Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దొడ్డ మనసు

[గంపా శ్రీదేవి గారు రచించిన ‘దొడ్డ మనసు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రాజేష్ ఆటో డ్రైవర్. ఒకరోజు తన ఆటో దగ్గరకి ఒక తల్లి, తండ్రి, వాళ్ళ అబ్బాయి వచ్చి ఒక చిరునామా చెప్పి, అక్కడకి తీసుకెళ్లమన్నారు.

వాళ్లు చెప్పిన చిరునామా ప్రకారం వాళ్ళని తీసుకెళ్లి అక్కడ దించాడు.

“నేను ఒక పావుగంటలో వచ్చేస్తాను వుంటావా?” అని అడిగాడు వాళ్ళ అబ్బాయి.

“లేదండీ నేను వెళ్తాను, నాకు డబ్బులిచ్చేయండి” అన్నాడు రాజేష్.

“బాబూ ఇక్కడ ఆటోలు దొరికేలా లేవు, డాక్టర్ గారికి చూపించుకుని మళ్ళీ తొందరగా వచ్చేస్తాము నాయనా” అని అతని తల్లి బ్రతిమాలే ధోరణిలో చెప్పటంతో రాజేష్ కాదనలేక “సరేనమ్మా వుంటాను లెండి” అన్నాడు.

ఒక పావుగంట తరువాత వాళ్ళ అబ్బాయి ఒక్కడూ వచ్చి “పద బాబూ” అన్నాడు.

“మీ అమ్మ గారు, నాన్నగారు ఏరండి?” అని అడిగాడు రాజేష్.

“డాక్టర్ గారు వాళ్ళని ఆసుపత్రిలో చేర్చమన్నారు. ఒక పది రోజులుండాలన్నారు. అందుకే వాళ్ళని చేర్చాను” అన్నాడు వాళ్ళ అబ్బాయి.

“సరేనండీ, రండి” అంటూ ఆటో తీసాడు రాజేష్.

“అమ్మ, నాన్న గారికి అనారోగ్యం ఏంటండీ?” అని అడిగాడు రాజేష్.

“నాన్నగారికి గుండె జబ్బు అతనికి తోడుగా అమ్మని కూడా ఆసుపత్రి లో వుంచాను” అన్నాడు వాళ్ళ అబ్బాయి.

ఇంతలో వాళ్ళ ఇల్లు వచ్చింది.

అతను దిగి రాజేష్కి డబ్బులిచ్చి పంపించేసాడు.

20 రోజుల తరువాత ఒకరోజు రాజేష్ తన ఆటోలో బడి పిల్లలను తీసుకుని బడికి వెళ్ళాడు.

ఆ పిల్లల్లో ఒక చిన్న బాబు కొత్తగా బడిలో చేరటం వల్ల ఆ బాబుని జాగ్రత్తగా టీచర్ కి అప్పజెప్పడానికి తరగతి దగ్గరికి వెళ్ళాడు.

ఆ టీచర్కి ఆ బాబుని అప్పజెపుతూవుంటే “అలాగే మేము జాగ్రత్తగా చూస్తామని వాళ్ళ అమ్మా, నాన్న లకు చెప్పు” అంటూ ఆయమ్మా అని పిలిచారు టీచర్.

ఒక పెద్దావిడ వచ్చి “ఏమ్మా?” అని అడిగింది.

రాజేష్ వెళ్లిపోతున్న వాడల్లా ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసాడు.

ఆ పెద్దావిడని ఎక్కడో చూసినట్లుంది అనుకున్నాడు మనసులో.

ఆలోచించుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు.

ఇంతలో ఒక పెద్దాయనతో ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ కనిపించారు.

“చూడు, ఈ మొక్కలన్నింటికీ నీళ్లు పొయ్యాలి, వీటి తరువాత అదిగో అక్కడ కొన్ని వున్నాయి వాటికి కూడా పొయ్యాలి” అని చెపుతున్నారు.

