నేనిక కోర్టు, ఆధారాలు అంటూ నీతో వాదించను సుధీర్. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసి దీన్ని కూడా సాక్ష్యంగా నిలవకుండా చేయగలవని నాకు తెలుసు. కానీ.. దాన్ని నేను బార్ కౌన్సిల్‌కి పంపి, మీడియా వాళ్ళకి ఇస్తే? నైతిక విలువలు లేని ఒక క్యారెక్టర్‌లెస్ అడ్వకేట్, తన జూనియర్ అడ్వకేట్‌తో జరుపుతున్న ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి వాళ్ళకి తెలిస్తే నీ తోటి లాయర్ల ముందు, జడ్జిల ముందు నీ పరువు ఏమవుతుంది? నీ దగ్గరకు క్లయింట్లు ఎవరైనా వస్తారా? నీ కెరీర్ ఏమవుతుంది.. ఆలోచించుకో” మృదుల గొంతులో కత్తికంటే పదునైన తెగింపు కనబడింది.
ఒక్కసారిగా సుధీర్ ముఖం పాలిపోయింది. మృదుల ఇలా చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు. ఆ వీడియో గనుక బయటికి వస్తే మొత్తం చేజారిపోయింది. తను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరు, పరపతి అంతా ఒక్కరోజులో నాశనం అయిపోతుంది.
ఆలోచనల్లోంచి బయటకి వచ్చి, “నన్ను బెదిరిస్తున్నావా?” అంటూ కోపంగా అరిచాడు సుధీర్.
“బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాను. నీలాంటి వాడికి పరువు అనేది ఎంత వీక్ పాయింటో నాకు తెలుసు. నీ తప్పులని ప్రపంచం ముందు పెట్టి నిన్ను రోడ్డు మీద నిలబెట్టడం నాకు నిమిషం పని. కానీ, ఆ బురద నా కొడుకు మీద పడకూడదు. వాడికి తన తండ్రి ఒక వెధవ అని తెలియకూడదు. నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది. నీలాంటి మోసగాడితో బంధం నాకొక శాపం అనుకుంటాను. సంతకం చేస్తావా? లేక రేపు న్యూస్ ఛానల్స్‌లో నీ బాగోతమంతా స్వయంగా నువ్వే చూస్తావా? ఛాయిస్ ఇస్ యువర్స్” మృదుల మాటల్లో ఏమాత్రం బెరుకు లేదు.
ఏసీ రూమ్‌లో కూడా సుధీర్‌కు చెమటలు పట్టాయి. నోట్లోనుంచి మాటలు రావడంలేదు. తన కెరీర్, పేరుప్రతిష్ఠలు తన కళ్ళముందే చేజారిపోతున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు తన దగ్గర వేరే దారి కనిపించడం లేదు. గత్యంతరం లేక, రగిలిపోతూ ఆ మ్యూచువల్ డివోర్స్ పేపర్ల మీద కోపంగా సంతకం చేశాడు.
“గుడ్ బై సుధీర్” అంజెప్పి ఆ కాగితాలు తీసుకుని బయటకు వచ్చేసింది మృదుల.
ఇప్పుడు తన మనసు చాలా తేలిగ్గా అనిపించింది. కోర్టు ఆవరణలో ఉన్న పెద్ద రావిచెట్టు ఆకుల గుండా సూర్యకిరణాలు ఆమె ముఖం మీద పడుతున్నాయి. ఆ కిరణాలు ఆమెకు ఒక కొత్త జీవితాన్ని స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది. విడాకులు అనేది జీవితానికి ముగింపు కాదు, ఒక మోసపూరితమైన బంధం నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి దొరికిన అవకాశం అని తనకు అర్థమైంది. తనకు జరిగిన అన్యాయానికి ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉండిపోకుండా, తనకంటూ ఒక గుర్తింపును, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆమె దృఢంగా నమ్మింది. ఇప్పుడు మృదుల మనసులో ఎలాంటి భారం లేదు. రేపటి గురించి భయం లేదు. ఇంటికి వెళ్ళి సుబ్బుని గుండెలకు హత్తుకుని, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కోర్టు గేటు దాటి బయటకు వస్తున్న మృదుల ముఖంపై ఇప్పుడు ఒక ప్రశాంతమైన చిరునవ్వు విరబూసింది. ఆ నవ్వులో గెలుపు ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది.
సమాప్తం
