Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చైనా జానపద కథలు-4: అంతులేని శిక్ష

[చైనా జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 4వ కథ ‘అంతులేని శిక్ష’.]

చందమామపై ఒక చెట్టు ఉంటుందని దాని కింద ఒక అవ్వ ఉంటుందని మనం ఎలా నమ్ముతామో అలాగే చైనాలో కూడా చందమామలో చెట్టు ఉందని నమ్ముతారు. కాకపోతే దాని కింద అవ్వ గాక ఒక యువకుడు ఉంటాడని అతను గొడ్డలితో ఆ చెట్టును నరుకుతుంటాడని చెబుతారు. ఆ చెట్టును నరికే యువకుని పేరు ‘ఊ గాంగ్’. మరి ఆ యువకుడు చందమామ పైకి ఎలా చేరుకున్నాడు, అక్కడ చెట్టును ఎందుకు నరుకుతున్నాడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం.

‘ఊ గాంగ్’ చైనాలోని ఒక గ్రామంలో ఉండేవాడు. ఆ యువకునికి ఎప్పటికైనాసరే తాను కూడా అమృతాన్ని తాగి, దేవతలలాగా అమరత్వాన్ని పొంది, స్వర్గలోకం చేరాలని చాలా కోరిక. దాంతో ఒకరోజు దేవతల గురువు దగ్గరికి చేరుకున్నాడు. “స్వామీ.. స్వర్గలోకం, అమృతం కేవలం దేవతలకేనా.. నాలాంటి సామాన్య మానవులు వాటిని సాధించలేరా” అని అడిగాడు. దానికి ఆ గురువు “చూడు నాయనా.. ఈ లోకంలో కష్టపడితే దక్కనిది అంటూ ఏదీ లేదు. నీవు నిరంతరం శ్రమ పడుతూ విద్య, వైద్య, యుద్ధ విద్యలలో దేవతలతో సమానంగా పోటీపడి గెలవగలిగితే అమృతం నీకు కూడా దక్కుతుంది. కానీ దానికి ఎంతో క్రమశిక్షణ, సహనం, ఏకాగ్రత, పట్టుదల, నిరంతర పోరాటం అవసరం” అని చెప్పాడు.

ఆ యువకుడు “అలాగే గురువుగారు.. ఎలాగైనాసరే నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి. మీరు ఏది చెబితే అది చేస్తాను. మాట తప్పను. వెనుకడుగు వేయను. సాధించేదాకా విశ్రమించను. నన్ను నమ్మండి. దయ చూపండి” అంటూ వదలకుండా ప్రాధేయపడ్డాడు. అతని మాటలకు ముచ్చటపడిన గురువు ‘సరే’ అని ఆ యువకున్ని తన శిష్యునిగా చేర్చుకున్నాడు.

కానీ నిజానికి ‘ఊ గాంగ్’ చాలా సోమరి. ఏ పనిపైనా సరిగా శ్రద్ధ పెట్టడు. చివరిదాకా నిలబడడు. ఏమాత్రం కష్టపడకుండా అడ్డదారిలో విజయం సాధించాలి అని కోరుకునేవాడు. ఇది గురువుకు తెలియదు.

గురువు శిష్యులందరికీ వైద్యం గురించి నేర్పించడం మొదలుపెట్టాడు. “శిష్యులారా.. దేవతలకు వైద్యం మీద మంచి పట్టు ఉండాలి. ప్రకృతి మనకు ఇచ్చిన వరం ఈ మూలికలు. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఏ మూలిక ఎక్కడ దొరుకుతుంది, అది ఎలా ఉంటుంది, ఎలా పని చేస్తుంది అనే విషయాలన్నీ బాగా తెలుసుకోవాలి. ఈరోజు నుంచి మనం మూలికల మహిమల గురించి నేర్చుకుందాం” అన్నాడు.

ఆ యువకుడు చాలా ఉత్సాహంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచేసరికి ఉత్సాహమంతా చచ్చుబడిపోయింది. ‘ఇదేంది ఇన్ని మూలికలు ఉన్నాయి. ఏదో పదో ఇరవయ్యో అనుకుంటే.. ఇవన్నీ నేర్చుకునేసరికి కనీసం ఏడాది పైన్నే పడుతుంది. అన్ని రోజులు ఎదురు చూడడం నావల్ల కాదు’ అనుకున్నాడు. దాంతో గురువు చెప్పింది చెప్పినట్టు శ్రద్ధగా నేర్చుకోవడం మానేశాడు. ఈరోజు రేపు అంటూ తప్పించుకోవడం, ఆరోగ్యం బాగాలేదని దొంగ మాటలు చెప్పి తరగతులు ఎగ్గొట్టడం చేయసాగాడు. ఒకరోజు గురువు దగ్గరికి పోయి “గురువుగారు.. ఈ మూలికల విద్య మరలా నేర్చుకుంటాను. నాకు మంత్రవిద్యలు నేర్పండి. ఎగిరిదూకే పులిలాగా ఉత్సాహంగా దూసుకుపోతాను. చెప్పింది చెప్పినట్లు కంఠతాపడతాను. నన్ను నమ్మండి” అంటూ వెంటపడ్డాడు.

