Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దివ్యప్రకాశం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దివ్యప్రకాశం’ అనే రచనని అందిస్తున్నాము.]

ఉదయించే సూర్యుడు ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తాడు. చల్లని వెన్నెల మనస్సుకు ప్రశాంతతను పంచుతుంది. అగ్ని చీకటిని పటాపంచలు చేసి వెచ్చదనాన్ని అందిస్తుంది. అనునిత్యం మన కంటికి గోచరించే ఈ ప్రకృతి వెలుగుల్లో దాగి ఉన్న దైవవైభవాన్ని గుర్తించగలిగితే, బాహ్య ప్రపంచ దర్శనమే ఆధ్యాత్మిక అనుభూతికి దివ్య ద్వారమవుతుంది. ఈ సమగ్ర విశ్వదృష్టిని ప్రసాదిస్తుంది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్।
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్॥

సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసే సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలో నిమిత్తమై ఉన్న ఆహ్లాదకరమైన వెలుగు, అగ్నిలో దాగి ఉన్న దాహక శక్తి తనదిగానే తెలుసుకోమని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధిస్తున్నాడు. విశ్వంలో గోచరించే ప్రకాశం ద్వారా దానికి పరమాధారమైన మూలచైతన్యాన్ని గుర్తించాలన్నదే ఈ శ్లోకం అందిస్తున్న అంతరార్థం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని భౌతికంగా వేర్వేరుగా కనిపించినప్పటికీ, వాటిలో భాసించే వెలుగు ఒక్కటేనని, అది ఆ పరమేశ్వర విరాట్ రూపావిర్భావమేనని గీతాచార్యుడు తేటతెల్లం చేస్తున్నాడు.

ఈ అవగాహన మన దృష్టిని బాహ్య పరిధిలోని వెలుగుల నుంచి వాటికి మూలమైన ఆత్మతత్త్వం వైపు మళ్లిస్తుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి కేవలం పరవశించడంతో ఆగిపోకుండా, ఆ సృష్టి వెనుక ఉన్న సృజనకర్త పట్ల మనస్సులో కృతజ్ఞతాభావం మేల్కొనాలి. మానవ ప్రయత్నంతో నిర్మితం కాని ఎన్నో ప్రకృతి శక్తులపైనే తన ప్రాణకోటి ఉనికి ఆధారపడి ఉందనే యథార్థం మనిషిలో అహంకారాన్ని తొలగించి, వినయ విధేయతలను పెంపొందిస్తుంది.

కఠోపనిషత్తు “తమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి” అని మహోన్నతంగా ప్రకటిస్తోంది. ఆ పరమాత్మ స్వయంప్రకాశక శక్తితో ప్రకాశించడం వల్లనే ఈ సమస్త విశ్వమూ ప్రకాశిస్తోంది. భౌతికమైన సూర్యచంద్రాగ్నులు ఆ పరబ్రహ్మాన్ని వెలిగించలేవని, పైగా వాటి ప్రకాశత్వానికే ఆ పరమాత్మ మూల కారణమని ఈ మంత్రం బోధిస్తోంది. బాహ్య కాంతిని దాటి, సమస్త జగత్తుకు, మన అనుభవాలకు ఆధారభూతమైన అంతర్గత పరమచైతన్యాన్ని విచారించడానికి ఉపనిషత్తులు మనలను ఆహ్వానిస్తున్నాయి.

భగవాన్ రమణ మహర్షి ఆత్మవిచారణ మార్గంలో “బాహ్యంగా కనిపించే ప్రపంచ వెలుగులను ప్రకాశింపజేస్తున్నది మనలోని ఆత్మచైతన్యమే” అని స్పష్టం చేశారు. కంటికి కనిపించే జగత్తును తెలుసుకుంటున్న ‘జ్ఞాత’ ఎవరో అన్వేషించినప్పుడే వెలుగుల అసలు మూలం బోధపడుతుందని ఆయన ఉపదేశించారు. ఈ భగవద్గీతా శ్లోకాన్ని రమణుల బోధలతో అనుసంధానిస్తే, బయట ప్రకాశించే సూర్యచంద్రాదులను చూస్తున్న మనలోని అంతర్దృష్టి లేదా సాక్షిచైతన్యమే ఆ పరమాత్మ స్వరూపమని స్పష్టమవుతుంది.

