Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దొంగ భయం

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘దొంగ భయం’. రచన శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు.]

విశాఖపట్నం..

విస్తరిస్తున్న ఉక్కు నగరం; ఒకింత రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొన్నా, ప్రముఖ పారిశ్రామిక నగరంగా, చూడచక్కటి విహారస్థలంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్‌ సిటీ. జెర్రిపోతులాంటి నేషనల్‌ హైవేకి ఒక ప్రక్కన కొండలపైకి ప్రాకుకొంటూ వెడుతున్న కాలనీలలో ఓ కాలనీ.. పోష్‌ కాలనీయే..

***

అర్ధరాత్రి రెండుగంటల దాటింది. అక్కడక్కడ కుక్కల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దంగాను, నిర్మానుష్యంగానూ ఉంది. ఆ కాలనీలో హైవేకి బాగా ఎత్తున ఓ మూలగా ఓ బిల్డింగ్‌.. ఆ బిల్డింగ్‌ ప్రహారిగోడను ఒక్క అంగలో ఎక్కి లోనికి దూకాడు సింహాచలం. ఆ బిల్డింగ్‌ ఆవరణ అంతా దట్టంగా రకరకాల మొక్కలు, చెట్లతో నిండి ఉంది.. సరి అయిన సంరక్షణ కనబడటం లేదు. దూకిన అయిదు నిముషాల వరకు మామిడి చెట్లు వెనుకనే నించున్నాడు సింహాచలం.. కీచురాళ్ళ శబ్దం తప్ప వేరే ఏం లేదు.. రోడ్డు మీద లైటు వెలుగు పడుతోంది.. ఆ వెలుగు చాలు.. లేకపోయినా సింహాచలానికి చీకట్లోనే దృష్టి బాగా ఆనుతుంది. ఎందుకంటే అతను దొంగ కాబట్టి..

అతని వయస్సు ఇరవై, ఇరవైరెండు మధ్య ఉంటుంది. పదేళ్ళ క్రితం ఏడోక్లాసు చదువుతుండగా రిక్షాత్రొక్కే తండ్రి పోయాడు.. తల్లి పాచిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సింహాచలమే పెద్ద.. ఇద్దరు చెళ్ళెళ్ళు. దాంతో ఏదో ఒక కూలిపనికి వెళ్ళేవాడు. అయితే సినిమాల పిచ్చి ఉండటంతో కూలిడబ్బులు సినిమాలకి, సరదాలకీ సరిపోయేవి కావు.

ఓసారి కిళ్ళీకొట్టు దగ్గర బీడీ కాలుస్తుంటే, కూల్‌డ్రింక్‌ త్రాగి డబ్బులిచ్చేసి పర్సు పేంట్‌జేబులో పెట్టుకొని స్కూటర్‌ మీద వెళ్ళిపోయాడొకడు. పర్సు సరిగ్గా పెట్టుకోకపోవడంతో జారిపడటం సింహాచలం చూశాడు.

మరెవరు చూడకుండా అందుకొన్నాడు. రెండువేల రూపాయలున్నాయి అందులో.. వారం రోజుల కూలి విలువ. అందుకే జేబుల కోసం చూడటం మొదలుపెట్టి జేబులు కొట్టడం జాబుగా పెట్టుకొన్నాడు. అదృష్టాన్ని బట్టి ‘సంపాదన’ దొరకసాగింది. తల్లికేవేవో చెప్పేవాడు.. ఒకటి రెండు సార్లు పోలీసులకు దొరికాడు. అయితే వారి దృష్టిలో సింహాచలం ఓ చిల్లర దొంగ మాత్రమే. అయితె ఈ మధ్య కొట్టిన పర్సులతో డబ్బుల కన్నా ఏవేవో కార్డులు మాత్రమే కనబడటంతో తనకి తాను ప్రమోషన్‌ ఇచ్చుకొందామనుకున్నాడు. బాగా సర్వే చేసి పగలు కూడా అలికిడిలేని ఆ బిల్డింగ్‌ గోడ దూకాడు రాత్రి రెండు దాటాకే.. అలా దూకడం అది రెండోసారి..

