Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విప్లవాత్మక కంట్రీ సాంగ్ ‘డోంట్ కమ్ హోమ్ ఎ-డ్రింకిన్’

[లోరెట్టా లిన్ రచించి, పాడిన ‘డోంట్ కమ్ హోమ్ ఎ-డ్రింకిన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కంట్రీ మ్యూజిక్‌లో అరుదైన పాత్ర పోషించిన గాయని లోరెట్టా లిన్. ఈమె అనేక అవార్డులు, ప్రశంసలను అందుకున్నారు. డ్యూయెట్ భాగస్వామిగా, వ్యక్తిగత కళాకారిణిగా కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్, అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ (ACM) నుండి అవార్డులు పొందిన లిన్, గ్రామీ అవార్డుకు 18 సార్లు నామినేట్ చేయబడి మూడు గ్రామీలు గెలుచుకున్నారు. 2022 నాటికి, లిన్ అత్యధిక అవార్డులు పొందిన మహిళా కంట్రీ రికార్డింగ్ కళాకారిణిగా చరిత్ర సృష్టించారు. అలాగే దశాబ్దపు (1970లు) ఏకైక మహిళా ACM కళాకారిణిగానూ నిలిచారు. లిన్ 24 నెం. 1 హిట్ సింగిల్స్, 11 నెం. 1 ఆల్బమ్‌లను రూపొందించారు. 2017లో స్ట్రోక్‌కు గురైన తర్వాత, 2018లో తుంటి ఎముక విరిగిన తర్వాత ఆమె తన 57 సంవత్సరాల పర్యటనకు ముగింపు పలికారు.

సంగీత ప్రపంచం ముఖ్యంగా కంట్రీ గీతాల ప్రపంచం పురుషాధిక్యతను బాహాటంగా వ్యక్తీకరిస్తుంది. అలాంటి చోట స్త్రీలు గాయకులుగా మొదటి వరుసలోకి చేరడమే అసాధారణ విజయం. అలాంటిది స్త్రీల పక్షాన  నిలబడి, ఎవరూ చర్చించడానికి ఇష్టపడని, ఇబ్బందిపడే ఇతివృత్తాలను తీసుకుని వాటిని పాటలుగా రాసి పురుషుల మధ్య గానం చేసి ఆ పాటల ద్వారా సమాజంలో ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేసిన అద్భుత గాయని లిన్. అమితమైన ఆత్మవిశ్వసంతో ఆమె రచించిన గీతాలు పితృస్వామ్య మూలాలను ధైర్యంగా ప్రశ్నిస్తాయి. అలా అని ఆమె ఏ పాటలోనూ పురుషులను విమర్శించదు, తిట్టదు. చాలా స్పష్టంగా స్త్రీ ఆలోచనను, మనసును తన పాటల్లో ఆవిష్కరిస్తుంది. అందువల్ల ఆమె పాటలను పురుషులు సైతం ఆమోదించేవారు. ఈ కొత్త ఒరవడి వారికి ఇబ్బంది కలిగించినా లిన్ పట్ల అది గౌరవంగా మారి కంట్రీ గీతాలలో మరింత ప్రజాస్వామికత్వానికి ఆహ్వానం పలికింది. దానికి లిన్ చూపిన చొరవ, ధైర్యం ప్రధానం అని ఒప్పుకుని తీరాలి.

లోరెట్టా లిన్ పాట ‘డోంట్ కమ్ హోమ్ ఎ-డ్రింకిన్’ 1966 నాటి ఒక విప్లవాత్మక కంట్రీ గీతం. భార్య పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే తాగుబోతు భర్త, తనకు కావల్సినప్పుడు ఆమె నుండీ శారీరక సాన్నిహిత్యాన్ని హక్కుగా కోరడాన్ని ఎదిరించే ఓ స్త్రీ మనసును ఆవిష్కరిస్తుంది. ఆ రోజుల్లోని సాంప్రదాయ స్త్రీ పురుష పాత్రలను తలక్రిందులు చేసిన గీతం ఇది.

