[చైనా జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 12వ కథ ‘సీతాకోకచిలుక ప్రేమికులు’.]
చైనాలో ఒక ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి చక్కని చుక్కలాంటి ఒక ముచ్చటైన కూతురు ఉండేది. ఆ పాప చాలా తెలివైంది. చురుకైంది. చిన్నప్పటి నుంచి చదవంటే చాలా ఇష్టం. ఇంటి వద్దనే రాయడం, చదవడం మొత్తం నేర్చేసుకుంది. ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంది గానీ ఆనాటికాలంలో చైనాలో ఆడపిల్లలను బయటికి పంపించి చదివించడానికి ఎవరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. చైనా గురుకులాల్లో కూడా మగ పిల్లలనే తప్ప ఆడపిల్లలను అస్సలు రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆ పాపకేమో బాగా చదువుకోవాలనీ, పెద్ద పండితురాలు కావాలనీ ఒకటే కోరిక.
దాంతో ఒకరోజు వాళ్ళ నాన్నతో “నాన్నా.. నేను ఎవరూ కనుక్కోకుండా మగ పిల్లవాని వేషం వేసుకొని చదువు నేర్చుకుంటా. నన్ను ఏదైనా గురుకులానికి పంపించు” అంది. ఆ మాటలకు అతను “చూడమ్మా.. ఆడపిల్లలను, మగపిల్లలను చూడగానే చాలా సులభంగా గుర్తుపట్టేయవచ్చు. మీ గొంతు, నడక, చూపు అన్నీ వేరేగా ఉంటాయి. జింక పులితోలు కప్పుకున్నంత మాత్రాన పులి కాలేదు కదా. ఇదీ అంతే” అన్నాడు. దాంతో ఆ అమ్మాయి మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.
ఒక నెల తరువాత ఆ వ్యాపారికి అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతింది. నీరసంగా మంచానికే అతుక్కుపోయాడు. దాంతో వైద్యున్ని పిలిపిస్తే ఒక యువకుడు వచ్చాడు. ఆ ధనవంతున్ని పరీక్షించి రకరకాల మూలికలతో మందు తయారుచేసి ఇచ్చాడు. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోసాగాడు. అలా వారం రోజులు సేవ చేసిన తర్వాత ఆ వ్యాపారి మరలా కోలుకొని ఇంతకుముందులా తిరగసాగాడు. తనకు వైద్యం చేసిన ఆ యువకునికి అడిగినంత ధనం ఇచ్చి పంపించాడు. తర్వాతరోజు ఆ వైద్యుడు మరలా వచ్చి “అయ్యా.. నీవు అనుకున్నట్టు నేను వైద్యున్ని కాదు. నీ కూతురినే. వారం రోజులుగా నీ ముందు తిరుగుతున్నాను. మాట్లాడుతున్నాను. మందులు ఇస్తున్నాను. కానీ నీవు గానీ, అమ్మ గానీ, ఇంటిలోని సేవకులు గానీ ఏ ఒక్కరు నన్ను గుర్తుపట్టలేకపోయారు. ఇంట్లో వున్న మీరే కనుక్కోలేనప్పుడు బయటవాళ్ళు ఎలా కనుక్కుంటారు. ఇప్పుడైనా దయచేసి నన్ను మగ పిల్లవాని వేషంలో చదువుకోడానికి పంపించండి” అంటూ బతిమలాడుతూ తన వేషం తీసేసింది.
దాంతో ఆ వ్యాపారికి తన కూతురి మీద నమ్మకం కలిగి అడుగుకో జాగ్రత్త చెబుతూ ఒక మంచి గురుకులంలో చేర్పించాడు. అక్కడ ఆ అమ్మాయికి ‘లియాన్’ అనే విద్యార్థి పరిచయమయ్యాడు. అతను చాలా పేదవాడు. పుస్తకాల పురుగు. చదువు తప్ప మరేమీ తెలియదు. చాలా అమాయకుడు. మంచివాడు. వీరిద్దరిదీ ఒకటే గది. తరగతిలో కూడా పక్కపక్కనే కూర్చునేవాళ్లు. ఆ అమ్మాయి తాను ఆడపిల్లననే విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేది. పురుషునిలాగా తలదువ్వుకొని, బట్టలు వేసుకునేది. మగపిల్లల్లాగే నడుస్తూ గంభీరంగా మాట్లాడుతుండేది. ఉదయం అందరికన్నా ముందే చీకటిలో లేచి స్నానం పూర్తి చేసేది.
