తేది 21-06-2026 న సాయంత్రం 06.00 గంటలకు డోంబివలీ లోని సర్వేశ్ సభాగృహం లో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురు గీత రమేశ్ కోలి బృందం ప్రదర్శించిన ‘మహిషాసుర మర్దిని’ నృత్య రూపకం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది గత ఎనిమిది నెలల్లో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ జరిగిన పన్నెండవ తెలుగు కార్యక్రమం.
తొలుత అతిథులచే దీప ప్రకాశనంతో తర్వాత, మహారాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది.
ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ హరీశ్, తెలుగు కార్యక్రమ సమన్వయకులు శ్రీ జగన్ బాబు గంజి, శ్రీ అశోక్ కంటె, డా. అంబల్ల జనార్దన్, డోంబివలి కార్యక్రమ సమన్వయకులు శ్రీ వాసాల కిషన్ గార్లు నిర్వాహకులుగా వేదికనలంకరించారు.
సాంస్కృతిక బృంద అధిపతులైన గురు గీత, శ్రీ విజయభాస్కర్ మరియు డోంబివలీ కార్యక్రమ సమన్వయకర్త శ్రీ వాసాల కిషన్ గార్లను మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. తర్వాత కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటె గారు, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ హరీశ్ గారిని తన ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరారు. శ్రీ హరీశ్ గారు, మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పడంలోని ఉద్దేశం విశద పర్చారు. మహారాష్ట్రలోని తెలుగు-మరాఠీ ప్రజల మధ్య సుహృద్భావం ఏర్పరచి, మరాఠీ-తెలుగు సాహిత్య-సంస్కృతులను పరస్పరం ఇచ్చి పుచ్చుకుని ఇరు భాషీయులు సఖ్యంగా ఉండాలన్నారు. అందుకే తెలుగు వారు ప్రాముఖ్యంగా ఉన్న అన్ని ప్రాంతాలలో తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
అటు పిమ్మట సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా గురు గీత రమేష్ కోలి బృందం ‘గణేశ్ వందన’, ‘పుష్పాంజలి’, ‘అలరింపు’ అంశాల నృత్య ప్రదర్శనలు కనుల పండువగా చేశారు.
ఆ తర్వాత, శ్రీ రత్నాకరం విజయభాస్కర్ రాజు బృందం, పుణే వారు ఒక హాస్య నాటిక ప్రదర్శించారు. శ్రీ విజయ భాస్కర్, శ్రీ కార్తికేయ మరియు శ్రీమతి మాధవి గార్లు, నేటి రీళ్లు, వాట్సాప్లు కుటుంబ బాంధవ్యాలను ఎంతలా భంగపరుస్తున్నాయో, అవి కోల్పోయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, చాలా ప్రభావవంతంగా ఆవిష్కరించారు. నాటికలోని వ్యంగానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్పందించారు.
వ్యాఖ్యాత శ్రీ కంటె అశోక్ గారు, కార్యక్రమ సమన్వయకుల్లో ఒకరైన డా. అంబల్ల జనార్దన్ గారిని ప్రసంగించ వలసిందిగా కోరారు. డా. జనార్దన్ గారు మాట్లాడుతూ ఒక తెలుగేతర రాష్ట్రంలో తెలుగు సాహిత్య అకాడెమీ స్థాపించిన ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర అని, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మన తెలుగు కార్యక్రమాల నిర్వహణకై సహకరిస్తున్న మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యదర్శి శ్రీ సచిన్ నింబాళ్ కర్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగు వారిని ఒక్క త్రాటిపైకి తెచ్చి, మన సాహిత్య – సంస్కృతులను కాపాడుకునే అవసరం ఎంతో ఉందన్నారు. మహారాష్ట్రలో తెలుగు వారు, తెలుగు మూలాలున్న వారు దాదాపు కోటి మందికి పైగా ఉన్నారని ఆంచనా. వారంతా సాటి తెలుగు వారితో, తమ పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని పిలుపు నిచ్చారు. అలాగే తెలుగు అక్షర జ్ఞానం కూడా కలిగి ఉంటే, మన మాతృభాషను పరిరక్షించుకోగలమనీ, మన అస్తిత్వాన్ని కాపాడగలుగో గలమని అన్నారు. ఐతే వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమాలను అంతగా ఆదరించక పోవడం శోచనీయం అన్నారు. ఒక ప్రభుత్వ తెలుగు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై, మన సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. అలాగే శ్రీ కంటె అశోక్ గారు కూడా స్థానిక తెలుగు ప్రజలు, ఈ కార్యక్రమాలను ఉచిత రీతిని ఆదరించక పోవడంపై కాస్త గట్టిగానే విచారం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఇరవై మందికి పైగా ప్రదర్శించిన ‘మహిషాసుర మర్దిని’ నృత్య రూపకం, ప్రేక్షకులను ఉర్రూతలూగుంచింది. నృత్య కళాకారుల హావభావాలు. భంగిమలు ఆ రూపకానికి వన్నె తెచ్చాయి. ఆ కళాకారులందరికి, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
అటు పిమ్మట స్థానిక తెలుగు ప్రజల తరఫున శ్రీ రమేశ్ గొండ్యాల, అక్కినపల్లి దుర్గేశ్ తదితరులు, మహారాష్ట్ర ప్రతినిధి శ్రీ హరీశ్ మరియు ఇతర తెలుగు కార్యక్రమ సమన్వయకులు శ్రీ జగన్ బాబు గంజి, శ్రీ అశోక్ కంటె, డా. అంబల్ల జనార్దన్, డోంబివలి కార్యక్రమ సమన్వయకులు శ్రీ వాసాల కిషన్ గార్లను పుష్పగుఛ్ఛాలతో సత్కరించారు. శ్రీ రమేశ్ గొండ్యాల మాట్లాడుతూ, తెలుగు సాహిత్య అకాడెమీ స్థాపించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు అకాడెమీ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానిక గుజరాతీ సభ్యుడు శ్రీ నిరంజన్ పండ్యా గారిని పుష్ప గుచ్ఛంతో నిర్వాహకులు సన్మానించారు.
శ్రీ అశోక్ కంటే గారి వందన సమర్పణ తర్వాత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