లోరెట్టా లిన్, ఆమె చెల్లెలు పెగ్గీ స్యూ కలిసి ఈ పాటను రాసారు. వారి జీవితలలో తాగుబోతు భర్తల దగ్గర వారు పొందిన అనుభవాలు ఈ పాటకు ప్రేరణ. ఇది మద్యపానాన్ని విమర్శించడమే కాకుండా, భర్త పాత్రలో పురుషుల స్వార్థాన్నిఎత్తి చూపుతుంది. ఇది లిన్ మొట్టమొదటి బిల్బోర్డ్ నెం. 1 హిట్‌గా నిలిచిన గీతం. దీనిని 1967 ప్రారంభంలో లోరెట్టా లిన్ గానం చేశారు. ఇది ఆమె అత్యంత ప్రసిద్ధ పాటలలో ఒకటిగా ప్రజాదరణ పొందింది, ఆమె అన్ని లైవ్ షోలలో దీన్ని పాడేవారు. ఈ రికార్డింగ్లో నేపథ్య గాయకులు జోర్డనైర్స్. ఈ పాట కంట్రీ సంగీతంలో నిషిద్ధమైన విషయాలను ప్రస్తావించడానికి భయపడని కళాకారిణిగా ఆమెకు పేరు తీసుకొచ్చింది.

Well you thought I’d be waiting up
When you came home last night
You’d been out with all the boys
And you ended up half-tight
Liquor and love, they just don’t mix
Leave a bottle or me behind
And don’t come home a-drinkin’
With lovin’ on your mind

(నిన్న రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను నీ కోసం ఎదురు చూస్తూ మేలుకునే ఉంటానని నువ్వు అనుకున్నావు. నీ స్నేహితులందరితో సమయం గడిపి స్పృహ లేని స్థితిలో నువ్వు ఇల్లు చేరావు. మందు, ప్రేమ ఈ రెండిటి కలయిక కుదరదు. ఆ మందు సీసానో లేదా నన్నో దేన్నో ఒకదాన్ని నువ్వు వదిలేయక తప్పదు. ప్రేమ కోరుతూ అలా తప్పతాగి మాత్రం ఇక ఇల్లు చేరకు.)

ఒక స్త్రీ మనసును ఇంత కన్నా గొప్పగా స్పష్టంగా చెప్పలేరు ఎవరూ. స్నేహితులతో రోజంతా గడిపి తప్పతాగి అర్ధరాత్రి మత్తులో ఇల్లు చేరి అబగా భార్య పక్కలోకి దూరి ఆమెతో పడక సుఖం కోరుకోవడం మగవాడు తన హక్కుగా భావిస్తాడు. నిజానికి ఇది స్త్రీకి ఎంతో అవమానకరంగా ఉండే అనుభవం. ఈ అవమానాన్ని కోట్లాది స్త్రీలు కన్నీళ్ల నడుమ భరించి అది తమ కర్మ అనో బాధ్యత అనో మౌనంగా ఉండిపోయే ప్రయత్నం చేస్తారు. కాని ఇక్కడ లిన్ ధైర్యంగా ఆ సమయంలో తాను అనుభవించే బాధను చెప్తూ అది ఇక తన వల్ల కాదని ప్రతిఘటిస్తుంది. ఇలాంటి విషయాలను బాహాటంగా చర్చించడానికి ఇబ్బంది పడే స్త్రీ సమాజం నడుమ, ఇలాంటివి వినడానికి ఆమోదించని పురుష నైజం మధ్య ఆమె నిర్భయంగా ఇక తాను ఈ అనుభవాన్ని అంగీకరించనని, తనను అలాంటి ఇబ్బందికి గురి చేసే హక్కు భర్తకు లేదని గట్టిగా చెప్పడం ఆ రోజుల్లో ఓ పెద్ద విప్లవం.

No, don’t come home a-drinkin’
With lovin’ on your mind
Just stay out there on the town
And see what you can find
‘Cause if you want that kind of love
Well, you don’t need none of mine
So don’t come home a-drinkin’
With lovin’ on your mind

(ప్రేమ, పొందు కోరుతూ తప్పతాగి మాత్రం ఇల్లు చేరకు, అక్కడే పట్నంలో ఉండిపోయి నీకు కావల్సింది అక్కడ ఏం దొరుకుతుందో దాన్ని అక్కడే వెతుక్కుని పొందు. అలాంటి ప్రేమే కావాలంటే మాత్రం నీకు నా అవసరం ఇక ఉండబోదు. కాబట్టి, మత్తులో తూగుతూ ప్రేమ తలపులతో ఇంటికి రాకు.)