***

రెండు రోజుల క్రితం అలా దూకాడు, మొదటిసారిగా. వెనుకడోర్‌ జారవేసి ఉండటంతో ఆశ్చర్యంగా లోనికి ప్రవేశించాడు. విశాలమైన కిచెన్‌లోనికి తెరచుకొందది. సెల్‌ టార్చితో పరికించి చూశాడు. అంతే నిశ్శబ్దంగా ఉంది. కిచెన్‌కి ప్రక్కగా దేవుడి గది ఉంది. దేవుడి మందిరమంతా వెండిమయం. దొరికిన వెండిసామానులు భుజం మీద వేలాడుతున్న సంచిలో వేసుకొన్నాడు. హాలులోనికి వచ్చాడు. బెడ్‌రూం తలుపులు జారవేసి ఉన్నాయి. పెద్ద టీవీ, ఫ్రిడ్జ్‌.. ఖరీదైన వాతావరణం. ఇంతలో ఏదో అలికిడి అయితే గబగబ వచ్చిన దారినే బయటకు వచ్చి చెట్టుచాటున నించున్నాడు. అతను నించున్న చోటునుంచి హాలు కిటికి.. కిటికీలోంచి హాలు కనిపిస్తోంది. ఎలకని పట్టుకోవడానికి అటు ఇటు పరుగెడుతున్న పిల్లి కనిపించి నిట్టూర్చాడు. అయిదు నిముషాల తరువాత మళ్ళీ లోనికి వెడదామా అనిపించింది. అయితే పిల్లి గొడవకి ఇంట్లోవాళ్ళు లేస్తారేమో ఎందుకొచ్చిన గొడవ అనిపించింది. సంచి బరువుగా ఉంది వెండిసామానులతో.. వన్‌టౌన్‌లో ‘దొంగసరుకులు’ కొనె దుకాణంలో అమ్మితే కనీసం లక్ష గ్యారంటీ. సంతృప్తిపడ్డాడు.

బయటకు గోడ దూకుతు వెనుకకు చూసాడు. అంతే నిశ్శబ్దం.. పిల్లి చేసిన చప్పుడుకు ఎటువంటి ప్రతిస్పందన కనబడలేదు. ‘మందుకొట్టేసి పడుకున్నారేమో గొప్పోళ్ళు.. అలాగే పడుకోండి’ అని కూడా అనుకొని చీకట్లోకి కలిసిపోయాడు.

***

ఆ మర్నాడు చూసాడు. దొంగతనాల వార్తల కోసం. ఏమీ కనబడలేదు. మూడోరోజు అటువైపు వచ్చాడు. మధ్యాహ్నం.. ఎటువంటి అలికిడి లేదు, ఆ బిల్డింగ్‌లో. ఊర్లో లేరేమో అనుకొన్నాడు.. అయితే మెయిన్‌డోర్‌కి తాళం వేసిందీ లేనిదీ తెలియడం లేదు. కొంతమంది వెనుక డోర్‌కి తాళం వేస్తారు. కానీ దానికీ తాళం లేదు. తను లోపలికి వెళ్ళింది దాంట్లోంచే కాబట్టి మరో చూపు చూద్దాం అనుకొన్నాడు. అలా అనుకొనే ఆ రాత్రి గోడ దూకాడు రెండోసారి.

***

ఆ ప్రదేశానికి కళ్ళు అలవాటు పడ్డాక తిన్నగా హాలు కిటికీకి ఎదురుగా ఉండె చెట్టు చాటుకి నక్కి కిటికీలోంచి దృష్టి సారించాడు. అయిదు నిముషాలు అలాగే నుంచుని ముందుకు అడుగు వేసేంతలో కిటికీలోంచి కనబడుతున్న బెడ్‌రూం తలుపు ఓరగా తెరచుకొంది. ఎవరూ లేరనుకొంటున్న సింహాచలం అదరిపడి మళ్ళీ చెట్టుచాటున నక్కాడు.

