[చైనా జానపద కథల సీరిస్లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 7వ కథ ‘నిరంతర సాధన’.]
చైనాలోని ఒక చిన్న పల్లెటూర్లో ఒక యువకుడు ఉండేవాడు. అతని పెళ్ళాం చాలా మంచిది, తెలివైంది. చాలా పద్ధతిగా ఉండేది. చచ్చినాసరే తప్పు చేయకూడదు, పొరపాటున కూడా ఎవరినీ బాధ పెట్టకూడదు అని నమ్మేది. ఎప్పుడూ చిరునవ్వుతో ఊరిలో అందరినీ పలకరిస్తా అవసరానికి చేతనైనంత సాయం చేస్తా ఉండేది. ఆ యువకుడు ఆమెను ఎంతగానో గౌరవిస్తూ, ఆమె మాటకు విలువనిస్తూ, ప్రేమగా చూసుకునేవాడు.
ఒకసారి ఆ యువకుడు ఊరి బయట ఉన్న పొలానికి పోతూవుంటే దారిలో ఒక బంగారుహారం కనపడింది. అది చాలా ఖరీదైంది. దాదాపు పది తులాల పైన్నే ఉంటుంది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. సంబరంగా ఆ హారాన్ని తీసుకొని ఉరుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. పెళ్ళానికి దానిని చూపించాడు.
అది చూసి ఆమె చిరునవ్వుతో “చూడండి.. మనది కానిది మంచి నీటిని కూడా అడగకుండా తాగకూడదు అంటారు పెద్దలు. అలాంటిది ఇంత విలువైన వస్తువు దొరికితే ఆనందంగా ఉరుక్కుంటూ వచ్చేశారే. ఇదేనా మనం నేర్చుకున్న నీతి, నిజాయితీ. అక్కడ దీనిని పోగొట్టుకున్న వాళ్లు పాపం ఎంత బాధ పడుతున్నారో ఏమో.. తలుచుకుంటేనే మనసు కలుక్కుమంటూ ఉంది” అంది.
ఆ మాట వింటూనే ఆ యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు. జరిగిన పొరపాటుకు బాధపడి వెంటనే ఆ హారాన్ని తీసుకొని దొరికిన చోటుకు పరుగెత్తుకుని పోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఎవరైనా ఆ బంగారు హారం కోసం వస్తారేమో అని ఎదురు చూడసాగాడు.
కాసేపటికి ఒక స్త్రీ తన కుటుంబంతో ఆ దారిలో ఏదో వెతుకుతూ కనపడింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. “అమ్మా ఏమైంది. ఏమి వెతుకుతా ఉన్నారు” అని అడిగాడు.
“అయ్యా నా కూతురు పెళ్లికని ఒక కొత్త హారాన్ని చేయించి తీసుకొని పోతుంటే పొరపాటున ఎక్కడో జారిపడిపోయింది. అందుకే వచ్చిన దారంతా వెతుకుతూ వస్తున్నాము” అని కళ్ళనీళ్ళతో చెప్పింది. వెంటనే ఆ యువకుడు తనకు దొరికిన హారాన్ని వారికి అప్పజెప్పాడు.
పోయిందనుకున్న వస్తువు తిరిగి దొరకడంతో ఆమె ఎంతగానో సంబరపడిపోయింది. “బాబూ.. నా కూతురి జీవితం నిలబెట్టావు. పొరపాటున ఈ హారం దొరకకపోయి వుంటే పిల్ల పెళ్లి ఆగిపోయేది. నా గుండె పగిలిపోయేది. నీ మంచి మనసుకు ధన్యవాదాలు. నీలాంటివాళ్లు భూమి మీద ఉండబట్టే ఇంకా అప్పుడప్పుడు వానలు పడుతా వున్నాయి” అంటూ పదేపదే అతనికి వంగి వంగి నమస్కారాలు చేసింది.
ఆ మాటలు వింటావుంటే అతని మనసుకు చాలా హాయిగా నోటిలో తేనె పోసినంత కమ్మగా అనిపించింది. పెళ్ళాం పట్ల మరింత గౌరవం పెరిగింది.
నెమ్మదిగా కొంతకాలం గడిచింది..