రోజంతా బైట గడిపి భార్య ఇష్టాలను గౌరవించక, తప్పతాగి స్పృహలేని స్థితిలో భార్యను చేరి తన అవసరం తీర్చుకోవడం తమ హక్కుగా భావించే భర్తలకు ఈ వాక్యాలలోని తిరుగుబాటు ఓ చెంపదెబ్బ లాంటిది. ఆమె మత్తులో తన అవసరం కోసం పక్కలో చేరే ఆ భర్తతో తాను రాజీపడనని స్పష్టంగా చెబుతుంది. ఆ అవసరమే ముఖ్యం అనుకుంటే పట్నంలో అతనికి కావలసిన విధంగా తీర్చుకొమ్మని, తాను అటువంటి సంతృప్తిని అతనికి అందివ్వనని, దానికి ఉపయోగపడనని ఆమె స్పష్టంగా చెబుతుంది. తాను ఒక వస్తువును కానని, తనను అలా వాడుకోవడం సహించనని ధైర్యంగా ఎదురుతిరుగుతుంది. నిజానికి ఈ పాట గొప్పతనం ఆ నిష్ఠురమైన, రాజీపడని వాస్తవికతలో ఉంది.

ఇందులో ఒక కఠినమైన హెచ్చరిక కూడా ఉంది. తనను ఒక ప్రత్యామ్నాయ ఎంపికగానో, లేదా తన కోరికలకు ఒక తాత్కాలిక ఉపశమనంగానో అతను చూడడాన్ని ఆమె తిరస్కరిస్తుంది. అలాంటి చౌకబారు ప్రేమే కావాలంటే, బయటే ఉండిపోమ్మని ఆమె అతనికి సవాలు విసురుతూ, నా ప్రేమ ఇక నీకు ఏమాత్రం అవసరం లేదు అని గట్టిగా తేల్చి చెబుతుంది. ఎటువంటి పరిస్థితిలోనూ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని, భర్త అయినా సరే తనను ఉపయోగించుకునే వస్తువుగా పరిగణీస్తుంటే తాను సహించనని ఓ స్త్రీ ఆత్మగౌరవ ప్రకటనను చాటి చెప్తున్నప్పుడు లిన్ గొంతులోని ఆ స్పష్టత ఇతర స్త్రీలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పాటలోని సాహిత్యంతో పాటు దాన్ని లిన్ గానం చేసిన విధానం చాలా బావుంటుంది. ఎక్కడా తడబాటు, భయం ఉండదు. ఓ నిర్ణయం, ఓ రాజీపడని నిబ్బరం ఆమెలో ద్వనిస్తాయి. అవి ఈ పాటను ఆత్మగౌరవ నినాదంగా మారుస్తాయి.

You never take me anywhere
Because you’re always gone
Many a night, I’ve laid awake
And cried here all alone
And you come in a-kissin’ on me
It happens every time
So don’t come home a-drinkin’
With lovin’ on your mind

(నన్ను ఎప్పుడూ ఎక్కడికీ తిసుకెళ్ళని నువ్వు నాకెప్పుడూ అందుబాటులో లేవు. చాలా రాత్రుల్లు మేల్కొని నేను ఒంటరిగా కన్నీరు కార్చాను. ఆ తర్వాతెప్పుడో ఇల్లు చేరిన నువ్వు ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి నా పక్కలోకి చేరతావు. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. అందుకే చెప్తున్నాను తాగి నా పొందు కోరుతూ మాత్రం ఇక ఇంటికి రాకు.)