“చూడు.. అలా ఏ విద్య కూడా సగంలో వదిలేయకూడదు. ఒకసారి మొదలుపెడితే ముగించేదాకా వెనుతిరిగి చూడకూడదు. నా మాట విను” అంటూ ఎంత చెప్పినా వినలేదు. దాంతో గురువు ‘సరే’ అని మంత్ర విద్యలు నేర్పడం మొదలుపెట్టాడు.

ఆ యువకుడు కొంతకాలం ఉత్సాహంగానే నేర్చుకున్నాడు కానీ నెమ్మదిగా మరలా ఆసక్తి తగ్గిపోయింది. ఆ శ్లోకాలు నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. దాంతో గురువుగారి వద్దకు చేరి “ఇలా పెద్ద పెద్ద పద్యాలు కాకుండా చిన్నచిన్నవి ఉంటే చెప్పండి. నోరు తిరగడం లేదు, మెదడుకు ఎక్కడం లేదు” అన్నాడు. దానికి గురువు నవ్వి “విజయానికి ఎప్పుడూ దగ్గరదారులు, అడ్డదారులు అంటూ ఏవీ ఉండవు నాయనా. నిరంతర సాధన మాత్రమే విజయాన్ని అందిస్తుంది. అది తెలుసుకోనంతవరకు నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు” అన్నాడు. కొంతకాలం గడిచింది. కొత్తవి నేర్చుకోవడం సంగతి దేవుని కెరుక పాతవి కూడా మర్చిపోవడం మొదలుపెట్టాడు. కమ్మగా తినడం, గురకలు పెట్టి నిద్రపోవడం, పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుతున్నట్టు నటించడం చేసేవాడు.

దాంతో ఇక లాభం లేదనుకొని ఒకరోజు గురువు దగ్గరికి పోయి “గురువుగారు.. కొద్ది రోజులుగా జలుబు, దగ్గు వదలనే వదలడం లేదు. శ్లోకాలు నేర్చుకుంటూ వుంటే ఒకటే గొంతునొప్పిగా ఉంది. దగ్గు ఎక్కువయి ఊపిరి ఆడడం లేదు. కొద్దిరోజుల తర్వాత మరలా మొదలు పెడతాను. అంతలోపు నాకు ధ్యానం చేయడం నేర్పించండి” అన్నాడు. దానికి గురువు నవ్వి “ధ్యానం నువ్వు అనుకున్నంత సులభం కాదు నాయనా.. దానికి ఎంతో ఏకాగ్రత కావాలి” అన్నాడు. అయినా యువకుడు పట్టు వదలలేదు.

దాంతో గురువు ధ్యానం నేర్పించడం మొదలుపెట్టాడు. రకరకాల ముద్రలు, ఆసనాలు, మౌనంగా మనస్సును ఒకే విషయం మీద కేంద్రీకరించడం ఎలాగో తెలియజేసాగాడు. ఎప్పటిలాగే మొదట్లో చాలా ఉత్సాహంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచింది. గంటలు గంటలు మౌనంగా ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చోవడం, ఎటువంటి భావాలు మొహంలో కనపడకుండా ప్రశాంతంగా ఉండడం, ఒళ్ళు వివిధ ఆకారాల్లో విల్లులా వంచుతూ ఆసనాలు వేయడం, రోజురోజుకీ చాలా కష్టంగా అనిపించింది. దాంతో ఒకరోజు గురువు దగ్గరికి పోయి “గురువుగారు.. ఒళ్ళు ఒంగడం కష్టంగా ఉంది. ఏమీ ఆలోచించకుండా మనసును ఒకే అంశం మీద నిమగ్నం చేయడం అస్సలు కుదరడం లేదు. “నాకు ఇంకో విద్య సులభమైనది ఏదైనా ఉంటే నేర్పండి. తొందరగా అమృతాన్ని సంపాదించుకోవడానికి” అన్నాడు.

