[చైనా జానపద కథల సీరిస్లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 3వ కథ ‘చందమామలో చైనా కుందేలు.]
చందమామలో కుందేలు ఉంటుందని మనం నమ్మినట్లే చైనా ప్రజలు కూడా నమ్ముతారు. నమ్మడమే కాదు, ‘మూన్ ఫెస్టివల్’ అనే పేరుతో పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటూ కుందేలు ఆకారంలో ఉన్న బొమ్మలను, మిఠాయిలను పిల్లల కోసం ప్రేమగా తయారు చేస్తారు. ఇంతకుముందు ‘పదిమంది సూర్యులు’ అనే కథలో మనం చందమామలో చాంగే అనే దేవత ఉంటుందని చెప్పుకున్నాం కదా.. ఆ దేవతకు తోడుగా ఈ కుందేలు కూడా ఉంటుందట. అమృతం తయారు చేయడానికి కావలసిన దినుసులన్నీ ఒక రోలులో వేసి రోకలితో దంచుతూ అమృతాన్ని తయారు చేస్తూ ఉంటుంది. పున్నమి రోజు ఆకాశంలో ధగధగా మెరిసిపోతున్న చందమామను గనుక గమనిస్తే అందులో ఈ కుందేలు పచ్చగా మిలమిలా మెరుస్తూ మనకు కనపడుతుంది. చైనీయులు దీనిని పచ్చ కుందేలు లేదా జేడ్ రాబిట్ అంటారు. మరి చందమామలో ఈ కుందేలు ఎలా చేరింది అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి కథ బౌద్ధ జాతక కథలలో కూడా కనపడుతుంది.
ఒకసారి స్వర్గలోకాధిపతి అయిన జేడ్ చక్రవర్తి ‘భూమి మీది జంతువులలో ఏది ఎక్కువ దయగలదో తెలుసుకోవాలి’ అనుకున్నాడు. దాంతో ఒక ముసలివాని రూపం వేసుకొని అనేక జంతువులను కలుస్తూ, వాటి దయాగుణం పరీక్షిస్తూ చివరికి ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చాడు. అక్కడ అతనికి ఒక నక్క, కోతి, కుందేలు కనపడ్డాయి. జేడ్ చక్రవర్తి వాటిని పరీక్షించాలి అనుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్నట్లుగా నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ వాటి దగ్గరికి పోయాడు. “మిత్రులారా.. మూడు రోజుల నుంచి తినడానికి తిండి లేదు. కేవలం నీళ్లతో కడుపు నింపుకుంటూ ఉన్నా. అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇలాగే వుంటే ఈరోజో రేపో ప్రాణాలు పోవడం ఖాయం. దయచేసి ఏదైనా ఆహారం ఇవ్వగలరా” అని దీనంగా చేతులు జోడించి అడిగాడు.
నక్క అతని బక్క చిక్కిన ఆకారాన్ని చూసి “అలాగే ఒక్క నిమిషం” అంటూ పక్కనే ఉన్న చెరువులోకి పోయింది. పది నిమిషాలు కష్టపడితే దానికి ఒక చిన్న చేప దొరికింది. దానిని తీసుకొని వచ్చి “ఇదిగో ఇది తిను. ఇంతకు మించి తేవడం నావల్ల కాదు. నాకు అంత ఓపిక కూడా లేదు” అంది. ఆ చక్రవర్తి ఆ చిన్న చేపను కాల్చుకొని తిన్నాడు కానీ అది ఒక మూలకు కూడా సరిపోలేదు. దాంతో కోతి వంక తిరిగి “మిత్రమా.. ఆ చిన్న చేప తిన్నది తిన్నట్టు అరిగిపోయింది. ఆకలి కొంచం కూడా తీరలేదు. ఇంకేమన్నా ఉన్నాయా” అని దీనంగా అడిగాడు.
