[చైనా జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 10వ కథ ‘మాట్లాడే చేప’.]
ఒక ఊరిలో ఒక చేపలు పట్టే జాలరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఏ పూటకా పూట కష్టపడితే గానీ పొయ్యిలో మంట వెలగదు. సొంతంగా పడవ గానీ వల గానీ ఏమీ లేవు. దాంతో ఒక ధనవంతుని దగ్గర పని చేసేవాడు. ప్రతిరోజు అతను ఇచ్చిన పడవలో నదికిపోయి చేపలు పట్టుకుని వచ్చి కూలీ తీసుకునేవాడు.
ఒకసారి ఆ జాలరి ఎప్పటిలాగే చేపలు పట్టడానికి పక్కనే ఉన్న నదిలోకి పోయాడు. ఆ రోజు ఎందుకోగానీ పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎన్నిసార్లు వల వేసినా ఒక్క చేప కూడా పడలేదు. ‘ఇక లాభం లేదు ఈరోజు యజమాని దగ్గర తిట్లు తప్పవు. ఈ రాత్రి ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే’ అనుకుంటూ ఆఖరిసారిగా వల విసిరాడు. పావుగంట ఆగి నెమ్మదిగా లాగాడు.
ఆశ్చర్యం.. ఆ వల మధ్యలో ఒక చిన్న బంగారు చేప దగధగా మెరిసిపోతా కనపడింది. అంత అందమైన చిన్న చేపను చూడడం అదే మొదటిసారి. ‘ఆహా.. ఏమో అనుకున్నాను కానీ ఈరోజు అదృష్టం నా ఇంటి తలుపు తట్టింది. మిల మిలా మెరిసిపోతావున్న ఈ అపురూపమైన చేపను చూసి మా యజమాని ఎంతో సంబరపడతాడు. ఈ వింతచేపకు మంచి ధర కూడా పలుకుతుంది. ఈ రోజు నాకు పదింతలు లాభం’ అనుకుంటూ వల నుంచి నెమ్మదిగా బయటకు తీసి బుట్టలో వేసుకోబోయాడు. అంతలో ఆ చిన్న చేప కళ్ళనీళ్లు పెట్టుకొని “ఓ జాలరీ.. దయచేసి నన్ను విడిచిపెట్టు. పొరపాటున దారి తప్పి ఇటు వచ్చాను. నేను చాలా చిన్నవాన్ని. మా అమ్మకు ఒక్కన్నే కొడుకును. నేనంటే ఆమెకు చాలా ఇష్టం. ఒక్కరోజు కనబడకపోయినా అల్లాడిపోతుంది. అన్నం తినడం మానివేస్తుంది. నువ్వు నన్ను వదిలివేస్తే నీకు ఆపద కలిగినప్పుడు ఖచ్చితంగా సాయం చేస్తా. నన్ను నమ్ము” అంది.
చేప మాట్లాడడంతో ఆ జాలరి ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డాడు. ఆ చిన్ని చేపను చూస్తావుంటే జాలి వేసింది. కానీ వాళ్ళ యజమాని చాలా క్రూరుడు. కొంచెం కూడా జాలీ దయా లేనివాడు. చేపను తీసుకొని పోకపోతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. కానీ ఇక్కడేమో పాపం చిన్న చేప కాపాడమని వేడుకుంటూ ఉంది. ఆకలితో ఇంటి గుమ్మం ముందు నిలబడిన వారిని ఉత్త చేతులతో పొమ్మనకూడదు, కాపాడమని చేతులు జోడించి మొక్కిన వారిని శత్రువైనా సరే సాయం వేయాలి అంటారు పెద్దలు. దాంతో ఏదైతే అదైతుందని భావించి ఆ చిన్నారి చేపను తిరిగి నీళ్లలో వదిలివేశాడు.
ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చిన జాలరిని చూసి యజమాని కోపంతో ఊగిపోయాడు. జాలరి ఏ మాత్రం దాచిపెట్టుకోకుండా జరిగింది జరిగినట్టు తలవంచుకొని వివరంగా చెప్పేశాడు. జరిగిన విషయం తెలుసుకొన్న యజమాని “బంగారం లాంటి చేప చిక్కితే దాన్ని తిరిగి నీళ్లలో వదిలివేస్తావా. నీలాంటి తెలివితక్కువ వాన్ని పనిలో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. పో ఇక్కన్నుంచి. ఇకపై నీకు పని ఎవరిస్తారో నేనూ చూస్తాను” అంటూ నోటికొచ్చినట్లు తిట్టి కూలీ కూడా ఇవ్వకుండా పనిలోంచి తీసేసాడు. దాంతో అతనికి ఊరిలో ఎక్కడా పని దొరకలేదు. దాచిపెట్టుకున్న డబ్బులు అన్నీ అయిపోయాయి. అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చినా ఎవరూ కొనడం లేదు. ఇంటింటికి పోయి పని ఇవ్వమని ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఆఖరికి తినడానికి తిండి కూడా లేక ఆకలితో అల్లాడిపోసాగాడు.