మిగిలిన విద్యార్థులంతా అన్నీ నేర్చుకుంటున్నారు. చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. కానీ ఈ యువకుని పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. దేనిలోనూ పట్టు రావడం లేదు. అన్ని సగం సగమే. ఒకటి రాకముందే మరొకదానికి దుంకుతున్నాడు. గురువుకు కోపం వచ్చి “నువ్వు మాటిమాటికి మాట మారుస్తున్నావు. ఏదీ పూర్తిగా నేర్చుకోవడం లేదు. నీలాంటి శ్రద్ధ లేనివాళ్ళు ఇక్కడ ఉండడం అనవసరం. అమృతం కాదు కదా తినడానికి అన్నం కూడా దొరకదు. కోరికలు ఉంటే లాభం లేదు. ఆ కోరికలను సాధించుకోవడానికి కావలసిన పట్టుదల ఉండాలి. అది నీలో ఇంచు కూడా లేదు. నీలాంటివాడు ఎప్పటికీ ఏదీ సాధించలేడు” అన్నాడు.

దానికి ఆ యువకుడు “నీకు సరిగా చెప్పడం రాక నన్ను అంటావెందుకు. ఇప్పటికే చేరి కొన్ని సంవత్సరాలు అయింది. ఏదీ నేర్పించలేకపోతున్నావు. చేతకాకపోతే ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా నా సమయం వృథా చేశావు” అంటూ చిన్నా పెద్దా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు.

ఇదంతా దేవతలరాజు చూస్తూ ఉన్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆ యువకునికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. వెంటనే ఆ యువకున్ని చందమామ మీదికి తీసుకుపోయాడు. అక్కడ ఒక పెద్ద మలబారు చెట్టు ఉంది. అతని చేతికి ఒక గొడ్డలి ఇచ్చి “చూడు మిత్రమా.. నీకు అమరత్వం కావాలి అంతేగదా.. నీవు ఎప్పుడైతే ఈ చెట్టును పూర్తిగా కొట్టేస్తావో అప్పుడే నీకు అమృతం దొరుకుతుంది. దేవలోకం తలుపు తెరుచుకుంటుంది. ఇక నీదే ఆలస్యం” అని చెప్పి మాయమయ్యాడు.

ఆ గొడ్డలి చాలా బరువుగా, పదునుగా ఉంది. “ఎంతసేపు ఈ చెట్టును కొట్టడం” అనుకుంటూ ఆ యువకుడు సంబరంగా తన బలమంతా ఉపయోగించి గొడ్డలితో ఒక్క వేటు వేశాడు. చెట్టు కొంచెం లోపలికి తెగింది. సంబరంగా మరో వేటు వేయడానికి గొడ్డలి బయటికి తీశాడు. అతను అలా తీయడం ఆలస్యం ఆ చెట్టులో దెబ్బతిన్న భాగం మరలా మామూలుగా అయిపోయింది. దెబ్బ మీద దెబ్బ ఎన్నిసార్లు వేసినా ఆ చెట్టుకు ఏమీ కావడం లేదు. దాంతో అతనికి అర్థమైంది ఆ చెట్టు ఎప్పటికీ పడిపోదని. పని ఆపేద్దామనుకుంటే చేతికి వుండే గొడ్డలి అలాగే అతుక్కుపోయింది. చెట్టు దాటి పక్కకు కదలలేకపోతున్నాడు. తప్పనిసరిగా కొట్టాల్సి వస్తూనే ఉంది.

ఒంటరిగా అతను ఆ రోజునుంచి అలా చెట్టును దిగులుగా నరుకుతూనే ఉన్నాడు. భూమిపై ఉన్నప్పుడు ఏ పనికూడా పూర్తి చేయకుండా, నేర్చుకోకుండా వున్నందుకు దేవతలరాజు అతనికి విధించిన శిక్ష అది. ఎవరైతే నేర్చుకునేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో, క్రమశిక్షణతో, పట్టు వదలకుండా ముందుకు సాగుతారో వాళ్లు జీవితాంతం హాయిగా సుఖసంతోషాలతో బతుకుతారు. అలాగాక ఏ పని పూర్తిగా నేర్చుకోకుండా అన్ని సగం సగం నేర్చుకుంటూ, ఆ తప్పును ఇతరుల పైకి నెట్టివేస్తారో, అలాంటివాళ్ళు ఆ తర్వాత జీవితమంతా గాడిదచాకిరి చేస్తూ విశ్రాంతి లేకుండా పని చేయవలసి వస్తుంది – అని ఈ కథ చెబుతుంది. ఇదీ చందమామలో చెట్టు నరుకుతున్న యువకుని కథ.

మిడ్ ఆటం ఫెస్టివల్ సమయంలో పున్నమి రోజున చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా వెలుగొందుతూ వుంటాడు. చైనా ప్రజలందరూ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ఆ ఒక్కరోజు మాత్రం ఆ యువకునికి విశ్రాంతి లభిస్తుందని చైనీయుల నమ్మకం.

(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)

Exit mobile version