కోతి అటూయిటూ చూసింది. ఒక చెట్టు మీద ఒక మాగిన పండు కనిపించింది. దాంతో కొమ్మమీద నుంచి కొమ్మమీదకి ఎగురుకుంటా పోయి ఆ పండును చేరుకుంది. దానిని కోసుకుని వచ్చి ఆ ముసలివానికి ఇచ్చింది. అతను ఆ పండు తిన్నాడు గానీ ఆ ఒక్క పండు కూడా అతని ఆకలిని ఏమాత్రం తీర్చలేకపోయింది.
దాంతో కుందేలు వంక తిరిగి “మిత్రమా.. వారం నుంచి తిండి లేకపోవడంతో ఈ పండు, చేపలు ఏ మూలకు సరిపోవడం లేదు. దయచేసి కడుపు నిండుగా ఏమైనా వుంటే పెట్టి నా ఆకలి తీర్చగలవా” అని నీరసంగా అడిగాడు.
కుందేలు ఆలోచించింది. “అతిధి దేవునితో సమానం. ఆకలి అంటూ చేయిచాచి ముందు నిలబడిన వానిని ఉత్త చేతులతో పంపకూడదు. కడుపునిండా చాలు అనేంతవరకు అన్నం పెట్టి పంపాలి. అదీ ధర్మం” అనుకుంది. కానీ కుందేలు నక్కలా చేపలు పట్టలేదు. కోతిలా చెట్లు ఎక్కి పండ్లు తెంపుకొని రాలేదు. అదీగాక ఆ ముసలివాని ఆకలికి చిన్న చిన్నవి ఏ మూలకు సరిపోవడం లేదు. దాంతో అతని ఆకలి పూర్తిగా తీరాలంటే ఒక్కటే మార్గం అనుకొంది.
వెంటనే నక్కను, కోతిని పిలిచి మంచి ఎండిన కట్టెపుల్లలు ఏరుకొని రమ్మంది. అవి ‘సరే’ అని ఏరుకొచ్చాయి. వాటిని పెద్ద కుప్పచేసి అంటించింది. మంట బాగా పెద్దగా భగభగమని మండడం మొదలుపెట్టాక కుందేలు ఆ ముసలివాని వైపు తిరిగి “అయ్యా.. మీ ఆకలి తీర్చడానికి సరిపోయేవి నా వద్ద ఏమీ లేవు. కాబట్టి దయచేసి నన్నే ఆహారంగా తీసుకొని కడుపునిండా తిని ఆనందించండి” అంటూ చిరునవ్వుతో ఎగిరి మంటల్లోకి దూకింది.
కుందేలు చేసిన పని చూసి జేడ్ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ‘పరుల కోసం తనను తాను త్యాగం చేసుకోవడం ప్రపంచంలోనే అత్యంత అరుదైన దయాగుణం. ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ ఇటువంటి త్యాగగుణం ఎంత వెతికినా ఎక్కడా దొరకదు’ అనుకున్నాడు. అంతే ఆ మరుక్షణమే ఆ మంటలు చల్లగా అయిపోయాయి. భగభగ మండే నిప్పు కణికలు మెత్తని పూవులుగా మారిపోయాయి. కుందేలుకు చిన్న గాయం కూడా కాలేదు.
ముసలివాడు జేడ్ చక్రవర్తి లాగా మారిపోయాడు. ప్రేమగా కుందేలును చేతుల్లోకి తీసుకొని దాని శరీరాన్ని నిమరాడు. అంతే.. దాని శరీరం పచ్చని వజ్రపు రంగులోకి మారి ధగధగా మెరవసాగింది. అతను ఆ పచ్చ కుందేలును చూస్తూ “నీలాంటి అద్భుతమైన దయగల జంతువు ఉండవలసింది ఈ భూమ్మీద కాదు. చల్లని చంద్రలోకంలో హాయిగా ఉండు. ఇకపై నీకు మాలాగే మరణం ఉండదు” అంటూ ఆ కుందేలును చంద్రలోకానికి చేర్చాడు. అలా చంద్రలోకానికి చేరిన కుందేలు అక్కడ వున్న చాంగేతో కలసి హాయిగా అమృతం తయారుచేస్తూ ఉంది. అది కుందేలు చందమామను చేరిన కథ.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
