[మధు పెమ్మరాజు గారి ‘డోరేదార్’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే మధు పెమ్మరాజు గారు అమెరికాలోని హ్యూస్టన్‌కి సమీపంలోని కేటీ నగరంలో నివసిస్తున్నారు. హైదరాబాద్ లో పెరిగారు. వీరు ‘డోరేదార్’ కథాసంపుటి లోని కథల్లో ఈ రెండు సంస్కృతులు ద్యోతకమవుతాయి. ఇక్కడి మనుషులు, అక్కడి మమకారాలు, ఇక్కడి పద్ధతులు, అక్కడి విధానాలు – ఒక్కోసారి కలిసిపోయి – ఒక్కోసారి విడిపోతూ – పాఠకుడు ఈ కథలని తనవిగా భావించేలా ఉంటాయి. ముఖ్యంగా ఇవి దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి కథలు.
ఈ పుస్తకం నన్ను ప్రధానంగా ఆకర్షించడానికి కారణం జీవితంలో మూడు ప్రధాన దశలనూ అద్భుతంగా ఒడిసిపట్టిన కథలున్నాయి. బాల్యం చాలా వరకూ ఆనందాల, సంతోషాల మయం! నడివయసులో అభద్రతలు, కెరీర్ ఒత్తిడులు! ముదిమి జ్ఞాపకాల భాండారం! బ్రతుకు లోని ఈ మూడు దశలు మూడు రంగులైన గాలిపటం ఈ పుస్తకం!
బాల్యంలో కష్టాలుండవా అంటే ఉంటాయి, కానీ చిన్న చిన్న ఆనందాలు ఆ కష్టాలను మరిపిస్తాయి. తల్లిదండ్రులు చూసుకుంటారులే అనే ధీమా ఉంటుంది. యవ్వనం, నడివయసుకొచ్చాకా, బరువుబాధ్యతలు మోస్తున్నప్పుడు సమస్యలు పదే పదే విసిగిస్తాయి. జీవిత భాగస్వామో, స్నేహితులో, ఇతర పెద్దలో ఎవరో ఒకరు అండగా ఉండి భరోసానిస్తారు. ఒక్కోసారి ఆయా వ్యక్తులే తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ బతుకుసంద్రాన్ని ఈదుతారు. ఇక వృద్ధాప్యం కొచ్చేసరికి – కొందరికి నిర్లక్ష్యం, కొందరికి నిరాదరణ, కొందరికి వృద్ధాశ్రమాలు ఎదురవుతాయి. కొందరి విషయంలో పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోయి, వేరే ఊర్లో తమ కుటుంబాలను ఏర్పర్చుకోడం, రాకపోకలు తగ్గడం వల్ల – ఎడబాటు కలుగుతుంది. కొద్దిమంది వృద్ధుల విషయంలో మాత్రం వారి అనుభవానికి గౌరవం దక్కుతుంది. పిల్లలతో మనవరాళ్ళతో కలిసి ఉంటూ కొందరికి అసూయ కలిగిస్తారు.
వెరసి జీవితంలోని ఈ అన్ని పార్శ్వాలు – కవులకు, కథకులకు ఇతివృత్తాలవుతాయి. స్వీయ అనుభవాలు కొన్ని, ఇతరుల జీవితాలలో అత్యంత సమీపం నుంచి గమనించినవి కొన్ని, అక్కడక్కడా విన్నవి కొన్ని – ఉద్వేగాలని కలిగించి, సాహితీప్రక్రియగా మారుతాయి. ఈ పుస్తకంలోని కథలన్నీ అలాంటివే!!