అదే సమయంలో ఒక రాక్షసుడు అటువైపు వచ్చాడు. ఆ రాక్షసుడు చాలా ముసలివాడు. ఇంతకుముందులా బలమూ లేదు. ఢీ అంటే ఢీ అంటూ తలపడే శక్తీ లేదు. కానీ బయటకు అలా కనిపించనీయకుండా మాటలతో అందరినీ బెదిరిస్తుంటాడు. తన గురించి తాను డబ్బా కొట్టుకుంటూ తనంత వీరుడు, శూరుడు, ఎవడూ లేడని ఉత్త మాటలు చెబుతూ తిరుగుతుంటాడు. ఆ రాక్షసుని చేతిలో ఒక మాయా ఆవు ఉంది. అతను జాలరితో “చూడు.. నిన్ను చూస్తావుంటే మరో నాలుగు రోజులు మించి బతికేటట్లు లేవు. ఇదిగో నీకు ఈ ఆవు ఇస్తా. ఇది అలాంటిలాంటి మామూలు ఆవు కాదు. నువ్వు ఎంత పిండితే అన్ని పాలు ఇస్తుంది. పిండీ పిండీ నీ చేతులు నొప్పి పెట్టాల్సిందే గానీ అది మాత్రం ఆపదు. కానీ మూడు సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తా. అప్పుడు మూడు ప్రశ్నలు అడుగుతా. నువ్వు గనుక సరైన సమాధానాలు చెబితే ఈ ఆవును నీకే ఇచ్చేస్తా. చెప్పలేకపోయావనుకో నిన్ను అక్కడికక్కడే నమిలి మింగేస్తా. ఏమంటావు” అన్నాడు.
ఆ జాలరి ఆలోచించాడు. “ఆకలితో ప్రతిరోజూ చచ్చేకన్నా మూడు సంవత్సరాలు కాలు మీద కాలేసుకుని కమ్మగా బతకొచ్చు కదా.. ఆ తర్వాతి సంగతి అప్పుడు చూసుకుందాం” అనుకొని ‘సరే’ అన్నాడు. అప్పుడా రాక్షసుడు ఆ మాయా ఆవును ఆ జాలరికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ జాలరి ఆ పాలు చుట్టుపక్కల అందరికీ తక్కువ ధరకు అమ్మసాగాడు. చూస్తుండగానే చేతిలో డబ్బులు పొంగిపొర్లసాగాయి. మంచి ఇల్లు కట్టుకున్నాడు. హాయిగా కోరినవన్నీ కొనుక్కొచ్చుకొని కమ్మగా తినసాగాడు. నెమ్మదిగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ యువకుడు అసలు రాక్షసుని విషయమే మరిచిపోయాడు.
ఒకరోజు పొద్దున్నే ఇంటి తలుపు కొట్టిన చప్పుడయింది. “ఎవరబ్బా ఇంత పొద్దున్నే” అని పోయి చూస్తే ఇంకేముంది రాక్షసుడు చిరునవ్వు నవ్వుతా కనపడ్డాడు. ఆ రాక్షసుడిని చూడగానే యువకుడు అదిరిపడ్డాడు. “ఏమట్లా బొమ్మలెక్క నిలబడిపోయావ్. నాకు ఇచ్చినమాట గుర్తుంది కదా.. రేపటితో మూడు సంవత్సరాలు పూర్తవుతాయి. పొద్దున్నే నేను అడిగే మూడు ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరి. లేదంటే ఇక్కడికి ఇక్కడే నిన్ను కరకర నమిలి మింగేస్తా” అన్నాడు.
జాలరికి ఏం చేయాలో తోచలేదు. ఇంక ఇదే తనకు చివరి రోజు అనుకొని దిగులు పడసాగాడు. అంతలో మరలా ఇంటి తలుపు చప్పుడయింది. ‘ఎవరబ్బా ఈ సమయంలో’ అని తీసి చూస్తే ఒక యువకుడు కనపడ్డాడు. ఆరడుగుల ఎత్తు, మెలి తిరిగిన మీసాలతో పెద్ద పహిల్వాన్ లాగా ఉన్నాడు. “ఎవరు నీవు. ఏం కావాలి” అన్నాడు.
అప్పుడు ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “నేను మీకు చాలా దూరపు బంధువుల అబ్బాయిని. చిన్న పని ఉండి ఈ ఊరికి వచ్చాను. మిమ్మల్ని కలుద్దామని వచ్చి ఇక్కడ జరిగిందంతా గమనించాను. మీరేమీ భయపడకండి. రేపు నా తరఫున ఈ అబ్బాయి నీ ప్రశ్నలకు జవాబులు చెబుతాడు అని నన్ను చూపించండి. మిగతాది నేను చూసుకుంటాను” అన్నాడు చిరునవ్వుతో. జాలరి ‘సరే’ అన్నాడు. తర్వాత రోజు ఆ అబ్బాయిని తన తరపున రాక్షసుని ముందు నిలబెట్టాడు.