బెడ్‌రూంలోంచి ఎవరో బయటకు వచ్చి కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూడసాగాడు. ఊపిరి బిగపట్టాడు సింహాచలం. తన ఉనికిని పసిగట్టారా?!? అయితే తన మీద లైటింగ్‌ పడటం లేదు కాబట్టి ధైర్యంగా కొమ్మని తొలగించి చూసాడు. కిటికీ మీద పడుతున్న వెలుతురులో ఆ వ్యక్తి రూపం స్పష్టంగా కనబడుతోంది సింహాచలానికి. ముప్పై అయిదు సంవత్సరాలు

ఉండొచ్చు. కాని అతని వాలకం చూస్తె ఆ ఇంటిమనిషిలా అనిపించటం లేదు. మరి బెడ్‌రూంలోంచి ఎలా బయటకు వచ్చాడు? ఆ వ్యక్తి బేక్‌డోర్‌లోంచి బయటకు వచ్చి మెయిన్‌గేట్‌ దాకా వచ్చి రోడ్డువేపు చూసాడు. ఓ అయిదు నిముషాలు పరికించి చూసి, రోడ్డుమీద ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని గేటు తీసుకొని బయటకు వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా గేటువేసి ఓ వారగా పెట్టుకొన్న మోపెడ్‌ మీద వెళ్ళిపోయాడు. గేటు వేస్తున్నప్పుడు అతని చేతులకు గ్లౌవ్స్‌ ఉండటం గమనించాడు సింహాచలం. ఆ వ్యక్తి భుజం మీద కాలేజీ బ్యేగ్‌లాంటిది వ్రేలాడుతూ ఉండటం కూడా గమనించాడు. గేటు తీయడాన్ని, వేయడాన్ని బట్టి చూస్తె ఆ ఇంటితో ఆల్‌రెడీ పరిచయం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.

తనలాగే దొంగా?!! చేతులకు గ్లౌవ్స్‌, జాగ్రత్త చూస్తుంటే సీనియర్‌ దొంగలా కనబడుతున్నాడు. ఈ బిల్డింగ్‌లో ఎవ్వరు లేరనుకొని తనలాగే వచ్చి దక్కింది దోచుకొని పోతున్నాడా? భుజం మీద చిన్న బేగ్‌లో ఏ మాత్రం పడుతుంది? విలువైన నగలు, క్యాష్‌ మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడా? తనకి ఏమైనా మిగిల్చాడా? లేదా?

సింహాచలం అలా ఆలోచిస్తూ మరో పావుగంట అలాగే నుంచున్నాడు. గాలి శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం.. సమయం మూడు గంటలు అవుతోంది.. తను తొందరగా బయటపడాలి అనుకొని ఓసారి లోపలికి వెళ్ళి దొరికింది అందిపుచ్చుకొని పోదాం అనుకొని లోనికి నడిచాడు. హాలులోనికి ప్రవేశించాడు. బెడ్‌రూం తలుపు ఓరగా వేసి ఉంది. ఇందాకటి దొంగ ఎలా ఉంచాడో అలాగే ఉంది.. ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవ్వరు లేరని నిర్దరించుకొని ఆ రూం తలుపు నెమ్మదిగా బార్లా తెరిచాడు..

లోపల దృశ్యం చూసేసరికి గొంతు తడారిపోయింది. పారిపోదామన్నా కాలు కదలలేదు.

***

ఆ మరునాడు పేపర్లన్నింటిలోనూ హెడ్‌లైన్స్‌ ఒకటే.

“తల్లీ కూతుళ్ళపై అత్యాచారం.. హత్య”

“హత్యా? ఆత్మహత్యలా?”

“రేప్‌ అండ్‌ మర్డర్‌?”

