[ఇటీవల నేపాల్‌లో పర్యటించి, అక్కడి ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి పొందిన అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు డా. నర్మదా ఇంద్రారెడ్డి.]
ఈమధ్య నేను, మావారు, అంజనాద్రి గారు విజయలక్ష్మి, సుధ గారు, లక్ష్మణ్ గారు – మూడు జంటలు కలసి నేపాల్ వెళ్ళాము.
నేపాల్‌లో దిగగానే తప్పనిసరిగా ముక్తినాథ్ వెళ్లాలని ఎన్ని సంవత్సరాల నుంచో నాకు కోరిక ఉండేది. నేపాల్‌కి నేను ఇది నాలుగోసారి వెళ్లడం. అయితే ముక్తినాథ్ దర్శనం మాత్రం కాలేదు. ఈసారి మేము అక్కడికి వెళ్లినప్పుడు పోక్రాకి వెళుతున్నామని తెలిసింది, మా ప్రయాణం మాత్రం చాలా సడన్‌గా పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం లేదు ముక్తినాథ్కి బుక్ చేసుకోవడానికి.
సరే, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి, నేపాల్‌లో దిగగానే మొదలు పెట్టాను. అక్కడ టిక్కెట్ కౌంటర్ దగ్గర ఉన్న అబ్బాయి “నేను హెల్ప్ చేస్తానండి మీకు, ఎంతమంది వెళ్లాలి? అని అడిగాడు. మేము ఇద్దరం వెళ్ళాలని అతనితో చెప్పాను.
“అయితే సరే నేను బుక్ చేయించి ఇస్తాను” అని అతను మమ్మల్ని లోపలికి టికెట్ కౌంటర్ లోకి తీసుకెళ్లి, మాకు రెండో రోజుకి పొద్దున్నే 12 ఓ క్లాక్ ఫ్లైట్ బుక్ చేసి ఇచ్చాడు. ఎంత సంతోషం అనిపించిందంటే ఏదో లాటరీ టికెట్ దొరికినట్టు అనిపించింది. మనసులో ఎంత ఆనందమో చెప్పొద్దు, ఎగిరి గంతేయాలనిపించింది కానీ అక్కడ చాలామంది ఆఫీసర్లు ఉన్నారు.
కిందికి దిగి వస్తుంటే మా సామానులన్ని విజయకి అప్పజెప్పి పైకి వచ్చాము. విజయ ఆ సామానులని లాగుతూ వెళ్లి అది ఎలా టిల్ట్ అయిపోయింది తెలియదు పాపం లగేజ్ ట్రాలీ తన మీద పడిపోయింది. తనూ కింద పడిపోయిందిట. మేము వెళ్లేసరికి తను నార్మల్ గానే వెహికిల్‌లో కూర్చుని ఉన్నారు, కానీ తను పాపం దెబ్బ తగలటం నాకు చాలా బాధనిపించింది. ఈసారి నేపాల్ లో టూ నైట్స్ ఉన్నాము. ఒక హోటల్లో దిగాము. దిగిన తర్వాత అక్కడ దగ్గర దగ్గర ప్లేసెస్ ఏమేం ఉన్నాయి అని కనుక్కుంటే, చాలా ప్లేసేస్ ఉన్నాయని తెలిసింది. అందులో పశుపతినాథ్ టెంపుల్ ముఖ్యమైనది. తరువాత సాలిగ్రామ శిలతో తయారు చేసిన విగ్రహం ఉన్న విశిష్టమైన విష్ణుమూర్తి ఆలయం అని చెప్పారు. పశుపతినాథ్ ఆలయం తర్వాత విష్ణుమూర్తి గుడి. ఆ దగ్గరలో చాలా గుళ్ళు ఉన్నాయి. మేము మర్నాడు ఉదయం ఈ గుళ్ళు చూడ్డానికి వెళ్లడానికి వెళ్ళాము. ప్రతి ఆలయంలోనూ అద్భుతమైన దర్శనాలు, ప్రశాంతమైన అనుభూతి కలిగాయి.