♥
తెలంగాణాలో సంక్రాంతి పండుగ రోజుల్లో పిల్లలకి గాలిపటాలు ఎగరేయాలని ఎంతో కోరికగా ఉంటుంది. గాలిపటాలు కొనుక్కోలేని వారు మిత్రుల గాలిపటాలను కాసేపు ఎగరేసి తృప్తిపడతారు. మరికొందరు మిత్రుల చరఖాలు పట్టుకుని తామే ఎగరేసిన ఆనందాన్ని పొందుతారు. మరికొందరు ముళ్ళకర్రలతో రోడ్ల మీద పరిగెత్తుతూ తెగిన గాలిపటాలను, మంజాలను సేకరించి, తమ కోరిక తీర్చుకుంటారు. అలాంటి పిల్లల్లో రవి చందూలు కూడా ఉంటారు. తమ కాలనీ మైదానంలో జరిగే పతంగుల పందెంలో పాల్గొనాలని మనసులో ఉన్నా, గాలిపటం కొనలేని స్తోమత వాళ్ళని నిలువరిస్తుంది. తోటి పిల్లలు హేళన చేయగా, తామే స్వయంగా మాంజా, పతంగ్ తయారు చేసుకుని ఎగరేస్తారు. అది కొన్ని సేపు ఎగిరి, ఊరుకుంటుంది. వీళ్ళని హేళన చేసిన కుర్రాడి ప్రత్యేక గాలిపటం, ‘డోరేదార్’, తెగిపోయి, జిల్లయ్య అనే కుర్రాడికి దొరుకుతుంది. ఎందుకో అతను ఆ గాలిపటాన్ని వీళ్ళకిచ్చేస్తాడు. రవి, చందూ ఆనందంగా బరిలోకి దిగుతారు. ఈ కథలో రచయిత రాసిన “జీవితం ఒకరికి అతిగా వడ్డించిన వెండి కంచం, మరొకరికి ఖాళీ అతుకుల విస్తరి” అనే వాక్యం ఎందరికో తమ బాల్యాన్ని, వర్తమానాన్ని గుర్తు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, రవి గాని, చందూ గాని – అంత చిన్న వయసులోనే – తమ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని పరిస్థితులతో రాజీపడడం అబ్బురమనిపిస్తుంది. కొన్ని విషయాలు జీవితమే నేర్పిస్తుంది, అంతే!
పిల్లలకేం తెలుసు అని చాలా సార్లు పెద్దవాళ్ళు అనుకుంటారు, పొరబడతారు. పెద్దల కన్నా బాగా కొన్నిసార్లు తోటి మనిషి కష్టాలన్ని పిల్లలే సరిగ్గా అర్థం చేసుకుంటారు. తమకు వీలైన సాయం చేస్తారు. ‘నవ్వే ఏనుగు బొమ్మ’ కథలో – స్కూలువాళ్ళు తీసుకెళ్ళే ఎక్స్‌కర్షన్ (సిటీలోనే) వెళ్ళాలని ఆశపడి, అమ్మానాన్నలని విసిగించి సాధించిన ఇరవై రూపాయలని తమని బడికి తీసుకెళ్ళే రిక్షా లక్ష్మయ్య చేతిలో పెట్టి, దగ్గుకి మందులు కొనుక్కోమంటాడు ఓ కుర్రాడు. డబ్బులు తేనందుకు టీచర్‍తో తన్నులు తింటాడు. అయినా వాడికెంతో సంతోషం! “ఖర్చు ఉందంటే నోరు విప్పదు” ఇది అమ్మ గురించి; “పుస్తకంలో పేజీలు తిప్పినంత సులువుగా అడిగిన ప్రతీదీ వాయిదా వేస్తారు” ఇది తండ్రి గురించి ఆ అబ్బాయి అనుకున్న మాటలు! ఇది మా చిన్నప్పుడు మాకూ అనుభవమే. మేమేదైనా అడిగితే, మా నాన్నగారు ‘పార్కలాం’ అనేవారు. అదేంటో అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత రోజుల్లో తెలిసింది, అది తమిళ పదమనీ, ‘తర్వాత చూద్దాం’ అని అర్థమనీ!!