అన్నింటి కంటా కలవరపెట్టిన ఆ విషయం.. హత్య జరిగిన నాలుగు రోజులకు బయటకు వచ్చిన ఉదంతం. నగ్నంగా పడి ఉన్న తల్లీ కూతుళ్ళ శవాలు.. ఫొటోలతో సహా వేడి వేడి వార్తలు, ఊహాగానాలతో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ కుతకుత లాడిపోయాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫలానా ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ళ శవాలున్నట్లు ఆ ఇంట్లోకి దొంగతనానికి వచ్చి ఆ దృశ్యం చూసి బెదిరిపోయి పోలీసులకు కూపీ ఇచ్చిన చిల్లరదొంగ సింహాచలం ఫోటో కూడా పేపర్లో వేసారు.

అంతకు ముందు రెండురోజుల క్రితం ఆ ఇంట్లో కొంత వెండి సామాను దొంగిలించినట్లు మళ్ళీ దొంగతనానికి వచ్చినప్పుడు ఆ శవాలను కనుగొన్నట్లు, తనకన్నా ముందు ఓ వ్యక్తి ఆ రూంలోంచి వచ్చి సంచితో వెళ్ళిపోయినట్లు, శవాలు ఉండటంతో ఆ కేసు తనమీద కొస్తుందన్న భయంతో దొంగతనం ఒప్పుకొని లొంగిపోతూ శవాల విషయం వెల్లడించిన చిల్లర దొంగ సింహాచలాన్ని కష్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్‌ చేస్తున్నామని గతరాత్రి ఆ ఇంట్లోంచి పరారీ అయిన వ్యక్తికోసం గాలిస్తున్నట్లు పోలీసుల కథనం.

ఆ బిల్డింగ్‌లో తల్లీకూతుళ్ళు మాత్రమే చాలాకాలంగా ఉంటున్నట్లు, తల్లి వితంతువని వయస్సు 42, 45 మధ్య ఉండొచ్చని, కూతురు బి.టెక్‌ చదువుతోందని వయస్సు 21 సంవత్సరాలు అని, ఇద్దరూ అందంగా ఉండేవాళ్ళని, ధనవంతులని వార్తాపత్రికల భోగట్టా. తాము వూరు వెడుతున్నామని నాలుగురోజుల వరకు రావొద్దు అని చెప్పటంతో పనిమనిషి రావడం లేదట.

***

రెండు రోజులు గడిచినా ఎటువంటి ‘క్లూ’ దొరకలేదు. ఇంట్లో దొరికిన డైరీలో ఓ అడ్రస్‌ ప్రకారం ఫోన్‌ చేసి విషయం చెబితే వాళ్ళు అంత ఇంట్రెస్ట్‌ చూపించలేదు. దాంతో ఆ బిల్డింగ్‌ని పోలీసులు సీలుచేసి శవాలను పోస్ట్‌మార్టం చేయించారు. ఆ ఇరువురి మర్మావయవాల మీద వీర్యపు మరకలు ఉన్నందున బహుశ రేప్‌ చేసి చంపివేసి ఉండొచ్చని అనుమానించారు మొదట్లో. అయితే చంపిన గుర్తులుగాని, పెనుగులాట జరిగిన ఆనవాళ్ళు కానీ కానరాలేదు. పోస్ట్‌మార్టమ్‌లో నిద్రమాత్రల వలన ప్రాణాలు పోయాయని నిర్దారణ అయ్యింది.. అయితే బెడ్‌రూం ఏ.సీ. అవటంతో పైగా శీతాకాలం కావడంతోనూ శవాలు కుళ్ళిపోవడం అనేది తొందరగా జరిగి ఉండకపోవచ్చని భావించారు. ఆ బిల్డింగ్‌ని ఆనుకొని మరే ఇల్లు లేకపోవడంతోను, దూరంగా ఉన్న ఇండ్లతో అంతగా సఖ్యత లేకపోవడంతోనూ జనరల్‌గా అది పోష్‌ కాలనీ కావడంతో వెంటనే ఆ ఘోరం వెలుగులోనికి రాలేదన్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న యువతి కాలేజికి రెగ్యులర్‌గా వచ్చేది కాదనీ, అన్ని సెమిష్టర్లలోనూ ఫెయిల్‌ అయిందని, స్నేహంగా ఉండేది కాదని వార్తలు.