రాక్షసుడు ఆ యువకున్ని కిందికి మీదికి ఎగాదిగా చూసి “నువ్వేమైనా పెద్ద మొనగాడిని అనుకుంటున్నావా.. నేను నిన్న ఒక కొండమీదికి ఎక్కి నిలబడితే ఆకాశం నా తలకు తగిలింది. ఏమనుకుంటున్నావో” అన్నాడు. ఆ మాటలకు ఆ యువకుడు “అలాగా.. నిన్న సరదాగా సాయంకాలం నేను ఆకాశంలో నడుస్తా వుంటే అనుకోకుండా ఏదో గట్టిగా ఠపీమని నా కాలికి తగిలింది. ఇదేందబ్బా మేఘాలు మెత్తగా ఉంటాయి గానీ ఇక్కడ ఇంత కరుకుగా వుంది అనుకున్నాను. అది నీ తలనా. నువ్వేనా అప్పుడు అక్కడ నిలబడింది” అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు గతుక్కుమన్నాడు.
‘వీడెవడో చాలా అసాధ్యునిలా వున్నట్టున్నాడే. నన్ను మించి గప్పాలు కొడుతున్నాడు’ అనుకొని “ఏమనుకుంటున్నావ్ నా గురించి. నాకు నిన్న దాహం అయితే ఒకే ఒక గుక్కలో చెరువు నీటిని మొత్తం తాగేశాను తెలుసా” అన్నాడు రొమ్ము విరుచుకొని. దానికి వాడు నవ్వుతూ “నువ్వేనా తాగేసింది.. నిన్న సాయంకాలం స్నానం చేసి వద్దామని పోతే చుక్క నీళ్ళు లేవు. దాంతో సర్రున పక్కనే ఉన్న సముద్రానికి పోయి నా దోసిలి నిండా నీళ్లు నింపుకొని వచ్చి పోస్తే.. దెబ్బకు చెరువు నిండటమే కాదు పక్కనే ఉన్న ఊరు కూడా సగానికి సగం కొట్టుకుపోయింది” అన్నాడు.
దాంతో ఆ రాక్షసునికి “వీన్ని మాటలతో గెలవడం కష్టం. నేనే మాటలోన్ని అనుకుంటే నన్ను మించిన మాటగాడు వీడు. ఇక చివరిసారిగా వీన్ని భయపడించి చూద్దాం” అనుకున్నాడు.
దాంతో ఆ యువకుని వైపు తిరిగి “నా బలం ఎంతనో తెలుసా.. ఒక్క దెబ్బ కొట్టినానంటే చాలు. ఎంత పెద్ద ఏనుగైనా సరే అక్కడికక్కడే చచ్చి శవంగా మారాల్సిందే” అన్నాడు. ఆ మాటలకు ఆ యువకుడు నవ్వేసి “ఓయబ్బో అది కూడా గొప్పేనా. మా ఊరిలో పాలు తాగే పసిపిల్లలు కూడా చేస్తారు. నేను నా బలమంతా ఉపయోగించి నిన్న ఒక ఈగను కొడితే అది సర్రున పోయి భూమిని ఢీ కొట్టుకుంది. ఆ వేగానికి భూమికి బొక్క పడి పాతాళం దాకా రంద్రం పడింది. దెబ్బ అంటే అలా కొట్టాల. నీ బలమెంతో నా బలమెంతో ఇప్పుడే ఇక్కడే తేల్చుకుందాం. ముందు నువ్వు నన్ను కొట్టు. ఆ తర్వాత నేను నిన్ను కొడతాను. ఎవరు బతుకుతారో ఎవరు చస్తారో ఇప్పుడే తెలిసిపోతుంది” అంటూ అంగీ మడిచి ముందుకు వచ్చి తొడ కొట్టాడు.
దాంతో ఆ ముసలి రాక్షసుడు భయంతో వణికిపోయాడు. “వీడు మామూలోడు కాదు. ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే వీని చేతిలో చావడం ఖాయం” అనుకొని ఆ ఆవును అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
అదిచూసి జాలరి సంతోషపడి “బాబూ నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. నీ బొమ్మను పూజగదిలో పెట్టి రోజు పూజించుకుంటాను. నీకేం కావాలో చెప్పు నా చేతనైన సాయం చేస్తాను” అన్నాడు.
అప్పుడు ఆ యువకుడు “అయ్యా మీరు పెద్దవారు. అంత మాట అనకండి. నేనెవరో కాదు ఆ రోజు నదిలో చేతికి చిక్కిన ఒక బంగారు చేపను జాలిపడి వదిలివేసారే.. అది నేనే. అప్పుడు చాలా చిన్నోడిని. నాకు ఎటువంటి శక్తులు లేవు. ఈ మూడు సంవత్సరాల్లో యువకునిగా మారి అన్ని విద్యలు నేర్చుకున్నాను. అందుకే నాకు ప్రాణ బిక్ష పెట్టిన మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇలా వచ్చాను. ఇకపై ఎప్పుడు ఎటువంటి ఆపద ఎదురైనా సరే నన్ను ఒక్కసారి తలుచుకోండి. మీ కాళ్ళ వద్ద ఉంటాను. ఈ బతుకంతా మీరు పెట్టిన బిక్షనే” అంటూ వినయంగా అతని కాళ్లకు మొక్కి వెళ్లిపోయాడు.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