లియాన్‌కు ఎప్పుడూ, ఎక్కడా చిన్న అనుమానం కూడా రాలేదు. స్నేహితునిలాగానే భావిస్తూ చదువులో చాలా సహాయం చేసేవాడు. రానివి ఓపికగా చెబుతూ నేర్పించేవాడు. కలసి తినేవారు. కలసి తిరిగేవారు. ఒకరిని విడిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండేవాళ్లు కాదు. ఇద్దరి మధ్య నెమ్మదిగా చక్కని అనుబంధం పెరిగింది. ఆ అమ్మాయి లియాన్ పట్టుదల, అమాయకత్వం, చదువుపై ఇష్టం, నిజాయితీ చూసి అతన్ని చాలా ఇష్టపడింది. చదువు పూర్తయ్యాక అసలు విషయం చెప్పి అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది.
చూస్తుండగానే మూడు సంవత్సరాలు ముగిశాయి. ఇద్దరి చదువులు పూర్తి అయ్యాయి. విడిపోవాల్సిన రోజు దగ్గరపడింది. ఆ అమ్మాయికి చాలా దిగులుగా ఉంది. మనసంతా బాధతో నిండిపోయింది. కళ్ళలో మాటిమాటికి నీళ్లు వస్తూ ఉన్నాయి. నోట మాట రావడం లేదు. మనసు మౌనంగా ఏడవసాగింది. లియాంగ్ కూడా చాలా విచారంగా ఉన్నాడు. మూడు సంవత్సరాలుగా తన సంతోషాలు, బాధలు పంచుకుంటూ తోడునీడగా నిలిచిన స్నేహితున్ని అస్సలు వదలలేకపోతున్నాడు.
లియాంగ్ తన స్నేహితునికి వీడ్కోలు చెప్పి ఇంటి వద్ద దిగబెట్టి రావడానికి బయలుదేరాడు. అలా పోతున్నప్పుడు ఆ అమ్మాయి తన మనసులోని మాట అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచించసాగింది. దారిలో ఒక చెరువు కనపడింది. అందులో రెండు బాతులు జంటగా ఈదుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి వాటిని చూపిస్తూ “లియాన్.. ఆ అందమైన బాతులను చూడు. ఎంత సంబరంగా కలసిమెలసి ఈత కొడుతున్నాయో. మనం కూడా అలా కలకాలం చిరునవ్వులతో కలసి బ్రతుకుతే ఎంత బాగుంటుందో కదా” అంది. దానికి లియాన్ చిరునవ్వు నవ్వి “మనం ఇద్దరం మంచి స్నేహితులం కదా.. వాటిలాగే ఎప్పటికీ కలసిమెలసి ఉంటాంలే” అన్నాడు అమాయకంగా.
వాళ్లు మరి కొంచెందూరం పోయారు. అక్కడ ఒక పక్షుల జంట చెట్టుపై గూడు కట్టుకుంటూ ఉంది. వాటిని లియాన్ కు చూపుతూ “మనం కూడా అలా ఒక ముచ్చటైన ఇల్లు కట్టుకొని మొగుడూపెళ్ళాల మాదిరి కలసిమెలసి ఉంటే ఎంత బాగుంటుందో కదా” అంది. దానికి లియాన్ పెద్దగా నవ్వేసి “నిజమే.. కానీ మనమిద్దరం మగ పిల్లలమే కదా.. అది ఎలా సాధ్యం. పొరపాటున నేను ఆడపిల్లగా మారితే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాలే” అన్నాడు పకపకమని నవ్వుతూ. లియాన్ అమాయకత్వానికి, స్వచ్ఛమైన మనసుకు ఆమె చిన్నగా నవ్వుకుంది.