***

ఈ జంట హత్యలలోని కొన్ని ఆసక్తికర విషయాల వలన పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఒత్తిడి పెరిగింది. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నిజంగా తలచుకొంటే ఏ మిష్టరీ అయినా వీడిపోతుంది. ఇది అలాగే అయింది.

***

ఆ రోజు పోలీస్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌. విలేఖర్లుతో నిండిపోయింది. పోలీసు అధికారులతో పాటు, సైకియాట్రిస్ట్‌ కూడా హాజరయ్యారు. కమీషనర్‌ మాట్లాడుతూ,

“ముందుగా ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన సింహాచలంను, దొంగైనా మెచ్చుకోక తప్పదు. ఇన్వెస్టిగేషన్‌లో ఎంతో సహకరించాడు. ఆ ఇంట్లోంచి పారిపోయిన వ్యక్తిగా చెబుతున్న వ్యక్తిని పట్టుకొన్నాం. ఇడిగో ఇతనే.. పేరు నరసింహులు. చంపబడినది ఆడవారు కావడంతో, పైగా నగ్నంగా పడి ఉండటంతో జననాంగాల మీద వీర్యపు మరకలు ఉండటంతో అఘాయిత్యం జరిపి ఆపై చంపి ఉంటాడని ముందు భావించాం. కాని నిద్రమాత్రల వలనే ప్రాణాలు పోయాయని పోస్ట్‌మార్టంలో తేలింది. అయితే హతురాళ్ళ ఇంట్లో మార్కెట్‌లోకి ఇంకా విడుదల కాని సబ్బులు కనబడటంతో సేల్స్‌మాన్స్‌ కోసం వలపన్నాం.. నరసింహులు చిక్కాడు. నరసింహులు రకరకాల ప్రొడక్ట్స్‌ అమ్ముతూ ఉంటాడు. ఆ ఇంటివాళ్ళకి కూడా గతంలో రకరకాల ప్రొడక్ట్స్‌ అమ్మి ఉన్నాడు. అలాగే ఆ రోజు సాయం సంధ్యవేళ అమ్మకానికి వెళ్ళాడు. కాలింగ్‌ బెల్‌ కొట్టబోతూ మెయిన్‌ డోర్‌ తీసి ఉండటం గమనించి హాల్‌లోకి వెళ్ళాడు. ‘అమ్మగారు’ అని ఎంత పిలిచినా స్పందన లేదు. బెడ్‌ రూము తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. బాగా పరిచయం ఉండటంతో బెడ్‌రూంలోకి తొంగిచూశాడు. బెడ్‌ మీద తల్లీ కూతుళ్ళు ఇద్దరు పడుకొని ఉన్నారు. దగ్గరగా వెళ్ళి పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. తొలగిన పైట ముప్పై అయిదేళ్ళొచ్చినా పెళ్ళికాని అతడిలో మన్మధ వికారాన్ని కలిగించింది. పరిస్థితి అతడికి చాలా అనుకూలంగా ఉండటంతో దుర్బుద్ది పుట్టి ఆ ఇద్దరు ఆడవాళ్ళని వివస్త్రలు చేసి అనుభవించి వెళ్ళిపోయాడు. అయితే అన్ని సెమిష్టర్లలోను ఫెయిలైన కూతురు అవమానంతో నిద్రమాత్రలు మింగింది. ఆ విషయం తెలుసుకొన్న తల్లి తాను కూడా నిద్రమాత్రలు మింగేసింది. ఆ ఇద్దరిని అనుభవించే సమయానికే వారిద్దరు మత్తులోకి జారుకున్నారు. ఆత్మహత్య ప్రయత్నం విషయం తెలియక అనుభవించి పారిపోయాక కూడా నరసింహులు ఆ బిల్డింగ్‌ని అబ్జర్వ్‌ చేయసాగాడు. వారిద్దరూ మరణించారేమోనని భయపడి తన ఆనవాళ్ళు ఏమి మిగలకుండా చేద్దామని, సింహాచలం రెండోసారి దొంగతనానికి వచ్చేముందే ప్రవేశించి తన సంచి తీసుకొని పారిబోతూ వాళ్ళ మెడలోని నగలు కూడా పట్టుకుబోయాడు. అయితే ఆ సంచిలోంచి పడిపోయిన ఓ సబ్బుబిల్ల అతడిని పట్టించింది. అయితే మాకు ఆ గదిలో బీరువా క్రింద ఆ అమ్మాయి వ్రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది. దాంతో నరసింహులు హంతకుడు మాత్రం కాదని సైకియాట్రిస్ట్‌ గారి సాయంతో నిర్దారించుకొన్నాం. ఇవి కేవలం ఆత్మస్థైర్యం లేని ఇద్దరు ఆడవాళ్ళ ఆత్మహత్యలు మాత్రమే. అయితె సింహాచలం, నరసింహులు కూడా శిక్షార్హులు దొంగతనం వగైరా చర్యల వలన – ఇప్పుడు సైకియాట్రిస్ట్‌ మాట్లాడతారు” అన్నారు.