భార్యను నిర్లక్ష్యంగా ఇంట వదిలేసి, ఎప్పుడూ ఆమె గురించి పట్టించుకోక, ఆమె మనసు తెలుసుకోక రోజంతా బైట గడిపి, తప్పతాగి శరీరం వేడిని తీచుకోవడానికి భార్య పక్కలోకి చేరే ఆ మగాడి స్వార్థాన్నిఆమె ఇక సహించను అని గట్టిగా తెగేసి చెబుతుంది. నువ్వు ఎప్పుడూ బయటే ఉంటావు కాబట్టి నన్ను ఎక్కడికీ తీసుకువెళ్ళవు, ఎన్నో రాత్రులు ఇక్కడ ఒంటరిగా మేల్కొని ఏడ్చాను అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె బాధ ఒంటరితనం లిన్ గొంతులో ప్రకటితమవుతూనే దాని వెనుక ఆమె బలమైన నిర్ణయమూ కనిపిస్తుంది. రోజంతా తన గురించి ఆలోచించక, తన ఒంటరితనాన్ని అర్థం చేసుకోక, రాత్రి అదీ తప్పతాగి, స్పృహలోలేని స్థితిలో కేవలం ఓ శరీరం కోసం తనను చేరే ఆ భర్త చేతుల్లో నలిగిపోవడం ఆమెకు అవమానంగా తోస్తుంది. ఆ స్థితిలో నువ్వు లోపలికి వచ్చి నన్ను ముద్దుపెట్టుకుంటావు, ప్రతీసారి ఇలాగే జరుగుతుంది. అంటున్నప్పుడు ఆమెలో కోపం, అవమానం ద్వనిస్తాయి. ఆమె లేకుండా రాత్రంతా విచ్చలవిడిగా గడిపిన తర్వాత, అతను శృంగారపరమైన ప్రత్యేక హక్కులను ఆశించడం లోని స్వార్థాన్ని ఆమె ఎత్తి చూపెట్టడం ప్రితృస్వామ్య సమాజంలో ఆ రోజుల్లో ఓ పెద్ద సంచలనమే..

No, don’t come home a-drinkin’
With lovin’ on your mind
Just stay out there on the town
And see what you can find
‘Cause if you want that kind of love
Well, you don’t need none of mine
So don’t come home a-drinkin’
With lovin’ on your mind

(వద్దు. ప్రేమ, పొందు కోరుతూ తప్పతాగి మాత్రం ఇల్లు చేరకు, అక్కడే పట్నంలో ఉండిపోయి నీకు కావల్సింది అక్కడ ఏం దొరుకుతుందో దాన్ని అక్కడే వెతుక్కుని పొందు. అలాంటి ప్రేమే కావాలంటే మాతం నీకు నా అవసరం ఇక ఉండబోదు. కాబట్టి, మత్తులో తూగుతూ ప్రేమ తలపులతో ఇంటికి రాకు.)

లిన్‌కు ముందు, ఒక మహిళా గాయకురాలు తన శారీరక హద్దులను ఇంత ధైర్యంగా నొక్కి చెప్పడం, తన భర్త రాత్రిపూట ప్రవర్తనను ప్రశ్నించడం, వైవాహిక అసంతృప్తి గురించి పాడటం ఎవరూ ఊహించని విషయం. ఇలాంటి గృహ పరిస్థితులతో వ్యవహరిస్తున్న లక్షలాది మంది మహిళలకు ఈ పాట ఒక గొంతుగా నిలిచింది, కంట్రీ రేడియోలో మహిళా సాధికారత గీతాలకు ఒక ప్రధాన స్థానం ఉందని నిరూపించింది.

No, don’t come home a-drinkin’
With lovin’ on your mind

ఈ వాక్యాలు ఒక నినాదంగా నిలిచిపోయాయి. ఈ పాట ఎందరో స్త్రీలకు లిన్‌ను దగ్గర చేర్చింది. దీనికి జవాబు పాటగా స్వయంగా ఆమె తమ్ముడే ఓ గీతాన్ని పాడి రికార్డ్ చేసినా ఈ పాటలోని నిజాయితీ, నిస్సహయత, ఆత్మాభిమానాన్ని ఆ పాట తక్కువ చేయలేకపోయింది. మహిళా ప్రధాన గీతాలలో ఒక గొప్ప గీతంగా ఇప్పటికీ ఈ పాట ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఇలాంటి పాటను గానం చేయడం లిన్ చేసిన అతి పెద్ద సాహసం.

~

ఈ పాట యూ ట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=M87yovaov_4

Exit mobile version