పిల్లలకి చెప్పే పద్ధతిలో చెప్తే చక్కగా అర్థం చేసుకుంటారు. ఊరికే భయపెడితే, బెదిరిపోతారు, లేదా ఎదురుతిరుగుతారు. నాన్నని విసిగించి కార్క్ బాల్ కొనుకున్న జంగారెడ్డి ఆటలో దాన్ని పోగొట్టుకుంటాడు. నాన్న ఏమంటాడో అని చాలా భయపడతాడు. అమ్మ పాలపాకెట్ తెమ్మని ఇచ్చిన డబ్బులతో, బస్‌లో కోఠీ వరకు వెళ్ళి అక్కడ ఓ షాపులో బాల్ ఇవ్వమని డబ్బులిస్తే, అర్ధ రూపాయి తగ్గుతుంది. ఇంతలో ఒకాయన ఆ అర్ధ రూపాయి కొట్టతనికిచ్చి బాల్ ఇప్పిస్తాడు. ఇంటికి చేరేసరికి నాన్న పడకుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎక్కడికెళ్ళావని అడిగితే జంగారెడ్డి ఏం మాట్లాడడు. చేతిలో ఆ బాల్ ఏమిటని అడిగితే, నువ్వు కొన్నదే అంటాడు. అప్పుడు నాన్న మరో బాల్‌ని పిల్లాడి వైపు దొర్లించి, మరి ఇదేంటి ఖాన్ సాబ్ ఇచ్చి వెళ్ళాడు అని అంటాడు. దొరికిపోయానని జంగారెడ్డి భయపడుతుంటే, నాన్న దగ్గరికి పిలిచి, ఒళ్ళు నిమిరి, తనలా ప్యూన్‌లా కాకూడనే చదువుకోమంటున్నాను అని చెప్తాడు. అప్పుడు మొదటిసారిగా పుస్తకాల వైపు శ్రద్ధగా చూస్తాడు. ‘బౌండరీ దాటిన బాలు’ కథ బాల్యం లోకి నడుపుతుంది.
♥
“లోపలెంత చెమట పడుతున్నా, ధీమాగా కనపడడానికి కనిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను” ఈ వాక్యం చదివితే, కుటుంబ భారం మోస్తున్న మధ్యవయసు వాళ్ళు గుర్తొస్తారు. ఒక్కోసారి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు. వదిలించుకుందామనుకున్నవాడే ఆసరా అయి పరువు కాపాడితే, ఎలా ఉంటుంది? ‘గడ్డిపరక నలగాలి’ కథలోని నెరేటర్ (పేరు లేదు, నేను అంటూ కథ చెప్తాడు) కి రామం అనే వ్యక్తి ద్వారా కలిగిన అనుభవంలా ఉంటుంది. ఓ ఆదివారం పూట డబ్బు అవసరమై, బ్యాంకులు లేకపోవడం వల్ల – కావల్సిన డబ్బు పోగేయడానికి ఇబ్బందులు పడతాడాయన! ఆత్మాభిమానం ఉన్న మనిషి! చివరికి ఫంక్షన్‌కి పిలవని వ్యక్తి సాయం పొందాల్సి వస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో తెలీదు.. అందుకే అందరితోనూ వీలైనంత సౌమ్యంగా ఉండడం మంచిది!
ఊరు విడిచి వెళ్ళని అన్న! బ్రతుకు పండించుకోడానికి నగరం వెళ్ళిపోయిన తమ్ముడు! ఇష్టమైన పని చేసుకుంటూ, పదో పరకో సంపాదించుకుంటూ ఊర్లో అందరికీ మంచిమాటలు చెబుతూ కాలం గడిపేసే అన్న! నగరంలో ఉద్యోగం చేస్తూ, ఏదోలా బ్రతుకీడిస్తూ, భార్యకి భయపడి అన్నకి సాయం చేయలేని తమ్ముడు! ఓ రోజు అన్నకి బాలేదని తెలిసి చూడ్డానికొస్తాడు తమ్ముడు. ఎప్పటిలానే తనతో వచ్చేయమని అడుగుతాడు అన్న రానంటాడు. తమ్ముడు తెచ్చిన పులిహోరని కాస్త కుక్కకి పెట్టి కొంత తను తిని, మరికొంత అక్కడున్న బైరాగులకి పెడతాడు. ఓ మిత్రుడిని కలిసొస్తాడు తమ్ముడు. సాయంత్రం దాకా అన్నతో మాట్లాడి, బయల్దేరే ముందు అన్నతో ఓ మాట అంటాడు. అదే కీలకం ‘త్వమేవాహం’ కథకి. ఇతివృత్తానికి తగ్గ శీర్షిక! చివర్లో తమ్ముడు అన్న మాటలు కథా శీర్షికకి వర్తిస్తాయి. మంచి కథ!