సైక్రియాటిస్ట్‌ మాట్లాడుతూ “ఈ కేసులో ఉన్న క్రైం యాంగిల్‌ని కమీషనర్‌ గారు వివరించారు. నరసింహులుని పట్టుకొని నా దగ్గరకు తీసుకొచ్చారు. అతను మానసిక రోగి కాని సైకో కాని కాదు. ఇది బేసికల్‌గా ఓ సాంఘిక సమస్య. బి.ఏ. చదువుకున్న నరసింహులు నిరుద్యోగి. కుటుంబం పెద్దది. పెళ్ళి చేయాల్సిన చెల్లి, అక్క ఉండటంతో ముప్పై అయిదేళ్ళు దాటినా అతనికి పెళ్ళి చేసుకొనే అవకాశం రాలేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. యవ్వనం ఉరకలు వేస్తోంది. వేశ్యల దగ్గరకెళ్ళే ధైర్యం లేదు. సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కాలం వెల్లబుచ్చుకొంటూ ఎక్కువగా నీలిచిత్రాలు చూస్తూ, శృంగార పుస్తకాలు చదువుతూ కామాన్ని చల్లార్చుకొనేవాడు. హతులకి చాలాసార్లు రకరకాల ప్రొడక్ట్స్‌ అమ్మి ఉన్నాడు. ఆ రోజు చీకటి పడుతుంటే క్రొత్త సబ్బులమ్మడానికి హతుల ఇంటికి వెళ్ళాడు. అప్పటికి కేవలం గంటక్రితం ఆత్మస్థైర్యం లేని ఆ తల్లీకూతుళ్ళిద్దరూ నిద్రమాత్రలు మింగి పడుకొని ఉన్నారు. ఇంట్లో వేరెవరూ లేరు. ఎవరూ రారు. దాంతో ప్రధాన ద్వారం లోపలి నుంచి లాక్‌ చేసి – మన్మథ వికారంతో బాధపడుతున్న నరసింహులు ముందు ఆ అమ్మాయిని నగ్నంగా చేసాడు.. చూసాడు.. అనుభవించాడు.. కిచెన్‌లో ఉన్న టిఫిన్‌ తిని తల్లిని కూడా అనుభవించాడు. పెరటిగుమ్మం ద్వారా వెళ్ళిపోయాడు కామం చల్లారాక. అయితే తన బేగ్‌లలో ఒక దానిని మర్చిపోయాడు. దానికోసం మళ్ళీ వచ్చాడు. తరువాత జరిగింది కమీషనర్‌గారు చెప్పారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాని దీంట్లో ఉన్న సాంఘిక, ఆర్థిక సమస్యల మీద దృష్టి సారించాలి.

ఈ కాలం పిల్లలకు పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి. దాదాపుగా నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి. నెట్‌ ద్వారా సెల్‌ఫోన్లలోనే చాలా సులువుగా లభించే అశ్లీలత యువతను బాగా రెచ్చగొడుతుంది.