ఈ ఆలయాలన్ని చూసుకున్న తరవాత ఒక రాజసౌధాన్ని – నేపాల్ రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు కోటని చూడడానికి వెళ్ళాము. అందులో చాలా భాగము ఈ మధ్యన వచ్చిన భూకంపానికి పాడైపోయింది. దాన్ని పునరుద్ధరించి చాలా బాగా కట్టారు, కడుతున్నారు కూడా. ఇంకా అదంతా చూస్తూ చక్కటి ఫోటోలు తీసుకొని మేము నేపాల్ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వాళ్ల సంస్కృతి కట్టడాలని చిత్రీకరించిన కుడ్యాలను చూసుకుంటూ చాలా చాలా ఆనందించాము.
నేపాల్‌కి ఆ పేరెందుకు వచ్చిందో తెలుసుకున్నాం. నేపాల్ అనేది పురాతన పదం. ఎందుకు పురాతనపదం అంటే నేపా అనేది ఒక సంస్కృతమైన రూపం. నే అంటే మద్య, పా అంటే దేశం. నేపా అంటే మధ్యదేశం. కొండల మధ్యలో ఉన్న నేపా కులా. సంభాషణల్లో భావోద్వేగాలతో పిలుస్తారు కాబట్టి నేపాల్ అని అంటారు. ఇంతటి చరిత్ర ఉంది అన్నమాట నేపాల్ పేరు వెనుక. ఇంకా చాలా ఉంది. ఇవన్ని చూస్తూ చాలా చాలా సంతోషించాము. ఏనాడో 12 వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలను చూస్తు చాలా అనందించాము.
మర్నాడు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాము. అక్కడ శ్రీ మహావిష్ణువు సాలగ్రామ శిల రూపంలో నల్లని రాతిలో ఉంటాడు. చుట్టూ నీళ్లు, మధ్యలో శ్రీమహావిష్ణువు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. నిజంగా! అది చూస్తూ చూస్తూ అలా 15 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా చూసానేమో! నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే – అబ్బ ఎంత అందంగా ఉన్నాడు మహావిష్ణువు అని చెప్పేసి అలా చూస్తూ, మూడు సార్లు ప్రదక్షిణాలు చేశాను. భక్తిపారవశ్యాన్ని ఇంకించుకున్నాను. మేము రకరకాల పళ్ళు కూరగాయలు దేవుడికివ్వడానికి తీసుకెళ్లాము. వాటిని అక్కడ పెట్టేసి, పశుపతినాథ మందిరానికి వెళ్ళాము. పరమశివుడు స్వయంబుగా కొలువై ఉన్న పశుపతినాథ్ దేవాలయం ఖాట్మండులో భాగమతి నది తీరంలో ఉంది. ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం.
తరువాత, సీతాదేవి జన్మస్థలంగా చెప్పబడే జనక్‌పూర్ కూడా సందర్శించాం. దీనికి మిథిలా నగరం అనే పేరు కూడా ఉంది. జనక మహారాజుకు సీతాదేవి భూమిలో ఓ పెట్టెలో లభించినది అని ఇక్కడివారి నమ్మకం. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు కూడా జనక్‌పూర్ లోనే జీవించినట్లు చరిత్ర.
ఇక్కడి రాజప్రసాదంలో జానకీదేవి మందిరాన్ని కూడా చూడవచ్చు. ఇవన్నీ చూసుకుంటూ పోక్రాకి వెళ్ళాము. పోక్రా లోయలో అందమైన Phewa Lake ఉంది. ఈ పట్టణం చక్కటి అన్నపూర్ణ పర్వత శిఖరాల అందాలను దర్శింపజేస్తూ వాహ్ అనిపిస్తుంది. ఖాట్మండులో నాగర్ కోర్ట్ కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతం.
మధురానుభూతులను సొంతం చేసుకుని తిరుగుప్రయాణమయ్యాం.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన డా. నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.

