Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘డా. బాబాసాహెబ్ డైరీ’ – త్రిభాషల పుస్తకాల ఆవిష్కరణ సభ – నివేదిక

[09-10-2026 నాడు ముంబైలో జరిగిన ‘డా. బాబాసాహెబ్ డైరీ’ తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషల పుస్తకాల ఆవిష్కరణ సభ నివేదికని అందిస్తున్నారు డా. అంబల్ల జనార్దన్.]

తేది 09-10-2026 శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు పద్మశాలి మిత్ర మండలి మరియు ముంబయి భారతి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘డా. బాబాసాహెబ్ డైరీ’ తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషల పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ముంబయి భారతి వ్యవస్థాపక ఆధ్యక్షులు డా. అంబల్ల జనార్దన్ గారు మాట్లాడుతూ “డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక విజ్ఞాన ఖని అనీ ఆయన జ్ఞానతృష్ణ అపారము” అని కొనియాడారు. మనలో చాలా మందికి వారు మన రాజ్యాంగ కర్త అని మాత్రమే తెలుసు కానీ, వారు ముంబయి గవర్నమెంట్ లా కాలేజిలో ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా ఎన్నో సంవత్సరాలు సేవలందించిన న్యాయ నిపుణులని తెలిపారు. తమ ప్రాంగణంలో సభ జరుపడానికి తోడ్పడ్డ పద్మశాలి మిత్ర మండలి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

సభ ప్రారంభంలో శ్రీ భీంరత్న మాలజీ గారు, ముంబయి తెలుగు వారి గురించి చక్కని గీతం ఆలాపించారు. ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభించిన ‘ముంబయి భారతి’ కన్వీనర్ శ్రీ నడిమెట్ల ఎల్లప్ప గారు స్వాగతం పలికి, మలేషియాలో నివాసమున్న శ్రీ సుధీర్ రెడ్డి గారు, ఐ.టీ. రంగంలో ఉన్నా, తమ ‘కస్తూరి విజయం’ ప్రచురణ సంస్థ ద్వారా వందకు పైగా తెలుగు పుస్తకాలు ప్రచురించి, తెలుగు భాషకు సేవ చేస్తున్నారన్నారు. వారు, డా. జి.వి. రత్నాకర్ గారు రాసిన ‘డా. బాబాసాహెబ్ డైరీ’ ప్రచురించి, డా. అంబేడ్కర్ గారి కర్మభూమి ఐన ముంబయిలో, దాని తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లోని పుస్తకాలను ఆవిష్కరించాలని కోరగా ‘ముంబయి భారతి’ ముందుకు వచ్చి పద్మశాలి మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసిందన్నారు.

ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ మూల్ నివాసి మాలజీ గారు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ డైరీ, పద్మశాలి సంస్థలో ఆవిష్కరించడం మంచి పరిణామం అన్నారు. డా. బాబాసాహెబ్ గారు కేవలం దళిత నేత కాదనీ వారు విశ్వ నాయకుడన్నారు. దళిత బహుజన సంస్థ మహారాష్ట్ర అధ్యక్షులు శ్రీ దేవానంద్ నాగెల్ల గారు “డా. అంబేడ్కర్ గారి చలవ వల్లే తమ లాంటి వారు అభివృద్ధి చెందాము” అన్నారు. పైగా డా. బాబాసాహెబ్ ఇంటిపేరు ‘సక్పాల్’ అనీ ‘అంబేడ్కర్’ ఇంటిపేరు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వారు డా. బాబాసాహెబ్ కు ఆసరాగా నిలిచి, తమ ఇంటి పేరును ఇచ్చారన్నారు.

ప్రముఖ సాహితీ ప్రియులు శ్రీ పి. నాగేశ్వర రావు గారు, డా. బాబాసాహెబ్ గారు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తావించి ప్రసంగించారు. శ్రీ గోల్డి బాలె గారు, డా. బాబాసాహెబ్ గారిని పొగడడంలో తప్పు లేదు కాని ఇతర కులాలని విమర్శించడం సరి కాదన్నారు.

‘డా. బాబాసాహెబ్ డైరీ’ తెలుగు పుస్తకం పద్మశాలి మిత్ర మండళి ట్రస్టీ చైర్మన్ శ్రీ సత్యభాను తుమ, హిందీ పుస్తకం శ్రీ నాగెల్ల దేవానంద్ మరియు ఇంగ్లీషు పుస్తకం శ్రీ పి. నాగేశ్వర రావు గార్లు ఆవిష్కరించారు.

ప్రచురణ సంస్థ ‘కస్తూరి విజయం’ అధినేత శ్రీ సుధీర్ రెడ్డి గారు తమ సంస్థ సేవల విషయం వివరిస్తూ, ‘డా. బాబాసాహెబ్ డైరీ’ ముంబయిలో ఆవిష్కరించడం లోని నేపథ్యం చెప్పారు. సభ ఏర్పాటు చేసిన పద్మశాలి మిత్ర మండలి మరియు ముంబయి భారతి సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ముంబయి భారతి వ్యవస్థాపక ఆధ్యక్షులు డా. అంబల్ల జనార్దన్ గారిని శాలువాతో సన్మానించారు. చివరగా పద్మశాలి మిత్ర మండళి జనరల్ సెక్రెటరి శ్రీ గద్దె వెంకటేష్ గారు వందన సమర్పణ చేశారు.

సభలో సర్వశ్రీ ముంబై తెలంగాణ బహుజన ఫోరంకు చెందిన నాయకులు సామల లక్ష్మణ్ యాదవ్, ఎల్దీ రఘునాథ్ పద్మశాలి, శ్రీనివాస్ చారి, భీంరత్న మాలజీ, కొండేటి గంగాధర్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తేది 10-10-2026 శివాజీ పార్క్ లోని చైత్య భూమి వద్ద శ్రీ మూల్ నివాసి మాలజీ గారి సౌజన్యంతో, ముంబై తెలంగాణ బహుజన ఫోరంకు చెందిన నాయకుల మధ్య, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ముని మనుమడు శ్రీ భీంరావ్ అంబేడ్కర్ గారి కరకమలాల ద్వారా ‘డా. బాబాసాహెబ్ డైరీ’ హిందీ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అలాగే దాదర్‌లో డా. అంబేడ్కర్ గారు నివసించిన రాజగృహం కూడా సందర్శించారు. ‘కస్తూరి విజయం’ అధినేత శ్రీ సుధీర్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేసి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version