గతంలోనూ శృంగార పుస్తకాలు, నీలిచిత్రాల వీడియోలు ఉండేవి. కానీ అంత సులువుగా వినియోగంలోకి వచ్చేవి కావు. నరసింహులు మంచివాడే. ముప్పై అయిదేళ్ళు.. ఇంకా పెళ్ళి కాలేదు. అక్కా, చెల్లి పెళ్ళి అయితేగాని తనకి కుదరదు. ఒకప్రక్క నీలినీడలు వెంటాడుతున్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు మత్తునిద్రలో ఉండటం, ఏకాంతం అతడిని ఉసిగొల్పాయి. పెరుగుతున్న సాంకేతికత అశ్లీలతను సులువుగా అందుబాటులోకి తీసుకువస్తున్న తరుణంలో తల్లితండ్రులు పిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు చేసెయ్యడం మంచిది. యువత కూడా ఏదో ఒక వృత్తిలో తొందరగా స్థిరపడి యుక్తవయస్సులోనే పెళ్ళి చేసుకోవటం మంచిది. అందుకే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులోనే జరగాలి అని పెద్దలంటుంటారు.. లేకపోతే ఇలాంటి వికారాలు కలుగుతాయి” అని ముగించారు.

ఒక విలేఖరి లేచి “ఫోర్న్‌సైట్స్‌ని నిషేదిస్తే ఇటువంటి మానసిక రుగ్మతలని అరికట్టవచ్చుకదా” అని అడిగాడు.

“నేటి అంతర్జాలంలో ఫోర్న్‌సైట్స్‌ని పూర్తిగా నిషేదించడం అసాధ్యం. ఫోర్న్‌ చూడటం ద్వారా తమ వికారాలను తగ్గించుకొనే వారు కోకొల్లలు. నరసింహులుది మానసిక రుగ్మత కాదు. కలిగిన వికారాన్ని తీర్చుకొనే అవకాశం దొరికింది. తాపం తగ్గిన వెంటనే భయం కలిగింది. రెండు రోజులు అదే పనిగా ఆ ఇంటిని పరిశీలించినా ఎటువంటి అలికిడి కాని లేకపోయేసరికి వాళ్ళిద్దరు చాలా సెన్సిటివ్‌ అని తెలిసిన అతనికి వాళ్ళు చనిపోయారేమో అని అనుమానం వచ్చింది. తను బెడ్‌రూంలో మర్చిపోయిన తన సంచి తనను పట్టిస్తుందేమోనని అనుమానం వచ్చి దానిని తీసుకుపోతూ సింహాచలం కళ్ళళ్ళో పడ్డాడు. అయితే అతను ఉద్దేశ పూర్వకంగా నేరం చెయ్యలేదు. ఇటువంటి వికారాలకు విరుగుడు యుక్తవయస్సులో పెళ్ళిళ్ళు చేసేయ్యడమే” అన్నారు మనోజ్‌ గారు.

మరొక విలేఖరి లేచి “పెళ్ళైనంత మాత్రాన పెడబుద్దులు పుట్టవా? మొన్నటికి మొన్న ఓ తాతగారు తన మనవరాలి వయస్సున్న పిల్లని పాడు చేసాడుగా, పెళ్ళికి యుక్త వయస్సొకటే కాదు ఆర్థిక స్తోమత కూడా కలిగి ఉండాలిగా” అన్నాడు.

ఈసారి ఓ ఆడ విలేఖరి లేచి ‘మగ బుద్దే అలాంటిది. ఆడవారి వస్త్రధారణే మగవారి వికారాలకు కారణం అంటూ మోడ్రన్‌గా ఉన్న అమ్మాయిలను నిందిస్తున్నారు. గౌను వేసుకొన్న ఆరేళ్ళ పాప, పట్టుచీరె కట్టుకొన్న అరవైఏళ్ళ అవ్వలు కూడా అత్యాచారాలకు గురి అవుతున్నారు. వాళ్ళేం రెచ్చగొట్టారని? మగాళ్ళదే వంకరబుద్ది” అన్నది.