ఇంతలో రాజేష్ కనిపించటంతో “ఏమయ్యా రాజేష్ బాగున్నావా?” అని పలుకరిస్తూ, “ఏంటి కొత్త పిల్లలు ఎవరైనా నీ ఆటోలో వచ్చారా?” అని అడిగారు ప్రధాన ఉపాధ్యాయురాలు.

“అవును మేడం గారూ ఒక చిన్న అబ్బాయిని తీసుకు వచ్చాను. వాళ్ళ అమ్మా, నాన్న జాగ్రత్తగా టీచర్కి అప్పజెప్పమంటే ఇలా వచ్చాను” అన్నాడు రాజేష్.

“ఎంత బాధ్యతగా ఉంటావయ్యా!” అన్నారు మేడం.

“నన్ను నమ్మి నా ఆటో ఎక్కించాక నేను బాధ్యతగా చూసుకోవాలి కదా మేడం” అన్నాడు రాజేష్.

మేడంతో మాట్లాడుతున్నాడు కానీ రాజేష్ దృష్టంతా మొక్కలకు నీళ్లు పోస్తున్న పెద్దాయన మీదే వుంది.

“సరే వస్తాను మేడం” అని ముందుకి నడిచాడు.

కానీ ఆ ఆయా గురించి, ఆ పెద్దాయన గురించి ఆలోచిస్తున్నాడు.

అప్పుడు గుర్తొచ్చింది, 20 రోజుల క్రితం వాళ్ళని తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళానని.

ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు, ప్రధానోపాధ్యాయురాలు అక్కడ లేరు.

వెంటనే ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళాడు.

“నమస్కారమండీ! నేను గుర్తున్నానా?” అని అడిగాడు.

ఊహించని ఆ పిలుపుకి ఒక్కసారే ఆశ్చర్యంగా చూసాడు ఆయన.

“ఎవరు బాబూ నువ్వు?” అడిగాడు ఆయన.

“నేనండీ ఆరోజు మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాను కదా ఆటోవాడ్ని” అన్నాడు రాజేష్.

“ఆ గుర్తొచ్చింది బాబూ” అన్నాడు పెద్దాయన.

“మీరేంటి ఇక్కడ వున్నారు?” అడిగాడు రాజేష్.

“ఆ రోజు నా కొడుకు మమ్మల్ని తీసుకెళ్లి ఆసుపత్రి అని చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఒక పది రోజులు మాత్రమే ఇక్కడ ఉంచమని తరువాత నేను వచ్చి తీసుకు వెళ్తానని వాళ్ళకి చెప్పాడుట. మీ కొడుకు పది రోజులకే డబ్బులు కట్టాడని, పది రోజుల తరువాత బయటికి తగిలేశారు. ఆత్మాభిమానం అడ్డు వచ్చి అడుక్కు తినలేక రెండు రోజులు పస్థులుండి తరువాత ఈ పాఠశాల మేడం దగ్గరికి వచ్చి ఏదైనా పని ఇమ్మని అడిగితే నా భార్యకి ఆయా పని నాకు ఇదిగో ఈ మొక్కలకి నీళ్లు పోసేపని ఇచ్చారు బాబూ” అని చెప్పాడు పెద్దాయన.

రాజేష్ కి ఒక్కసారే బుర్ర తిరిగి పోయింది. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.

“బాధ పడకండి, నేను సాయంత్రం మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పి వెళ్తూ, “మీ అబ్బాయి పేరేంటి?” అని అడిగాడు. “సుధీర్, పి. డబ్ల్యూ. డి ఆఫీస్ లో ఉద్యోగం చేస్తాడు” అని చెప్పాడు.