స్వామి వివేకానంద ప్రతి జీవాత్మలో దివ్యత్వం అంతర్లీనంగా విరాజిల్లుతోందని, విశ్వంలో వ్యక్తమయ్యే సమస్త శక్తులు, తేజస్సులు ఆ దివ్యత్వ ప్రతిబింబాలేనని ఉద్ఘాటించారు. బాహ్య, అంతఃప్రకృతులను అదుపులోకి తెచ్చుకుని మనలోని ఆత్మతేజస్సును బహిర్గతం చేయడమే మానవ జీవిత పరమావధి అని ఆయన వివరించారు. సూర్యాగ్నులలోని దైవతేజస్సును గుర్తించే జ్ఞానదృష్టి, మన ప్రవర్తనలో ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరిచే ఆధ్యాత్మిక సాధనగా పరిణమించినప్పుడే జీవితానికి సంపూర్ణత్వం చేకూరుతుంది.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా “సర్వజీవులలో, సమస్త ప్రకృతిలో వెలిగే దివ్యజ్యోతి ఒక్కటే” అని చాటారు. సూర్యుడు పక్షపాతం లేకుండా సమస్త లోకానికి కాంతిని పంచినట్లే, మానవుడు కూడా హృదయ ప్రాంగణంలో ప్రేమజ్యోతిని వెలిగించి, సర్వమానవాళికి నిస్వార్థ సేవనందించాలని బాబా ఉపదేశించారు. విశ్వంలో భాసించే బాహ్యతేజస్సును దైవస్వరూపంగా భావిస్తూ, ఆ ప్రేమతత్త్వాన్ని మన ఆచరణలో ప్రతిబింబింపజేయడమే నిజమైన సాధన.

శిష్యుడి అంతర్దృష్టిని మేల్కొలుపుతూ గురువు వివరించాడు: “సూర్యోదయాన్ని తిలకించినప్పుడు కేవలం కళ్లతో చూడటం మాత్రమే కాక, ఆ వెలుగు ద్వారా నీకు లభిస్తున్న జీవితానికి ధన్యతా భావాన్ని ప్రకటించు. ఆ వెలుగును ప్రకాశింపజేస్తున్న ఆత్మతత్త్వమే నీలోనూ ఉందని గ్రహించినప్పుడు నీ అహంకారం సమసిపోతుంది. ఉదయాన్నే విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం, ప్రశాంతంగా ధ్యానించడం, నీలోని జ్ఞానకాంతిని ఇతరుల శ్రేయస్సుకు వినియోగించడం ఈ శ్లోక సమగ్ర ఆచరణ రూపాలు.”

ప్రకృతిని దైవస్వరూపంగా గౌరవించడం, వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం, తోటి జీవుల పట్ల ఆదరాభిమానాలను కలిగి ఉండటం ఈ దివ్యబోధను జీవితానికి అన్వయించుకోవడమే అవుతుంది. మనకు లభించిన విజ్ఞానాన్ని, వివేకాన్ని పదిమందికీ పంచడం అంటే ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించడమే. దైవవిభూతిని గ్రహించిన సాధకుడి హృదయం అహంకారాన్ని వీడి నిర్మలత్వంతో వికసిస్తుంది.

బాహ్యప్రపంచంలో వెలుగును చూడటం సహజసిద్ధమైన ప్రక్రియ; కానీ ఆ కాంతిలో దైవవైభవాన్ని దర్శించి, ఆత్మజ్ఞానంతో స్వయంప్రకాశకులుగా మారి సమాజంలో మేలును పంచడమే పరమార్థ పరిపూర్ణ సాధన.

Exit mobile version