మనోజ్‌ గారు తల పంకిస్తూ “ఆరేళ్ళ పాప రెచ్చగొట్టదు. పట్టుచీర ఎక్స్‌పోజ్‌ చెయ్యదు. నిజం. కాని అంతకుముందు చూసిన ‘ఎక్స్‌పోజింగ్‌’ కలిగించిన వికారాన్ని తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన పాప మీదో అవ్వ మీదో తీర్చుకొంటున్నారు. అత్యాచారాలకు కారణాలు ఎన్నో. ముఖ్యమైనవన్నీ నరసింహులు కేసులో చూడవచ్చు. ‘ఈడు’ ఎవరికయినా వేడి పుట్టిస్తుంది. అందుకే వెంటనే ఓ ‘జోడు’ను చూడండి అనేది. నరసింహులు ఎలాగో బి.ఏ. అయిందనిపించాడు. అతనికో మామ కూతురుంది. ఆమెను కట్టపెడదామని చిన్నప్పుడే పెద్దలు అనుకొన్నారు. అతడికన్నా ఆరేళ్ళు చిన్నదయిన ఆ మరదలు తెలివి గలది. బి.టెక్‌. చదించారు. క్యాంపస్‌లో ఎనిమిది లక్షల ప్యాకేజీతో ఉద్యోగం తెచ్చుకోవడం ఆమె తల్లితండ్రులను ఆలోచనలో పడేసింది. నరసింహానికి సరైన ఉద్యోగం లేదు. మంచి ఉద్యోగం తెచ్చుకొంటేనే పిల్లనిస్తామన్నారు. తెలివైన ఆ అమ్మాయి రెండేళ్ళలో పదిహేను లక్షల ప్యాకేజీతో మరో ఉద్యోగం సంపాదించుకొంది. ఇతనికి నెలకి ముప్పైవేలు కూడా రావు ఎంత కష్టపడినా. దాంతో ఆ సంబంధం తప్పిపోయింది. పోనీ గంతకు తగ్గ బొంతని చూద్దామంటే ఇతడికి పెళ్ళి కావలసిన ఓ అక్క, చెల్లి ఉన్నారు. కట్న సమస్యల వలన వారిరువురికీ ఇంకా పెళ్ళికాలేదు. ఆడపిల్లలకి కాకుండా ఇతడికి పెళ్ళి చెయ్యరు. వయసు దాటిపోతోంది. ఆ సాయంత్రం అతనికి దొరికిన అవకాశం ఆ పని చేయించింది. ఇది సమర్ధన కాదు. విశ్లేషణ అంతే. ఇటువంటి నేరాలకు నా దృష్టిలో కారణం పెళ్ళిళ్ళు ఆలస్యం కావడమే. అంతెందుకు.. నాకు తెలిసిన ఓ అమ్మాయి ఉంది. అందం అంతస్తు అన్నీ ఉన్నాయి. కాని పెళ్ళి కావటం లేదు. కారణం ఆమె ప్యాకేజీ ముప్పై అయిదు లక్షలు. ఆమెకి అంతకు మించిన ప్యాకేజ్‌ కలిగిన అబ్బాయి దొరకటం లేదు. దొరికితే నచ్చటం లేదు. ఆమెకూ ముప్పై అయిదేళ్ళొచ్చేసాయి. ఆమె అన్నదమ్ములిద్దరికి కూడా పెళ్ళి కాలేదు ఈమె వలన. ఇలా ఒకరికి అయితే కాని మరొకరికి చెయ్యకూడదు అనే ధోరణి కూడా మార్చుకోవాలి. కొన్ని నేరాలు తగ్గాలంటే చట్టం ఒకటే పని చేస్తే చాలదు. సమాజం కూడా మారాలి” అని ముగించారు మనోజ్‌ గారు.

– సమాప్తం –

Exit mobile version