మాటల్లోనే ఇల్లు వచ్చేసింది. విడిపోయేముందు ఆ అమ్మాయి “మిత్రమా నాకు ఒక అందమైన చెల్లి ఉంది. అచ్చం నాలాగే ముచ్చటగా అప్పుడే పూసిన మందారపువ్వులా ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏం సరేనా” అంది. లియాన్ సిగ్గుతో నవ్వుతూ వెళ్ళిపోయాడు.
నెమ్మదిగా ఒక నెల గడిచిపోయింది. లియాన్‌కు మాటిమాటికీ స్నేహితుడే గుర్తుకు రాసాగాడు. కళ్ళు మూసినా, తెరిచినా అతని మాటలు, నవ్వులే మెదలసాగాయి. దాంతో ఒకసారి చూసొద్దామని బయలుదేరాడు. ఇంటికిపోయి తలుపు కొట్టాడు. అప్పుడు ఇంటిలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. తలస్నానం చేసి, పువ్వులు తలలో పెట్టుకుని, అచ్చం ఆకాశం నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. వచ్చి తలుపు తీసింది. లియాన్ కళ్ళు మిరమిట్లు గొలిపే ఆ అద్భుతమైన అమ్మాయిని చూసి నోట మాటరాక అలాగే నిలబడిపోయాడు. అచ్చం తన స్నేహితుని లాగానే ఉంది. అతని చెల్లెలేమో అనుకున్నాడు.
ఆ అమ్మాయి లియాన్‌ను లోపలికి పిలిచింది. “మిత్రమా.. నిజానికి నాకు చెల్లెలు అంటూ ఎవరూ లేరు. నీతో పాటు కలసి చదువుకున్న స్నేహితుడిని నేనే” అంటూ అచ్చం మగపిల్లవాని లాగే గంభీరంగా అని ఫక్కున నవ్వింది. అంతకాలం తనకు తోడునీడగా మగ పిల్లవాని వేషంలో ఉన్నది ఆ అమ్మాయే అని తెలిసి లియాన్ ఆశ్చర్యపోయాడు. విడిపోయేముందు ఆమె చూపిన దృశ్యాలు, అడిగిన మాటలు అన్నీ గుర్తుకు వచ్చాయి. దాంతో “నన్ను మన్నించు. నీవు నన్ను ఇష్టపడుతూ, పెళ్లి చేసుకుని కలసి జీవిద్దాం అని అడుగుతున్నా ఆ రోజు గ్రహించలేకపోయాను. ఇక నిన్ను వదులుకోలేను. చచ్చినా బ్రతికినా నీతోనే” అన్నాడు. అలా ఆ ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వీలున్నప్పుడల్లా చెరువు దగ్గర, తోట దగ్గర, గుడి దగ్గర కలుసుకొని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య అనుబంధం మరింత చిక్కబడింది. త్వరలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు.
ఆ ఊరిలో ‘మావెన్ చాయ్’ అనే యువకుడున్నాడు. మంచోడే గానీ ఏదైనా పట్టుపడితే అస్సలు వదలడు. అతని తండ్రి చాలా పెద్ద ధనవంతుడే గాక పెద్ద అధికారి కూడా. ఆ యువకునికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎలాగైనాసరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దాంతో వాళ్ళ నాన్న ద్వారా రాయబారం పంపించాడు. ఆ వ్యాపారికి ఆ ధనవంతుడు అంటే గౌరవమే కాదు భయం కూడా. దాంతోపాటు అంత పెద్ద ధనవంతుడే స్వయంగా వచ్చి మీ కూతురుని మా కొడుకు కిచ్చి పెళ్లి చేయమంటే కాదని ఎలా అంటాడు. దాంతో సంతోషంగా ‘సరే’ అన్నాడు.
విషయం తెలిసి వ్యాపారి కూతురు బాధతో కుమిలిపోయింది. ఇలాగే ఉంటే లాభం లేదు వెంటనే విషయం తండ్రితో చెప్పాలి అనుకొని తన ప్రేమ కథంతా చెప్పి “నాన్నా.. అతనికంటే తెలివైనవాడు, చురుకైనవాడు, బాగా చదువుకున్నవాడు, అందమైనవాడు, నేనంటే చచ్చేంత ప్రేమున్నవాడు.. కేవలం డబ్బు లేదన్న కారణంతో అతన్ని వదులుకోలేను. చేసుకుంటే లియాన్నే చేసుకుంటా. లేదంటే లేదు” అని తెగేసి చెప్పింది.