ఆ యువకుడు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. బాగా చదువుకున్నవాడు. కానీ పెళ్లి తర్వాత కుటుంబ భారం మీద పడడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి పొలం పనుల్లోకి దిగాడు. ఒకరోజు అతని పెళ్ళాం “ఏమండీ నాకు మగ్గం మీద బట్టలు నేయడం ఇప్పుడు బాగా వచ్చు. రోజుకి రెండు మూడు చీరలు ఇంటి పనులన్నీ చేసుకుంటూ అవలీలగా నేస్తున్నాను. వాటిని అమ్ముతూ ఎటువంటి సమస్య లేకుండా ఒక్కదాన్నే ఇంటిని బాగా చూసుకోగలను. నీవు పక్కనే వున్న నగరానికి పోయి ఒక మంచి గురువు వద్ద మరలా నీ చదువు మొదలుపెట్టు. నీ చదువు పూర్తయి మంచి ఉద్యోగం దొరికితే మన జీవితాలే మారిపోతాయి. నీకు ఇంకా మంచి వయసు, నేర్చుకునే శక్తి, పోరాడే ఓపిక ఉన్నాయి. ఈ వయసులో కాకపోతే మరలా జీవితంలో ఎప్పటికీ సాధించలేవు” అంది.
అతను బాగా ఆలోచించాడు. ఆమె చెప్పినట్లే చేయడం మంచిది అనిపించింది. దాంతో సరేనని ఇంటిలో అందరికీ వీడ్కోలు పలికి నగరానికి బయలుదేరాడు. నెమ్మదిగా రెండు నెలలు పూర్తయ్యాయి.
ఒకరోజు ఆమె మగ్గం మీద బట్టలు నేస్తూవుంటే తలుపు తట్టిన చప్పుడయింది. ఎవరబ్బా అని తెరిచి చూస్తే ఎదురుగా ఆమె మొగుడు కనబడ్డాడు. “ఏమిటి అంత త్వరగా వచ్చేశావు” అంది ఆశ్చర్యంగా. అతను చిరునవ్వు నవ్వి “నిన్ను, మన కుటుంబాన్ని వదిలి అక్కడ ఒంటరిగా ఉండలేకుంటున్నా. అందుకే తిరిగి వచ్చేశా. మీ అందర్నీ వదిలి ఇక ఒక్క క్షణం కూడా వుండలేను” అన్నాడు.
అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వి ఒక కత్తెర తీసుకు వచ్చింది. అతను చూస్తుండగానే మగ్గం మీద తాను అంతవరకు నేసిన సగం చీరను ఇంకా పూర్తి కాకముందే కత్తిరించింది. అంతే… ఒక్కసారిగా దారాలన్నీ తెగిపోయి అంతా ఒక చెత్త కుప్పలా పడిపోయింది.
అదిచూసి అతను “అరెరే ఎంత పని చేశావు. ఇంతవరకు నీవు పడిన కష్టమంతా వృథా అయిపోయిందే” అన్నాడు బాధపడుతూ.
దానికి ఆమె చిరునవ్వు నవ్వుతూ “ఏ పనయినా పూర్తి కాకముందే వదిలేస్తే ఇలాగే అవుతుంది. ఒక చీర వృధా అయితేనే ఇంత బాధ పడుతున్నావే. మరి నీ జీవితమంతా వృథా చేసుకుంటూ వుంటే నేనెంత బాధపడాలి. ఏ పనైనా మొదలుపెడితే పూర్తి అయ్యేదాకా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు. చలించకూడదు. సర్వం మరచిపోయి చూపు అంతా గమ్యం మీదనే ఉంచాలి. ఇంకొకసారి ఇలా చేయకండి. విజయం సాధించేదాకా మరలా ఈ గుమ్మం తొక్కకండి. నా మీద ఒట్టు” అంది.
తాను చేసిన పనికి ఆ యువకుడు సిగ్గుతో చితికిపోయాడు.
మారు మాట్లాడకుండా మరలా దృఢ నిశ్చయంతో వెనుతిరిగాడు.
ఆ రోజునుంచీ నిరంతర సాధనతో చదువును పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాతనే మరలా ఆ ఇంటి తలుపు తట్టాడు. “ఈ విజయం నీదే. నీలాంటి పెళ్ళాం వెన్నంటి ఉన్నంత వరకు ఏమోగాని జీవితంలోనూ అపజయం అడుగు పెట్టదు” అంటూ ఆమె చేతికి తన మొదటి జీతంతో కొన్న పట్టుచీరను బహుమతిగా అందజేశాడు.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