♥
సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల్లో ఒత్తిడి, లేఆఫ్స్ కలిగించే అభద్రత ఇటీవలి కాలంలో అందరికీ అనుభవంలోకి వస్తున్నాయి. కానీ రచయిత 2015 నాటి నుంచే ఈ రంగంలో ఎంత ఒత్తిడి ఉందో, ఉద్యోగులు వర్క్‌నీ, ఫామిలీనీ బాలెన్స్ చేయలేక ఎంతలా నలిగిపోతుంటారో చెప్పారు. ‘ఇనుప తెర’ కథ శశాంక్‌కి ఎదురైన పరిస్థితి, బహుశా ఇప్పుడు అందరి జీవితాల్లోనూ తొంగి చూస్తోంది. అందరూ శశాంక్‌లో ధైర్యంగా ఓ కఠిన నిర్ణయం తీసుకోలేరు!
“కంపెనీ ఆటోమేషన్ ఇన్నోవేషన్ అంటోంది..”, “కంపెనీ ఔట్ సోర్సింగ్ అంటోంది” అంటూ మొదటి రెండు పేరాల్లోనే ఇప్పుడు ఐటి వాళ్ళు అనుభవిస్తున్న భయాన్ని/దుస్థితిని కళ్ళకు కట్టారు రచయిత ‘చీకటి నీడలు’ కథలో. ఓ పెద్ద ఐటి కంపెనీ 30వేల మందిని లేఆఫ్ చెయ్యడం, వారు చాలా సీనియర్ హోదాలలో ఉండడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ అనుభవాన్ని రచయిత 2015లో గ్రహించారు. తనతో పని చేస్తున్న ఒక్కొక్క కొలీగ్ మాయమవడం, నెమ్మదిగా ఫ్లోర్ ఖాళీ అవడం చూసి బాధపడతాడు, కొలీగ్స్‌ని తలచుకుంటాడు, చివరికి తను కూడా సామాన్లు సర్దుకుని బయడకి నడుస్తాడు జో. ‘చీకటి నీడలు’ అని ఈ కథకి పేరు పెట్టడం ఔచితీమంతంగా ఉంది. నీడ ఎప్పుడూ నల్ల రంగులోనే ఉంటుంది. కానీ వెలుగు ఉంటేనే నీడ కనిపిస్తుంది కదా అనిపిస్తుంది. జీవితం మనం అనుకున్నట్టు సాగదు, అది వైరుధ్యాల పుట్ట అని సూచిస్తుందీ శీర్షిక!
“ఓ స్థాయికి చేరుకున్నాకా కంపెనీ మనల్ని దత్తత తీసుకుంటుంది. పనిని జీవితంగా మలచుకోడం తప్ప ఛాయిస్ ఉండదు” అంటుందో పాత్ర ‘ఫైండింగ్ డోరీ’ కథలో. ఎంతో వాస్తవం ఉందీ వాక్యాలలో. దంపతుల విషయంలో ఎప్పుడూ ఒకరి వెర్షన్ మాత్రమే విని ఓ అభిప్రాయానికి రాకూదని హెచ్చరిస్తుంది కథ. మనుషుల ప్రవర్తనలో వచ్చే మార్పులని పట్టించే చక్కని వాక్యాలున్నాయీ కథలో.
“ఒక కంపెనీని నడపాలంటే, టెక్నాలజీ సరిపోదని అభికి ఆలస్యంగా తెలిసింది” ఈ వాక్యం ‘వైకుంఠపాళి’ కథకి అత్యంత కీలకం! ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో చిక్కుకుని, కోర్టు కేసుల్లో ఇరుక్కుని మనశ్శాంతి కోల్పోయిన అభికి అలాన్ అనే అటార్నీ సాయపడ్తాడు. అతని మాట్లాడకా, తన సమస్య తీరుతుందని అభికి నమ్మకం కలుగుతుంది. ఈ సందర్భంలో అతని భార్య స్వప్న గమనించిన ఓ విషయం గురించి “పాత అభి తల వంచుకుని తప్పించుకునేవాడు, కొత్త అభి చొరవగా ఎదురెళ్తున్నాడు” అని రచయిత రాసిన ఒక్క వాక్యం ఎంతో విలువైనది.