కానీ వ్యాపారి పేదవాడైన లియాన్‌కు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. “బంగారు చెంచాతో బంగారు పళ్లెంలో అన్నం తినే మనమెక్కడ, ఏ పూటకాపూట అన్నం కోసం వెతుక్కునే అతనెక్కడ. నా పరువు మర్యాద ఏం కావాలా. అందరూ మొహం మీద ఉమ్మేసిపోతారు. ఒకసారి మాట ఇచ్చాక ప్రాణం పోయినా వెనక్కి తీసుకోలేను. ఈ ఇంట్లోనుంచి నీ పెళ్లి పల్లకీ అయినా బయటకు పోవాల లేదా నా శవం కట్టిన పాడె అయినా పోవాల. తేల్చుకో కనిపెంచిన నేను కావాలో, ప్రేమించిన అతను కావాలో” అని గీత గీసి చెప్పాడు.
దాంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో తోచలేదు. చూస్తుండగానే పెళ్లి నిశ్చయమైపోయింది. ఈ విషయం లియాన్‌కు తెలిసింది. బాధతో వెక్కివెక్కి ఏడిచాడు. అన్నం తినబుద్ధి కాలేదు. నీళ్లు తాగబుద్ధి కాలేదు. ఆ అమ్మాయినే తలుచుకుంటూ నెమ్మదిగా చిక్కి అస్తిపంజరంలా మారిపోయాడు. ఆమె లేని బతుకు బతకడం కన్నా చావడం మేలు అనుకున్నాడు. చూడాలని మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ వ్యాపారి ఇంటి చుట్టూ సైనికులను కాపలా పెట్టాడు. అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టం చేశాడు. దాంతో లియాన్ ఆమెను ఒక్కసారి కూడా చూడలేకపోయాడు. దాంతో చివరిసారిగా రక్తంతో ఆమెకు ఉత్తరం రాశాడు
“ఓ స్నేహితురాలా.. నీ పెళ్లి వార్త నా మనసును ముక్కలు చేసింది. కానీ నీ సంతోషం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. వచ్చే జన్మలోనైనా మనం ధనిక పేద తేడాలేని పక్షుల్లా పుడదాం. ఎప్పటికీ విడిపోకుండా సంతోషంగా కలకాలం కలసి బతుకుదాం. నాది ఒకే ఒక చివరి కోరిక. నీ పెళ్లి ఊరేగింపు నా సమాధి వున్న వీధి వైపు పోయేలా చూడు. ఆఖరిసారి నిన్ను అందులోంచి తనివితీరా చూసుకుంటాను” అని రాసి ఆ ఉత్తరాన్ని ఆ అమ్మాయికి అందించమని మిత్రునికి చెప్పి ప్రాణాలు వదిలాడు.
ఆ మిత్రుడు రహస్యంగా ఆ అమ్మాయికి ఉత్తరాన్ని చేరవేశాడు. అది చదివి ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. శాశ్వతంగా దూరమైన లియాన్‌ను తలుచుకొని తనని మన్నించమని పదేపదే ఆకాశం వైపు చూస్తూ వేడుకొంది. పెళ్లికి ముందురోజు తండ్రితో “నాన్నా.. నీవు చెప్పిన మాట విని పెళ్లి చేసుకోవాలంటే నాది ఒకే ఒక షరతు. నన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరేగింపుగా కళ్యాణమంటపానికి తీసుకొని పోయేటప్పుడు ఖచ్చితంగా లియాన్ సమాధి వున్న వైపే తీసుకుపోవాలి. నేను చివరిసారిగా ఆ సమాధిని చూడాలి. లేకపోతే చచ్చినాసరే ఈ పెళ్లి చేసుకోను” అంది. ఆమె మొండిపట్టుతో చేసేదేమిలేక వ్యాపారి ‘సరే’ అన్నాడు.