“వాడి గురించి శ్రమ తీసుకుని నువ్వు వాకబు చేయొద్దు బాబూ. మేము ఆశ్రమం నుంచి బయటికి వచ్చాక ఇంటికెళితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని, ఆఫీస్ కెళితే ఇచ్చాపురం బదిలీ అయి వెళ్లిపోయారని చెప్పారు. అప్పుడర్ధమైంది మాకు ముందుగా ఒక పధకం ప్రకారం మమ్మల్ని వదిలించుకున్నాడని. ఆ రోజే నేను నా భార్య మళ్ళీ వాడు వచ్చి అడిగినా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము.” అన్నాడు ఆ పెద్దాయన.

ఆయన ఆత్మభిమానానికి సంతోషించాలో, వాళ్ళ కష్టం చూసి బాధ పడాలో తెలియ లేదు రాజేష్ కి.

“లేదండీ ఆయన గురించి వాకబు చేయను” అని చెప్పి వెళ్లి పోయాడు.

సాయంత్రం పిల్లలను తీసుకుని వెళ్ళటానికి ఆటో తీసుకొచ్చి పిల్లలతో పాటు ఆ పెద్దాయనని, ఆవిడని కూడా బ్రతిమాలి తన ఆటో ఎక్కించుకుని పిల్లలను ఎవరింటి దగ్గర వాళ్లను దించేసాక వాళ్లిద్దరినీ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.

భార్యకు ముందే చెప్పటంతో భార్య వారిని సాదరంగా ఆహ్వానించింది.

రాత్రి భోజనాలయ్యాక వారిద్దరినీ కూర్చోబెట్టి ఇకనుంచీ వారిని తన ఇంటిలోనే తన కుటుంబంతో కలసి ఉండమని తన అమ్మ, నాన్నలు చినప్పుడే చనిపోయారని వారిని ఆ లోటు తీర్చమని ప్రాధేయపడ్డాడు రాజేష్.

“బాబూ ఈ వయసులో మేము నీ దగ్గరుంటే మా వలన నీకు ఎటువంటి సాయం ఉండదు సరికదా మా బాధ్యత కూడా నీమీద పడి నీకు భారమవుతాం బాబూ” అని వారు అక్కడ ఉండటానికి ఒప్పుకోలేదు.

కానీ ‘అమ్మా, నాన్నలు ఎలా వుంటారో తెలియని నాకు మీయిద్దరిలో వారిని చూసుకునే అవకాశం ఇమ్మ’ని రాజేష్ ఎంతగానో బ్రతిమాలాటంతో ఒప్పుకోక తప్పలేదు వారికి.

“సరే ఐతే నీకు భారమవకుండా ఎక్కడో దగ్గర పనిచేసి ఎంతోకొంత పైకం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం” అన్నారు.

కానీ రాజేష్ ఒప్పుకోలేదు.

పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడూ భారమవరని, కావాలంటే కాలక్షేపం కోసం ఇంటి దగ్గర కూరగాయల దుకాణం పెట్టుకుందామని, అంతేకాని మీరు బయటకి వెళ్లి ఏ పనీ చేయొద్దనీ వారికి నచ్చ చెప్పాడు.

రాజేష్ భార్య పదవతరగతి వరకూ చదువుకున్నదవటంతో, సాయంత్రం పూట పిల్లలకు ప్రైవేట్ చెప్పేది. పగలు ఇంట్లో పని అయ్యాక మిషన్ కుట్టేది.

ఇప్పుడు ఇంటిపనిలో అత్తగారు సాయం చేస్తుండటంతో ఎక్కువ సమయం మిషన్ కుట్టడానికి వెచ్చిస్తోంది. దాని ద్వారా ఆదాయం కూడా పెరిగింది.

ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన రాజేష్ కూరగాయలు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు ఎవరో “మీ అబ్బాయి ఏమి చేస్తాడు?” అని అడిగినప్పుడు “నా కొడుకు ఆటోవాలా, ఆటో వేస్తాడు” అని చెపుతున్న తండ్రి మాటలు చెవిన పడిన రాజేష్ తనను కొడుకుగా అంగీకరించిన ఆ దొడ్డ మనసుకు ఎంతగానో పొంగిపోయాడు.

Exit mobile version