“జీవితం ఎంత తోసినా ఇంకా ముందుకు నడవాల్సిందే” అనే ఈ వాక్యం చదువుతూంటే ఎంతో వేదన కలుగుతుంది. ఎంతో గొప్పగా ఊహించుకుని అమెరికా వచ్చి చదువుకుంటూ, డబ్బు సంపాదించడానికి రకరకాల పనులు చేసే విద్యార్థుల వెతలను ‘ఆడ్ జాబ్’ కథ చాటుతుంది. చట్టవిరుద్ధంగా అమెరికాలో అడుగుపెట్టిన ఇమ్మిగ్రెంట్స్ మససులో ఎంత భయంగా ఉంటుందో ఈ కథలోని స్పానిష్ వృద్ధుడు చెబుతాడు. “మనం ఎంత కావాలనుకున్నా కాలం మన చేతిలో ఉండదు” అనే వాక్యం ఎంతో తాత్త్వికతని నింపుకుంది. ఎన్నెన్నో సంశయాలు నిండిన స్టూడెంట్ (నెరెటర్) మనసు.. చీకట్లు వీడి వెలుగు నిండిన ఉదయంలా మారుతుంది కథ చివర్లో.
♥
‘ఎత్తరుగుల ఇల్లు’ కథ ఊరివారికి అన్ని విధాలుగా అండగా ఉండి, ఉమ్మడి బాగు కోసం తపించిన రామం గారి గురించి, ఆయనలా పేరు తెచ్చుకోవాలన్న ఆశతో తప్పుటడుగులు వేసి, పతనమైన ఆయన మనవడి గురించి చెబుతుంది. “ఊరి మునసబు మంచి మనిషి” అంటూ మొదలైన వాక్యం చదివి, ఆ పేరా ముగించేసరికి మునసబు గురించి కొన్ని క్షణాల క్రితం కలిగిన భావం మారిపోతుంది. గొప్ప వ్యంగ్యంగా రాశారు రచయిత. “అప్పు తప్పనే అడ్డుకట్ట ఉన్నంత వరకూ మనిషి పరవాలేదు, ఒకసారి గట్టు తెగిందంటే ప్రవహాన్ని ఆపలేం” ఈ వాక్యం చదివితే ఎంత మందిని ఎంత సన్నిహితంగా పరిశీలించి రాసి ఉంటారో రచయిత అనిపిస్తుంది.
వయసుడిగిపోయి, మరణానికి చేరువ అవుతున్న జేనీ అనే వృద్ధురాలు, స్వస్థత కేంద్రంలో చేరడానికి టాక్సీ మాట్లాడుకుంటుంది. కానీ నేరుగా అక్కడికి వెళ్ళకుండా, తను చెప్పిన ప్రదేశాల గుండా తీసుకువెళ్ళమని డ్రైవర్ డేవిడ్‌ని కోరుతుంది. ఒక్కో చోట జీవితంలో గడిపిన కాలాన్ని, అనుభవాలని గుర్తు చేసుకుంటుందామె. టాక్సీ ప్రయాణంలో జీవనయాత్రలోని ప్రతి మజిలీని రివైండ్ చేసుకుంటూ, పురాస్మృతులను హృదయంలో నింపుకుంటూ, చివరగా, వెళ్ళాళ్సిన చోటుకి చేరుతుంది. “మాటల కంటే మౌనంగా సాగే సంభాషణకి విస్తృతి ఎక్కువ” అంటారు రచయిత. ఉద్వేగాల వెల్లువ ‘ఆఖరి మజిలీ’ కథ.
♥
అమెరికాలోనూ తెలుగువారి మధ్య కులం ప్రధానమైపోడాన్ని ‘పాత్రాభినయం’ కథ చెబుతుంది. జనాలని మోసం చేద్దామని చూసిన ఓ బిల్డర్, తాను కట్టిస్తున్న బిల్డింగ్ కూలిపోతే, అక్కడే ప్రాణాలు వదిలిన ఉదంతాన్ని ‘ఇసుక మేడలు’ కథ చెబుతుంది.
ఈ కథలు చదివాకా, కాసేపు మనసు మొద్దుబారుతుంది. అంతర్ముఖులం అవుతాం. చిన్న నిట్టూర్పు వెలువడుతుంది. చాలా కథల్లో మనలాంటి వారే పాత్రలుగా కనబడడం వల్ల, ఇవి మన సొంత కథల్లా అనిపిస్తాయి, సంతృప్తితో పుస్తకం మూస్తాం!!
గుండెతడి దారమై ఔన్నత్యం దిశగా ఎగిరే అంతరంగం ఈ గాలిపటం!
***
రచన: మధు పెమ్మరాజు
పేజీలు: 127
వెల: ₹ 120/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/doredaar
~
మధు పెమ్మరాజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-madhu-pemmaraju/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