పెళ్లికి ముందురోజు సంతాపాన్ని తెలిపే తెల్లనిబట్టలను వేసుకొని అవి కనబడకుండా పైన పెళ్లికూతురు ధరించే ఎర్రని పట్టుబట్టలు ధరించింది. ఎవరికీ కనపడకుండా తెరలు దించి పల్లకీలో కూర్చుంది. ఊరేగింపు చాలా ఘనంగా ముందుకుసాగింది. ఆ నగరంలో అత్యంత ధనవంతుల పెళ్లి కావడంతో టపాకాయలు పేలుతూ ఆకాశమంతా రంగుల వెలుగులు విరజిమ్మసాగాయి. సన్నాయి మేళాలు, డప్పులు, ఆటపాటలు, రంగులు చల్లుకోవడం అంతా సరదాగా ఆనందంగా ఉంది.
పల్లకిలో పరదాల మాటున ఉన్న పెళ్లికూతురు మొహం మాత్రం విచారంగా ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాటిమాటికి ఆమెకు లియానే గుర్తుకు వస్తున్నాడు. అతనితో ఆడిన ఆటలు, పాడిన పాటలు, పోట్లాడిన సరదాలు, మాట్లాడిన ముచ్చట్లు, చేసుకున్న బాసలు అన్నీ ఒకదాని వెనుక ఒకటి గుర్తుకు వచ్చి మనసంతా విషాదంతో నిండిపోసాగింది.
పెళ్లి ఊరేగింపు ఒక్కొక్క వీధి దాటుకుంటూ లియాన్ సమాధి ఉన్న వీధిలోకి వచ్చింది.
ఊరేగింపు సమాధి ముందుకు రాగానే ఒక్కసారిగా పల్లకి ఆగిపోయింది.
అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం హఠాత్తుగా నల్లని మబ్బులతో నిండిపోయింది. గాలికి చుట్టూ వున్న పెద్దపెద్ద చెట్లు కిందికీ మీదికీ మీదికి ఊగిపోసాగాయి. ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. ఏం జరుగుతుందో అర్థం కాక జనాలంతా కళ్ళు పెద్దవి చేసుకొని భయంభయంగా చూడసాగారు.
అంతలో పల్లకీలోంచి ఎర్రని బట్టలతో పెళ్లికూతురు కిందికి దిగింది. లియాన్ సమాధి ముందు మోకాళ్ళపై కూర్చొని “స్నేహితుడా.. మనం ఈ లోకంలో కలసి బతకలేకపోయాం. కనీసం మరణంలోనన్నా ఒక్కచోట కలసి బతుకుదాం. భగవంతుడా మా ఇద్దరిదీ నిజమైన, స్వచ్ఛమైన ప్రేమే అయితే ఈ క్షణమే మా ఇద్దరినీ కలుపు తండ్రీ” అంటూ నీళ్లు నిండిన కళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ దేవున్ని ప్రార్థించింది. ఆమె ఏడుపుకు భూమి కంపించింది. ఆకాశం బద్దలయింది. అందరూ చూస్తుండగానే పెద్ద చప్పుడుతో లియాన్ సమాధి రెండుగా చీలిపోయింది.
అంతే.. ఆమె తన ఒంటి మీద వున్న ఎర్రని పెళ్లి బట్టలను తీసి విసిరి పారేసింది. తెల్లని బట్టలతో ఆ సమాధిలోకి ఎగిరి దూకేసింది. అంతే ఆ మరుక్షణమే మరలా ఆ సమాధి ఎప్పటిలాగే మూసుకుపోయింది. నల్లని మబ్బులన్నీ తొలగిపోయి ఆకాశం ప్రశాంతంగా మారిపోయింది. గాలీవాన తగ్గిపోయాయి. అందరూ చూస్తుండగానే సమాధిపై రకరకాల పువ్వులు ఇంద్రధనస్సుల్లా వికసించాయి.
సమాధిలోంచి రెండు అందమైన రంగురంగుల సీతాకోకచిలుకలు ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ స్వేచ్ఛగా సంబరంగా ఆకాశంలోనికి ఎగురుకుంటూ వెళ్లిపోయాయి.
(త్వరలో కొరియన్ జానపద కథలతో మళ్ళీ కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
